12.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మిక అలంకారం మరియు అలంకరించడిన మూర్తులు.

బాప్ దాదా తన యొక్క పిల్లలందరినీ ఈరోజు విశేషంగా అలంకారి స్వరూపంలో చూస్తున్నారు. ప్రతి ఒక్కరి అలంకరించబడిన అలంకారధారి అతి సుందరమూర్తిని చూస్తున్నారు. మిమ్మల్ని మీరు చూసుకున్నారా! ఏయే అలంకారాలు ధరించి ఉన్నారు. మీ ఆత్మిక అలంకారాల అలంకరణ సదా ధరించి నడుస్తున్నారా? ఈరోజు అమృతవేళ ప్రతి బిడ్డ యొక్క అలంకరించబడిన మూర్తిని చూశారు. ఏమి చూశారు? ప్రతి ఒక్క బిడ్డ అతి సుందర చత్రఛాయ (గొడుగు) క్రింద కూర్చుని ఉన్నారు. ఆ ఛత్రఛాయ క్రింద ఉన్న కారణంగా ప్రకృతి మరియు మాయ యొక్క యుద్ధం నుండి రక్షించబడి ఉన్నారు. చాలా ఆత్మిక రక్షణా సాధనంలో ఉన్నారు. కొంచెంగా కూడా సూక్ష్మ తరంగాలు కూడా ఛత్రఛాయ లోపలికి రాలేవు. ఇటువంటి చత్రఛాయలో విశ్వకళ్యాణం యొక్క సేవా భాద్యత యొక్క కిరీటధారులు కూర్చుని ఉన్నారు. డబుల్ కిరీటాలు చాలా అందంగా అలంకరించబడి ఉన్నాయి. 1. సంపూర్ణ పవిత్రతకు గుర్తుగా ప్రకాశ కిరీటం 2. సేవాకిరీటం. దీనిలో నెంబరువారీగా ఉన్నారు. పవిత్రతలో మూడు స్థితులు అనగా సంకల్పం, మాట మరియు కర్మలో పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం యొక్క ప్రకాశం ఎక్కువగా వ్యాపించబడి ఉంది. మూడింటిలో ఎంత పవిత్రత ఉందో దాని అనుసారంగా ప్రకాశ కిరీటం తన ప్రకాశాన్ని నలువైపుల వ్యాపిస్తుంది. కొందరిది ఎక్కువగా వ్యాపిస్తుంది, కొందరికి తక్కువగా వ్యాపిస్తుంది. దాంతోపాటు సేవాభాద్యతను అనుసరించి ప్రకాశానికి ఉండే శక్తిలో తేడా ఉంది. అంటే శాతంలో తేడా ఉంది. కొందరిది 10 పవర్ కలిగి ఉంటే, కొందరిది 1000 పవర్ ఇలా శాతం మరియు వ్యాపించటం అనుసరించి నెంబరువారీగా రకరకాల కిరీటధారులు ఉన్నారు.

కిరీటంలో ఎంత నెంబరు ఉందో దానిని అనుసరించి ఛత్రఛాయలో కూడా తేడా ఉంది. కొందరి ఛత్రఛాయ ఎంత పెద్దగా ఉందంటే ఆ చత్రచ్చాయలో ఉంటూనే పనులు చేసుకోవచ్చు. ఆ చత్రచ్చాయలో ఉంటూనే విశ్వం అంతా తిరిగి రావచ్చు. వారిది అంత బేహద్ చత్రచ్చాయ. మరికొందరిది శక్తిననుసరించి నెంబరు వారీగా హద్దులో ఉంది. అలా హద్దులోని చత్రచ్చాయలో కూర్చుని అంటే తమ పురుషార్థంలో సదా స్మృతికి బదులు నియమప్రమాణంగా సమయానుసారంగా స్మృతిలో ఉండేవారు. 4 గంటలు లేదా 8 గంటలు అని ఇలా స్మృతిని కూడా హద్దులోకి తీసుకువచ్చేవారు, స్మృతి బేహద్ తండ్రిది కానీ స్మృతి చేసేవారు బేహద్ స్మృతిని కూడా హద్దులోకి తీసుకువచ్చేశారు. సంబంధం అవినాశి కానీ సంబంధం జోడించేవారు సమయాన్ని నిర్ణయించుకుని వినాశిగా చేసేశారు. ఒకొక్కసారి బాబాతో సంబంధం, ఒకొక్కసారి వ్యక్తులతో సంబంధం, ఒకొక్కసారి వైభవాలతో సంబంధం, ఒకొక్కసారి తమ పాత స్వభావ సంస్కారాలతో సంబంధం. తీసుకోవడానికి అయితే అవినాశి అధికారం, అవినాశి వారసత్వం ఉన్నాయి. కానీ ఇచ్చే సమయంలో వినాశి వారసత్వం నుండి కూడా దాచుకుంటున్నారు. తీసుకోవటంలో విశాల హృదయులు కానీ ఇవ్వటంలో అక్కడక్కడ పొదుపు చేస్తున్నారు. ఎలా పొదుపు చేస్తున్నారో తెలుసా? కొంతమంది పిల్లలు అతి తెలివితో బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, చేస్తూ ఏమంటున్నారు?ఫలానా ఫలానా విషయంలో ఇంత అయితే పరివర్తన చేసుకున్నాను ఇక కొంచెమే ఉంది, అది కూడా అయిపోతుంది. ఇంత కొంచెం అయితే ఉంటుంది కదా! తీసుకోవటంలో అయితే కొద్దికొద్దిగా ఇవ్వు అని అయితే అనటం లేదు. ఒకవేళ బాబా ఏ మహారథికైనా విశేష గౌరవం ఇస్తే మేము కూడా అధికారులమే కదా అనే సంకల్పం వస్తుంది. తీసుకోవటంలో అయితే కొంచెం కూడా వదలరు కానీ ఇవ్వటంలో కొంచెం కొంచెం ఇచ్చి పూర్తి చేసేస్తారు, ఇలాంటి పొదుపు చేస్తున్నారు. చతురతతో బాబాని కూడా నమ్మిస్తారు. తప్పకుండా సంపన్నంగా అయిపోతాం, జరిగిపోతుంది అంటారు. తీసుకోవటంలో ఒక్క సెకండులో అధికారం తీసుకుంటారు, మరయితే ఇవ్వటంలో కూడా ఇంత విశాల హృదయులుగా అవ్వండి. పరివర్తన చేసుకునే శక్తిని పూర్తి శాతంతో ఉపయోగించండి. నిరంతర స్మృతిని హద్దులోకి తీసుకువచ్చేశారు. అందువలనే ఛత్రఛాయలో కూడా నెంబరు చూశారు. నెంబరువారీ అయిన కారణంగా మాయ యొక్క తరంగాలు - వాయుమండలం, వ్యక్తి - వైభవాలు, స్వభావ - సంస్కారాలు యుద్ధం చేస్తున్నాయి. లేకపోతే కనుక ఛత్రఛాయలో సదా రక్షణగా ఉండగలరు.

కిరీటధారిగా మరియు ఛత్రధారిగా చూశారు మరియు వెనువెంట సింహాసనాధికారులుగా కూడా చూశారు. సింహాసనం ఏమిటో తెలుసు - బాబా యొక్క హృదయ సింహాసనం. కానీ ఈ హృదయ సింహాసనం ఎంత పవిత్రమైనదంటే ఎవరైతే సదా పవిత్రంగా ఉంటారో వారే ఈ సింహాసనాన్ని అధిష్టించగలరు. సింహాసనం నుండి బాబా దించటం లేదు, కానీ స్వయమే దిగి వచ్చేస్తున్నారు. పిల్లలందరూ సదా హృదయ సింహాసనాధికారులుగా ఉండండి అని పిల్లలందరికీ బాబా సదాకాలిక అవకాశాన్ని ఇస్తున్నారు. కానీ స్వతహాగానే కర్మలగతి యొక్క చక్రాన్ని అనుసరించి ఎవరైతే సదా తండ్రిని అనుసరించే వారిగా ఉంటారో వారే సదాకాలికంగా సింహాసనంపై కూర్చోగలరు. సంకల్పంలోనైనా అపవిత్రత లేదా అమర్యాద వచ్చిందంటే సింహాసనాధికారికి బదులు పడిపోయే కళలోకి అంటే క్రిందకి వచ్చేస్తారు. ఎటువంటి కర్మ చేస్తారో దానిని అనుసరించి సింహాసనాధికారి నుండి పడిపోయే కథలోకి వచ్చేశాను అని పశ్చాతాపపడతారు లేదా అనుభవం చేసుకుంటారు. ఎక్కువ పొరపాటు కర్మ జరిగితే పశ్చాత్తాపపడే స్థితిలోకి వచ్చేస్తారు. ఒకవేళ వికర్మ కాకుండా వ్యర్ధ కర్మ జరిగితే పశ్చాత్తాప స్థితి ఉండదు, కానీ అనుభవం చేసుకునే స్థితి ఉంటుంది. ఇది చేయకూడదు అని మాటిమాటికి వ్యర్ధ సంకల్పం అనేది అనుభవం చేసుకునే స్థితికి తీసుకువస్తుంది. ఇది తప్పు అని ముల్లులా గ్రుచ్చుకుంటూ ఉంటుంది. ఎక్కడైతే ఈ విధమైన అనుభవం లేదా పశ్చాత్తాప స్థితి ఉంటుందో అక్కడ సింహాసనాధికారిని అనే నషా యొక్క స్థితి ఉండదు. మొదటిస్థితి - సింహాసనాధికారులుగా ఉండటం. రెండవ స్థితి - చేసిన తర్వాత అనుభవం చేసుకునే స్థితి. దీనిలో కూడా నెంబరు ఉంది. కొందరు చేసేసిన తర్వాత అనుభవం చేసుకుంటున్నారు, కొందరు చేసే సమయంలోనే అనుభవం చేసుకుంటున్నారు, మరికొందరు కర్మ జరిగే ముందే ఏదో జరగనున్నది, తుఫాను రానున్నది అని గ్రహించేస్తున్నారు. ఇలా వచ్చేముందే అనుభవం చేసుకుని, గ్రహించి సమాప్తి చేసేసుకుంటున్నారు. కనుక రెండవ స్థితి - అనుభవం చేసుకునే స్థితి. మూడవ స్థితి - పశ్చాత్తాపపడే స్థితి. దీనిలో కూడా నెంబరు ఉంది. కొందరు పశ్చాత్తాపంతో పాటు పరివర్తన కూడా చేసుకుంటున్నారు, కొందరు పశ్చాత్తాప పడుతున్నారు. కానీ పరివర్తన చేసుకోలేరు. పశ్చాత్తాపం ఉంది, కానీ పరివర్తనా శక్తి లేకపోతే వారిని ఏమి చేయాలి?

ఇటువంటి సమయంలో విశేషంగా స్వయం గురించి ఏదోక వ్రతం లేదా నియమం పెట్టుకోవాలి. భక్తిమార్గంలో కూడా అల్పకాలిక కార్యసిద్ధి కొరకు విశేష నియమం లేదా వ్రతాన్ని ధారణ చేస్తారు. వ్రతం ద్వారా వృత్తి పరివర్తన అవుతుంది. వృత్తి ద్వారా భవిష్య జీవితం అనే సృష్టి మారిపోతుంది. ఎందుకంటే విశేష వ్రతం కారణంగా మాటిమాటికి దేనికోసం వ్రతం పెట్టుకున్నారో అదే శుద్ద సంకల్పం స్వతహాగానే గుర్తు వస్తుంది. భక్తులు విశేషంగా ఏ దేవి లేదా దేవత గురించి అయినా వ్రతం పెట్టుకుంటే అనుకోకుండానే రోజంతా ఆ దేవీ లేదా దేవత యొక్క స్మృతి వస్తూ ఉంటుంది. ఆ స్మృతి కారణంగానే బాబా ఆ దేవీదేవత ద్వారా వారి ఆశను పూర్తి చేస్తారు. మరయితే భక్తుల వ్రతానికే ఫలం లభిస్తున్నప్పుడు, జ్ఞాని ఆత్మలు, అధికారి పిల్లల యొక్క శుద్ద సంకల్ప రూపి వ్రతానికి లేదా ధృడ సంకల్ప రూపి వ్రతానికి ప్రత్యక్షఫలం తప్పక ప్రాప్తిస్తుంది. అయితే విన్నారా, అందరినీ సింహాసనాధికారులుగానే చూశారు, కానీ కొందరు సదాకాలికంగా, కొందరు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు చూశారు. ఇప్పుడిప్పుడే సింహాసనాధికారులుగా ఇప్పుడిప్పుడే క్రింద. నాల్గవ అలంకారం ఏమి చూశారు?
ప్రతి ఒక్కరి దగ్గర స్వదర్శనచక్రాన్ని చూశారు. అందరూ స్వదర్శన చక్రధారులే కాని కొందరి చక్రం స్వతహాగా తిరుగుతుంది, కొందరిది అయితే త్రిప్పవలసి వస్తుంది. మరికొందరు సవ్యదిశలో త్రిప్పడానికి బదులు అపసవ్యదిశలో త్రిప్పుతున్నారు. అప్పుడు స్వదర్శనచక్రానికి బదులు మాయాచక్రంలోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎడమవైపుకి తిప్పారు కదా! అంటే స్వదర్శనచక్రానికి బదులు పరదర్శన చక్రం తిప్పుతున్నారు. ఎడమవైపుకి తిప్పటం అంటే ఇదే. మాయాజీత్ గా అవ్వడానికి బదులు ఇతరులను చూసి అలజడి చక్రంలోకి వచ్చేస్తున్నారు. దీని వలన ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నల జాలం తయారవుతుంది. దీనిని స్వయమే రచిస్తున్నారు. స్వయమే చిక్కుకుపోతున్నారు. ఇంకా ఏమేమి చూశారో విన్నారా!

నాలుగు అలంకారాలతో అలంకరించబడి అయితే ఉన్నారు. కానీ నెంబరువారీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? బేహద్ ఛత్రఛాయలోకి వచ్చేయండి, అంటే అప్పుడప్పుడు స్మృతి కాకుండా నిరంతర స్మృతి అనే ఛత్రఛాయలోకి వచ్చేయండి. పవిత్రత మరియు సేవ అనే డబుల్ కిరీటాల శాతం మరియు ప్రకాశం వెదజల్లడం బేహద్ గా చేయండి. అంటే బేహద్ గా వ్యాపించి ఉన్న ప్రకాశకిరీటధారులు అవ్వండి. ఇవ్వటం మరియు తీసుకోవటంలో సెకండు యొక్క అభ్యాసిగా అయ్యి సదా సింహాసనాధికారులు అవ్వండి. ఎక్కటం మరియు దిగటంలో అలసిపోతారు. కనుక సదా బేహద్ ఆత్మిక విశ్రాంతిలో సింహాసనాధికారిగా ఉండండి. అంటే నిర్భంధన ఆత్మగా విశ్రాంతి స్థితిలో ఉండండి. మాస్టర్ జ్ఞానసాగరులై సదా మరియు స్వతహాగా స్వదర్శనచక్రాన్ని త్రిప్పుతూ ఉండండి. పరదర్శనం అనే చక్రం అనగా ఎందుకు ఏమిటి అనే ప్రశ్నజాలం నుండి సదా ముక్తులు అవ్వండి. అప్పుడు ఏమవుతుంది! సదా యోగయుక్తులు, జీవన్ముక్త చక్రవర్తి అయ్యి బాబాతో పాటు విశ్వకళ్యాణం యొక్క సేవలో చుట్టు తిరుగుతూ ఉంటారు. విశ్వసేవాధారి చక్రవర్తి రాజుగా అవుతారు.

ఈవిధంగా సదా అలంకారి, సదా స్వదర్శన చక్రధారి, మాస్టర్ జ్ఞాన సాగర స్థితిలో స్థితులై మాయ యొక్క ప్రతి స్వరూపాన్ని ముందుగానే పరిశీలించి అనేకరకాలైన మాయా యుద్ధాలను సమాప్తి చేసుకుని మాయను బలిహారం చేసుకునేవారికి, బాబా కంఠహారంగా అయ్యేవారికి, అవినాశిగా సర్వ సంబంధాల యొక్క ప్రీతిని సదా నిలుపుకునేవారికి, ఇటువంటి బాబా సమాన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.