17.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పవిత్ర హంస మరియు అమృతవేళ అనే మానససరోవరం.

ఈరోజు నలువైపుల ఉన్న ఆత్మిక హంసలు లేదా పవిత్ర హంసల యొక్క సంఘటన చూస్తున్నారు. పవిత్ర హంసలందరూ సదా జ్ఞానరత్నాలను స్వీకరిస్తూ మరియు స్వీకరింపచేస్తూ ఉన్నారు. అమూల్య ముత్యాలే హంసలకు భోజనం. అదేవిధంగా పవిత్ర హంసలైన మీ అందరి బుద్ధికి భోజనం - జ్ఞాన రత్నాలు. అమృతవేళ నుండి బాప్ దాదాతో పాటు ఆత్మిక సంభాషణ ద్వారా, ఆత్మిక మిలనం ద్వారా జ్ఞాన రత్నాలను ధారణ చేస్తున్నారు, శక్తులను ధారణ చేస్తున్నారు. ఆ రత్నాలను, శక్తులను రోజంతా మననశక్తి ద్వారా జీవితంలో ధారణ చేస్తున్నారు మరియు ఇతరులచే చేయిస్తున్నారు.

అమృతవేళ సమయంలో మిలనం చేసుకునే శక్తి, గ్రహణశక్తి అనగా ధారణ చేసే శక్తి, ప్రతిరోజూ బాబా ద్వారా లభించే విశేష శుద్ద సంకల్పం అనే ప్రేరణను గ్రహించే శక్తి అన్నింటికంటే చాలా ఎక్కువ అవసరం. ప్రతి ఒక్కరు అమృతవేళ ధారణ చేసే శక్తి ద్వారా ధారణామూర్తులు అవుతున్నారు. అమృతవేళ విశేషంగా రెండు మూర్తులు అవసరం - 1. ధారణామూర్తి 2. అనుభవీ మూర్తి. ఎందుకంటే అమృతవేళ బాప్ దాదా విశేషంగా పిల్లల కోసం దాత స్వరూపంలో ఉంటారు మరియు పిల్లలను కలుసుకునేటందుకు సర్వసంబంధాలతో స్నేహ సంపన్న స్వరూపంలో ఉంటారు. సర్వ ఖజానాలతో జోలెను నింపే భోళా భండారీ రూపంలో ఉంటారు. ఆ సమయంలో ఏది చేయాలనుకుంటే అది చేయవచ్చు అంటే బాబాని ఒప్పించాలన్నా, బాబాని సంతోషపరచాలన్నా, ఏ సంబంధం నిలుపుకోవాలన్నా, సహజ విధిని అనుభవం చేసుకోవాలన్నా కానీ సర్వ విధులు మరియు సిద్ధులను సహజంగా ప్రాప్తింప చేసుకోగలరు. ప్రాప్తుల భండారా మరియు ఇచ్చేటటువంటి దాత కూడా సహజంగా లభిస్తారు. సర్వగుణాల నిధి, సర్వశక్తుల నిధి పిల్లల కోసం తెరిచే ఉంటాయి. అమృతవేళలోని ఒక్క సెకండు యొక్క అనుభవం పగలు, రాత్రి అనగా రోజంతా సర్వ ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకోవడానికి ఆధారం. బాప్ దాదా కూడా ప్రతి ఒక్కరితో మనస్పూర్తిగా మాట్లాడేటందుకు, ఫిర్యాదులు వినేటందుకు, బలహీనతలు తొలగించేటందుకు, అనేక రకాల పాపాలను ప్రక్షాళన చేసేటందుకు, ప్రేమను, గారాబాన్ని చూపించేటందుకు ఇలా అన్ని విషయాల కోసం తీరికగా ఉంటారు. ఆ సమయంలో అధికారికంగా ఉండరు, భోళా భండారిగా ఉంటారు. ఇంత స్వర్ణిమ అవకాశం ఉండి కూడా కొంతమంది అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు మరికొందరు అవకాశాన్ని తీసుకున్నవారిని దూరం నుండి చూస్తూ ఉన్నారు. వారికి కూడా తీసుకోవాలని కోరిక ఉంది కానీ మధ్యలో విఘ్నం ఏమి వస్తుంది? తెలుసా? మాయ కూడా చాలా తెలివైనది, విశేషంగా ఆ సమయంలోనే బాబా నుండి దూరం చేసేటందుకు వస్తుంది. విశేషంగా సాకులు చెప్పే ఆటలో పిల్లలను మోహిస్తుంది. గారడీ చేసేవారు తమ గారడితో ప్రజలను ఎలా ఆకర్షిస్తారో అదేవిధంగా మాయ కూడా అనేక రకాలుగా సోమరితనం, నిర్లక్ష్యం మరియు వ్యర్ధ సంకల్పాల యొక్క సాకులు చెప్పటంలో మోహితుల్ని చేస్తుంది. అందువలన స్వర్ణిమ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి సమయాన్ని

పోగొట్టుకున్న కారణంగా, సహజ ప్రాప్తుల నుండి వంచితులు అవుతున్న కారణంగా రోజంతటి పునాది బలహీనం అయిపోతుంది. రోజంతటిలో ఎంత పురుషార్థం చేసినా కాని రోజంతటికి ఆది అనగా పునాది సమయం బలహీనంగా ఉన్న కారణంగా శ్రమ ఎక్కువ చేయవలసి ఉంటుంది మరియు ప్రాప్తి తక్కువగా ఉంటుంది. ప్రాప్తి తక్కువగా ఉన్న కారణంగా రెండు రకాల స్థితులు అనుభవం చేసుకుంటారు. 1. నడుస్తూ నడుస్తూ అలసటను అనుభవం చేసుకుంటారు 2. నడుస్తూ నడుస్తూ మనస్సు బలహీనం అయిపోతుంది. తిరిగి ఏమి ఆలోచిస్తున్నారు? గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు అంటున్నారు. సమయం సమీపంగా ఉందో లేక దూరంగా ఉందో? ఎప్పుడు ప్రత్యక్షత జరుగుతుందో మరియు సత్యయుగి సృష్టిలోకి ఎప్పుడు వెళ్తామో? ఈ కుటుంబ బంధనాలు ఎంత వరకు ఉంటాయో? ఇలా వర్తమాన ప్రాప్తిని వదిలేసి భవిష్యత్తు గురించి చూస్తారు.

వర్తమాన ప్రాప్తుల యొక్క జాబితాను సదా ఎదురుగా ఉంచుకోండి. అప్పుడు ఎప్పుడు అవుతుంది? అనే దాని నుండి అవుతుంది అనే దానిలోకి వచ్చేస్తారు. మనస్సు బలహీనం అవ్వడానికి బదులు సంతోషం అయిపోతుంది. వర్తమానాన్ని వదులుకోకండి. మాయ యొక్క ఆటను గ్రహించండి. మాయ ఏదో వంకతో మిమ్మల్ని రాజీ చేసేసుకుంటుంది. అందువలనే బాబాని సంతోషపరచలేకపోతున్నారు అంటే సహజ సాధన చేయలేకపోతున్నారు. వరదాన రూపంలో పొందవలసిన ప్రాప్తిని శ్రమ చేసి పొందటంలో తత్పరులైపోతున్నారు. అందువలన అమృతవేళ అంటే సహజ ప్రాప్తి యొక్క వేళ అని తెలుసుకుని దాని యొక్క లాభాన్ని పొందండి. తెరిచి ఉన్న భండారా నుండి ప్రాలబ్దం యొక్క జోలెను నింపుకోండి. అమృతవేళ సమయంలో వరదాత మరియు భాగ్యవిధాత ద్వారా ఏ అదృష్ట రేఖను గీయించుకోవాలనుకుంటే అది గీయడానికి బాబా తయారుగా ఉంటారు. కనుక వరదాత ద్వారా అదృష్ట రేఖను సహజంగా మరియు శ్రేష్టంగా గీయించుకోండి. ఆ సమయంలో భోళా భగవంతుని రూపంలో ఉంటారు, ప్రేమపూర్వకంగా

ఉంటారు. కనుక ప్రేమతో శ్రేష్ట అదృష్ట రేఖను గీయించుకోండి. ఏది కావాలంటే అది, ఎన్ని జన్మలకు కావాలంటే అన్ని జన్మలకు, అష్టరత్నాలలోకి లేదా 108 మాలలోకి ఏది కావాలంటే అది పొందవచ్చు. బాప్ దాదా యొక్క విశాల ఆహ్వానం ఇది. ఇంకేమి కావాలి!

యజమాని అవ్వండి మరియు అధికారం తీసుకోండి. ఏ ఖజానాకు తాళం వేసి లేదు. శ్రమ అనే తాళం చెవిని ఉపయోగించనవసరం లేదు. ఈ సమయంలో తీసుకోకపోతే రోజంతటిలో శ్రమ అనే తాళంచెవిని ఉపయోగించవలసి ఉంటుంది. ఆ సమయంలో కేవలం ఒకే సంకల్పం చేయండి - నేను ఎవరో, ఎలా ఉన్నానో అలా నీ వాడిని. మాయా మోసాన్ని దాటుకుని వచ్చి బాబాతో పాటు కూర్చోండి అంతే! మాయ యొక్క మోసం మార్గమధ్య దృశ్యం వంటిది. దానిలో ఆగిపోకూడదు. వచ్చేయండి మరియు కూర్చోండి. సంకల్పం మరియు బుద్ధిని అంటే మనస్సు మరియు బుద్ధిని బాబాకు అర్పించేయండి. ఇలా చేయటం రావటం లేదా? బాబా ఇచ్చిన వస్తువులను బాబాకి ఇచ్చేయటంలో కష్టం ఎందుకనిపిస్తుంది? అప్పుడప్పుడు నీది అని, మరలా అప్పుడప్పుడు నాది అని అంటున్నారు. నీది నాది అనే చక్రంలోకి వస్తున్నారు. అమృతవేళ అయ్యింది. కళ్ళు తెరిచారు. అంతే సెకండులో జంప్ చేసి బాబాతో పాటు కూర్చోండి. బాబా తోడు కారణంగా బాబా యొక్క ఖజానాలన్నీ మీ సొంతమైనట్లు అనుభవమవుతుంది. జ్ఞానం ఆధారంగా కాదు, ప్రాప్తి ఆధారంగా, అధికారం అనే సింహాసనంపై కూర్చుని ఉన్న కారణంగా అధికారి స్థితి అనుభవం అవుతుంది. బాబా మీ స్నేహితుని వలె అధికారం యొక్క సింహాసనాన్ని ఇస్తానంటున్నారు. మేల్కోండి మరియు సింహాసనంపై కూర్చోండి. కొద్ది సమయం ఈ అధికార సింహాసనాన్ని అధిష్టించినా కానీ ఏది కావాలనుకుంటే అది పొందగలరు. హద్దులోని రాజులు కొద్ది సమయం యొక్క రాజరికాన్ని అధికారంలోకి తీసుకోవటం లేదా? అదేవిధంగా బేహద్ సింహాసనాధికారులు వర్తమాన స్వర్ణిమ సమయంలో సహజంగానే తమ స్వర్ణిమ స్థితిని తయారుచేసుకోగలరు మరియు భవిష్యత్తులో స్వర్ణిమ యుగంలో శ్రేష్ట పదవిని పొందగలరు. సహజ పురుషార్ధం యొక్క సమయం గురించి, సహజ సాధనం ఏమిటో అర్థమైందా! ఇప్పుడు సహజ పురుషార్ధిగా అవుతారా లేక కష్టంగానా? బాబా సహజంగా లభించినప్పుడు మార్గం కష్టంగా ఎలా ఉంటుంది? కనుక సహజ పురుషార్థీగా అవ్వండి. కష్టం యొక్క నామరూపాలను సమాప్తి చేయండి. అప్పుడే ప్రపంచం యొక్క కష్టాలను సమాప్తి చేయగలరు.

ఈవిధంగా సదా అధికారి, సింహాసనాధికారి, మాయ ఆటలో సదా స్వయాన్ని సదా పాస్ చేసుకునేవారికి, సదా బాబా యొక్క రహస్యాలను తెలుసుకునేవారికి, శ్రమ అనే మాటను ప్రేమలోకి మార్చుకునే వారికి, మానసికంగా బలహీనంగా ఉండడానికి బదులు సంతోషంగా ఉండేవారికి, తమ మనస్సు యొక్క సంతోషం ద్వారా ప్రపంచాన్ని సంతోషం చేసేవారికి, ఈ విధంగా సదా బాబాతో పాటు ఉండే సర్వ శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.