14.01.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం - పవిత్రత.

పవిత్రత, సుఖం మరియు శాంతి యొక్క ఈశ్వరీయ జన్మ సిద్ధాధికారం పొందే పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు అమృతవేళ బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో నెంబర్‌వారీ పురుషార్థాన్ని అనుసరించి పవిత్రత యొక్క మెరుపు కనిపిస్తుంది. ఈ బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం పవిత్రతయే. శ్రేష్టత్మలైన మీ యొక్క శ్రేష్టత - పవిత్రతయే. పవిత్రతయే ఈ భారత దేశం యొక్క గొప్పతనం, పవిత్రతయే బ్రాహ్మణాత్మలైన మీ యొక్క ఆస్తి, ఇది ఈ జన్మలో కూడా పొందుతున్నారు మరియు అనేక జన్మలు కూడా పొందుతున్నారు. పవిత్రతయే విశ్వ పరివర్తనకు ఆధారం. పవిత్రత కారణంగానే విశ్వంలో ఆత్మలు మీ జడ చిత్రాలను చైతన్యం కంటే శ్రేష్టంగా భావిస్తున్నారు. ఈ రోజుల్లో పేరున్నవారు కూడా పవిత్రత ముందు తల వంచుతారు. ఇటువంటి పవిత్రత బాప్ దాదా ద్వారా మీకు జన్మ సిద్ధాధికారం రూపంలో లభిస్తుంది. బయటవారు పవిత్రత అనేది చాలా కష్టంగా భావిస్తారు కానీ మీరు అతి సహజంగా అనుభవం చేసుకుంటున్నారు. పవిత్రత యొక్క పరిభాష పిల్లలైన మీకు అతి సాధారణమైనది ఎందుకంటే మీకు వాస్తవికంగా ఆత్మ యొక్క స్వరూపమే సదా పవిత్రత అని ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది. అనాది స్వరూపంలో కూడా పవిత్ర ఆత్మలు మరియు ఆది స్వరూపంలో కూడా పవిత్ర దేవతలు మరియు ఇప్పటి అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జన్మ. ఈ స్మృతి ఆధారంగా పవిత్ర జీవితం తయారు చేసుకోవటం అతి సహజంగా అనుభవం చేసుకుంటున్నారు. అపవిత్రత అనేది పర ధర్మం. పవిత్రత అనేది స్వధర్మం. స్వధర్మాన్ని సొంతం చేసుకోవటం సహజంగా అనిపిస్తుంది. ఆజ్ఞాకారీ పిల్లలకు బాబా ఇచ్చే మొదటి ఆజ్ఞ - పవిత్రంగా అవ్వండి, అప్పుడే యోగిగా కాగలరు. ఈ ఆజ్ఞని పాలన చేసే ఆజ్ఞాకారీ పిల్లలను చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. విశేషంగా ఈ రోజు విదేశీ పిల్లలను అంటే ఎవరైతే బాబా యొక్క శ్రేష్ట మతాన్ని ధారణ చేసి జీవితాన్ని పవిత్రంగా చేసుకున్నారో అటువంటి పవిత్ర ఆజ్ఞాకారీ ఆత్మలను చూసి బాప్ దాదా కూడా పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు. పిల్లలు బాబా యొక్క గుణాల మహిమ ఎక్కువగా చేస్తున్నారా? లేక బాబా ఎక్కువగా పిల్లల గుణాల మహిమ చేస్తున్నారా? బాప్ దాదా ఎదురుగా వతనంలో విశేష శృంగారం ఎవరు?

ఎలాగైతే మీరు ఇక్కడ ఏదైనా స్థానాన్ని పూల మాలలతో అలంకరిస్తారో అలాగే బాప్ దాదా దగ్గర కూడా ప్రతి బిడ్డ యొక్క గుణాల మాల యొక్క అలంకరణ ఉంది. ఎంత మంచి అలంకరణ ఉంటుంది! దూరం నుండే చూడవచ్చు కదా! ప్రతి ఒక్కరు మా గుణాల మాల చిన్నదా లేక పెద్దదా అని తెలుసుకోవచ్చు. బాప్ దాదాకి అతి సమీపంగా, సన్ముఖంగా ఉన్నారా? కొంచెం దూరంగా ఉన్నారా? ఎవరి మాల సమీపంగా ఉంటుందో తెలుసు కదా? ఎవరైతే బాబా యొక్క గుణాలకు, కర్తవ్యానికి సమీపంగా ఉంటారో వారే సదా సమీపం. ప్రతి గుణం ద్వారా బాబా యొక్క గుణాన్ని ప్రత్యక్షం చేసేవారు, ప్రతి కర్మ ద్వారా బాబా కర్తవ్యాన్ని రుజువు చేసేవారే సమీప రత్నాలు.

ఈరోజు బాప్ దాదా పవిత్రత అనే సబ్జక్టులో మార్కులు ఇస్తున్నారు. మార్కులు ఇవ్వటంలో ఏమి విశేషత చూశారు? మొదటి విశేషత - మనస్సు యొక్క పవిత్రత. జన్మ తీసుకున్న దగ్గర నుండి ఇప్పటివరకు సంకల్పంలో కూడా అపవిత్ర సంస్కారం రాకూడదు. అపవిత్రత అంటే విషాన్ని వదిలేసారు. బ్రాహ్మణులుగా అవ్వటం అంటేనే అపవిత్రతను త్యాగం చేయటం మరియు పవిత్రత యొక్క శ్రేష్ట భాగ్యాన్ని పొందటం. బ్రాహ్మణ జీవితంలో సంస్కారాలే పరివర్తన అయిపోతాయి. మనస్సులో సదా శ్రేష్ట స్మృతి, ఆత్మిక స్వరూపం అంటే అందరూ సోదరులు అనే స్మృతి ఉంటుంది. ఈ స్మృతి ఆధారంగానే మనసా పవిత్రతలో మార్కులు లభిస్తాయి. మాటలో సదా సత్యత మరియు మధురత ఉండాలి. దీని ఆధారంగానే మాటకు మార్కులు లభిస్తాయి. కర్మలో సదా నమ్రత మరియు సంతుష్టత ఉండాలి. దీని ప్రత్యక్ష ఫలంగా సదా హర్షితముఖంగా ఉండగలరు. ఈ విశేషత ఆధారంగానే కర్మణాలో మార్కులు లభిస్తాయి. ఇప్పుడు మూడింటిని ఎదురుగా ఉంచుకుని స్వయాన్ని పరిశీలించుకోండి. మా నెంబర్ ఏది? అని. విదేశీ ఆత్మల నెంబర్ ఏది?

ఈరోజు విశేషంగా కలుసుకోవటానికి వచ్చారు. కొంతమంది ఆత్మల కారణంగా బాబా కూడా విదేశీ నుండి దేశీగా కావలసి వస్తుంది. అందరికంటే దూర దేశం యొక్క విదేశీ బాబా. విదేశీ బాబా ఈ లోకంలో విదేశీ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. భారత వాసీయులు కూడా తక్కువైన వారు కాదు. భారతవాసీయులు విదేశీయులకి అవకాశం ఇవ్వటం కూడా భారతదేశం యొక్క గొప్పతనం. అవకాశాన్ని ఇచ్చే భారతవాసీయులందరు అవకాశధారులుగా అయిపోయారు. విదేశీయుల విశేషత తెలుసా? ఏ విశేషత కారణంగా ముందు నెంబర్ తీసుకుంటున్నారు? విశేష విషయం ఏమిటంటే కొంతమంది విదేశీ పిల్లలు రాగానే స్వయాన్ని ఈ పరివారానికి చెందినవారిగా, ఈ ధర్మం యొక్క పూర్వీకులుగా అనుభవం చేసుకుంటున్నారు. వీరినే అంటారు రాగానే అధికారిగా అనుభవం చేసుకునే ఆత్మలు అని. ఎక్కువ శ్రమ చేయకుండా సహజంగానే కల్ప పూర్వం యొక్క స్మృతి జాగృతి అవుతుంది. అందువలనే “మా బాబా " అనే మాట అనుభవం ఆధారంగా చాలా తొందరగా కొందరి నోటి నుండి లేదా మనస్సు నుండి వస్తుంది. రెండవ విషయం ఈశ్వరీయ చదువు యొక్క ముఖ్య సబ్జక్టు అయిన సహజ రాజయోగం. ఈ సబ్జక్టులో ఎక్కువ మంది విదేశీ ఆత్మలకి అనుభవాలు చాలా మంచిగా సహజంగా అవుతాయి. ఈ ముఖ్య సబ్జక్టుపై విశేషంగా ఆకర్షితం అయిన కారణంగా నిశ్చయం యొక్క పునాది గట్టిగా అయిపోతుంది. ఇది రెండవ విశేషత. అంగదుని సమానంగా గట్టిగా ఉన్నారు కదా! మాయ చలింపచేయటం లేదు కదా, ఈరోజు విశేషంగా విదేశీయులది కనుక భారతవాసీయులు సాక్షిగా ఉన్నారు.

భారతవాసీయులు తమ భాగ్యం గురించి మంచిగా తెలుసుకుంటున్నారు, విదేశీయులు కూడా రాజ్యం ఇక్కడే చేయాలి కదా! మీ భాగ్యం గురించి తెలుసుకుంటున్నారా? ఇక ముందు ముందు సేవకి నిమిత్తంగా అయ్యే పాత్ర మంచిగా లభిస్తుంది. లభించిన భాగ్యాన్ని చూసి అందరికీ సంతోషం అనిపిస్తుంది కదా! మంచిది.

ఈ విధంగా సదా సంతోషంలో ఊగేవారికి, సదా తమ మెరిసే భాగ్యసితార ద్వారా వృద్ధి కళలోకి వెళ్ళేవారికి, సదా పవిత్రత యొక్క వ్యక్తిత్వంతో ఉండేవారికి, పవిత్రత యొక్క మహానతతో విశ్వాన్ని పరివర్తన చేసేవారికి, విశ్వకళ్యాణకారీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.