14.02.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సమీప ఆత్మ యొక్క గుర్తులు.

అవ్యక్త బాప్ దాదా అన్నారు -

స్వయాన్ని సదా బాప్ దాదా యొక్క తోడుగా అంటే సదా సమీప ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? సమీప ఆత్మ యొక్క గుర్తులు ఏమి ఉంటాయి? ఎవరు ఎంత సమీపంగా ఉంటారో అంతగా స్థితిలో, కర్తవ్యంలో, గుణాలలో బాబా సమానంగా అంటే సదా సంపన్నంగా అంటే దాతగా ఉంటారు. ఎలాగైతే బాబా ప్రతి సెకను మరియు ప్రతి సంకల్పంలో విశ్వకళ్యాణకారియో అదేవిధంగా వారు కూడా బాబా సమానంగా విశ్వకళ్యాణకారిగా ఉంటారు. విశ్వ కళ్యాణకారుల ప్రతి సంకల్పం ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభ భావన కలిగి ఉంటుంది. ఒక్క సంకల్పం కూడా శుభ భావన లేకుండా ఉండదు. ఎలాగైతే బీజం ఫలంతో నిండుగా ఉంటుందో అంటే వృక్షమంతటి సారం బీజంలో నిండి ఉంటుందో అదేవిధంగా సంకల్పం అనే బీజంలో శుభ భావన, కళ్యాణ భావన, సర్వులను బాబా సమానంగా తయారు చేయాలనే భావన, నిర్భలులను బలశాలిగా తయారుచేయాలనే భావన, దుఃఖి, అశాంతి ఆత్మలను స్వయానికి లభించిన శక్తుల ఆధారంగా సదా సుఖిగా, శాంతిగా తయారుచేయాలనే భావన... ఇలా సర్వ రసాలు ప్రతి సంకల్పంలో నిండి ఉంటాయి. ఏ సంకల్ప రూపి బీజం ఈ సారం నుండి ఖాళీగా అంటే వ్యర్ధంగా ఉండదు. కళ్యాణ భావనతో సమర్ధంగా ఉంటుంది.

ఎలాగైతే స్థూల గీతాలు ఆత్మలను అల్పకాలికంగా ఉత్సాహంలోకి తీసుకువస్తాయో, అనుకోకుండానే అందరి పాదాలు నాట్యం చేయటం ప్రారంభిస్తాయి కదా, మనస్సు కూడా నాట్యం చేస్తుంది. అదేవిధంగా విశ్వకళ్యాణకారుల ప్రతి మాట ఆత్మిక గీతం వలె ఉత్సాహ, ఉల్లాసాలను ఇస్తుంది. ఉదాసీన ఆత్మ బాబాను కలుసుకున్నట్లు అనుభవం చేసుకుంటుంది మరియు సంతోషంలో నాట్యమాడుతుంది. విశ్వకళ్యాణకారుల కర్మ కర్మయోగిగా ఉంటుంది. కనుక ప్రతి కర్మ చరిత్ర సమానంగా మహిమాయోగ్యంగా ఉంటుంది. ప్రతి కర్మ మహిమా యోగ్యంగా మరియు కీర్తనా యోగ్యంగా ఉంటుంది. భక్తులు కీర్తనలో వర్ణిస్తారు - చూడటం అలౌకికంగా, నడవటం అలౌకికంగా ఇలా ప్రతి కర్మేంద్రియం యొక్క మహిమను అపరం అపారంగా చేస్తారు. అదేవిధంగా ప్రతి కర్మ మహాన్ గా అంటే మహిమాయోగ్యంగా ఉంటుంది. ఇటువంటి ఆత్మను బాబా సమాన సమీప ఆత్మ అని అంటారు. అదేవిధంగా విశ్వకళ్యాణకారి ఆత్మ యొక్క ప్రతి సెకను యొక్క సంపర్కం ఆత్మకు సర్వ కామనలు ప్రాప్తించినట్లుగా అనుభవం చేయిస్తుంది. విశ్వకళ్యాణకారి మహానాత్మల సంపర్కం కొందరికి శక్తిని, కొందరికి శాంతిని, కొందరికి కష్టాన్ని సహజం చేసే విధంగా ఉంటుంది, ఆధీనులను అధికారిగా తయారుచేసే, ఉదాసీనులు హర్షితంగా చేసేవిధంగా ఉంటుంది. విశ్వకళ్యాణకారి మహానాత్మల యొక్క సంపర్కం సదా ఉత్సాహ ఉల్లాసాలను ఇస్తుంది. పరివర్తనను అనుభవం చేయిస్తుంది. చత్రఛాయను అనుభవం చేయిస్తుంది. ఈవిధమైన విశ్వ కళ్యాణకారి అంటే సమీప ఆత్మగా అయ్యే వారినే సంలగ్నతలో నిమగ్నమైన ఆత్మ అని అంటారు. ఈ విధంగా తయారవుతున్నారు కదా?

బాబాని మీవారిగా చేసుకున్నారు. కనుక అందరు అదృష్టవంతులే! బాబా తన పిల్లలను స్వీకరించారు అంటే అధికారిగా చేశారు. ఈ అధికారం అందరికీ లభించింది కూడా. కానీ విశ్వ యజమానిగా అయ్యే అధికారం విశ్వ కళ్యాణకారి అవ్వటం ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి - అధికారిగా అయ్యానా? అని. రాజ్య భాగ్యం యొక్క అధికారిగా అయ్యారా? సింహాసనాధికారిగా అయ్యే అధికారిగా అయ్యారా? ఉన్నత కుటుంబంలోకి వచ్చే అధికారిగా అయ్యారా? లేక ఉన్నత కుటుంబం యొక్క సంపర్కంలోకి వచ్చే అధికారిగా అయ్యారా? ఎంత వరకు చేరుకున్నారు? రాజ్య భాగ్యానికి అధికారిగా అయ్యారా? విదేశీ ఆత్మలు స్వయాన్ని ఏమని భావిస్తున్నారు? అందరు రాజ్యం చేస్తారా లేక రాజ్యంలోకి వస్తారా? ఏది లభించినా అంగీకారమేనా? విదేశి ఆత్మలలో సత్యయుగి అష్ట చక్రవర్తులలో ఒక చక్రవర్తిగా అయ్యే ఆశావాదులు ఎవరు? అష్ట చక్రవర్తులలో మొదటి లక్ష్మీ నారాయణులుగా అవుతారా? రెండవ నెంబర్ లోకి వస్తారా? అష్ట చక్రవర్తులుగా అవ్వడానికి ఏమి చేయాల్సి ఉంటుంది? ఎనిమిది మందే కదా అని ఆలోచిస్తున్నారా? చాలా సహజ విషయం ; ప్రతి సమయం , ప్రతి పరిస్థితిలో అష్ట శక్తులు వెనువెంట ప్రత్యక్ష రూపంలో ఉంటున్నాయా? ఒకవేళ రెండు, నాలుగు శక్తులు ఉండి ఒక్క శక్తి అయినా లోటుగా ఉంటే అష్ట చక్రవర్తుల్లోకి రాలేరు. అష్టశక్తుల సమానత ఉండాలి మరియు ఒకే సమయంలో అష్ట శక్తులు ప్రత్యక్షమవ్వాలి. సహనశక్తి 100% ఉంది, కానీ నిర్ణయశక్తి 60% లేదా 50% ఉండకూడదు. రెండింటిలో సమానత ఉండాలి అంటే పూర్తి శాతం ఉండాలి. అప్పుడే సంపూర్ణ రాజ్య సింహాసనం యొక్క అధికారిగా అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఎలా అవుతారు? అష్ట లక్ష్మీ నారాయణుల రాజ్యానికి లేదా సింహాసనానికి అధికారిగా అవుతారా?

విదేశీ ఆత్మలలో ఉల్లాసం మరియు ధైర్యం మంచిగా ఉన్నాయి. ధైర్యవంతులైన పిల్లలకు బాబా సహాయం చేస్తారు. హైజంప్ కి ఉదాహరణ కాగలరు. కానీ ఈ అన్ని విషయాలను ధ్యాసలో ఉంచుకోవలసి ఉంటుంది. విశేష ఆత్మలు, పందెంలో నెంబరువగా పరుగు పెట్టేవారు అని బాప్ దాదాకి తెలుసు. దూరంగా ఉన్నా కానీ సమీపంగా అనుభవం చేసుకునే ఉత్సాహ, ఉల్లాసాలు గల ఆత్మలు కూడా తప్పకుండా ఉన్నారు. ఇప్పుడు వేదికపై ప్రత్యక్షంలో మీ పాత్రను అభినయించండి. పురుషార్థాన్ని పెంచుకోవాలి. మొదటి నెంబరు యొక్క విశేషత ఏమిటో దాని అనుసారంగా పురుషార్ధం చేయాలి. ప్రతి కర్మలో వృద్ధి కళ ఉండాలి. మంచిది.