15.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్ దాదా యొక్క సంభాషణ.

ఈ రోజు పదమాపదమ్ భాగ్యశాలి పిల్లలను చూసి బాబా హర్షిస్తున్నారు. ఒక్కొక్కరూ విశ్వమనే షోకేసులో ఉన్న అమూల్య రత్నాలు. ప్రతీ ఒక్క రత్నం యొక్క విలువ శక్తిననుసరించి తెలుసుకుంటున్నారు. కానీ బాప్ దాదా సదా పిల్లలందరి యొక్క సంపన్న స్థితినే చూస్తారు. వర్తమాన ఫరిస్తా రూపం మరియు భవిష్య దేవతా రూపం, మధ్యలో పూజ్య రూపం. మూడు రూపాలను అంటే ఆది, మధ్య, అంత్యాలను చూస్తూ ప్రతీ ఒక్కరత్నం యొక్క విలువ బాబాకి తెలుసు. ప్రతీ రత్నం కోట్లలో కొద్దిమంది మరియు కొద్దిమందిలో కొద్దిమంది. అలా మిమ్మల్ని మీరు భావిస్తున్నారు కదా? విశ్వంలోని కోట్ల ఆత్మలను ఒకవైపు ఉంచండి మరియు రెండవ వైపు మిమ్మల్ని ఒక్కరినే ఉంచుకోండి. కానీ ఆ కోట్లమంది కంటే మీ ఒక్కొక్కరి వర్తమానం మరియు భవిష్యత్తు శ్రేష్టమైనవి, ఇంత నషా సదా ఉంటుందా? ఈ రోజు వరకూ కూడా మీ పూజ్య రూపాన్ని దేవీ దేవతల రూపంలో భక్తులు పూజిస్తున్నారు. మీ జడ చిత్రాలలో చైతన్య దేవతలను ఆహ్వానం చేస్తున్నారు. పిలుస్తున్నారు - రండి! వచ్చి మమ్మల్ని అశాంతి నుండి విడిపించండని. ఇది భక్తుల పిలుపు మరియు భవిష్యత్తులో కాబోయే మీ ప్రజల యొక్క ఆహ్వానం. వినిపిస్తుందా?

ఈరోజుల్లోని రాజకీయ అలజడిని చూసి ఆనాటి విశ్వ మహారాజు, మహారాణీలైన మిమ్మల్ని లేదా వైకుంఠ రామ రాజ్యాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు, అలాంటి రాజ్యం కావాలని, రామరాజ్యంలో లేదా సత్యయుగ వైకుంఠంలో మీరందరూ బాబాతో పాటు రాజ్యాధికారులు కదా! కనుక అధికారులైన మిమ్మల్ని మీ ప్రజలు ఆహ్వానిస్తున్నారు. 'మరలా ఆ రాజ్యం తీసుకురండి' అని. శ్రేష్టాత్మలైన మీ అందరికి వారి పిలుపు అందటం లేదా? అందరూ అరుస్తున్నారు. కొందరు ఆకలితో అరుస్తున్నారు, కొందరు కోరికలతో అరుస్తున్నారు, కొంతమంది తనువు యొక్క రోగంతో అరుస్తున్నారు, కొంతమంది మానసిక అశాంతితో, కొంతమంది పన్ను (టాక్స్) కట్టాలి అనే బాధతో, కొంతమంది కుటుంబ సమస్యలతో అరుస్తున్నారు, కొంతమంది తమ కుర్చీ (పదవి) కదులుతుందని అరుస్తున్నారు. పెద్ద పెద్ద రాజ్యాధికారులు ఒకరితో ఒకరు భయపడి అరుస్తున్నారు. చిన్న పిల్లలు చదువు భారంతో అరుస్తున్నారు. చిన్న పెద్ద అందరు అరుస్తున్నారు. నాలుగువైపుల అరుపులు మీ చెవుల వరకూ చేరుతున్నాయా? ఇలాంటి సమయంలో బాబాతో పాటూ మీరందరూ కూడా శాంతి స్థూపాలు. అందరి దృష్టి శాంతి స్థూపం వైపు వెళ్తుంది. అందరూ చూస్తున్నారు - హాహాకారాల తర్వాత జయ జయకారాలు ఎప్పుడు వస్తాయని. శాంతి స్థూపాలూ మీరు ఇప్పుడు చెప్పండి. జయ జయ కారాలు చేస్తారా? ఎందుకంటే బాప్ దాదా సాకార రూపంలో నిమిత్తంగా పిల్లలైన మిమ్మల్నే ఉంచారు. అందువలన ఓ సాకారీ ఫరిస్తాలూ! ఎప్పుడు మీ ఫరిస్తా రూపం ద్వారా విశ్వంలోని దు:ఖాలను దూరం చేసి సుఖధామంగా తయారు చేస్తారు? తయారేనా?

అద్భుతమైన ప్రసాదం:

విదేశీయులు చివర్లో వచ్చినా కానీ వేగంగా వెళ్ళిపోయే వారు కదా! తీవ్ర వేగంతో సర్వులకు సద్గతి ఎప్పుడు ఇస్తారు? సదా తయారీనా? బాప్ దాదా అందరికీ సైగ చేసి పిల్లల వైపు చూపిస్తున్నారు. శక్తులకు పూజ ఎక్కువగా జరుగుతుంది. రెండువైపుల పెద్ద పంక్తి ఉంటుంది. పాండవులకి స్మృతిచిహ్నంగా హనుమంతుని దగ్గర మరియు శక్తుల వైపు నుండి వైష్ణవ దేవి, ఇదరికి పెద్ద వరుస ఉంటుంది. రోజు రోజుకీ పంక్తి పెద్దది అయిపోతుంది. అందువలన భక్తులందరికీ భక్తికి ఫలితంగా గతి సద్గతిని ఇచ్చేవారేనా? అయితే స్వయాన్ని సదా మాస్టర్ గతి సద్గతి దాతలుగా భావించి గతి మరియు సద్గతి అనే ప్రసాదాన్ని భక్తులకు పంచండి. ప్రసాదం పంచి పెట్టటం వస్తుందా? ఇక్కడ ప్రసాదం పంచి పెట్టే అభ్యాసం అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ ప్రసాదాన్ని పంచిపెట్టండి.

ఈరోజు విశేషంగా విదేశీయులను కలుసుకోవడానికి వచ్చాను. ఈరోజు అమృతవేళ విశ్వంలో ఏమి చూశానో ఆ దృశ్యం చెప్పాను కదా! 1.అరవటం 2. నడిపించుకోవటం. ఒకవైపు అరుస్తున్నారు. మరోవైపు అన్ని పనులను నెట్టుతూ నడిపిస్తున్నారు. నెట్టుకురావాలి కదా అని అన్ని విషయాలలో అలాగే అనుకుంటున్నారు, నడిపించాలి కదా అని. ఎలాగైతే ఎవరైనా తమంతట తాము నడవలేకపోతే, నెట్టుతూ నడిపిస్తారు లేదా కృత్రిమ చక్రాల ఆధారంగా నడిపిస్తారు కదా! ఈరోజుల్లో ఏ కార్యం చేయాల్సి వచ్చినా ఏదోక సాధనాలను, చక్రాలను ఆధారంగా చేసుకుని చేయవలసి ఉంటుంది. చక్రాలు పెట్టుకోవలసిన కాలమిది. ఇది ఫ్యాషన్. అంటే పని దానంతట అది అవ్వటం లేదు, నెట్టుకుని రావలసి వస్తుంది లేదా చక్రాలతో నడవవలసి వస్తుంది. ఈనాటి సమాచారం ఏమిటంటే విశ్వంలో అందరు అరవటం మరియు పని లేదా జీవితాన్ని నెట్టుకోవడం, అందువలన ఈ రోజుల్లో ప్రభుత్వం కూడా తన పని సాధించుకుంటుంది. అరవటం మరియు నెట్టుకోవటం - ఈనాడు విశ్వం యొక్క పరిస్థితి ఇదే. కొంతమంది అరుస్తున్నారు. కొంతమంది నెట్టుకొస్తున్నారు. విన్నారా! ఈ ప్రపంచం యొక్క సమాచారం?

విదేశీయులలో కూడా విశేషతలు ఉన్నాయి. అందువలనే బాప్ దాదా దూరదూర దేశాల నుండి కూడా తన పిల్లలను వెతికి పట్టుకున్నారు. ఎప్పుడైనా స్వప్నంలో అయినా అనుకున్నారా - మేము ఇలాంటి తండ్రికి గారాబమైన పిల్లలుగా అవుతామని? కానీ బాబా అయితే పిల్లలని కోనకోనల నుండి ఎంచుకుని తన పరివారమనే పుష్పగుచ్చంలో పెట్టారు. రకరకాల స్థానాల నుండి వచ్చి అందరూ ఒకే బ్రాహ్మణ పరివారం అనే పుష్పగుచ్చంలో విభిన్న పువ్వులుగా ఉన్నారు. విదేశీయుల విశేషత - డబుల్ విదేశి పిల్లలకు డ్రామానుసారం విశేష సహాయం యొక్క బహుమతి లభించింది. ఈ సహాయం ఆధారంగా అంతిమంలో వచ్చినా మంచిగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ సహాయం యొక్క బహుమతి ఏమిటి? విదేశీయుల విశేషత ఏమిటంటే, విదేశీయులకు విశేష సహాయం ఎందుకు లభించిందంటే వారు విదేశాలలో అన్ని రకాల సుఖసాధనాలను అన్ని రకాలుగా అనుభవించి అలసిపోయి ఉన్నారు ఇప్పుడు. కానీ భారతీయులు ఇప్పుడు మొదలు పెడుతున్నారు. విదేశీయులు అల్పకాలిక సాధనాలతో ఆసక్తి ఉంచటం లేదు. ఎవరికైనా పొట్ట నిండిపోతే వారి ముందు ఏ పదార్ధం పెట్టినా తినాలనే ఆసక్తి ఉండదు. అలాగే విదేశీయులు కూడా వైభవాలతో, వస్తువులతో, అల్పకాలిక సుఖాలతో కడుపు నిండిపోయింది. అందువలన వాటి నుండి సహజంగానే వేరు అయిపోయారు. మరియు వారికి అవసరమున్న తోడు లభించింది. అందువలన సహజంగా నాకు శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితిని అనుభవం చేసుకుంటున్నారు. త్యాగం తప్పకుండా చేసారు కానీ జీవితం అయిపోయిన తర్వాత త్యాగం చేశారు. విదేశీయులకి విశేషమైన సహాయం ఏమిటంటే వారి బుద్ది ముందునుండే అతీతం అయిపోయింది. మరియు తోడు వెతుక్కునే వాయుమండలం ప్రారంభమైంది. అందువలనే భారతవాసీయులకు వదలటం కష్టం అనిపిస్తుంది మరియు విదేశీయులకి వదలటంలో కష్టం లేదు. సహజంగానే త్యాగం చేసేస్తున్నారు. భారతీయులకి త్యాగం చేయటంలో హృదయవిదారకం అయిపోతుంది. విదేశీయులు ఒకే గెంతులో, ఒకే దెబ్బతో వదిలేశారు మరియు వదిలిపోయినవి. రెండవ విషయం ఏమిటంటే విదేశీయుల స్వభావ సంస్కారం ఎలాంటిదంటే వారు ఆలోచించినదే చేస్తారు. దేనిని లెక్కచేయరు. ఏది ఆలోచించారో అది చేయాల్సిందే. వీరు ఏమి అనుకుంటారో? వారు ఏమి అనుకుంటారో? అని ఆలోచించేవారు కాదు. లోక మర్యాదలను ముందుగానే దాటేశారు. అందువలన భారతవాసీయుల కంటే పురుషార్ధంలో సహజంగా మరియు తీవ్రంగా వెళ్ళిపోతున్నారు. భారతవాసీయులకి లోక మర్యాదలు చాలా ఉంటాయి. కానీ డబుల్ విదేశీయులు లోక మర్యాదలు ముందుగానే వదిలేశారు. సగం సంబంధం ముందుగానే వదిలిపోయింది. అందువలనే చివర్లో వచ్చినా ముందుకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? డ్రామానుసారం విదేశీయుల విశేషత ఏమిటో? అవి అజ్ఞానం యొక్క విషయాలు. అయినా కానీ ఆ సంస్కారాలు డ్రామాలో పరివర్తన అవ్వటంలో సహజ సాధనంగా అయ్యాయి.

అందువలనే విదేశీయులకి సహజం అనిపిస్తుంది. విదేశీయులు నష్టోమోహులుగా అవ్వటంలో తెలివైనవారు. భారతీయులు కూడా విదేశాలలో ఉంటూ విదేశీ వాతావరణంలోకి వచ్చేస్తున్నారు. విదేశీయులు దుమకటంలో తెలివైనవారిగా అయిపోయారు. అర్థమైందా; విదేశీయుల విశేషత. మంచిది.