04.02.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


భాగ్య విధాత తండ్రి మరియు భాగ్యశాలి పిల్లలు.

ఈరోజు జ్ఞానదాత, భాగ్య విధాత తండ్రి తన పిల్లల యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు. సర్వ శ్రేష్ట ఆత్మల యొక్క భాగ్యం ఎంత శ్రేష్టమైనది మరియు ఏవిధంగా శ్రేష్టమైనది? మీరు బాబా పరిచయాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఆరు విషయాలు చెప్తారు. వాటి ద్వారా బాబా పరిచయాన్ని స్పష్టం చేస్తారు. ఆ ఆరు విషయాలను తెలుసుకుంటే ఆత్మ శ్రేష్ట పదవిని పొందగలదు. వర్తమానం మరియు భవిష్యత్తు రెండింటిలో సర్వ ప్రాప్తులకు అధికారి కాగలదు. అదేవిధంగా బాప్ దాదా కూడా పిల్లల యొక్క భాగ్యాన్ని ఆరు విషయాల ఆధారంగా చూస్తున్నారు. ఆ ఆరు విషయాల గురించి బాగా తెలుసా?

1. శ్రేష్టాత్మలైన మీ పేరు యొక్క భాగ్యం - మీ పేరుని ఇప్పటికీ కూడా విశ్వంలోని ఆత్మలు వర్ణన చేస్తున్నాయి. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది. బ్రాహ్మణులైన మీ పేరు మీద ఈనాటి నామధారి బ్రాహ్మణులు ఇప్పటికీ ఈ అంతిమ సమయం వరకు కూడా శ్రేష్టంగా పిలవబడుతున్నారు. చేసే పని మారిపోయింది కానీ పేరు యొక్క గౌరవం మాత్రం లభిస్తూనే ఉంది. అదేవిధంగా మీ పేరు - పాండవసేన. ఇప్పటికీ కూడా ఈ పేరుతో మానసికంగా బలహీనంగా ఉన్న ఆత్మ స్వయంలో ఉత్సాహాన్ని తెచ్చుకుంటుంది. ఎలాగంటే పంచ పాండవుల వలె భగవంతుని తోడు ద్వారా విజయీ అవుతాం అని. పాండవులు కొద్దిమందే అయినా కానీ పర్వాలేదు, పాండవులు అంటే సదా విజయీలు. ఆవిధంగా మేము కూడా విజయం పొందగలం అనుకుంటారు. అదేవిధంగా మరో పేరు - గోపగోపికలు. ఈనాటికీ కూడా గోపగోపికలను మహిమ చేస్తూ సంతోషంలోకి వచ్చేస్తారు. ఆ పేరు వింటూనే ప్రేమలో లవలీనం అయిపోతారు. ఈవిధంగా మీ పేరుకి కూడా భాగ్యం ఉంది.

రూపం యొక్క భాగ్యం - శక్తుల రూపంలో ఇప్పటికీ కూడా భక్తులు మీ దర్శనం కోసం శీతోష్ణములను సహిస్తారు. ఇక్కడైతే మీరు విశ్రాంతిగా ఉన్నారు. అక్కడైతే ఆకాశం మరియు భూమికి మధ్యలో నిల్చుని నిల్చుని తపస్సు చేస్తారు. ఇలా శక్తుల రూపంలో లేదా దేవిదేవతల రూపంలో పూజలందుకునే భాగ్యం మీది. రెండు రూపాలుగా పూజ్యులు అవుతున్నారు. ఈ విధంగా మీ రూపానికి మహిమ మరియు పూజ ఉన్నాయి. విశేషంగా పూజయే భాగ్యం.

మీ గుణాల యొక్క భాగ్యం - మీ గుణాలను ఈనాటికీ కీర్తనల రూపంలో వర్ణిస్తున్నారు. మీ గుణాల భాగ్యం యొక్క ప్రభావంతో వర్ణించినవారికి కూడా అల్పకాలికంగా శాంతి, సంతోషం, ఆనందం అనుభవం అవుతాయి. ఇది గుణాల యొక్క భాగ్యం. అంతా ముందుకి పడండి--

కర్తవ్యం యొక్క భాగ్యం - మీ కర్తవ్యాలకు గుర్తుగా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం రకరకాల పండుగలు జరుపుకుంటారు. శ్రేష్టాత్మలైన మీరు అనేక రకాల సాధనాల ద్వారా అత్మల జీవితంలో ఉత్సాహాన్ని ఇచ్చారు. అందువలన ఆ కర్తవ్యం యొక్క భాగ్యానికి గుర్తుగా పండుగలు జరుపుకుంటారు. ముందుకి పదండి -

నివాస స్థానం యొక్క భాగ్యం - నివాస స్థానం అంటే మనం ఉండే ధామం, దానికి స్మృతిచిహ్నం - తీర్థస్థానాలు. మీ స్థానానికి కూడా ఎంత భాగ్యం అంటే ఆ స్థానం తీర్థస్థానం అయిపోయింది. అక్కడి మట్టికి కూడా భాగ్యం ఉంటుంది. ఆ తీర్థస్థానంలోని మట్టిని మస్తకానికి అద్దుకుని తమని తాము భాగ్యశాలిగా భావిస్తారు. ఇదే స్థానం యొక్క భాగ్యం, ఇంకా ముందుకి వెళ్తే -

సమయం యొక్క భాగ్యం - ఈ సంగమ సమయం యొక్క భాగ్యాన్ని విశేషంగా అమృతవేళ రూపంలో కీర్తిస్తారు. అమృతవేళ అంటే అమృతం ద్వారా అమరంగా అయ్యే వేళ, దానితో పాటు ధర్మ యుగం, పురుషోత్తమ యుగం అని కూడా అంటారు. సాయం సంధ్య వేళని కూడా శ్రేష్టంగా భావిస్తారు. సమయం యొక్క ఈ అన్ని మహిమలు మీ సమయానివే. మీ భాగ్యం ఎంత శ్రేష్టమైనదో అర్ధమైందా!

ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డ యొక్క భాగ్యాన్ని విశేషంగా ఈ ఆరు విషయాలతో చూస్తున్నారు. ఈ ఆరు రకాలైన భాగ్యాలను ఎంత శాతంలో తయారు చేసుకున్నారు, శ్రేష్ట నామం యొక్క స్మృతిలో ఎంత వరకు ఉంటున్నారు? ఎంత సమయం ఉంటున్నారు? ఏ స్థితిలో ఉంటున్నారు? అదేవిధంగా మీ దివ్యగుణధారి దేవతా రూపంలో లేదా మాస్టర్ సర్వశక్తివాన్ గా శక్తిరూపం యొక్క సమర్ధ స్వరూపం ఎంత వరకు ఉంటుంది? ఇలా ప్రతి విషయం యొక్క ఫలితాన్ని చూశారు. పరిశీలించడానికి సూక్ష్మవతనంలో పెద్దగా శ్రమ అవసరం లేదు అని చెప్పాను కదా! సంకల్పం అనే స్విచ్ వేయగానే ప్రతి ఒక్కరి యొక్క అన్ని రకాలైన ఫలితం అంతా ప్రత్యక్షమైపోతుంది. సాకార ప్రపంచంలో వలె శ్రమించనవసరం లేదు. విజ్ఞాన సాధనాలు ఏవైతే ఈనాడు కనిపెట్టారో వాటి కంటే పరిశుద్ధమైన రూపంలో అక్కడ ఎప్పటి నుండో ఉన్నాయి. టి.వి అనే సాధనం ఇప్పుడు వచ్చింది కానీ సూక్ష్మవతనంలో స్థాపన యొక్క ఆది సమయంలోనే స్థూల వతనం యొక్క దృశ్యాలన్నింటినీ పిల్లలైన మీకు చూపించి అనుభవం చేయించారు. వైజ్ఞానికులు శ్రమ చేసే పిల్లలు, నక్షత్రాల వరకు వెళ్ళాలని శ్రమిస్తున్నారు. చంద్రునిలో ఏమీ లభించకపోతే నక్షత్రాల వరకు వెళ్తున్నారు. కానీ పిల్లలైన మీరు శాంతిశక్తి ద్వారా నక్షత్రాల కంటే పైన ఉన్న పరంధామం యొక్క అనుభవాన్ని ఆది నుండి చేసుకుంటున్నారు. అయినా కానీ శ్రమించిన ప్రతి బిడ్డకి ఫలితం లభిస్తుంది. వారికి కూడా (వైజ్ఞానికులు) ప్రపంచంలో పేరు, ప్రతిష్ట గౌరవం మరియు సఫలత అనే అల్పకాలిక సంతోషం ప్రాప్తిస్తుంది. వీరు కూడా డ్రామాలో పరవశులు అంటే తమ పాత్రకి వశులు, దేవతల ఎదురుగా ప్రకృతి వజ్రాలు, రత్నాలను పళ్ళాలతో నింపి తీసుకువచ్చింది అనే మహిమ ఉంది కదా! భూమి మరియు సముద్రం ఇవి రెండూ నలువైపులా చెల్లాచెదురైపోయిన బంగారాన్ని, ముత్యాలను, వజ్రాలను ఒకచోటకి చేర్చడానికి నిమత్తమవుతాయి. దీనినే పళ్ళాలతో నింపి తీసుకువచ్చాయి అని చెప్తారు. చెల్లాచెదురైనవన్నీ పళ్లెంలో ఒకచోట చేర్చబడతాయి కదా! ఇలా భారతదేశం మరియు పరిసర స్థానాలు పళ్ళాలుగా అవుతాయి. సేవకులై అన్నింటిని తయారుచేసి విశ్వ యజమానులైన మీ ముందుంచుతాయి. అదేవిధంగా దేవతలకు సర్వ మంత్రతంత్రాలు కూడా సేవాధారిగా అవుతాయి. ఇక్కడ భిన్న భిన్న సాధనాల ద్వారా సఫలతను లేదా సిద్ధిని పొందుతున్నారు. ఈ అన్ని సిద్ధులు అంటే విజ్ఞానం యొక్క పరిశుద్ధమైన రూపం, సఫలతా రూపం సిద్దిరూపంలో మీకు సేవాధారి అవుతాయి. ఇప్పుడైతే వీటి ద్వారా దుర్ఘటనలు జరుగుతున్నాయి మరియు ప్రాప్తి కూడా ఉంది. కానీ పరిశుద్ధ సిద్ధి రూపంలో దు:ఖం యొక్క కారణాలు సమాప్తి అయిపోయి సదా సుఖం మరియు సఫలతారూపంగా అయిపోతాయి. ఇక్కడ భిన్న భిన్న వర్గాల వారు ఉన్నారు. వారు తమ తమ విషయ జ్ఞానం యొక్క సిద్ధి, ఆవిష్కరణల సిద్ది మీకు సేవ చేస్తాయి. దీనినే ప్రకృతి దాసి అవ్వటం మరియు సర్వ మంత్రతంత్రాల యొక్క ప్రాప్తి అని అంటారు. మీరు ఆజ్ఞాపించగానే పని అయిపోతుంది. దీనిని సిద్ధి స్వరూపం అని అంటారు. మీ భాగ్యం ఎంత గొప్పదో అర్ధమైందా! తండ్రి యొక్క భాగ్యాన్ని ఆత్మలు వర్ణిస్తాయి కానీ మీ భాగ్యాన్ని తండ్రి వర్ణిస్తున్నారు. ఇంతకంటే గొప్పభాగ్యం మరేదీ లేదు మరియు ఉండదు. ఇప్పుడు అందరిలో భాగ్య సితార కనిపిస్తూ ఉంది. ఎలాగైతే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉందో అలాగే సదా మీ భాగ్య సితారను మెరుస్తున్నట్లుగా చూడండి.
ఇటువంటి శ్రేష్ట భాగ్యశాలి, సర్వాత్మల యొక్క భాగ్యాన్ని తయారుచేయడానికి నిమిత్తమైన ఆత్మలకు, సదా ప్రకృతిజీత్ అయ్యి ప్రకృతిని కూడా సేవాధారిగా చేసుకునేవారికి, మాస్టర్ సర్వశక్తివంతులై శక్తుల ఆధారంగా సర్వ యంత్రాలను ప్రాప్తింప చేసుకునేవారికి, ఈ విధంగా సదా సర్వశక్తివంతులై, విశ్వ కళ్యాణకారియై విశ్వంలోని ఆత్మలకు మహాదానం లేదా వరదానం ఇచ్చే జ్ఞానదాత, భాగ్య విధాత పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.