28.12.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సిద్ది స్వరూపంగా అయ్యేటందుకు విధి ఏకాగ్రత.

బాబా తీవ్ర పురుషార్థులందరినీ చూస్తున్నారు. తీవ్ర పురుషార్థానికి సహజ విధి ఏమిటి? దాని ద్వారా సహజ సిద్ధిని పొందవచ్చు. అంటే సదా సిద్ధిస్వరూపంగా అవ్వవచ్చు. సంకల్పం, మాట, కర్మ సిద్ధించాలి దాని ద్వారా విశ్వం ముందు కూడా ప్రత్యక్షం అవుతారు. అటువంటి సహజ విధి ఏమిటి? విధి ఒకే మాట; ఆ ఒకే మాట ద్వారా సిద్ది స్వరూపం అయిపోతాము. ఆ మాట సంకల్పం మరియు మాట కర్మ మూడింటికీ సంబంధించినది; ఆ ఒక్క మాట - ఏకాగ్రత. సంకల్పం సిద్ధి పొందకపోవటానికి కారణం ఏకాగ్రత యొక్క లోపం. ఏకాగ్రత తక్కువ అయిన కారణంగానే అలజడి వస్తుంది. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ స్వతహాగానే ఏకరస స్థితి ఉంటుంది. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ సంకల్పం, మాట మరియు కర్మలో వ్యర్థం సమాప్తి అయిపోతుంది మరియు సమర్థ స్థితి వస్తుంది. సమర్థంగా ఉన్న కారణంగా అన్నింటిలోనూ సిద్ధి లభిస్తుంది. ఏకాగ్రత అంటే ఒకే శ్రేష్ట సంకల్పంలో సదా స్థితులవ్వటం. ఈ ఒక్క బీజరూపీ సంకల్పంలో మొత్తం వృక్షం యొక్క విస్తారం అంతా నిండి ఉంది. ఏకాగ్రతను పెంచుకోండి. అప్పుడు అన్నిరకాల అలజడులు సమాప్తి అయిపోతాయి. ఏకాగ్రత తనవైపు ఆకర్షితం కూడా చేసుకుంటుంది. ఏదైనా స్థూల వస్తువు కూడా అలజడికరమైనది అయితే అది ఇతరులను కూడా అలజడిలోకి తీసుకుని వస్తుంది కదా! (మధ్యమధ్యలో కరెంటు పోతుంది) ఎలాగైతే ఇక్కడ లైట్ అలజడి అవుతూ ఉంది కదా! ఒకసారి వెలుగుతూ ఒకసారి ఆరుతూ ఉంటే; ఇది ఏమిటని అందరి సంకల్పాలలో అలజడి వస్తుంది కదా! ఏకాగ్ర వస్తువు ఇతరులకి ఏకాగ్రతను అనుభవం చేయిస్తుంది. ఏకాగ్రత ఆధారంగానే ఏ వస్తువు ఎలాంటిదో అలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఏకాగ్ర స్థితిలో స్థితులయ్యే వారు సదా స్వయాన్ని కూడా ఎవరో ఎలాంటివారో అలా స్పష్టంగా అనుభవం చేసుకోగలరు. అప్పుడు ఎలా అవుతుంది? ఏమి అవుతుంది? అనే అలజడి సమాప్తి అయిపోతుంది. ఏదైనా వస్తువు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇది ఏమిటి? అనే ప్రశ్న రాదు, ఇది ఈ వస్తువు అని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఏకాగ్రత ఆధారంగా స్వ స్వరూపం లేదా బాబా యొక్క స్వరూపం సదా స్పష్టంగా ఉంటుంది. ఆత్మిక స్వరూపంలో ఎలా ఉండాలి? ఆత్మ స్వరూపం ఇదియా లేక అదియా? అనే అలజడి అంటే ప్రశ్నలు సమాప్తి అయిపోతాయి. ఎప్పుడైతే ప్రశ్నలు సమాప్తి అయిపోతాయో, అలజడి సమాప్తి అయిపోతుందో అప్పుడు ప్రతి సంకల్పం కూడా స్పష్టం అయిపోతుంది. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ యొక్క ఆది మధ్య అంత్యాలు కూడా వర్తమాన కాలం స్పష్టంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తాయి. సంకల్పరూపీ బీజం శక్తిశాలిగా ఉంటే ఫలదాయకంగా ఉంటుంది.

ఏకాగ్రత ద్వారా సర్వ శక్తులూ సిద్ధి స్వరూపంలో ప్రాప్తిస్తాయి. ఎందుకంటే స్వరూపం స్పష్టంగా ఉంటే స్వరూపం యొక్క శక్తులు కూడా అంతే స్పష్టంగా అనుభవమౌతాయి. ఏకాగ్రత యొక్క మహిమ అర్ధమైందా? ఈ రోజుల్లో ప్రపంచంలో అలజడులతో విసుగొస్తుంది. రాజనీతి యొక్క అలజడి, వస్తువుల రేట్ల యొక్క అలజడి, ధనం ద్వారా అలజడి, కర్మభోగం ద్వారా అలజడి, ధర్మం యొక్క అలజడి... ఇలా అనేకరకాల అలజడులు కారణంగా విసిగిపోతున్నారు. విజ్ఞాన సాధనాలు కూడా మొదట్లో సుఖసాధనాలుగా అనుభవం అయ్యాయి. ఈనాడు ఆ సాధనాలు కూడా అలజడిని అనుభవం చేయిస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణాత్మలు సంకల్పంలో లేదా సంప్రదింపుల్లో అలజడితోనే అలసిపోతున్నారు. అందువలన సహజ విధి - ఏకాగ్రతను అలవర్చుకోండి. దీని కోసం సదా ఏకాంతవాసిగా అవ్వండి. ఏకాంతవాసీ నుండి ఏకాగ్రులుగా సహజంగానే అయిపోతారు. మంచిది.