19.05.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మజ్ఞానం మరియు పరమాత్మ ఙ్ఞానంలో గల తేడా.

సదా అంతర్ముఖి అంటే హర్షిత ముఖి, జ్ఞాన సాగరులు, శక్తిశాలి, సదా బాబా తోడుని అనుభవం చేసుకునే అనుభవీ మూర్తులైన పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

స్వయాన్ని సదా స్వదర్శనచక్రధారిగా అనుభవం చేసుకుంటున్నారా? కేవలం భావిస్తున్నారా లేక ప్రతి సమయం అనుభవం అవుతుందా? 1. అర్థం చేసుకోవటం 2. స్వరూపంలోకి తీసుకురావటం అంటే అనుభవం చేసుకోవటం. ఈ శ్రేష్ట జీవితం యొక్క శ్రేష్ట జ్ఞానం యొక్క శ్రేష్టత - అనుభవం చేసుకోవటం. ప్రతి విషయాన్ని అనుభవంలోకి తీసుకురానంత వరకు ఆత్మ జ్ఞానం మరియు పరమాత్మ జ్ఞానంలో ఏవిధమైన తేడా ఉండదు. ఆత్మలు ఆత్మజ్ఞానం చెప్తారు లేదా అర్ధం చేయిస్తారు కానీ అనుభవం చేయించలేరు. కానీ పరమాత్మ జ్ఞానం ప్రతి విషయాన్ని అనుభవం చేయిస్తూ వృద్ధికళ వైపుకి తీసుకువెళ్తుంది. కనుక జ్ఞానం యొక్క ప్రతి విషయాన్ని అనుభవంలోకి తీసుకువచ్చానా? అని స్వయాన్ని అడగండి. అర్థం చేసుకునేవారా, వినేవారా లేక అనుభవీ మూర్తులా? జీవితంలో అనేక రకాల అనుభవాలు ఆత్మను జ్ఞానిగా మరియు శక్తిశాలిగా తయారుచేస్తాయి. జ్ఞానం యొక్క ఏ పాయింట్ లో అయినా శక్తిశాలిగా లేరంటే వారు అన్ని పాయింట్స్ యొక్క అనుభవీమూర్తి కాలేదు అని అర్ధం. అర్ధం చేసుకునేవారిగా, అర్ధం చేయించేవారిగా, వర్ణన చేసేవారిగా అయ్యారు. కానీ మననమూర్తిగా కాలేదు. ఏడు రోజుల కోర్సులో ఇతరులకు ఏడు విషయాలు చెప్తారు కదా! ఆ ఏడు విషయాలను ఎదురుగా పెట్టుకోండి మరియు అన్ని పాయింట్స్ అనుభవీ మూర్తిగా అయ్యానా? అని పరిశీలన చేసుకోండి. ఏ పాయింట్ లో అర్ధం చేసుకునే వరకే ఉన్నాను లేదా ఏ పాయింట్స్ లో వినే వరకే ఉన్నాను? అని పరిశీలించుకోండి. బాప్ దాదా ఫలితం చూస్తే తెలిసింది ఏమిటంటే అన్ని విషయాలలో అనుభవీమూర్తిగా చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే అనుభవీ అంటే సదా అన్ని రకాల మోసం, దుఃఖం, సంశయం నుండి అతీతంగా ఉంటారు. అనుభవమే పునాది. ఏ రకమైన స్వయం యొక్క సంస్కారం, ఇతరుల సంస్కారం లేదా మాయ యొక్క చిన్న పెద్ద విఘ్నాలతో బలహీనం అవుతున్నారు అంటే అనుభవం అనే పునాది గట్టిగా లేనట్లు సిద్ధి అవుతుంది. అనుభవీమూర్తులు సదా స్వయాన్ని సంపన్నంగా భావిస్తూ కష్టాన్ని కష్టంగా భావించకుండా గట్టిగా అవ్వడానికి ఆధారం అని భావిస్తారు. బలహీన స్థితి అనేది అప్రాప్తికి గుర్తు. అనుభవీ మూర్తులు సర్వ ప్రాప్తిస్వరూపులు.

అదేవిధంగా దుఃఖం వస్తుంది లేదా మోసపోతున్నారంటే దానికి కారణం మాయ అని అంటున్నారు. కానీ మాయ యొక్క అనేక రూపాల యొక్క అనుభవీలు కాలేదు. అనుభవీలు మాయను అమాయక పిల్లవానిగా చూస్తారు. అమాయక పిల్లలు ఏదైనా చేస్తే పిల్లలంటే అమాయకులు, పిల్లల పనులు ఇలాగే ఉంటాయి అని భావిస్తారు కదా! వృద్ధుల ముందు చిన్న పిల్లలు ఆటలాడుకుంటారు. ఆవిధంగా అనుభవీలు మాయ యొక్క అనేక రకాల లీలలను చిన్న పిల్లల ఆటల వలె అనుభవం చేసుకుంటారు. ఇతరులు అయితే మాయ యొక్క చిన్న విఘ్నాన్ని కూడా పర్వతంగా భావిస్తారు, మాయ చాలా బలమైనది, మాయను జయించటం చాలా కష్టం అని అనుకుంటారు. దీనికి కారణం ఏమిటి? అనుభవం యొక్క లోపం. ఇటువంటి ఆత్మలు బాప్ దాదా యొక్క మాటలనే తీసుకుంటారు కానీ భావాన్ని అర్థం చేసుకోరు. అనుభవం యొక్క ఆధారం ఉండదు, మాటలనే ఆధారంగా చేసుకుంటారు. మాయను జయించటం అంటే అత్తారింటికి వెళ్ళివచ్చినంత సులువు కాదు, మాయ కూడా సర్వశక్తివంతమైనది, అర్జునులు ఇప్పుడు ఇంకా సంపూర్ణం కాలేదు, అంతిమంలో సంపూర్ణం అవుతారు అని బాప్ దాదా కూడా చెప్పారు అని ఇలాంటి మాటలను తమ ఆధారంగా చేసుకుని నడవటం వలన, ఆధారం బలహీనమైనది కనుక మాటిమాటికీ అలజడి అవుతూ ఉంటున్నారు. అందువలన మాటలను ఆధారంగా చేసుకోకండి, బాబా యొక్క భావాన్ని అర్థం చేస్కోండి. అనుభవాన్ని మీ ఆధారంగా చేస్కోండి. అలజడి అవ్వడానికి కారణం - అనుభవం యొక్క లోపం. మాస్టర్ సర్వశక్తివంతులు, విజయీ రత్నాలు, స్వదర్శనచక్రధారులు, శివశక్తి, పాండవసేన, సహజ రాజయోగి, మహాదాని, వరదాని, విశ్వకళ్యాణకారులు కానీ స్వయం యొక్క కళ్యాణం కోసమే ఏ విషయం అయినా వస్తే, మాయాజీత్ గా అయ్యేటందుకు ఏ విషయం అయినా వస్తే ఏమి చేస్తున్నారు మరియు ఏమి అంటున్నారు? ఏమి చేస్తున్నారో తెలుసు కదా? చాలా మనోరంజన ఆట ఆడుతున్నారు. జ్ఞాన సాగరులు నుండి పూర్తిగా తెలివితక్కువ వారిగా అయిపోతున్నారు. మాయ ఎలాగైతే అమాయక బిడ్డ అని అన్నారో అదేవిధంగా మాయకి వశమై జ్ఞాన సాగరులకు బదులు అమాయక పిల్లల వలె అయిపోతున్నారు. ఇంకా ఏమి చేస్తున్నారు? ఇలాగని మాకేమి తెలుసు, ఇది ముందే తెలిసి ఉంటే త్యాగం చేసేవాళ్ళమే కాదు, బ్రాహ్మణులమే కాకపోదుము, ఇంతగా ఇముడ్చుకోవలసి వస్తుంది, సహించవలసి వస్తుంది, ప్రతి విషయంలో స్వయాన్ని మార్చుకోవలసి వస్తుంది, తొలగించుకోవలసి వస్తుంది, చనిపోవలసి వస్తుంది, ఇలాగని అసలు తెలియనే తెలియదు అంటున్నారు. త్రికాలదర్శి, జ్ఞాన సాగరులు అయ్యిండి ఈ సాకులు చెప్పటం అమాయకపు బాల్యం కాదా? కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే సదా బాబా తోడు యొక్క అనుభవం లేదు. సదా బాబా తోడు యొక్క అనుభవం ఉన్న అనుభవీలు ఇటువంటి బలహీన సంకల్పాలు చేయరు. బాబాని తోడు పెట్టుకుంటే ఉండే నషా ఎలా ఉంటుందో కల్పపూర్వపు స్మృతిచిహ్నం ఇప్పటికీ కూడా కీర్తించబడుతుంది. అది ఏమిటి? అక్షోణి సైన్యం ఎదురుగా ఉన్నా కానీ, పెద్ద పెద్ద మహారథీలు ఎదురుగా ఉన్నా కానీ పాండవులకు ఏ నషా ఉంది? బాబా తోడు ఉన్నారనే నషా. అక్షోణి సైన్యం అంటే మాయ యొక్క భిన్న భిన్న స్వరూపాలు కూడా బాబా తోడు ఉన్న కారణంగా క్షణంలో భస్మం అయిపోతాయి. ఇటువంటి నషా స్మృతిచిహ్నంలో కూడా కీర్తించబడింది. మహావీరులను మహావీరులుగా భావించలేదు, చనిపోయిన శవాలుగా భావించారు. ఇది ఎవరి స్మృతిచిహ్నం? బాబాని తోడుగా పెట్టుకునే అనుభవీ ఆత్మలది. అందువలనే అనుభవీలు ఎప్పుడూ మోసపోరు, కష్టాన్ని అనుభవం చేసుకోరు అని చెప్పాను. కల్పపూర్వపు స్మృతిచిహ్నాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటున్నారా లేక కేవలం వర్ణిస్తున్నారా? బాప్ దాదా పిల్లల యొక్క ఇటువంటి స్థితిని చూసి - స్వయం యొక్క కళ్యాణం చేసుకోలేనివారు, స్వయాన్ని పరివర్తన చేసుకోలేనివారు అంతే కాకుండా తమ బలహీనతను తెలివి అనుకుని వర్ణిస్తుంటే వీరు అర్ధం చేసుకునేవారే కానీ అనుభవీ కాదు అని అనుకుంటున్నారు. దీని కారణంగా జ్ఞాన సాగరులే కానీ శక్తిశాలి కాదు. వినేవారు మరియు వినిపించేవారు, అర్ధం చేసుకునేవారే కానీ బాబా సమానంగా అయ్యేవారు కాదు. సమానంగా కాని వారు ఎదుర్కోలేరు కూడా. అప్పుడప్పుడు వాడిపోతారు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు. అందువలన ఏకాంతవాసిగా అవ్వండి, అంతర్ముఖి అవ్వండి. ప్రతి విషయం యొక్క అనుభవంలో స్వయాన్ని సంపన్నంగా చేస్కోండి. మొదటి పాఠం తండ్రి మరియు పిల్లలు. ఎవరి సంతానాన్ని? ప్రాప్తి ఏమిటి? ఈ మొదటి పాఠం యొక్క అనుభవీమూర్తి అయితే సహజంగానే మాయాజీత్ అయిపోతారు. కొద్ది సమయం అనుభవంలో ఉంటున్నారు, వినటం మరియు అర్ధం చేసుకోవటంలో ఎక్కువ సమయం ఉంటున్నారు. అనుభవీ మూర్తి అంటే సదా సర్వ అనుభవాలలో ఉండాలి. అర్థమైందా? సాగరుని పిల్లలుగా అయ్యారు కానీ సాగరం అంటే సంపన్నత యొక్క అనుభవం చేసుకోలేదా? మంచిది.

సదా అంతర్ముఖి అంటే హర్షితముఖి, మాయ యొక్క ప్రతి యుద్దాన్ని వెన్నలో వెంట్రుక తీసినంత సహజంగా దాటేసేవారికి, ఈ విధమైన సహజ యోగి, సదా బాబా తోడుని అనుభవం చేసుకునే అనుభవీమూర్తులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.