26.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


రాజయోగి అంటే త్రిస్మృతి స్వరూపులు.

ఈరోజు బాప్ దాదా తిలకధారి పిల్లలను చూస్తున్నారు. ప్రతీ ఒక్కరి మస్తకంపై రాజయోగి అనగా స్మృతి భవ అనే తిలకం మరియు దాంతోపాటు విశ్వరాజ్యాధికారం యొక్క రాజ్య తిలకం ఉన్నాయి. రాజయోగి తిలకం మరియు రాజ్యతిలకం రెండింటిని చూస్తున్నారు. మీరందరూ కూడా మీ యొక్క రెండు తిలకాలను సదా చూసుకుంటూ ఉంటున్నారా? బాప్ దాదా అందరి మస్తకంపై విశేషంగా రాజయోగి తిలకం యొక్క విశేషతను చూస్తున్నారు. విశేషతను చూస్తూ ఏమి తేడాను చూశారు? కొంతమంది రాజయోగుల మస్తకంపై మూడు బిందువుల తిలకం ఉంది, కొంతమంది మస్తకంపై రెండు బిందువుల తిలకం ఉంది, కొంతమంది మస్తకంపై ఒకే బిందువు యొక్క తిలకం ఉంది. వాస్తవానికి జ్ఞానసాగరుడు అయిన బాబా ద్వారా విశేషంగా మూడు స్మృతుల యొక్క మూడు బిందువుల తిలకం ఇచ్చారు. ఆ మూడు స్మృతులకు స్మృతిచిహ్న రూపంగా త్రిశూలాన్ని చూపించారు.

ఈ మూడు స్మృతులు :- 1. స్వ స్మృతి 2. బాబా స్మృతి 3. డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. విశేషంగా ఈ మూడు స్మృతులలోనే మొత్తం జ్ఞానం యొక్క విస్తారం నిండి ఉంది. జ్ఞానమనే వృక్షానికి ఈ మూడు స్మృతులు. ముందు బీజం వేస్తారు, ఆ బీజం ద్వారా మొదట రెండు ఆకులు వస్తాయి ఆ తర్వాత వృక్షం యొక్క విస్తారం వస్తుంది. అలాగే ముఖ్య విషయం బీజరూపీ అయిన బాబా స్మృతి ఆ తర్వాత వచ్చే రెండు ఆకులు అనగా ఆత్మ యొక్క పూర్తి జ్ఞానం మరియు డ్రామా యొక్క స్పష్టజ్ఞానం. ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ! అనే వరదానిగా అవుతారు. ఈ మూడు స్మృతుల ఆధారంగానే మాయాజీత్ గా, జగత్ జీత్ గా అయిపోతారు. ఈ మూడు స్మృతులకు సంగమయుగంలో విశేషత ఉంది. అందువలనే రాజయోగీ తిలకం మూడు బిందువుల రూపంలో ప్రతీ ఒక్కరి మస్తకంలో మెరుస్తూ ఉంది. త్రిశూలంలో ఒక కోణం లేకపోతే దానిని యథార్థ శస్త్రం అని అనరు.

సంపూర్ణ విజయానికి గుర్తు - మూడు బిందువులు అనగా త్రి స్మృతి స్వరూపం. కానీ ఏమి జరుగుతుంది? ఒకే సమయంలో మూడు స్మృతులు వెనువెంట మరియు స్పష్టంగా ఉండటంలో తేడా వస్తుంది. ఒకసారి ఒక స్మృతి, ఒకసారి రెండు, ఒకసారి మూడు ఉంటున్నాయి. అందువలన చెప్పాను కదా! కొంతమంది రెండు బిందువుల తిలకధారిగా ఉన్నారని, చాలా మంచి మంచి పిల్లలని కూడా చూశారు. వారు నిరంతరం మూడు స్మృతుల తిలకధారిగా ఉన్నారు. చెరగని తిలకధారిగా ఉన్నారు అంటే వారి తిలకాన్ని ఎవరూ చెరపలేరు. ఎప్పుడైతే స్మృతి స్వరూపంగా అవుతారో అప్పుడు ఎవరూ చెరపలేని తిలకధారిగా అవుతారు. లేకపోతే మాటి మాటికి తిలకం పెట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడిప్పుడే చెరిగిపోతుంది, మరలా ఇప్పుడిప్పుడే పెట్టుకుంటున్నారు. కానీ సంగమయుగీ రాజయోగీలు నిరంతర అవినాశీ తిలకధారిగా ఉండాలి. మాయ అవినాశీని వినాశిగా చేయకూడదు. రోజూ అమృతవేళ ఈ మూడు స్మృతుల యొక్క అవినాశీ తిలకాన్ని పరిశీలించుకోండి. అప్పుడు రోజంతటిలో మాయకి ఆ తిలకాన్ని చెరిపే ధైర్యం ఉండదు. త్రిస్మృతి స్వరూపులుగా అవ్వటం అంటే సర్వ సమర్థ స్వరూపంగా అవ్వటం. ఇది సమర్థ తిలకం. సమర్ధుల ముందు మాయ యొక్క వ్యర్థ రూపాలన్నీ సమాప్తం అయిపోతాయి. మాయ యొక్క ఐదు రూపాలు ఐదు దాసీల రూపంగా అయిపోతాయి. పరివర్తనా రూపం కనిపిస్తుంది.

వికారాల యొక్క పరివర్తనారూపం:-

కామ వికారం శుభ కామన రూపంలో మీ పురుషార్థంలో సహయోగి రూపంగా అయిపోతుంది. కామ రూపంలో యుద్ధం చేసేది శుభ కామనా రూపంలో విశ్వ సేవాధారిగా అయిపోతుంది. శత్రువుకి బదులు మిత్రునిగా అయిపోతుంది. క్రోధం అగ్ని రూపంలో ఈశ్వరీయ సందపని కాల్చేస్తుంది, ఆవేశం రూపంలో వచ్చి అందరినీ స్పృహ తప్పిపోయేలా చేస్తుంది. అలాంటి క్రోధ వికారం పరివర్తన అయిపోయి ఆత్మిక నషా లేదా ఆత్మిక సంతోషం రూపంలో స్పృహ తప్పినవారికి స్పృహనిచ్చేదిగా అయిపోతుంది. క్రోధ వికారము సహనశక్తి రూపంలోకి పరివర్తన అయిపోయి మీకు ఒక శస్త్రంవలె పనికొస్తుంది. ఎప్పుడైతే క్రోధం సహన శక్తి యొక్క శస్త్రంగా అయిపోతుందో అప్పుడు శస్తాలు సదా శస్త్రధారి సేవార్థమే ఉంటాయి. క్రోధాగ్ని యోగాగ్నిగా పరివర్తన అయిపోయి మనల్ని కాల్చకుండా పాపాలను కాల్చుతుంది. అదేవిధంగా లోభ వికారం నిమిత్త రూపంలోకి, అనాసక్త వృత్తి యొక్క స్వరూపంలోకి, అతీత స్థితి యొక్క స్వరూపంలోకి, బేహద్ వైరాగ్యవృత్తి యొక్క రూపంలోకి పరివర్తన అయిపోతుంది. లోభం సమాప్తి అయిపోయి కావాలి కావాలి అనటానికి బదులు ఇచ్చా మాత్రం అవిద్యా స్వరూపంగా అయిపోతారు. కావాలి అని అనరు, లోభాన్ని ఇక వెళ్ళు అని అంటారు. తీసుకోవాలి తీసుకోవాలి అనరు, ఇవ్వాలి ఇవ్వాలి అనే దానిలోకి పరివర్తన అయిపోతుంది. అదే లోభం, అనాసక్త వృత్తిలోకి ఇచ్చేటటువంటి దాత స్వరూపం యొక్క స్మృతి స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. అలాగే మోహవికారం యుద్ధం చేయటానికి బదులు స్నేహ స్వరూపంలోకి పరివర్తన అయిపోయి బాబా స్మృతిలో మరియు సేవలో విశేష తోడుగా అవుతుంది. స్నేహం అనేది స్మృతి మరియు సేవలో సఫలతకి విశేష సాధనంగా అయిపోతుంది. అలాగే అహంకారం అనే వికారం దేహాభిమానం నుండి పరివర్తన అయిపోయి స్వ అభిమానిగా అయిపోతుంది. స్వ అభిమానం వృద్ధి కళకి సాధనం. దేహాభిమానం పడిపోయే కళకి సాధనం. దేహాభిమానం పరివర్తన అయిపోయి స్వ అభిమానం యొక్క రూపంలోకి స్మృతి స్వరూపంగా అవ్వటంలో సాధనంగా అవుతుంది. ఈ విధంగా ఈ వికారాలు అనగా విరాఠ రూపధారులందరు సేవలో మీకు సహయోగులుగా, మీ శ్రేష్ట శక్తులుగా పరివర్తన అయిపోతాయి. ఇలా పరివర్తన చేసుకునే శక్తిని అనుభవం చేసుకుంటున్నారా? ఈ మూడు స్మృతుల ఆధారంగా ఈ అయిదింటిని పరివర్తన చెయగలరు. కామ రూపంలో వచ్చెది శుభ భావనగా అయిపోవాలి. అప్పుడే మాయాజీత్ జగత్ జీత్ అనే బిరుదులు లభిస్తాయి. విజయీలు శత్రువుల రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు. రాజులుగా ఉన్నవి సాధారణ ప్రజలుగా అయిపోతాయి. అప్పుడే విజయాలు అని అంటారు. మంత్రిగా ఉన్న సాధారణ వ్యక్తి అయిపోతాయి. అప్పుడే విజయీలుగా పిలుపబడతారు. మామూలుగా కూడా నియమం ఉంది. ఎవరు ఎవరిపై విజయం పొందుతారో వారిని బందీగా చేసుకుంటారు అంటే దాసీగా చేసుకుని ఉంచుకుంటారు. మీరు కూడా పంచవికారాలపై విజయం పొందుతున్నారు. కానీ మీరు వీటిని బందీలుగా చేయకండి. బందీలుగా చేస్తే మరలా లోపల గెంతులేస్తాయి. అందువలన వాటిని పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా తయారుచేయండి. అప్పుడు అది సదా మీకు నమస్కరిస్తూ ఉంటాయి. విశ్వపరివర్తనకి ముందు స్వపరివర్తన చేసుకోండి. స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన సహజంగా అయిపోతుంది. పరివర్తనా శక్తి సదా మీ వెంట ఉంచుకోండి. పరివర్తనా శక్తి యొక్క గొప్పదనం చాలా పెద్దది. అమృతవేళ నుండి రాత్రి వరకూ పరివర్తనాశక్తి ఎలా ఉపయోగించాలో తర్వాత చెప్తాను.

ఈవిధంగా రాజయోగీ తిలకధారులకు, భవిష్య రాజ్య తిలకధారులకు, సదా మస్తకంపై మూడు స్మృతుల యొక్క స్వరూపంలో సమర్థంగా ఉండేవారికి, మాయని కూడా శ్రేష్ట శక్తి రూపంలో సహయోగిగా తయారు చేసుకుని మాయాజీత్ జగత్ జీతులుగా పిలవబడే వారికి, సర్వశక్తులు యొక్క శస్త్రాలను తయారుచేసుకునే వారికి, సదా శస్త్రధారులకు, శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.