21.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాబాని ప్రత్యక్షం చేసే విధి.

ఈరోజు బాప్ దాదా పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపులు అంటే ప్రత్యక్షంగా రెండు రూపాలు గల పిల్లలను చూస్తున్నారు. 1. మాయా ప్రూఫ్ 2. శ్రేష్ట జీవితం యొక్క లేదా బ్రాహ్మణ జీవితం యొక్క ఉన్నతోన్నతమైన మీ అలౌకిక జీవితం యొక్క ప్రూఫ్ (రుజువు), ఈశ్వరీయ జీవితం యొక్క ప్రూఫ్. శ్రేష్ట జ్ఞానానికి ప్రూఫ్ - శ్రేష్ట జీవితం. ఇలా డబుల్ ప్రూఫ్ పిల్లలను చూస్తున్నారు. సదా మిమ్మల్ని మీరు పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్షప్రమాణంగా లేదా ప్రూఫ్ గా భావించడం ద్వారా సదా మాయా ఘ్రఫ్ గా ఉంటారు. ఒకవేళ ప్రత్యక్ష రుజువులో ఏదైనా బలహీనత ఉంటే పరమాత్మ జ్ఞానం అని ఏదైతే శపధం చేస్తున్నారో దానిని అంగీకరించరు. ఎందుకంటే ఈనాటి విజ్ఞానయుగంలో ప్రతి విషయాన్ని ప్రత్యక్ష రుజువు ఉంటేనే అంగీకరిస్తున్నారు. వినటం మరియు వినిపించడం ద్వారా నమ్మటం లేదు. పరమాత్మ జ్ఞానాన్ని కూడా నమ్మటానికి ప్రత్యక్ష రుజువు చూడాలనుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష రుజువు - మీ జీవితమే. మీ జీవితంలో ఇదే విశేషత చూపించండి, ఇప్పటి వరకు ఏ ఆత్మ జ్ఞానులు, మహానాత్మలు చేయలేనిది, తయారవ్వనిదై ఉండాలి. ఇలా అసంభవం అనేది సంభవం చేసే విషయాలే పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష రుజువు. అన్నింటికంటే పెద్ద అసంభవం నుండి సంభవం అయ్యే విషయమేమిటంటే, ప్రవృత్తిలో ఉంటూ పర వృత్తిలో ఉండటం. ప్రవృత్తిలో ఉంటూ ఈ దేహం మరియు దేహ ప్రపంచం యొక్క సంబంధాలకు అతీతంగా ఉండాలి. పాత వృత్తితో పరగా ఉండటం అంటే అతీతంగా ఉండటం. దీనినే పర వృత్తి అంటారు. ప్రవృత్తిలో కాదు, పర వృత్తిలో ఉండాలి. చూసేది దేహాన్నే కానీ వృత్తిలో ఆత్మ రూపం ఉండాలి. లౌకిక సంబంధీకులతో సంప్రదింపుల్లోకి వస్తూ కూడా సోదర సంబంధంలో ఉండాలి. ఈ పాత శరీరం యొక్క కళ్ళతో పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తూ కూడా చూడకూడదు. ఇలా ప్రవృత్తిలో ఉండేవారు అంటే సంపూర్ణ పవిత్ర జీవితంలో నడిచేవారు - దీనినే పరమాత్మ జ్ఞానానికి రుజువు అని అంటారు. ఏదైతే మహానాత్మలు కూడా అసంభవం అని భావిస్తారో దానిని పరమాత్మ జ్ఞానీలు అతి సహజ విషయంగా అనుభవం చేసుకుంటారు. వారు అసంభవం అంటారు, మీరు సహజం అంటున్నారు. కేవలం చెప్పడమే కాదు, కానీ ప్రపంచం ముందు తయారయ్యి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు భక్తిమాలలో మొదటి మరియు రెండవ పూస కూడా పరమాత్మ మిలనాన్ని చాలా కష్టంగా మరియు చాలా జన్మల తర్వాత కూడా లభిస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం అంటారు. ఒక్క సెకను యొక్క సాక్షాత్కారాన్ని చాలా గొప్ప ప్రాప్తిగా భావిస్తారు. సాక్షాత్తు బాబా మన వారిగా అవ్వటం లేదా తన వారిగా మనల్ని చేసుకోవటమనేది అసంభవం అని అనుకుంటారు. వారు అది పెద్ద కర్జూరపు చెట్టు అని భావించి బలహీనం అయిపోతారు మరియు మీరు పెద్ద ఖర్జూరపు చెట్టుగా భావించడానికి బదులు ఇంట్లో కూర్చునే కల్పకల్పాల మీ అధికారాన్ని అనుభవం చేసుకుంటున్నారు. వారు బాబా కలయికను కష్టంగా భావిస్తారు మరియు మీరు కలుసుకోవటం మీ అధికారంగా భావిస్తారు. అధికారి జీవితం అంటే బాబా యొక్క సర్వ ఖజానాలతో నిండైన జీవితం. ఈ ప్రత్యక్ష అనుభవి జీవితం కూడా విశేషంగా పరమాత్మ జ్ఞానానికి రుజువు అంటే ప్రూఫ్. పరమాత్మ అనటం అంటే తండ్రి అనటం. తండ్రి సంబంధానికి రుజువు - వారసత్వం. ఆత్మ జ్ఞానులు లేదా మహానాత్మలతో ఉండే సంబంధం సోదరుల సంబంధం. వారు తండ్రి కాదు. అందువలన వారసత్వం కూడా రాదు. ఆత్మ జ్ఞానులు, మహానాత్మలు సోదరులు అవుతారు, పరమాత్మ లేదా తండ్రి అవ్వరు. అందువలనే అవినాశి వారసత్వం కావాలనుకున్నా కానీ దాని అనుభవం పొందలేరు. పరమాత్మ జ్ఞానానికి సహజ రుజువు జీవితంలో వారసత్వం యొక్క ప్రాప్తి. ఈ అవినాశి జ్ఞానం, ప్రాప్తికి రుజువు జీవితంలో వారసత్వం లభించటం. ఈ అవినాశి జ్ఞానం, ప్రాప్తి యొక్క అనుభవీ జీవితం పరమాత్మను ప్రత్యక్షం చేస్తుంది. కనుక ఇది విశేష రుజువు అయ్యింది.

కేవలం పురుషార్ధిని అనటం అంటే ప్రాప్తి నుండి వంచితం అవ్వటం:

బాబాని ప్రత్యక్షం చేయాలి అని ఈ క్రొత్త సంవత్సరంలో ధృడసంకల్పం తీసుకున్నారా? అందరు సంకల్పం తీసుకున్నారు కదా! మరి ప్రత్యక్షం చేసే సాధనం - డబుల్ ప్రూఫ్ గా అవ్వటం. కనుక పరిశీలన చేసుకోండి, ఈ ప్రత్యక్ష రుజువైన పవిత్రత మరియు ప్రాప్తి రెండూ అవినాశిగా ఉన్నాయా? అల్ప ఆత్మలు అల్పకాలిక ప్రాప్తిని ఇస్తారు కానీ అవినాశి బాబా అవినాశి ఇస్తారు. పరమాత్మ కలయిక లేదా పరమాత్మ జ్ఞానం యొక్క విశేషతయే అవినాశి. అవినాశి కదా! మేము పురుషార్థులం అని అంటారు మీరు. కానీ పురుషార్ధం మరియు ప్రత్యక్ష ప్రాలబ్దం ఇదే పరమాత్మ ప్రాప్తి యొక్క విశేషత. సంగమయుగం అంటే పురుషార్థీ జీవితం, సత్యయుగం అంటే ప్రాలబ్ధ జీవితం అని కాదు. కానీ సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే, ఒక అడుగు వేయండి మరియు వేల అడుగుల ప్రాలబ్దం పొందండి. మరే యుగంలోను ఒకటికి కోటిరెట్లు లభించే భాగ్యం ఉండదు. ఈ భాగ్య రేఖ స్వయం భాగ్య విధాత బాబా బ్రహ్మా ద్వారా ఇప్పుడే గీస్తున్నారు. అందువలనే బ్రహ్మను భాగ్య విధాత అని అంటారు. బ్రహ్మ భాగ్యం పంచి పెట్టేటప్పుడు నిద్రపోయారా ఏమిటి అనే మహిమ కూడా ఉంది కదా! సంగమయుగం యొక్క విశేషత పురుషార్ధం మరియు ప్రాప్తి వెనువెంట లభించటం. సత్యయుగీ ప్రాలబ్దం కంటే కూడా విశేషమైన బాబా లభించటం అనే ప్రాలబ్దం ఇప్పుడే లభిస్తుంది. ఇప్పటి ప్రాలబ్ధమేమిటంటే స్వయంగా పరమాత్మతో సర్వ సంబంధాలు. భవిష్య ప్రాలబ్ధమేమిటంటే దేవాత్మలతో సంబంధం. ఇప్పటి ప్రాప్తి మరియు భవిష్య ప్రాప్తి యొక్క తేడా తెలుసు మరియు చెప్పాను కూడా! కనుక పురుషార్థీలు కాదు, కానీ శ్రేష్ట ప్రాలబ్ధీలు - ఇలా భావించి ప్రతి అడుగు వేస్తున్నారా? కేవలం పురుషార్ధిని అనుకోవటం అంటే సోమరిగా అయ్యి ప్రాలబ్ధం లేదా ప్రాప్తి నుండి వంచితం అవ్వటం. ప్రాలబ్ద రూపాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. ప్రాలబ్దాన్ని చూసి సహజంగా ఎగిరేకళ యొక్క అనుభవాన్ని చేసుకుంటారు. సదా సంగమయుగం యొక్క విశేషతల స్మృతి స్వరూపంగా అయితే విశేషాత్మగా అయిపోతారు.

పొందవలసినదంతా పొందాను - సదా ఈ పాట పాడుతూ ఉండండి:

నడుస్తూ, నడుస్తూ కొంతమంది పిల్లలకు మార్గం కష్టంగా అనుభవం అవుతుంది. అప్పుడప్పుడు సహజంగా భావిస్తున్నారు, అప్పుడప్పుడు కష్టంగా భావిస్తున్నారు. అప్పుడప్పుడు సంతోషంలో నాట్యం చేస్తున్నారు, అప్పుడప్పుడు మనస్సుని బలహీనం చేసుకుని కూర్చుండిపోతున్నారు. అప్పుడప్పుడు బాబా యొక్క గుణాలు పాడతారు మరియు అప్పుడప్పుడు ఏమిటి? ఎందుకు? అనే పాటలు పాడతారు. అప్పుడప్పుడు శుద్ద సంకల్పాల సర్వ ఖజానాల ప్రాప్తి యొక్క మాలను స్మరణ చేస్తున్నారు మరియు అప్పుడప్పుడు వ్యర్ధ సంకల్పాల తుఫానుకి వశం అయ్యి కష్టం, కష్టం అనే మాలను స్మరిస్తున్నారు. కారణం ఏమిటి? కేవలం పురుషార్ధిగా భావిస్తున్నారు కానీ ప్రాలబ్దాన్ని మర్చిపోతున్నారు. వదవలసినవి ఎదురుగా పెట్టుకుంటున్నారు మరియు తీసుకోవల్సినవి వెనుక పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే వదిలేవాటిని వెనుక, తీసుకునే వాటిని ముందు పెట్టుకుంటారో అప్పుడు వదలటానికి ఎప్పుడూ వెనుక ఉండరు, ముందే ఉంటారు. తీసుకునేవాటిని గుర్తు పెట్టుకోవటం అంటే బాబా ఎదురుగా ఉండటం. వదిలినవాటి గుణాలను ఎక్కువగా పాడుతున్నారు. ఇది చేసాము. ఇది కూడా చెయాలి లేదా చేయాల్సిందే... ఇలా వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏమి లభిస్తుందో లేదా ఏమి ప్రాలబ్ధం తయారవుతుందో తక్కువగా ఆలోచిస్తున్నారు. అందువలనే వ్యర్థం అనే బరువు ఎక్కువ అయిపోతుంది. శుద్ద సంకల్పాల బరువు తేలిక అయిపోతుంది. బరువు అనేది ఎగిరెకళకు బదులు స్వతహాగానే క్రిందికి తీసుకువచ్చేస్తుంది. అంటే పడిపోయే కళ వైపు వెళ్ళిపోతున్నారు. పొందవలసినదంతా పొందాను అనే పాట పాడటం మర్చిపోతున్నారు. ఈ ఒక పాట మర్చిపోవటం ద్వారా అనేక రకాలైన ఎదురు దెబ్బలు తింటున్నారు. పాట పాడండి అప్పుడు ఎదురుదెబ్బలు, గుటకలు మ్రింగటం అన్నీ సమాప్తి అయిపోతాయి. స్థూల పాట కూడా మిమ్మల్ని మేల్కొల్పుతుంది కదా! ఈ అవినాశి పాట పాడుతూ ఉండండి. ప్రాప్తి యొక్క సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. అప్పుడు ఎదురుదెబ్బలు మరియు గుటకలు మ్రింగటం సమాప్తి అయిపోతాయి. ఇలా డబుల్ ప్రూఫ్ గా ప్రత్యక్ష రుజువు ద్వారా బాబాని ప్రత్యక్షం చేస్తారు. ఇదే ప్రత్యక్షం చేసే విధి. ప్రత్యక్ష రుజువు సహిత సంచార చైతన్య మ్యూజియం స్వరూపంగా అవ్వండి మరియు సంచార ప్రొజెక్టర్ అయిపోండి. చరిత్ర నిర్మాణ ప్రదర్శిని అవ్వండి. ప్రతీచోట ఇలాంటి ప్రదర్శనిగా మరియు మ్యూజియంగా అయిపోతే తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవ జరుగుతుంది. స్వయమే ప్రదర్శిని అవ్వండి మరియు స్వయమే గైడ్ అవ్వండి. ఈ రోజుల్లో సంచార గ్రంధాలయాలు, ప్రదర్శనలు తయారుచేస్తున్నారు కదా! 60 వేలమంది బ్రాహ్మణులు 60వేల సంచార ప్రదర్శనిలుగా మ్యూజియంగా తయారు అయిపోతే ఎంత సమయంలో ప్రత్యక్షత జరిగిపోతుంది! అర్ధమైందా. ఈ సంవత్సరం 60 వేల సంచార ప్రదర్శనిలు లేదా ప్రొజెక్టర్లు విశ్వం యొక్క నలువైపుల వెళ్ళిపోతే తక్కువ ఖర్చుతో ప్రత్యక్షత జరిగిపోతుంది. ఖర్చు పెట్టాల్సిన పని లేదు కానీ ఖర్చు పెట్టేవారు వచ్చేస్తారు. ఖర్చుకి బదులు బహుమతి లభిస్తుంది.

గుజరాత్ పెద్దది కదా! సంఖ్యలో పెద్దది. ఇప్పుడు సాక్షాత్కార రూపంలో కూడా పెద్దవారిగా అయ్యి చూపించాలి. గుజరాత్ యొక్క భూమి మంచిది. ఎక్కడ భూమి మంచిగా ఉంటుందో అక్కడ శక్తిశాలి బీజం వేయాలి. శక్తిశాలి బీజం అంటే వారస క్వాలిటీ బీజం. ఇలా వారస బీజాన్ని వేసి ఫలం పొందండి. ఫలీభూత భూమి అంటే అన్నింటికంటే శ్రేష్ట ఫలాన్ని ఇచ్చేది. క్వాలిటి అయితే చాలా మంచిగా ఉంది. క్వాలిటీ ఉంది కూడా కానీ మరింత పెంచండి. ఒకొక్క క్వాలిటి వారు వారసుల గ్రూపు యొక్క ఉదాహరణ చూపించాలి. గుజరాత్ లో సహజంగా కూడా వస్తారు. ఇప్పుడు విస్తారం ఎక్కువ జరుగుతుంది. కనుక వారసులు గుప్తం అయిపోయారు. ఇప్పుడు వారిని ప్రత్యక్షం చేయండి. అర్థమైందా గుజరాత్ వారు ఏమి చేయాలో! ఇతరులను సంప్రదింపుల్లోకి తీసుకువస్తూ మీరు సంబంధంలోకి రండి. అప్పుడు మొదటి నెంబర్ అయిపోతారు. ఈ సంవత్సరం యొక్క ప్లాన్ కూడా చెప్పేశాను. ఇప్పుడు విస్తారంలో బిజీ అయిపోయారు. రకరకాల వృక్షాలు వచ్చేస్తే బీజం గుప్తం అయిపోతుంది కదా! కానీ అంతిమంలో బీజమే పైకి వస్తుంది. విస్తారంలో బాగా బిజీ అయిపోయారు. ఇప్పుడు మరలా బీజాన్ని మరియు వారసుల క్వాలిటీని తయారుచేయండి. ఆదిలో చేసినది అంతిమంలో చేయండి.

ఈ విధంగా సదా సంతోషంలో నాట్యం చేసేవారికి, ప్రాప్తి యొక్క పాటలు పాడేవారికి, ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకునేవారికి, స్వయాన్ని ప్రత్యక్ష రుజువుగా తయారు చేసుకుని బాబాని ప్రత్యక్షం చేసేవారికి, ఇలా డబల్ ప్రూఫ్ శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.