సేవా సఫలత యొక్క వెలుగు.
సదా కృపాళువు మరియు దయాళువు అయిన బాప్ దాదా తన యొక్క
ఈశ్వరీయ సేవాధారి పిల్లలతో మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా తన పిల్లలను ఏ రూపంలో చూసున్నారంటే
భగవంతుని యొక్క సేవాధారి పిల్లలుగా చూస్తున్నారు. ఎవరైతే భగవంతుని సేవాధారులుగా
ఉంటారో వారికి స్వతహాగానే భగవంతుడు మరియు వెనువెంట సేవ రెండూ స్మృతి ఉంటాయి.
ఈరోజులలో ఏదైనా కార్యం జరగకపోతే, ఎవరూ సహయోగిగా కాకపోతే ఒకరికొకరు భగవంతుని
పేరుతో ఈ పని చేయండి అని చెప్తారు. ఎందుకంటే భగవంతుడి పేరుతో చేస్తే సహయోగం కూడా
లభిస్తుంది మరియు సఫలత కూడా లభిస్తుంది. ఏదైనా అసంభవ కార్యం అయినా. లేక విశేష
విషయం అయినా భగవంతుని పేరుతో చేస్తే ఆ పని అయిపోతుంది అని చెప్తారు. దీని ద్వారా
ఏమి రుజువు అవుతుంది? అసంభవం నుండి సంభవం, నిరాశతో ఉన్న పనిలో ఆశను బాబా వచ్చి
నింపారు. అందువలనే ఇప్పటివరకు కూడా ఆ మహిమ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే మీరు
భగవంతుని సేవాధారులు. కేవలం భగవంతుని పేరుని వాడేవారు కాదు. భగవంతునికి సహయోగిగా
అయ్యి శ్రేష్టకార్యం చేసేవారు. ఇటువంటి ఈశ్వరీయ సేవాధారులైన పిల్లల యొక్క ప్రతి
కార్యంలో సఫలత ఇమిడే ఉంది. భగవంతుని సేవాధారి పిల్లల కార్యంలో అసంభవం అనే విషయమే
లేదు. అన్ని సంభవమే మరియు సహజమే. భగవంతుని సేవాధారులైన మీకు విశ్వపరివర్తన
యొక్క కార్యం కష్టం అనిపిస్తుందా? జరిగే ఉంది అని అనుభవం అవుతుందా? సదా ఇదే
అనుభవం చేసుకుంటున్నారు - ఇది అయితే అనేకసార్లు చేసే ఉన్నాము అని. ఏమి క్రొత్త
విషయంగానే అనిపించదు. అవుతుందా, అవ్వదా, ఎలా అవుతుంది .... అనే ఈ ప్రశ్నలే రావటం
లేదు. ఎందుకంటే బాబా మీకు సహయోగిగా ఉన్నారు. ఇప్పటి వరకు భగవంతుని పేరు మీదే పని
జరిగిపోతుందంటే భగవంతుని తోడుతో చేసే పిల్లల యొక్క ప్రతి కార్యంలో సఫలత ఇమిడే
ఉంటుంది. అందువలనే బాప్ దాదా సదా పిల్లలను సఫలతా మూర్తులు అంటారు. సఫలతా సితారలు
మీ యొక్క సఫలత ద్వారా విశ్వానికి వెలుగు ఇవ్వాలి. కనుక మిమ్మల్ని మీరు ఈవిధంగా
సఫలతామూర్తిగా అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ నడుస్తూ - నడుస్తూ ఎప్పుడైనా
అసఫలత లేదా కష్టం అనుభవం అవుతుందంటే దానికి కారణం కేవలం మీరు సేవాధారిగానే
అవుతున్నారు కానీ భగవంతుని సేవాధారులుగా అవ్వటం లేదు. భగవంతుడిని సేవ నుండి వేరు
చేసేస్తున్నారు. అందువలన ఒంటరిగా ఉన్న కారణంగా సహజం కష్టం అవుతుంది, దూరంగా
అనిపిస్తుంది. కానీ పేరే - భగవంతుని సేవాధారులు. కంబైండ్ ని వేరుగా చేయకండి,
కానీ వేరు చేసేస్తున్నారు కదా! సదా ఈ పేరు స్మృతి ఉంచుకుంటే సేవలో స్వతహాగానే
భగవంతుని యొక్క గారడీ నిండి ఉంటుంది. సేవా క్షేత్రంలో స్వయంపట్ల అయినా, సేవలో
అయినా రకరకాలైన విఘ్నాలు వస్తున్నాయి అంటే దీనికి కూడా కారణం స్వయాన్ని కేవలం
సేవాధారిగా భావిస్తున్నారు. కానీ ఈశ్వరీయ సేవాధారులం, కేవలం సేవ కాదు కానీ
భగవంతుని యొక్క సేవ - ఈ స్మృతి వలన స్మృతి మరియు సేవ స్వతహాగానే కంబైండ్ గా
ఉంటాయి. స్మృతి మరియు సేవ సమానంగా ఉంటాయి. ఎక్కడ సమానత ఉంటుందో అక్కడ స్వయం సదా
ఆనంద స్వరూపంగా మరియు ఇతరుల పట్ల స్వతహాగా దయాదృష్టి ఉంటుంది. వీరిపైన దయ
చూపించాలి అని ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు. సదా మీ యొక్క పనే - దయ చూపించడం.
ఇలా అనాది సంసార స్వరూపంగా అయ్యారా! విశేష సంస్కారం ఏదైతే ఉంటుందో అది
స్వతహాగానే కార్యం చేస్తూ ఉంటుంది. ఆలోచించి చేయవలసిన అవసరం ఉండదు, కాని
జరిగిపోతూ ఉంటుంది. మాటిమాటికి ఇదే అంటారు నా సంస్కారం ఇదే కనుక అయిపోయింది
అంటారు. నా భావం కాదు, నా లక్ష్యం ఇది కాదు.... కానీ అయిపోయింది అంటారు. ఎందుకు
అంటే - సంస్కారం అని ఇలా అంటారు కదా? కొంతమంది అంటారు నేను కోప్పడలేదు కానీ నా
మాట తీరే అంత అంటారు. దీని ద్వారా ఏమి ఋజువు అయ్యింది? అల్పకాలిక సంస్కారం కూడా
స్వతహాగానే మాట మరియు కర్మ చేయిస్తూ ఉంటుంది. కనుక శ్రేష్ట ఆత్మలైన మీ యొక్క
అనాది, స్వతహ సంస్కారం ఏమిటి? సదా సంపన్నస్థితి మరియు సఫలతామూర్తి. సదా వరదాని
మరియు మహాదాని. సదా ఈ సంస్కారం స్మృతిలో ఉండటం ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల
దయాదృష్టి ఉంటుంది. అల్పకాలిక సంస్కారాలను అనాది సంస్కారాల ద్వారా పరివర్తన
చేసుకోండి. అనాది సంస్కారాలు ప్రత్యక్షం అవ్వటం ద్వారా రకరకాలైన విఘ్నాలు
స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. బాప్ దాదా ఇప్పటివరకు స్వపరివర్తన లేక
విశ్వపరివర్తన యొక్క సేవలో శ్రమ చూసి సహించలేకపోతున్నారు. భగవంతుని సేవాధారులు
అయినా శ్రమ చేస్తున్నారు. పేరుతోనే పని జరిగిపోతుంటే అధికారులైన మీకు శ్రమ ఎలా
ఉంటుంది? చిన్న పొరపాటు చేస్తున్నారు, అది ఏమిటి? ఏ పొరపాటు చేస్తున్నారో తెలుసా?
బాగా తెలుసు, మరలా ఎందుకు చేస్తున్నారు? బలహీనంగా అయిపోతున్నారు. కేవలం చిన్న
పొరపాటు ఏమిటంటే నా స్వభావం, నా సంస్కారం అంటున్నారు. అనాది సంస్కారాలను మీవిగా
భావించడానికి బదులు మధ్యకాల సంస్కారాలను మీవిగా భావిస్తున్నారు. మధ్యకాల
సంస్కారాలను, స్వభావాలను నా స్వభావం, నా సంస్కారం అని భావించడమే పొరపాటు. అవి
రావణుని యొక్క స్వభావాలు మీవి కాదు. పరాయి వస్తువులను మీవిగా భావించే పొరపాటు
చేస్తున్నారు. నావి అనటం ద్వారా మరియు భావించడం ద్వారా స్వతహాగానే వాటితో
తగుల్పాటు వస్తుంది. అందువలనే అవి వదలాలి అనుకున్నా వదలడం లేదు. కనుక పొరపాటు
ఏమిటో అర్థమైందా? కనుక సదా స్మృతి ఉంచుకోండి నేను భగవంతుని యొక్క సేవాధారిని.
నేను చేసాను అని కాదు, భగవంతుడు నా ద్వారా చేయించారు. ఈ ఒక్క స్మృతి ద్వారా
సహజంగా సర్వవిఘ్నాల యొక్క బీజాన్ని సదాకాలికంగా సమాప్తి చేయండి. అన్నీ రకాలైన
విఘ్నాలకు బీజం రెండు మాటలలో ఉంది. ఆ రెండు మాటలు ఏమిటి? విఘ్నం వచ్చే తలుపు
ఏమిటో తెలుసా? ప్రసిద్ధమైన ఆ రెండు మాటలు ఏమిటి? విస్తారం చాలా ఉంది కానీ రెండు
మాటలలో సారం వచ్చేస్తుంది. 1. అభిమానం. 2. అవమానం. సేవా క్షేత్రంలో విశేషంగా ఈ
విఘ్నాలు రెండు మార్గాలలో వస్తాయి. వస్తే, నేను చేసాను ... అనే అభిమానం రూపంలో
వస్తుంది లేకపోతే అవమానం యొక్క భావన విఘ్నరూపంలో వస్తుంది. భగవంతుని సేవాధారులం,
చేసి చేయించేవాడు బాబా ఇది మర్చిపోతున్నారు, ఇది చిన్న పొరపాటు కదా! అందువలనే
భగవంతుడిని వేరు చేయకండి అంటారు. సేవలో కూడా కంబైండ్ రూపాన్ని స్మృతి ఉంచుకోండి.
భగవంతుడు మరియు సేవ. ఇది రావటంలేదా? చాలా సహజం. శ్రమ నుండి విడిపించుకుంటారు.
కనుక ఏమి చేయాలో అర్థమైందా!
ఈవిధంగా సదా అనాది సంస్కారాల యొక్క స్మృతి స్వరూపులకి,
సదా స్వయాన్ని నిమిత్త మాత్రంగా మరియు బాబాని చేసి చేయించేవాడిగా భావించే వారికి,
సదా స్వయం అనాది స్వరూపం అంటే ఆనంద స్వరూపంగా ఉండేవారికి, ఏ రకమైన విఘ్నాల
యొక్క బీజాన్నయినా సమాప్తి చేసుకునే సమర్ధ ఆత్మలకు సదా బాబా యొక్క సహయోగి,
ఈశ్వరీయ సేవాధారులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.