06.02.1980        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అశరీరిగా అయ్యేటందుకు సహజవిధి.

ఈరోజు కల్పపూర్వపు ప్రియమైన, అతి గారాబమైన, స్నేహి, సహయోగి మరియు శక్తిస్వరూప పిల్లలను కలుసుకునేటందుకు బాప్ దాదా వచ్చారు. బాప్ దాదా తన సహయోగి పిల్లలతో పాటే ఉంటారు. సహయోగం మరియు స్నేహం యొక్క తెగిపోని బంధం సదా అవినాశి. ఈరోజు వతనంలో బాప్ దాదా అతి ప్రియాతి ప్రియమైన పిల్లల యొక్క స్నేహమాలను తయారుచేస్తున్నారు. స్నేహి అయితే అందరూ అయినా కానీ నెంబరువారీ అని అంటారు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ యొక్క విశేషతలను అనుసరించి నెంబరు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలలో విశేషతలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే వారు పూర్తిగా బాబా సమానంగా సమీప రత్నాలుగా కనిపించారు. కొంతమంది పిల్లలు విశేషతలను ధారణ చేయటంలో శ్రమించటం కూడా చూశారు. నా పిల్లలు మరియు శ్రమిస్తున్నారు అని అనుకుంటున్నారు. అన్నింటికంటే ఎక్కువగా అశరీరిగా అవ్వటంలో ఎక్కువ శ్రమ చేస్తున్నారు.

ఈ విషయం గురించి బాప్ దాదా ఇరువురు పరస్పరంలో మాట్లాడుకున్నారు - అశరీరి ఆత్మకు అశరీరి అవ్వటంలో శ్రమ ఎందుకు? బ్రహ్మాబాబా అన్నారు - 84 జన్మలు శరీరాన్ని ధరించి పాత్రను అభినయించిన కారణంగా పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ శరీరధారి అయిపోతున్నారు. శివబాబా అన్నారు - పాత్ర అభినయించారు, సరే కానీ ఇప్పుడు ఎటువంటి సమయం? సమయం యొక్క స్మృతి అనుసారంగా కర్మ కూడా ఆవిధంగానే ఉంటుంది కదా! అయితే అభ్యాసమే కదా? బాబా అన్నారు - ఇప్పుడు పాత్రను సమాప్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలి. కనుక పాత్ర యొక్క దుస్తులను వదిలివేయాల్సి ఉంటుంది కదా! అదేవిధంగా ఇంటికి వెళ్ళాలంటే ఈ పాత శరీరాన్ని కూడా వదలాల్సి ఉంటుంది కదా! రాజ్యంలోకి అంటే స్వర్గంలోకి వెళ్ళాలన్నా ఈ పాత దుస్తులను వదిలేయాలి. వెళ్ళవలసిందే అయినప్పుడు మర్చిపోవటం కష్టం ఎందుకు? వెళ్ళాలి అనేది మర్చిపోతున్నారా? మీరందరు వెళ్ళిపోవడానికి తయారేనా లేక ఇప్పుడు కూడా ఏవైనా త్రాళ్ళు బంధించబడి ఉన్నాయా? తయారే కదా?

ఇప్పుడు బాప్ దాదా సేవ కోసం సమయం ఇచ్చారు. ఇప్పుడు మీరు సేవాధారి పాత్రను అభినయిస్తున్నారు. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఈ శరీరం యొక్క బంధన లేదు కదా లేదా ఈ పాత శరీరం బిగువుగా లేదు కదా? బిగువైన దుస్తులు ఇష్టం కాదు కదా? వస్త్రం బిగువుగా ఉంటే తయారుగా ఉండలేరు. బంధన్ముక్తులు అంటే వస్త్రం వదులుగా ఉండటం, బిగువుగా ఉండకూడదు. ఆజ్ఞ లభించగానే సెకనులో వెళ్ళిపోవాలి. ఇటువంటి బంధన్ముక్తులు మరియు యోగయుక్తులుగా అయ్యారా? నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనేది మీ ప్రతిజ్ఞ అంటే బంధన్ముక్తులు అయిపోయారు కదా! అశరీరిగా అయ్యేటందుకు విశేషంగా నాలుగు విషయాలపై ధ్యాస పెట్టుకోండి -

1. ప్రాపంచిక ఆత్మలు కూడా ఎప్పుడైనా తమని తాము మర్చిపోవాలంటే సత్యమైన ప్రేమలో లీనం అయిపోతారు. అంటే సత్యమైన ప్రేమయే స్వయాన్ని మరిపించే సహజ సాధనం. ప్రేమ అనేది ప్రపంచాన్ని మరిపించే సాధనం, దేహాన్ని మరిపించే సాధనం.

2. సత్యమైన మిత్రుడు కూడా ప్రపంచాన్ని మరిపించే సాధనం. ఇద్దరు మిత్రులు కలుసుకున్నారంటే వారికి తమ యొక్క లేదా సమయం యొక్క స్మృతి ఏదీ ఉండదు.

3. మనస్పూర్వక పాట - మనస్సుతో ఎవరైనా పాట పాడుతుంటే ఆ సమయంలో తమని తామే మర్చిపోతారు, సమయాన్ని కూడా మర్చిపోతారు.

4. యదార్థ రీతి - యదార్థ పద్దతి తెలిస్తే అశరీరిగా అవ్వటం చాలా సహజం. పద్ధతి రావటం లేదు అందువలనే కష్టమనిపిస్తుంది. 1. ప్రీతి 2. మిత్రుడు 3. గీతం (పాట) 4. రీతి

మీరందరు ఈ నాలుగు విషయాల యొక్క అనుభవీలు కదా? ప్రీతి యొక్క అనుభవీలు బాబా మరియు మీరు ఇక మూడవ వారు ఎవరూ లేరు. బాబా లభించారంటే అన్నీ లభించినట్లే, ఇక ఇతరులతో పని ఏమిటి? పరమాత్మ యొక్క ప్రేమ గురించి భక్తులు ఈనాటికీ కీరిస్తూ ఉంటారు. కేవలం ఆ ప్రేమ గీతాలలోనే వారు లీనమైపోతుంటే ప్రేమను నిలుపుకునేవారు ఎంతగా లీనమై ఉంటారు! ప్రేమ యొక్క అనుభవీలే కదా? విపరీత బుద్ధి నుండి ప్రీతిబుద్ది అయిపోయారు కదా? ఎప్పుడైతే ప్రభువుపై ప్రేమ ఉందో అప్పుడు అశరీరి అవ్వటం ఏమనిపిస్తుంది? ప్రేమ ఉంటే అశరీరి అవ్వటం అనేది ఒక్క సెకను యొక్క ఆట. బాబా అనగానే శరీరాన్ని మర్చిపోతారు. బాబా అనే మాటయే ప్రపంచాన్ని మరిపించే ఆత్మిక బాంబు. (కరెంట్ పోయింది) ఎలాగైతే ఇక్కడ స్వీచ్ లు మార్చే ఆట చూశారో అలాగే అక్కడ స్మృతి అనే స్విచ్. బాబా అనే స్విచ్ వేయాలి, దేహం, దేహ ప్రపంచం యొక్క స్మృతి అనే స్విచ్ ని ఆపేయాలి. ఇది ఒక్క సెకండు యొక్క ఆట. నోటితో బాబా అనటంలో సమయం పట్టవచ్చు కానీ స్మృతిలోకి తెచ్చుకోవటంలో ఎంత సమయం పడుతుంది! కనుక ప్రేమలో ఉండటం అంటే సహజంగా అశరీరిగా అవ్వటం.

బాబా అందరికంటే ఎంత సత్యమైన మిత్రుడంటే స్మశానం తర్వాత కూడా మన వెంట వస్తారు. శరీరధారులైన మిత్రులు స్మశానం వరకే వెళ్తారు కానీ వారు దు:ఖహర్త సుఖకర్తగా కాలేరు. దుఃఖ సమయంలో ఎంతో కొంత సహయోగి అవుతారు. అంతే కానీ దు:ఖాన్ని హరించలేరు. అయితే సత్యమైన మిత్రుడు దొరికాడు కదా? సదా ఈ అవినాశి మిత్రునితో పాటు ఉండండి, ఆ ప్రేమలో శ్రమ సమాప్తి అయిపోతుంది. ప్రేమించటం వచ్చినప్పుడు ఇక ఎందుకు శ్రమిస్తున్నారు? బాప్ దాదాకి అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఎవరికైనా బరువులెత్తే అలవాటు అయిపోతే వారిని విశ్రాంతిగా కూర్చోబెడితే కూర్చోలేరు. మాటిమాటికి బరువులవైపుకి వెళ్ళిపోతారు, ఆయాసపడుతూ విడిపించండి అని పిలుస్తున్నారు. సదా ప్రేమలో ఉండండి మరియు మిత్రునితోపాటు ఉండండి అప్పుడు శ్రమ సమాప్తి అయిపోతుంది. మిత్రుడికి దూరమవ్వకండి, సదా తోడు పెట్టుకుని నడవండి.

అదేవిధంగా బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన సర్వ ప్రాప్తులు మరియు గుణాల యొక్క పాటలు సదా పాడుకుంటూ ఉండండి. బాబా యొక్క మహిమ లేదా మీ యొక్క మహిమకు సంబంధించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ పాటల్లో సంగీతం కూడా స్వతహాగానే వస్తుంది. ఎంతెంత గుణాల మహిమ యొక్క పాటలు పాడుతారో అంతగా సంతోషం అనే బాజాలు స్వతహాగానే మ్రోగుతాయి. పాటలు పాడేవారు కూడా వచ్చారు కదా! (గాయకులు వచ్చారు) మీ వాయిద్యాలు వేరు. ఇది సంతోషం యొక్క వాయిద్యం. ఈ వాయిద్యం ఎప్పుడూ పాడవ్వదు, రిపేరు చేయనవసరం లేదు. కనుక సదా ఈ పాటలు పాడుకుంటూ ఉండండి. ఈ పాటలు పాడటం అందరికీ వచ్చు కదా! అయితే సదా పాటలు పాడుకుంటూ ఉండండి, అప్పుడు సహజంగానే అశరీరి అయిపోతారు. ఇక మిగిలింది రీతి - యదార్థ రీతి, సెకండు యొక్క రీతి. నేను అశరీరి ఆత్మను ఇది అన్నింటికంటే సహజ యదార్ధ రీతి. సహజమే కదా! కష్టాన్ని సహజం చేసేవాడు అని బాబాకి మహిమ ఉంది. అదేవిధంగా బాబా సమాన పిల్లలు కూడా కష్టాన్ని సహజం చేసుకునేవారు. విశ్వంలోని వారి కష్టాలను సహజం చేసేవారు, స్వయం కష్టాన్ని అనుభవం చేసుకోవటం అనేది అసలు ఎలా జరుగుతుంది? అందువలన సదా సర్వ సహజయోగి.

సంగమయుగి బ్రాహ్మణుల నోటి నుండి శ్రమ లేదా కష్టం అనే మాటలే కాదు, సంకల్పం కూడా రాకూడదు. ఈ సంవత్సరం విశేషంగా ధ్యాస పెట్టుకోవలసింది - సదా సహజయోగి. బాబాకి ఎలాగైతే పిల్లలపై దయ వస్తుందో అలాగే స్వయంపై కూడా దయ చూపించుకోండి మరియు సర్వుల పట్ల కూడా దయ చూపండి. దయాహృదయులు అనే బిరుదు మీ అందరికీ కూడా ఉంది కదా! మీ బిరుదు మీకు గుర్తు ఉంది కదా! కానీ దయాహృదయులు అవ్వడానికి బదులు చిన్న పొరపాటు చేస్తున్నారు. దయాభావానికి బదులు అహంభావంలోకి వచ్చేస్తున్నారు. అందువలన దయను మర్చిపోతున్నారు. కొందరు అహంభావంలోకి వచ్చేస్తున్నారు. కొందరు సంశయభావంలోకి వచ్చేస్తున్నారు. అంటే చేరుకోగలనో లేదో? నిజమైన మార్గమో, కాదో?.... ఈవిధంగా అప్పుడప్పుడు స్వయం గురించి, అప్పుడప్పుడు జ్ఞానం గురించి అనేక రకాల సంశయభావంలోకి వచ్చేస్తున్నారు. అందువలన దయాభావం మారిపోతుంది. అర్థమైందా? మానసికంగా బలహీనం అవ్వకండి, సదా హృదయ సింహాసనాధికారులు అవ్వండి. ఈ సంవత్సరం ఏమి చేయాలో అర్ధమైందా? ఈ సంవత్సరానికి పని చెప్తున్నాను - సహజయోగి అవ్వండి, దయా హృదయులు అవ్వండి మరియు హృదయసింహాసనాధికారులు అవ్వండి. ఇటువంటి ఆజ్ఞాకారి పిల్లలకు భాగ్యవిధాత బాబా ప్రతిరోజు అమృతవేళ సఫలతా తిలకాన్ని పెడతారు. భక్తులకు భగవంతుడు తిలకం దిద్దడానికి వచ్చారు. కనుక తిలకం యొక్క మహిమ కూడా జరుగుతుంది. కనుక ఈ సంవత్సరం ఆజ్ఞాకారి పిల్లలకు సఫలతా తిలకాన్ని పెట్టేటందుకు స్వయంగా బాబా మీ సేవాస్థానాలకు అంటే తీరస్థానాలకు వస్తారు. బాబా అయితే రోజూ విహరించడానికి వస్తారు. ఒకవేళ పిల్లలు నిద్రపోయారనుకోండి అది వారి పొరపాటు.

దీపావళికి ఎలాగైతే ప్రతి చోట దీపాలను వెలిగించుకుంటారు, శుభ్రం చేస్తారు, ఆహ్వానిస్తారు. అంటే స్వచ్చత, ప్రకాశం మరియు ఆహ్వానం. వారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు, మీరు లక్ష్మీదేవి యొక్క రచయితను ఆహ్వానిస్తారు. కనుక జ్యోతిని వెలిగించుకుని కూర్చోండి అప్పుడు బాబా వస్తారు. కొందరిని మేల్కొల్పుతున్నా కానీ నిద్రపోతున్నారు. ధ్వని ఏదో వినిపించినట్లు కూడా అనుభవం చేసుకుంటారు అయినా కానీ సోమరితన నిద్రలో నిద్రపోతున్నారు. సత్యయుగంలో నిద్రపోవటమే నిద్రపోవటం. అక్కడ బుబల్ సోనా (హిందీలో సోనా అంటే నిద్రపోవటం అని ఒక అర్ధం మరియు బంగారం అని మరో అర్ధం). అందువలన ఇప్పుడు జాగృతిజ్యోతి అవ్వండి. ఇక్కడ నిద్రపోయే సంస్కారంతోనే అక్కడ బంగారం దొరుకుతుంది అని అనుకోకండి. ఎవరు మేల్కొంటారో వారే బంగారం పొందుతారు. సోమరితనం యొక్క నిద్ర కూడా ఎప్పుడు వస్తుందంటే వినాశనకాలాన్ని మర్చిపోయినప్పుడు. భక్తుల యొక్క పిలుపు వినండి, దు:ఖి ఆత్మల యొక్క దు:ఖం యొక్క పిలుపుని వినండి, దప్పికగొన్న ఆత్మల యొక్క ప్రార్ధనా ధ్వనిని వినండి. అప్పుడు ఎప్పుడూ కూడా నిద్ర రాదు. ఈ సంవత్సరం సోమరితన నిద్రకు విడాకులు ఇవ్వాలి. అప్పుడే భక్తులు సాక్షాత్కారమూర్తులైన మీ యొక్క సాక్షాత్కారం చేసుకుంటారు. కనుక ఈ సంవత్సరం సాక్షాత్కారమూర్తులై భక్తులకు సాక్షాత్కారం చేయించండి. ఇటువంటి చక్రవర్తిగా అవ్వండి.

ఈవిధంగా సదా ప్రీతిని నిలుపుకునేవారికి, సదా సత్యమైన మిత్రునితో పాటు ఉండేవారికి, సదా ప్రాప్తులు మరియు గుణాల యొక్క పాటలు పాడేవారికి, సదా సెకండు యొక్క యదార్థ రీతి ద్వారా సహజయోగి అయ్యేవారికి, ఈ విధంగా సదా దయాహృదయులు, కష్టాన్ని సహజం చేసుకునే నిద్రాజీత్, చక్రవర్తి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.