25.01.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బిందువు (జ్ఞానసింధువు పరమాత్మ)తో బిందువు యొక్క (ఆత్మ) కలయిక.

ఈరోజు బాప్ దాదా కలుసుకునేటందుకు వచ్చారు. మురళీలైతే చాలా విన్నారు. మురళీలన్నింటి సారం ఒకే మాట - బిందువు; దీనిలోనే విస్తారమంతా ఇమిడి ఉంది. బిందువుగా అయిపోయారు కదా? బిందువుగా అవ్వాలి. బిందువుని జ్ఞాపకం చేయాలి మరియు ఏదైతే జరిగిపోయిందో దానికి బిందువు పెట్టాలి. ఇది సహజంగా అనుభవం అవుతుంది కదా! ఈ స్థితి అతి సూక్ష్మం మరియు అతి శక్తిశాలి. దీని ద్వారా మీరందరు కూడా సూక్ష్మ ఫరిస్తాలై, మాస్టర్ సర్వశక్తివంతులై పాత్రను అభినయిస్తున్నారు. సారం సహజమే కదా లేక కష్టమా? డబుల్ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? సహజమా లేదా డబుల్ విదేశీయులకు డబుల్ (రెండింతలు) సహజమా? ఇప్పుడు బాప్ దాదా సారస్వరూపాన్ని చూడాలనుకుంటున్నారు.

ప్రతి బిడ్డ ఎటువంటి దివ్యదర్పణం అంటే ఆ దర్పణం ద్వారా ప్రతి మనుష్యాత్మకు వారి యొక్క మూడు కాలాలు కనిపించాలి. ఇలా త్రికాలదర్శనం చేయించే దర్పణమేనా మీరు? ఈ దర్పణం ద్వారా - గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నాను మరియు భవిష్యత్తులో ఏమి లభిస్తుందో ఈ మూడు కాలాలు స్పష్టంగా కనిపించటం ద్వారా సహజంగానే బాబా నుండి వారసత్వం తీసుకునేటందుకు ఆకర్షితమై వస్తారు. ఎప్పుడైతే సాక్షాత్కారం అవుతుందో అప్పుడు స్పష్టంగా చూసినట్లు అనుభవం చేసుకుని తెలుసుకుంటారు. ముక్తి లోకి వెళ్ళాలి లేదా స్వర్గంలోకి వెళ్ళాలి అని అనేక జన్మల దప్పిక లేదా అనేక జన్మలుగా ఏదైతే ఆశ ఉందో అది పూర్తవుతుందని ఎప్పుడైతే అనుభవం చేసుకుంటారో, తెలుసుకుంటారో లేదా చూస్తారో అప్పుడు సహజంగానే ఆకర్షితులు అవుతారు. రెండు రకాల ఆత్మలు ఉంటారు. భక్తాత్మలు ప్రేమలో లీనమైపోవాలని అనుకుంటారు, మరికొంతమంది ఆత్మలు జ్యోతిలో లీనమైపోవాలని అనుకుంటారు. ఇద్దరూ లీనం అవ్వాలనే అనుకుంటారు. ఇటువంటి ఆత్మలకు సెకనులో బాబా యొక్క పరిచయం, బాబా మహిమ మరియు ప్రాప్తి గురించి చెప్పి సంబంధంలోని లవలీన స్థితిని అనుభవం చేయించండి. వారు ఎప్పుడైతే లవలీనం అవుతారో అప్పుడు సహజంగానే లీనం అవ్వటం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు. కనుక వర్తమాన సమయంలో లవలీన స్థితిని అనుభవం చేయించండి. భవిష్య లీనస్థితికి మార్గం చూపండి. అప్పుడు సహజంగానే ప్రజలను తయారుచేయవలసిన కార్యం సంపన్నం అయిపోతుంది. ఈ విధంగా త్రికాలదర్శిగా తయారుచేసే దివ్యదర్పణంగా అయ్యారా? ఈ దివ్య దర్పణం ద్వారా మీ పురుషార్థపు ఫలితం యొక్క చిత్రం తీయండి - సమర్థంగా ఉన్నానా లేక వ్యర్థంగా ఉన్నానా? అని. వ్యర్థం యొక్క ఫోజ్ (భంగిమ) మరియు సమర్థం యొక్క ఫోజ్ రెండూ కనిపిస్తాయి. సమర్థం యొక్క ఫోజ్ ఏవిధంగా ఉంటుందంటే - మాస్టర్ సర్వశక్తివంతులుగా లేదా హృదయసింహాసనాధికారిగా ఉంటారు. వ్యర్థం యొక్క ఫోజ్ ఎలా ఉంటుందంటే - సదా యుద్ధం చేసే యుద్ధ వీరుని ఫోజ్ లో ఉంటారు. సింహాసనాధికారిగా కాదు యుద్ధ స్థలంలో నిల్చున్నట్లు ఉంటారు. సింహాసనాధికారులు సఫలతామూర్తులుగా ఉంటారు మరియు యుద్ధ స్థలంలో నిల్చున్నవారు శ్రమమూర్తిగా ఉంటారు. చిన్న విషయంలో కూడా శ్రమ చేస్తూనే ఉంటారు. వారు స్మ్మతిస్వరూపులుగా ఉంటారు, వీరు ఫిర్యాదుల స్వరూపంగా ఉంటారు. ఈ విధంగా మీ యొక్క స్వరూపం చూసుకోవాలి. ఇతరుల యొక్క మూడు కాలాలను చూపించే దివ్య దర్పణంగా అవ్వండి. అర్థమైందా!

ఈరోజు డబుల్ విదేశీయులను మరియు గుజరాత్ వారిని కలుసుకోవాలి. ఇద్దరి నాట్యం చేసే రాశి ఒక్కటే. వారు కూడా నాట్యం చేస్తారు మరియు వీరు కూడా బాగా నాట్యమాడుతారు. గుజరాత్ వారు కూడా ప్రేమ స్వరూపులు మరియు డబుల్ విదేశీయులు కూడా ప్రేమ ఆధారం పరుగున వస్తారు. జ్ఞానంతో పాటు ప్రేమ కూడా లభించింది. ఆ ఆత్మిక ప్రేమయే వీరిని బాబా వారిగా చేసింది. డబుల్ ప్రేమ లభిస్తుంది. 1. బాబా యొక్క 2. పరివారం యొక్క. ప్రేమ అనుభవమే వీరిని దీపపు పురుగుగా చేసింది. విదేశీయుల కొరకు ప్రేమ ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. ఆ అనుభవం అయితే చెప్పినది వినడానికి మరియు చనిపోవడానికి కూడా సిద్ధమైపోతారు. ఇలా చనిపోవటం ఇష్టం కదా! ఇలా చనిపోవటం అంటే స్వర్గానికి వెళ్లటం. అందువలనే చనిపోయిన వారిని స్వర్గస్థులు అయ్యారు అని అంటారు. అలా చనిపోయినవారు అయితే స్వర్గానికి వెళ్ళరు. కానీ సంగమయుగంలో ఇలా చనిపోయినవారు స్వర్గానికి వెళ్తారు. దీనిని బట్టే ఎవరైనా దేహంతో చనిపోతే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని పత్రికలలో వేస్తారు. మరయితే ఇలా చనిపోవటం ఇష్టం కదా! మీ ఇష్టంతోనే చనిపోయారు కదా, కష్టంగా కాదు కదా! ఇది మరజీవగా అయినవారి యొక్క సభ. శ్వాస పాత ప్రపంచంలో ఎక్కడా దాగి లేదు కదా! విదేశీయులు బాబా చెప్పే విషయాలకు నవ్వుతున్నారు. అద్భుతం ఏమిటంటే చనిపోయినవారు కూడా నవ్వుతున్నారు.
మీ యొక్క క్రైస్తవ సిద్ధాంతంలో కూడా చనిపోయినవారు తిరిగి లేస్తారు అని ఉంది. అంటే మొదట చనిపోయారు. తర్వాత జీవిస్తున్నారు. ఇది కొత్తజన్మ అయ్యింది కదా. ఇలా చనిపోవటంలో ఆనందం ఉంది. భయం లేదు.