02.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


రాబోయే ప్రపంచం ఏ విధంగా ఉంటుంది?

స్వర్గ రచయిత అయిన శివబాబా అన్నారు -

ఈరోజు బాప్ దాదా ఏ సభను చూస్తున్నారు? భగవంతుని వారసులు, వారసురాళ్ళ నుండి భవిష్యత్తులో కాబోయే రాకుమారుడు, రాకుమారీల సభ, సత్యమైన భగవంతుని పిల్లలు వారసులు, వారసురాళ్ళు ఈ నషా సదా ఉంటుందా? రాజకుమారీ, కుమారుల జీవితం కంటే ఈ జీవితం కోటాను కోట్ల రెట్లు శ్రేష్టమైనది. ఇటువంటి శ్రేష్టాత్మలు మీరు, మీ శ్రేష్టతను తెలుసుకుని నిరంతరం ఇదే సంతోషంలో ఉంటున్నారా? ఈశ్వరీయ కుమారీ, కుమారుల యొక్క గొప్పతనం ఎంత గొప్పది? అనే విషయం గురించి ఈరోజు వతనంలో బాబా మరియు దాదా ఇద్దరి మధ్య ఆత్మిక సంభాషణ జరిగింది. భవిష్య జీవితం యొక్క సంస్కారాలన్నీ ఈ జీవితం నుంచే ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో రాజవంశీయులు, రాజ్యాధికారులు కనుక సదా సర్వ సంపదలతో సంపన్నంగా, ప్రతి వస్తువు సమృద్ధిగా, సదా రాజరికపు హోదాతో ప్రతి జన్మ గడుపుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో సర్వప్రాప్తులు సేవలందించడానికి చుట్టూ తిరుగుతూంటాయి. ప్రాప్తించాలనే కోరిక మీకు ఉండదు. కానీ నా యజమాని నన్ను ఉపయోగించుకోవాలని సర్వప్రాప్తులు కోరుకుంటాయి. నలువైపుల వైభవాల యొక్క ఖజనాలు నిండుగా ఉంటాయి. ప్రతి వైభవం సుఖాన్నిచ్చేటందుకు సదా తయారుగా ఉంటాయి. సదా సంతోషపు బాజాలు స్వతహాగానే మ్రోగుతూ ఉంటాయి. మ్రోగించవలసిన అవసరం లేదు. మీ రచన అయిన చెట్లు (వనస్పతి) విశ్వపతి అయిన మీ ఎదురుగా వాటి ఆకులను కదిలించటం ద్వారా విభిన్న రకాల గీతాలను ఆలపిస్తాయి. చెట్ల ఆకుల కదలిక ద్వారా విభిన్న రకాల సహజ గీతాలు అక్కడ ఉంటాయి. ఈరోజుల్లో అనేక రకాలైన పాటలను కృత్రిమంగా ఎలాగైతే తయారుచేస్తారో అలా అక్కడ పక్షుల కిలకిలరావాలే విభిన్న గీతాలుగా ఉంటాయి. చైతన్య ఆటబొమ్మల వలె అనేక రకాలైన ఆటలను మీకు చూపిస్తాయి. ఈనాటి ఇక్కడి మానవులు మనస్సుకి ఉల్లాసాన్ని కలిగిచేటందుకు అనేక రకాల ధ్వనులను అనుకరిస్తారు (మిమిక్రీ) కదా! అదేవిధంగా అక్కడ పక్షులు మీరు సైగ చేస్తే చాలు, రకరకాలైన సుందర ధ్వనులతో మిమ్మల్ని ఉల్లాసపరుస్తాయి. అదేవిధంగా ఫలాలు మరియు పుష్పాలు కూడా ఉంటాయి. ఫలాలు ఎంతటి విభిన్న రసాలను కలిగి ఉంటాయంటే ఇక్కడ ఉప్పు, పంచదార, మసాలా.... మొదలైనవాటిని వేసి ఆ రసనను పొందుతారు. అలాగే అక్కడ రకరకాల రసాలను అందించే సహజ ఫలాలు ఉంటాయి. ఇక్కడ వలె అక్కడ పంచదార మిల్లులు ఉండవు, తీయటి ఫలాలు ఉంటాయి. ఏ రుచి కావాలంటే ఆ రుచిని సహజసిద్ధ ఫలాల ద్వారా తయారుచేసుకోవచ్చు. ఇక్కడ వలె ఆకుకూరలు ఉండవు, అక్కడ ఫలాలు, పూవులు ద్వారా కూరలు తయారుచేసుకుంటారు. పాలు అయితే నదుల వలె ఉంటాయి. మంచిది, ఇప్పుడు త్రాగుతారా? ఫలాలు సహజ రసాలతో ఉంటాయి, తినడానికి వేరుగా, త్రాగడానికి వేరుగా ఉంటాయి. కష్టపడి రసం తీయాల్సిన పని కూడా ఉండదు. కొబ్బరినీళ్ళు ఎంత సహజంగా త్రాగగలరో అంతలా ప్రతి ఫలంలో రసం నిండుగా ఉంటుంది. ఫలాన్ని చేతిలోకి తీసుకుని వ్రేలుతో కొంచెం నొక్కగానే రసాన్ని త్రాగవచ్చు. స్నానం చేయటానికి నీళ్ళు ఉంటాయి; ఈనాటి గంగాజలం పర్వతాల నుండి మూలికలను రాసుకుని వస్తుంది. అందువలన ఆ గంగా జలానికి చాలా గొప్పతనం ఉంటుంది. క్రిములు ఉండవు కనుక పావన గంగ అని అంటారు. అలాగే అక్కడ కూడా పర్వతాలపైన సువాసన కలిగిన వనమూలికలుంటాయి. అక్కడ నుండి నీరు వస్తుంది. అందువలన స్వతహాగానే నీరు సువాసనగా ఉంటుంది. సెంటు వేయక్కరలేదు. కానీ స్వతహాగానే పర్వతాలలో ఉండే సువాసన మూలికలను రాసుకుంటూ వస్తుంది. అందువలన నీరు చాలా సువాసన కలిగి ఉంటుంది.

అక్కడ అమృతవేళ టేప్ రికార్డర్ మేల్కొల్పదు. పక్షుల ధ్వని సహజ పాటగా ఉంటుంది, దాని ద్వారా మీరు మేల్కొంటారు. అక్కడ ప్రొద్దున్నే మేల్కొంటారు కానీ అక్కడ అలసిపోవటం అనేది ఉండదు. ఎందుకంటే చైతన్య దేవతలు ఉదయమే మేల్కొన్నదానికి గుర్తుగానే భక్తులు కూడా ఉదయమే మేల్కొంటారు. భక్తిలో కూడా అమృతవేళకి గొప్పతనం ఉంది. ఉదయమే మేల్కొంటారు. కానీ వారు సదా జాగృతీ జ్యోతులుగానే ఉంటారు. ఏమీ కష్టమైన పనులు ఉండవు. బుద్ధికి కూడా పని ఉండదు. ఏ బరువూ ఉండదు. అందువలన నిద్రపోయినా, మేల్కొన్నా సమానమే. ఉదయమే లేవాలని మీరు అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ అలా అనుకోవలసిన పని లేదు. మంచిది. అక్కడ ఏమి చదువుకుంటారు? లేక చదువు ఉండకూడదు అనుకుంటున్నారా? అక్కడ చదువు ఒక ఆట. ఆటలు ఆడుకుంటూ చదువుకుంటారు. రాజధాని యొక్క జ్ఞానం అయితే కావాలి కదా? అందువలన అక్కడ రాజవిద్యే చదువు. కానీ అక్కడ ముఖ్య సబ్జక్టు చిత్ర లేఖనం, చిన్నవారు, పెద్దవారు అందరూ చిత్రకారులుగా ఉంటారు. పాటలు, చిత్రలేఖనం మరియు ఆటలు, పాటలు అంటే గాన విద్య ఉంటుంది. సంగీతం పాడతారు. ఆడుకుంటారు. వీటితోనే చదువుకుంటారు. అక్కడ చరిత్ర అంతా సంగీతం లేదా కవితల రూపంలో ఉంటుంది. ఇక్కడలా బోర్ కొట్టే విధంగా ఉండదు. నాట్యం కూడా ఒక ఆటే కదా! నాటకాలు ఉంటాయి కానీ సినిమాలు ఉండవు. నాటకాలు ఉంటాయి. మనోరంజనం కోసం హాస్యనాటకాలు ఉంటాయి. చాలా నాటకశాలలు ఉంటాయి. అక్కడ మహల్స్ లో విమానాలు వరుసలో ఉంటాయి. మరియు విమానాలు నడపటం కూడా చాలా సహజం. అణుశక్తి (సూర్య రశ్మి) ఆధారంగా అన్ని పనులూ జరుగుతాయి. ఇలా మీ గురించే అంతిమ ఆవిష్కరణ జరిగింది.

ధనం - బంగారునాణాలు. ఈనాటి కాగితాల వలె ఉండవు. రూపురేఖలు మారిపోతాయి. చాలా మంచి మంచి డిజైనులు ఉంటాయి. కేవలం నిమిత్తమాత్రంగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఎలాగైతే ఇక్కడ మధువనంలో అందరూ వేరు వేరు విభాగాలకి అధికారులుగా ఉంటారు కదా! అందరూ పరివారమే అయినా కానీ అక్కడ నిమిత్తం అయిన వారిని అడిగి తీసుకుంటారు. ఒకరు ఇస్తారు. ఇంకొకరు తీసుకుంటారు. అలాగే అక్కడ కూడా ఒకే కుటుంబంలా ఉంటారు. దుకాణదారులు, కొనుగోలుదారులు వలె ఉండరు. అందరూ యజమానులు అనే భావనయే ఉంటుంది. కేవలం పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని ఇస్తారు, కొన్ని తీసుకుంటారు. లోటు అనేది ఎవరికీ ఉండదు. ప్రజలకు కూడా లోటు ఉండదు. ప్రజలు కూడా తమ శరీర నిర్వహణ కంటే కోటానుకోట్ల రెట్లు ధనవంతులుగా ఉంటారు. అందువలన నేను కొనుగోలుదారుడిని, వీరు యజమాని అనే భావన ఉండదు. స్నేహంతో ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. లెక్కల ఖాతా యొక్క ఒత్తిడి ఉండదు. రిజిష్టరు ఉండదు. రత్నజడిత వాయిద్యాలు ఉంటాయి. సహజ సంగీతం, శ్రమ వాయించవలసిన పని లేదు. వ్రేలితో మీటగానే మ్రోగుతాయి. దుస్తులు అయితే చాలా మంచివి ధరిస్తారు. ఎలాంటి కార్యమో అలాంటి దుస్తులు, ఎలాంటి స్థానమో అలాంటి దుస్తులు. అలంకారాలు కూడా చాలా రకాలు ఉంటాయి. రకరకాల కిరీటాలు, నగలు ఉంటాయి. కానీ అవి బరువుగా ఉండవు. దూది కంటే తేలికగా ఉంటాయి. మేలిమి బంగారం ఉంటుంది. వజ్రాలు ఎలా ఉంటాయంటే ప్రతీ వజ్రం అనేక రంగుల కాంతిని విరజిమ్ముతూ ఉంటుంది. ఒక వజ్రం నుండి 8 రంగులు కనిపిస్తాయి. ఇక్కడ రకరకాల రంగుల ట్యూబ్ లైట్లు వేస్తారు కదా! అక్కడ వజ్రాలే ట్యూబ్ లైట్లు వలె రకరకాల రంగులకాంతినిస్తాయి. ప్రతీ ఒక్కరి మహలు రంగురంగుల కాంతితో అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ అనేక అద్దాలు పెట్టి ఒకే వస్తువుని రకరకాల రూపాలుగా చూపిస్తారు కదా!అలాగే అక్కడ రత్నాలతో పైకప్పు అలంకరించబడి ఉంటుంది. అది ఒకటే అయినా అనేక రూపాలుగా కనిపిస్తుంది. బంగారం యొక్క కాంతి మరియు వజ్రాల కాంతి రెండు కలిని మహలు అంతా ప్రకాశమయంగా కనిపిస్తుంది. సూర్యకిరణాలు బంగారుకాంతితో ఎలా ఉంటాయో అలాగే అక్కడ వేలలైట్లు వెలుగుతున్నంత కాంతి ఉంటుంది. విద్యుత్ వైర్లతో పని లేదు. ఈనాటి రాజ కుటుంబాల్లో లైట్లు కాంతి విరజిమ్ముతూ కనిపిస్తాయి కదా! రకరకాల డిజైన్లతో కూడిన దీపాలు ఉంటాయి కానీ అక్కడ నిజమైన వజ్రాలతో ఉంటాయి. కనుక ఒక్క దీపం అనేక దీపాల కాంతిని ఇస్తుంది. ఎక్కువ శ్రమించవలసిన పని లేదు. అన్నీ సహజసిద్ధంగా ఉంటాయి.

భాష అయితే చాలా శుద్ధమైన హిందీయే ఉంటుంది. ప్రతీ మాట వస్తువుని స్పష్టంగా రుజువు చేస్తుంది. అలాంటి భాష ఉంటుంది. (విదేశీయులతో) మీ ఇంగ్లాడ్ మరియు అమెరికా ఎక్కడికి వెళ్ళిపోతాయి? అక్కడ మహళ్ళు తయారవ్వవు. మహళ్ళు అయితే భారతదేశంలోనే తయారవుతాయి. అక్కడికి కేవలం విహరించడానికి వెళ్తారు. అక్కడ విహారస్థలాలు ఉంటాయి. అవి కూడా కొన్ని ఉంటాయి, అన్ని ఉండవు. విమానం ఎక్కగానే అది ధ్వనికంటే వేగంగా చేరిపోతుంది. విమాన వేగం అంత ఎక్కువ ఉంటుంది. ఎలాగైతే ఫోనులో మాట్లాడినంత త్వరగా విమానం వెళ్ళిపోతుంది. అందువలన ఫోను చేయాల్సిన అవసరం ఉండదు. విమానాలు కూడా కుటుంబమంతటికీ కలిసి ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా ఉంటాయి. ఇప్పుడు విమానంలో కూర్చున్నారా? ఇప్పుడు సత్యయుగీ విమానాన్ని వదిలేసి బుద్ధి యొక్క విమానంలోకి వచ్చేయండి. బుద్ధి విమానం కూడా అంత వేగవంతమైనదిగా ఉందా? సంకల్పం కూడా వేగంగా ఉందా? సంకల్పం చేయగానే సూర్య చంద్రులకి అతీతంగా మీ ఇంటికి చేరిపోవాలి. అలా బుద్ధి యొక్క విమానం సదా తయారుగా ఉందా? సదా విఘ్నాలకు అతీతంగా ఉందా? ఎటువంటి దుర్ఘటనలు ప్రమాదాలు జరగకూడదు. అనగా వెళ్ళాలనుకునేది పరంధామం కానీ విమానం భూమిని వదలల్లేకుండా లేదా ఏదో ఒక పర్వతాన్ని ఢీకొని పడిపోకూడదు. వ్యర్థ సంకల్పాలే పర్వతం. వాటి నుండి ఎదుర్కోవాలి. అందువలన ప్రమాదాలకి అతీతంగా బుద్ది రూపీ విమానం సదా తయారుగా ఉండాలి. మొదట ఈ విమానం ఎక్కాలి అప్పుడే ఆ విమానం లభిస్తుంది. అలా సదా తయారుగా ఉన్నారా? సర్వవిషయాలలో అవునా అలాగా అంటున్నారు. కానీ ఈ విషయాలలో అవునా అలాగా అని అనటం లేదు.

ఈరోజు వతనంలో స్వర్గం యొక్క పటాన్ని తీసారు. అందువలనే మీ అందరికీ కూడా వినిపించాను. స్వర్గంలోకి వెళ్ళటానికి బ్రహ్మబాబా తయారీలు చేస్తున్నారు. అందువలన స్వర్గం యొక్క పటం తీసారు. మీరందరూ తయారే కదా? ఏమి తయారు చేసుకోవాలో తెలుసు కదా? ఎవరు బాబాతో కలిసి స్వర్గ ద్వారాన్ని దాటుతారు? దానికి అనుమతి పత్రం తీసుకున్నారా? అనుమతి ప్రతం (పాస్) తీసుకున్నారు. కానీ బాబాతో పాటూ ద్వారాన్ని దాటే పత్రం ఉండాలి. ముఖ్య వ్యక్తులకు అనుమతి పత్రం ఒకటి ఉంటుంది. రాష్ట్రపతికి వేరుగా ఉంటుంది కదా! అలాగే ఇది విశ్వపతి యొక్క అనుమతి పత్రం. ఏ పత్రం తీసుకున్నారో మీ పత్రాన్ని పరిశీలించుకోండి.

ఈ విధంగా వర్తమానంలో యజమాని పిల్లలు నుండి రాకుమారులుగా అయ్యేవారికి, ప్రకృతి యజమానుల నుండి విశ్వ యజమానులుగా అయ్యేవారికి, మాయాజీతుల నుండి జగత్ జీతులుగా అయ్యేవారికి, ఒకే సంకల్పం యొక్క విధి ద్వారా సిద్ధిని పొందేవారికి, సర్వ సిద్ది స్వరూపులకి, సదా సమీపంగా ఉండేవారికి, సదా సమీపంగా ఉంటూ స్వర్గ ద్వారాన్ని తోడుగా దాటేవారికి, శ్రేష్ట ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.