18.01.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాప్ దాదా యొక్క సేవకి ఫలితం.

సదా అతీంద్రియ సుఖం లేదా సంతోషం యొక్క ఊయలలో ఊగింపచేసేవారు, సుఖ సాగరుడు అయిన శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు స్మృతి దినోత్సవం అంటే సమర్థ రోజున పిల్లలందరు తమ సంలగ్నతను అనుసరించి భిన్న భిన్న రూపాలతో స్మృతి చేసారు. బాప్ దాదా దగ్గరకి నలువైపుల ఉన్న స్నేహి, సహయోగి, శక్తి స్వరూపంగా సంపర్కంలో ఉన్న అన్ని ఆత్మల యొక్క అన్ని రకాలైన స్మృతి వతనం వరకు చేరుకుంది. బాప్ దాదా ద్వారా వారు ఎవరు ఏ రూపంలో స్మృతి చేస్తున్నారో ఆ రూపంలో ఆ సమయంలోనే అటువంటి ఫలితం లభిస్తుంది. ఎవరు ఏ రూపంతో స్మృతి చేస్తున్నారో ఆ రూపంలో బాప్ దాదా ప్రత్యక్షం అయిపోతున్నారు. యోగి ఆత్మలు యోగం యొక్క విధితో కలయిక జరుపుకుంటున్నారు. కొంతమంది పిల్లలు యోగికి బదులు వియోగి ఆత్మలుగా అయిపోతున్నారు. దీని కారణంగా కలయికకు బదులు విడిపోయినట్లు అనుభవం చేసుకుంటున్నారు. యోగి ఆత్మలు సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారు. మనస్సు ఎప్పుడు దూరం కాదు. వియోగి ఆత్మలు వియోగం ద్వారా బాబాని ఎదురుగా తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వర్తమానాన్ని మరచిపోయి జరిగిపోయిన దానిని జ్ఞాపకం చేస్తున్నారు. దీని కారణంగా అప్పుడప్పుడు బాప్ దాదా ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు, అప్పుడప్పుడు పరదా లోపల ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ బాప్ దాదా సదా పిల్లల ముందు ప్రత్యక్షంగానే ఉంటారు. పిల్లల దగ్గర దాగలేరు. బాబా ఉన్నదే పిల్లల కోసం. ఎప్పటి వరకు అయితే పిల్లలకు స్థాపనా కర్తవ్యం యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాప్ దాదా పిల్లలకు ప్రతి సంకల్పంలో మరియు ప్రతి సెకను తోడుగా ఉంటారు. బాప్ దాదా యొక్క ప్రతిజ్ఞ - వెంటే నడుస్తాను అని. ఎప్పుడు వెళ్ళిపోతారు? కార్యం సమాప్తి అయిన తర్వాత. మరి ముందే బాబాని ఎందుకు పంపేసారు! బాబా వెళ్ళిపోయారు అని అంటూ అవినాశి సంబంధాన్ని ఎందుకు వినాశిగా చేసుకుంటున్నారు? కేవలం బాబా పాత్ర పరివర్తన అయ్యింది. ఎలా అయితే మీరు కూడా సేవా స్థానాలను మార్చుకుంటారు కదా! అదేవిధంగా బ్రహ్మాబాబా కూడా సేవా స్థానాన్ని మార్చుకున్నారు. రూపం అదే, సేవ అదే. 1000 భుజాలు కల్గిన బ్రహ్మ యొక్క పాత్ర వర్తమాన సమయంలో నడుస్తుంది. అందుకే ఈ సాకార సృష్టిలో ఆ రూపానికి విశేషమైన మహిమ మరియు స్మృతిచిహ్నం ఉంది. భుజాలు కూడా బాబా లేకుండా కర్తవ్యం చేయలేరు. భుజాలు బాబాని ప్రత్యక్షం చేస్తున్నాయి. చేయించేవారు ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు. ఎలా అయితే ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చేయలేవు కదా! అదేవిధంగా బాప్ దాదాలు కలిసి ఉండే ఆత్మ లేకపోతే భుజాలైన పిల్లలు కూడా ఏమి చేస్తారు? కర్తవ్యంలో అంతిమం వరకు మొదట కార్యం యొక్క భాగం బ్రహ్మదే ఉంటుంది. బ్రహ్మ అంటే ఆదిదేవ్. ఆదిదేవ్ అంటే ప్రతి శుభకార్యాన్ని ప్రారంభం చేసేవారు. బాప్ దాదా ఆది చేయకుండా అంటే ప్రారంభించకుండా ఏ కార్యం అయినా ఎలా సఫలం అవుతుంది? ప్రతి కార్యంలో మొదట బాప్ దాదా యొక్క సహయోగం ఉంటుంది. అనుభవం కూడా చేసుకుంటారు, వర్ణన కూడా చేస్తారు అయినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. ప్రేమసాగరుని యొక్క ప్రేమ అనే అలలలో ఏవిధంగా తయారవుతున్నారు? అలలలో ఆడుకోవాలి కానీ అలలకు వశీభూతం అయిపోకూడదు. గుణగానం చేయండి కానీ హంతకునిగా అవ్వకండి. బాబా పిల్లలు నా తోడు అనే భావంతో చూస్తుంటే పిల్లలు వియోగమనే పరదా వేసి చూస్తూ ఉంటున్నారు మరియు మరలా వెతకటంలో సమయం పోగొట్టుకుంటున్నారు. ఒకవేళ దాగుడుమూతల ఆట ఇష్టమనిపిస్తే ఆటగా భావించి భలే ఆడుకోండి. కానీ స్వరూపంగా అవ్వకండి. ఈ విషయాలు సంతోష పెట్టటానికి చెప్పటం లేదు. సేవ యొక్క వేగం మరింత పెంచటానికి కేవలం స్థానాన్ని పరివర్తన చేసారు. కనుక పిల్లలు కూడా బాబా సమానంగా సేవని తీవ్రం చేయటంలో బిజీగా ఉండాలి. ఇదే స్నేహానికి ఇచ్చే బదులు. బాబాకి తెలుసు పిల్లలకి బాబా పైన విశేషమైన స్నేహం ఉంది అని. కానీ బాబాకి పిల్లలతో పాటు సేవపై కూడా స్నేహం ఉంటుంది. బాబాపై స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం - సేవపై స్నేహం ఉండాలి. ఎలా అయితే ప్రతి క్షణంలో బాబా, బాబా అంటున్నారో అలాగే ప్రతి క్షణం బాబా మరియు సేవ ఉండాలి, అప్పుడే సేవా కార్యం పూర్తి అవుతుంది మరియు తిరిగి ఇంటికి వెళ్ళగలము. ఇప్పుడు బాప్ దాదా ప్రతి ఒక్కరినీ , లైట్ హౌస్ రూపంలో చూస్తున్నారు. మైక్ అయితే శక్తిశాలిగా అయిపోయింది. కానీ లైట్, మైట్, మైక్ మూడూ శక్తిశాలిగా ఉండాలి మరియు వెనువెంట ఉండాలి. మాటలలోకి రావటం సహజంగా అనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇటువంటి శక్తిశాలి స్థితిని తయారుచేసుకోండి, ఆ స్థితి ద్వారా ప్రతి ఆత్మకు శాంతి, సుఖం మరియు పవిత్రత యొక్క మూడు లైట్స్ మీ మైట్ ద్వారా ఇవ్వాలి. మీ మైక్ ద్వారా ఈ మూడు లైట్స్ ని ఇవ్వాలి. ఎలా అయితే సాకార సృష్టిలో ఎటువంటి రంగు లైట్ వేసుకుంటే నలువైపుల ఆ రంగు యొక్క వాతావరణమే వస్తుంది కదా! ఒకవేళ ఆకుపచ్చ రంగు లైట్ వేస్తే నలువైపుల అదే ప్రకాశం వ్యాపిస్తుంది. స్థూల లైట్ ఒకే స్థానంలో ఉంటూ వాతావరణాన్ని పరివర్తన చేస్తుంది. ఎలా అయితే మీరు ఎరుపు లైట్ వేయగానే స్వతహాగానే యోగం యొక్క వాతావరణం తయారవుతుంది కదా! ఇలా స్థూలమైన లైట్ వాతావరణాన్ని పరివర్తన చేయగలుగుతున్నప్పుడు లైట్‌హౌస్ అయిన మీరు మీ పవిత్రత యొక్క లైట్ ద్వారా లేదా సుఖం యొక్క లైట్ ద్వారా వాతావరణాన్ని తయారుచేయలేరా? స్థూలమైన ప్రకాశాన్ని కళ్ళ ద్వారా తెలుసుకోగలము కానీ ఆత్మిక ప్రకాశాన్ని అనుభవం ద్వారానే తెలుసుకోగలము. వర్తమాన సమయంలో ఈ ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయాలి. ఇప్పుడు సేవా రూపం ఏమి ఉండాలో విన్నారా? రెండు సేవలు ఇప్పుడు వెనువెంట జరగాలి. మైక్ మరియు మైట్ రెండు వెనువెంట ఉండాలి. అప్పుడే సహజంగా సఫలతా మూర్తులుగా అవుతారు.