08.02.1976        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


కనెక్షన్, కరెక్షన్ యొక్క బ్యాలన్సుతో అద్భుతం.

యథార్థ టీచర్ యొక్క విశేషతలు చెప్తూ పరమ శిక్షకుడు శివబాబా మాట్లాడుతున్నారు -

టీచర్స్ విశేషంగా రెండు విషయాలపై ధ్యాస పెట్టాలి. ఆ రెండు విషయాలు ఏమిటి? మధువనంతో, బాబాతో పాటూ దైవీ పరివారంతో కూడా మర్యాదా పూర్వకమైన సంబంధం ఉండాలి. మర్యాదా పూర్వకమైన సంబంధం అంటే ఏ సంకల్పం లేదా కర్మ చేస్తున్నా కానీ ప్రతీ సమయం దానిని సరిదిద్దుకునే (కరెక్షన్) అభ్యాసం ఉండాలి. రెండు విషయాలు 1. యథార్థ సంబంధం (కనెక్షన్) 2. ప్రతీ సమయం సరిదిద్దుకునే (కరెక్షన్) అభ్యాసం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా సఫలతా మూర్తులు కాలేరు. సరిదిద్దుకోవటానికి సదా సాక్షి స్థితి ఉండాలి. సాక్షిగా అయ్యి సరిదిద్దుకోకపోతే బాబాతో యథార్థ సంబంధం పెట్టుకోలేరు. కాబట్టి సదా ఇది పరిశీలించుకోండి. నేను ప్రతి సమయం ప్రతి విషయంలో సరిదిద్దుకుంటున్నానా? అని. 1. బుద్ధిని సరి దిద్దుకోవాలి అంటే బాబా స్మృతియాత్ర చేయాలి. 2. సాకార కర్మలోకి వస్తూ, సాకార పరివారంలో సాకార సంబంధం పెట్టుకుంటూ రెండూ సమానంగా ఉంచుకోవాలి. సాకారీ సంబంధంలోకి రావటంలో మర్యాదా పూర్వకంగా ఉండాలి. ఆత్మిక పరివారంలో ఆత్మీయతతో కాకుండా దేహాభిమానంతో సంబంధం పెట్టుకుంటే అది యథార్థ సంబంధం కాదు. ఎవరికైతే సరి దిద్దుకోవటం, సంబంధం పెట్టుకోవటం వస్తుందో వారికి ఆత్మిక నషా ఉంటుంది. వారికి అతీత స్థితి మరియు అతి ప్రియ స్థితి రెండూ సమానంగా ఉంటాయి. సర్కస్ చేసేవారు ఈ సమానత అనే దాని ద్వారానే ధనం సంపాదిస్తున్నారు. సమానత ద్వారా అద్భుతం చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా సమానత ఉంటే అద్భుతం జరుగుతుంది. మరియు సంపాదన కూడా అవుతుంది. ఒకవేళ ఏదైనా ఎక్కువ, తక్కువ అయిపోతే అద్భుతం జరగదు, సంపాదన రాదు. ఏవిధంగా అయితే ఏదైనా వస్తువులో అన్ని సమానంగా లేకపోతే ఎంత మంచి వస్తువు అయినా దానిలో రుచి ఉండదు. అదేవిధంగా మీ జీవితాన్ని కూడా శ్రేష్ఠముగా, సఫలం చేసుకునేటందుకు సమానత ఉంచుకోండి. రెండవ విషయం ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి సమయం అయినా ఆవిధంగా మీ శక్తిశాలి రూపాన్ని తయారుచేసుకోండి. పరిస్థితి ఎదుర్కొవాలంటే ఎదుర్కోనే శక్తి స్వరూపంగా అవ్వండి. ఒకవేళ పరిస్థితిని సహించాలంటే సహన స్వరూపులుగా అవ్వాలి. ఈ విధమైన అభ్యాసం ఉందా? టీచర్స్ అంటే సమానత ఉంచుకునేవారు. ఏ విధమైన సమయమో ఈ విధమైన స్వరూపం ధారణ చేసే శక్తి ఉందా? స్నేహం ఇవ్వవలసినపుడు శక్తి, శక్తి ఇవ్వవలసినప్పుడు స్నేహం ఇస్తే దానిని ఏమంటారు? ఎటువంటి సమయమో అటువంటి స్వరూపం ధారణ చేసే శక్తి లేనట్లు. అప్పుడు సర్వీసులో సఫలత రాదు. నెంబర్ వన్ టీచర్ అవ్వాలంటే ముందు స్వయం ధారణ చేసి అప్పుడు ఇతరులకి చెప్పండి. స్వయం ఆచరించకుండా కేవలం ఇతరులకి చెప్పటం కాదు. ఇతరులకు చెప్పే ముందు అది నాలో ఉందా అని ముందు మీరు చూసుకోండి. ఇతరులకి సహనశీలులుగా అవ్వండి అని చెప్పి స్వయంలో లేకపోతే వారు టీచర్ కాదు. టీచర్ అంటే శిక్షకులు, శిక్షణ ఇచ్చేవారు. స్వయం శిక్షణా స్వరూపులుగా కాకపోతే యథార్థ టీచర్ అనరు. కాబట్టి సదా ఈ సూక్తి స్మృతిలో ఉంచుకోండి. శిక్షకులు అంటే శిక్షణా స్వరూపులు మరియు సమానత ఉంచుకునేవారు. ఇప్పుడు లక్షణాలు కలిగిన టీచర్స్ ని తయారు చేయాలి. ఎంతమంది ఉన్నారు? అని సంఖ్యను పెంచటం కాదు. లక్షణాలు పెంచుకోండి. అర్ధమైందా?

ఈ మురళీ యొక్క సారం :-
1. ఎవరికైతే సంబంధం పెట్టుకోవటం, సరిదిద్దుకోవటం వస్తుందో వారు ఆత్మిక నషాలో ఉంటారు.
2. నెంబర్ వన్ టీచర్‌గా అవ్వాలంటే ఏ ధారణ అయినా ముందు స్వయం ధారణ చేసి ఇతరులకి చెప్పాలి. స్వయం ధారణ
చేయకుండా ఇతరులకి చెప్పటం కాదు. ఇతరులకి చెప్పే ముందు అది నాలో ఉందా అని చూసుకోండి.
3. ఎటువంటి సమయమో అటువంటి స్వరూపాన్ని ధారణ చేసే శక్తిని పెంచుకోండి.
4. సఫలతామూర్తిగా అవ్వటానికి యథార్థ సంబంధం, సరిదిద్దుకోవటం ఈ రెండూ కావాలి. సాక్షిగా అయితేనే సరిదిద్దుకోగలం. సాక్షిగా
లేకుండా సరిదిద్దుకోలేకపోతే యథార్థ సంబంధం జోడించలేము.