16.04.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


"బ్రాహ్మణ జన్మ యొక్క దివ్యత మరియు అలౌకికత"

వినడం మరియు ఇముడ్చుకోవడం. వినడం సహజమనిపిస్తుంది. వింటూనే ఉండాలి అన్న రుచి కూడా ఉంటుంది. ఈ ఇచ్చ సదా ఉంటుంది. అలాగే ఇముడ్చుకోవడం కూడా సహజంగా అనుభవమవుతుందా? ఇముడ్చుకోవడం ద్వారా బాబా సమానంగా అవ్వాలి అన్న కోరిక సదా ఉంటుందా? ఇముడ్చుకునే స్వరూపము అనగా బాబా సమానముగా అవ్వడం. మరి ఇప్పటి వరకు మొదటి స్థితిలోనే ఉన్నారా? లేక రెండో స్థితిలో ఉన్నారా? లేక చివరి స్థితి వరకు చేరుకున్నారా?చివరి స్థితి వినడం మరియు అవ్వడం. వింటున్నాము, అయిపోతాము, అవ్వవలసిందే, కల్పపూర్వము కూడా అయ్యాము, ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాము అన్న ఈ మాటలు చివరి స్థితిలో సమాప్తమవుతాయి. ఒక్కొక్క మాటను ఏవిధంగా వింటూ ఉన్నారో అదేవిధంగా అలా అవుతూ ఉండాలి. చివరి స్థితి వారి యొక్క లక్ష్యము మరియు మాటలు స్వరూపము ద్వారా స్పష్టముగా కనిపిస్తాయి. ఆత్మ యొక్క మొదటి పాఠాన్ని వింటారు మరియు వినిపిస్తారు, కానీ చివరి స్థితిలో ఉండే ఆత్మ కేవలం శబ్దాలను వినడం మరియు వినిపించడం మాత్రమే చేయదు. దానితో పాటు స్వరూపంలో స్థితమై ఉంటుంది. దీనినే బాబా సమానంగా అవ్వడం అంటారు. స్వయం యొక్క లేక బాబా యొక్క స్వరూపము లేక గుణాలు లేక కర్తవ్యాలను వారు కేవలం వినిపించరు. అందుకు బదులుగా ప్రతి గుణము మరియు కర్తవ్యమును తమ స్వరూపము ద్వారా అనుభవము చేయిస్తారు. ఏవిధంగా బాబా అనుభవిమూర్తులో కేవలం వినిపించేవారు కాదో అదేవిధంగా బాబాను అనుసరించాలి. సాకారములో బాబాను చూసారు. వినిపించడంతో పాటు కర్మలో, స్వరూపములో చేసి చూపించారు. వినడం, వినిపించడం మరియు స్వరూపంగా అయి చూపించడం - మూడూ ఒక్కసారిగా కలిసి నడిచాయి. ఈవిధంగా వినడం, వినిపించడం మరియు చేసి చూపించడం, ఒకేసారి కలిసి ఉన్నాయా? ఇప్పటి వరకు మీరు ఎంతైతే విన్నారో అంతా ఇముడ్చుకున్నారా? విశ్వం ముందు చేసి చూపించారా? తేడా చాలా ఎక్కువగా ఉందా?లేక కొద్దిగా ఉందా? రిజల్టు ఏమిటి? వినడం మరియు వినిపించడం సాధారణమైన విషయమే. బ్రాహ్మణుల యొక్క అలౌకికత ఎంతవరకు కనిపిస్తోంది? నా జన్మ మరియు కర్మ ప్రాకృతిక మనుష్యుల వలే కాక దివ్యమైనది మరియు అలౌకికమైనది. బాప్ దాదాతో పాటు బ్రాహ్మణులైన మీ యొక్క జన్మ కూడా సాధారణమైనది కాదు. అది దివ్యమైనది మరియు అలౌకికమైనది. జన్మ ఏవిధంగా ఉందో , నామము ఏవిధంగా దివ్యమైనదో అదేవిధముగా కర్మలు కూడా దివ్యముగా, అలౌకికముగా ఉన్నాయా?

ప్రతి ఒక్క లౌకిక కులము యొక్క మర్యాద రేఖ కూడా ఉంటుంది, అలాగే మీరు బ్రాహ్మణ కులమర్యాదల యొక్క రేఖ లోపలే ఉంటున్నారా? మర్యాదల యొక్క రేఖను సంకల్పంలో కూడా ఏ ఆకర్షణకూ వశమై ఉల్లంఘించడం లేదు కదా! అనగా గీత దాటి బయటికి వెళ్లడం లేదు కదా! శూద్రత్వపు స్వభావాలు లేక సంస్కారాల యొక్క స్మృతి కలగడం అనగా అంటరానివారిగా అవ్వడం. అనగా బ్రాహ్మణ పరివారము నుండి తమకు తామే దూరమవ్వడం. కావున రోజంతటిలో బాబా యొక్క తోడుగా ఎంతసేపు ఉన్నాము మరియు తమకు తాముగానే ఎంత సమయం దూరంగా ఉన్నాము అన్నది పరిశీలించుకోండి. పదే పదే దూరమయ్యేవారు బాబా సహాయము యొక్క అనుభవమును కోరుకుంటూ కూడా పొందలేకపోతారు. సముద్రపు తీరంలో ఉంటారు. కేవలం చూస్తూనే ఉండిపోతారు కానీ పొందలేరు. పొందాలి అన్న కోరిక ఉంటుంది కానీ పొందేసాము అన్న అనుభవమును పొందలేకపోతారు. జిజ్ఞాసులుగానే మిగిలిపోతారు, అధికారులుగా అవ్వలేరు, కావున రోజంతటిలో నేను జిజ్ఞాసువు యొక్క స్థితిలో ఎంత సమయం ఉంటున్నాను? మరియు అధికారి యొక్క స్థితిలో ఎంత సమయము ఉంటున్నాను? అని పరిశీలించుకోండి. మీ వద్దకు కూడా ఎవరైనా క్రొత్తవారు వస్తే వారిని మీరు ముందు జిజ్ఞాసులుగా చేస్తారు. జిజ్ఞాసువు అనగా పొందాలి అన్న జిజ్ఞాస కలవారు. మీరు కూడా జిజ్ఞాసువులను పక్కన ఉంచుతారు, సంఘటనలోకి లేక రెగ్యులర్ క్లాసులోకి వారిని రానివ్వరు. ఎప్పటివరకైతే నాకు అనుభవమయ్యింది, నిశ్చయం ఏర్పడింది, నేను అంగీకరిస్తున్నాను, తెలుసుకున్నాను అని అనరో అప్పటివరకు సంఘటనలోకి వచ్చే పర్మిషన్ ను ఇవ్వరు కదా! కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎప్పటివరకైతే జిజ్ఞాసువు యొక్క స్థితి ఉంటుందో అప్పటివరకు బాబా యొక్క సహాయం మరియు కులము యొక్క సహాయం అనగా సంఘటన యొక్క సహాయం స్వతహాగా, సహాయానికి బదులుగా స్వతహాగానే బుద్ధి ద్వారా దూరమవ్వరా? పిల్లలకు బదులుగా అడుక్కునే భక్తులుగా అయిపోరా? శక్తిని ఇవ్వండి, సహాయమును ఇవ్వండి, మాయను పారద్రోలండి, యుక్తిని ఇవ్వండి, మాయ నుండి వదిలించండి... ఇలా అడగడం బ్రాహ్మణత్వపు సంస్కారాలు కావు. బ్రాహ్మణులు ఎప్పుడూ ఇలా పిలువరు. బ్రాహ్మణులను స్వయం బాబా భిన్న భిన్న శ్రేష్ఠ టైటిళ్లతో పిలుస్తారు. మీకు తెలుసు కదా! మీకు ఎన్ని టైటిళ్లు ఉన్నాయి! బ్రాహ్మణులు అనగా పిలవడం ఆగిపోవడం. బ్రాహ్మణులు అనగా శిరోకిరీటాలు. వారు ఎప్పుడూ ప్రకృతి యొక్క మాయ యొక్క కోరికలకు వశీభూతులవ్వరు. కావున ఈవిధంగా శిరోకిరీటాలుగా అయ్యారా? మాయ రావడం అంటే బికారులుగా అవ్వడం, పురాతన సంస్కారాలకు వశమైపోవడం, స్వభావాలకు వశమైపోవడం... ఇదే బికారులుగా అవ్వడం. ఇటువంటి బికారులు బాబా యొక్క శిరోకిరీటాలుగా అవ్వలేరు, విశ్వం యొక్క రాజ్యసింహాసనాధికారులుగా అవ్వలేరు. బాబా యొక్క శిరోకిరీటాలుగా అయ్యేవారు స్వప్నంలో కూడా ఎప్పుడూ బికారులుగా అవ్వజాలరు. అర్థమయ్యిందా? పరిశీలించుకోండి, ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ కోర్సు కూడా నడుస్తుంది కదా! అచ్చా!

సదా స్వయాన్ని బ్రాహ్మణ కుల మర్యాదల యొక్క రేఖలో ఉండేవారిగా, మర్యాదా పురుషోత్తములుగా, వింటూ, వినిపిస్తూ మరియు సమానంగా అయ్యేవారికి, వెంటనే స్వరూపములో చూపించేవారికి సదా కిరీటధారులకు, సదా బాబా యొక్క సర్వప్రాప్తుల సహాయములో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీజీతో అవ్యక్త బాప్ దాదా:-

వెళ్ళడం మరియు రావడం అని అంటారా? ఎప్పుడైతే తోడును వదిలి వెళతారో అప్పుడే వెళ్ళడం మరియు రావడం అని అంటారు. ఎక్కడినుండైనా వెళ్ళడం అనగా వదిలి వెళ్ళడం . మరి ఇక్కడ వెళ్ళడం మరియు రావడం అన్న శబ్దాలను వాడవచ్చా? ఇక్కడ ఉన్నా తోడుగా ఉన్నారు, అక్కడ ఉన్నా తోడుగా ఉన్నారు. ఎవరైతే సదా తోడుగా ఉంటారో, స్థానములోనూ మరియు స్థితిలోనూ కూడా తోడుగా ఉంటారో వారిని గూర్చి వెళ్ళడం అని అనరు. మధువనములో కూడా ఒక గది నుండి ఇంకొక గదిలోకి వెళ్ళితే మేము ఇక్కడినుండి వెళుతున్నాము, వీడ్కోలు తీసుకుందాము అని భావించరు. సహజంగా వెళ్ళడం మరియు రావడం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తోడుగా ఉన్నారు కదా! ఇది కూడా ఒక గది నుండి ఇంకొక గదిలోకి వెళ్లడం వంటిదే. మీరు మధువనవాసులు. కావున వీడ్కోలు అన్న శబ్దమును కూడా వాడరు. సదా సేవ యొక్క అభినందలను ఇస్తారు. సదా తోడుగా ఉంటారు, సదా తోడుగా వెళతారు, తోడుగానే ఉంటున్నారు, ఇదేవిధంగా అనుభవమవుతుంది కదా! మహారథులు అనగా బాబా సమానమైనవారు. ప్రతి అడుగులోనూ పదమాల యొక్క సంపాదన సాధారణమైన విషయమే. కానీ మహారథుల ప్రతి అడుగులోనూ అనేక ఆత్మలను పదమా పతులుగా తయారుచేసే వరదానము నిండి ఉంది. మేము వెళ్తాము అని మహారథులు అనరు, కలిసి వెళతాము అని అంటారు. నయనాల ద్వారా, బాబా ద్వారా లభించిన వరదానాలను అనేకులకు ప్రాప్తిoపజేయడం అనగా తమ ద్వారా బాబాను ప్రత్యక్షం చేయడం మహారథుల యొక్క సేవ. మిమ్మల్ని చూస్తూ, చూస్తూ బాబా యొక్క స్మృతి స్వతహాగా వచ్చేయాలి. ఆవిధంగా తయారుచేసే వారిది అద్భుతము అని ప్రతి ఒక్కరి హృదయం నుండి వెలువడాలి. అప్పుడు బాబా ప్రత్యక్షమైపోతారు. బాబా! మీ ద్వారా ప్రత్యక్షముగా కనిపిస్తారు మరియు మీరు గుప్తమైపోతారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షమవుతున్నారు. బాబా గుప్తముగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరి హృదయం నుండి ప్రత్యక్షత యొక్క గుణగానములను వింటారు. మీరు కనిపించరు కానీ ఎక్కడ చుసిన బాబాయే కనిపిస్తారు. దీని కారణంగానే ఎక్కడ చుసినా అంతా తండ్రియే తండ్రి అని అంటారు. ఈ సంస్కారాలు చివరిలో మళ్ళీ భక్తిమార్గములో ఎక్కడ చూసినా నీవే నీవు అని పిలుస్తూ ఉంటారు. చివరిలో మీ అందరి ముఖములు దర్పణాల వలే పని చేస్తాయి. ఈరోజుల్లో మందిరాలలో ఎటువంటి అద్దాలు పెడతారంటే అందులో ఒకే ముఖము అనేక రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ అందరి ముఖములు నలువైపులా బాబాను ప్రత్యక్షంగా చూపించేందుకు నిమిత్తమవుతాయి. అప్పుడు ఎక్కడ చుసినా నీవే నీవు అని భక్తులు అంటారు. మొత్తం కల్పమంతటి యొక్క సంస్కారమును ఇక్కడే నింపుకుంటారు. కావున భక్తులు ఈ సంస్కారముతోటే ముక్తిని పొందుతారు. కావుననే ద్వాపరయుగము యొక్క ఆత్మలలో ముక్తిని పొందే సంస్కారము లేక అంతా నీవే నీవు అన్న సంస్కారము ఎక్కువగా ప్రత్యక్షమై ఉంటుంది. కావున మీ యొక్క లేక బాబా యొక్క భక్తులు కూడా ఇప్పుడే నిశ్చితమవుతారు. రాజధాని కూడా ఇప్పుడే తయారవుతుంది. మరియు భక్తులు కూడా ఇప్పుడే తయారవుతారు. కావున భక్తులను మేల్కొల్పేందుకు వెళుతున్నారా? లేక పిల్లలను కలుసుకునేందుకు వెళ్తున్నారా? ఈసారి యాత్రలో నా భక్తులుగా ఎంతమంది అయ్యారు?మరియు బాబా యొక్క పిల్లలుగా ఎంతమంది అయ్యారు అని పరిశీలించాలి. ఇరువురి యొక్క విశేష పాత్ర ఉంది. భక్తులకు కూడా అర్ధకల్పం పాత్ర ఉంది మరియు పిల్లలకు కూడా అర్ధకల్పము యొక్క అధికారము ఉంది. భక్తులు కూడా ఇక్కడే కనిపిస్తారా? లేక అంతిమంలో కనిపిస్తారా? నౌధా భక్తిని చేసే నెంబర్ వన్ భక్తులు మాల యొక్క మణులుగా ఉంటారు. వారు కూడా ఇక్కడే ప్రత్యక్షమవ్వనున్నారు. విజయమాల మరియు భక్తిమాల కూడా ఇక్కడే ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే, సంస్కారాలను నింపుకునే సమయం సంగమయుగమే. భక్తులు అంతిమంలో హే భగవంతుడా!మాకు కూడా ఏంతో కొంత ఇవ్వండి అని పిలుస్తూనే ఉండిపోతారు. ఈ సంస్కారము కూడా ఇక్కడి నుండే నింపుకుంటారు, ఇంకోవైపు పిల్లలు తోడును అనుభవము చేసుకుంటారు. అచ్చా!

టీచర్లతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము:

టీచర్లు అనగా శిక్షకులు. శిక్షకుని యొక్క అర్థమేమిటి? ఇక్కడ శిక్షకుని అర్థము శిక్షణ స్వరూపము. అన్నింటికన్నా పెద్ద శిక్షణను ఇవ్వడానికి కూడా సహజమైన సాధనము ఏమిటి? శిక్షణను ఇచ్చేందుకు అనేకరకాలైన సాధనాలు ఉంటాయి కదా! కావున శిక్షణను ఇచ్చేందుకు సహజమైన సాధనము ఏమిటి? స్వరూపము ద్వారా శిక్షణను ఇవ్వడమే కానీ ముఖము ద్వారా కాదు. సాకార బాబా అన్నింటికన్నా సహజ సాధనమైన స్వరూపము ద్వారానే శిక్షణను ఇచ్చారు కదా! కేవలం మాటల ద్వారా చెప్పలేదు, కర్మ ద్వారా చెప్పాలి. చెబితే వారు నేర్చుకుంటారు అని అనలేదు. "ఏదైతే చేస్తామో అది చూసి ఇతరులు కూడా చేస్తారు" అన్నది మంత్రము. కావున అన్నింటికన్నా సహజమైన విధానము స్వరూపము ద్వారా శిక్షణను ఇవ్వడం. ఎవరికైనా నీవు ఆత్మవు, నీవు శాంతిస్వరూపానివి, శక్తిస్వరూపానివి అని ఎంత అర్థం చేయించిన కానీ ఎప్పటివరకైతే వారు స్వయం ఆ స్వరూపములో స్థితులవ్వరో అప్పటివరకు అర్థం చేసుకోరు. ఇటువంటి అనుభవము యొక్క చదువు ఏంతో అవినాశిగా అయిపోతుంది. కావున మీరు ఎలా శిక్షణను ఇస్తున్నారు? వాణి ద్వారా ఇస్తున్నారా? లేక స్వరూపము ద్వారా ఇస్తున్నారా?

ప్రతి అడుగు ద్వారా అనేక ఆత్మలకు శిక్షణ ఇవ్వడమే యోగ్య టీచర్ గా అవ్వడం. భాషణ ద్వారా లేక సప్తాహిక కోర్సు ద్వారా ఎవరినైనా శిక్షణా స్వరూపంగా చేయాలి. ఇటువంటి శిక్షకుల యొక్క ప్రతి వాక్కు కేవలం వాక్యముగా కాక మహావాక్యముగా పిలువబడుతుంది. ఎందుకంటే ప్రతి వాక్కు మహాన్ గా తయారుచేసే విధముగా ఉంటుంది. అందుకనే మహావాక్యము అని అంటారు. ప్రతి కర్మ అనేకులను శ్రేష్ఠముగా తయారుచేసే ఫలాన్ని ఇచ్చేవిధముగా ఉంటుంది. కర్మను బీజము అని అంటారు. మరియు ఫలితమును కర్మఫలము అని అంటారు. ఇటువంటి శిక్షకుల యొక్క కర్మరూపి బీజము ఫలమునిచ్చేదిగా ఉంటుందే కానీ నిష్ఫలంగా ఉండదు. వారినే యోగ్య శిక్షకులు అని అంటారు. బ్రహ్మ ఒక్క సంకల్పంతో సృష్టిని రచించాడు అని బ్రహ్మ యొక్క సంకల్పమునకు ఏవిధంగా గాయనము ఉందో అలాగే శిక్షకుల యొక్క ప్రతి సంకల్పము ఆవిధంగా ఉంటుంది. ఇటువంటి శిక్షకుల యొక్క సంకల్పము క్రొత్త సృష్టి యొక్క అధికారిగా తయారుచేసేవిధంగా ఉంటుంది. అర్థమయ్యిందా! ఇదే శిక్షకుల యొక్క పరిభాష.

టీచర్లకు ఒక లిఫ్ట్ యొక్క గిఫ్ట్ కూడా ఉంది. అది ఏమిటి? టీచర్లుగా అవ్వడం అనగా పురాతన సంబంధాలను త్యజించడం. ఈ త్యాగము యొక్క భాగ్యమనే లిఫ్ట్ యొక్క గిఫ్ట్ టీచర్లకు లభిస్తుంది. మొదట త్యాగము చేసారు కదా! మొదటి త్యాగము సంబంధము యొక్క త్యాగము. అదైతే చేసేసారు. త్యాగముయొక్క లిఫ్ట్ చాలా పెద్దది. కానీ ఈ త్యాగము చేసారు. ధైర్యమును ఉంచారు. సహాయోగిగా అయ్యే సంకల్పమును చేసారు, ఈ లిఫ్ట్ గిఫ్ట్ గా అయిపోతుంది కానీ సంపూర్ణ త్యాగము చేసి బాబాకు ఒక కానుకగా మరియు ప్రపంచానికి కూడా ఒక కానుకగా అయిపోండి. ఇటువంటి లిఫ్ట్ గా అయ్యి, కూర్చోగానే చేరుకునే విధంగా ఉండండి. కష్టపడే అవసరం రాకూడదు. టీచర్లకు ఎంతో ఛాన్స్ ఉంది. కానీ తీసుకునేవారు తీసుకోవాలి. టీచర్ గా అయ్యే భాగ్యమును అందరు గానము చేస్తూ అలా అవ్వాలి అన్న కోరికను ఉంచుతారు. కోరికను ఉంచడం అనగా అది శ్రేష్ఠ భాగ్యమే కదా! దానిని సదా శ్రేష్ఠముగా ఉంచుకోవడములోనే ప్రతీ ఒక్కరూ నెంబర్ వారీగా ఉన్నారు. టీచర్లు ఎంత కావాలనుకుంటే అంత తమ భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోవచ్చు. కానీ, ఆ టీచర్ యోగ్య టీచర్ గా ఉండాలి. కొద్దిలో సంతోషపడిపోయే టీచర్ గా అయితే లేరు కదా! బాప్ దాదా టీచర్లను ఏ దృష్టితో చూస్తారు? తన సమానమైనవారిగా బాబా చూస్తారు, ఎందుకంటే బాబా కూడా టీచరే కదా! టీచర్ ను చూసినపుడు సహచరుని దృష్టితో చూస్తారు కదా! సహచరులను చూసి ఏంతో సంతోషిస్తారు. టీచర్లు సదా సంతుష్టంగా ఉంటారు. అడగడం అంటే సహచరుని అవమానపరచడం. అచ్చా!