13.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరిశీలనా శక్తి మరియు నిర్ణయ శక్తికి ఆధారం - శాంతిశక్తి.

శాంతి సాగరుడైన బాప్ దాదా తన యొక్క శాంతమూర్తి పిల్లలతో మాట్లాడుతున్నారు -

ఈరోజు నిర్వాణస్థితి అంటే వాణీకి అతీతమైన శాంతి స్వరూపస్థితిని అనుభవం చేయిస్తున్నారు. ఆత్మలైన మీ యొక్క స్వధర్మం మరియు సుకర్మ, స్వ స్వరూపం, స్వదేశమే శాంతి. సంగమయుగం యొక్క విశేషశక్తి కూడా శాంతి శక్తియే. సంగమయుగి ఆత్మలైన మీ యొక్క లక్ష్యం కూడా ఇదే, ఇప్పుడు స్వీట్ సైలెన్స్ హోమ్ కి (మధురమైన శాంతిధామం) వెళ్ళాలి. ఇవే అనాది లక్షణాలు - శాంతి స్వరూపంగా ఉండాలి, అందరికీ శాంతి ఇవ్వాలి. విశ్వంలో ఈ శక్తి యొక్క అవసరమే ఉంది. సర్వసమస్యల యొక్క పరిష్కారం ఈ శాంతిశక్తి ద్వారానే జరుగుతుంది. ఎందువలన? సైలెన్స్ అంటే శాంతి స్వరూప ఆత్మ ఏకాంతవాసీగా ఉన్న కారణంగా ఏకాగ్రంగా ఉంటుంది మరియు ఏకాగ్రత కారణంగా విశేషంగా రెండు శక్తులు లభిస్తాయి. ఒకటి పరిశీలనాశక్తి, రెండు నిర్ణయశక్తి. వ్యవహారంలో అయినా, పరమార్ధంలో అయినా సమస్యలను తొలగించుకునే సహజసాధనం - ఈ రెండు శక్తులు, పరమార్థ మార్గంలో విఘ్నవినాశకులుగా అయ్యేటందుకు సాధనం - మాయని పరిశీలించటం, పరిశీలించిన తర్వాత నిర్ణయం చేయాలి. పరిశీలనా శక్తి లేని కారణంగానే మాయ యొక్క రకరకాల రూపాలను దూరం నుండే పారద్రోలలేకపోతున్నారు. పరమార్థులైన పిల్లల ఎదురుగా మాయ కూడా రాయల్‌ రూపంలో ఈశ్వరీయ రూపాన్ని రచించి వస్తుంది. దీనిని పరిశీలించడానికి ఏకాగ్రతాశక్తి కావాలి మరియు ఏకాగ్రతాశక్తి శాంతిశక్తి ద్వారానే లభిస్తుంది.

వర్తమాన సమయంలో బ్రాహ్మణ ఆత్మలలో పరివర్తన యొక్క వేగం తక్కువగా ఉంది. ఎందుకంటే మాయ యొక్క రాయల్ ఈశ్వరీయ రోల్డ్ గోల్డ్ ను (నకిలీ బంగారాన్ని) రియల్ గోల్డ్ గా (సత్యమైన బంగారంగా) భావిస్తున్నారు. దీని కారణంగా వర్తమానాన్ని పరిశీలించని కారణంగా ఏమి మాట్లాడుతున్నారు! నేను ఏది చేసానో లేక చెప్పానో అది సరిగానే చెప్పాను, నేను దేనిలో తప్పుగా ఉన్నాను. ఇలాగే నడవలసి ఉంటుంది! ఇలా అసత్యం అయినా కానీ అసత్యంగా భావించరు. దీనికి కారణం ఏమిటి? పరిశీలనాశక్తి లోపంగా ఉంది. మాయ యొక్క రాయల్ రూపాన్ని సత్యంగా భావిస్తున్నారు. పరిశీలనా శక్తి లేని కారణంగా యదార్థ నిర్ణయం కూడా చేయలేకపోతున్నారు. స్వ పరివర్తన చేసుకోవాలా లేదా ఇతరులు పరివర్తన అవ్వాలా అనేది పరిశీలన చేయలేకపోతున్నారు. అందువలనే పరివర్తన యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. సమయం చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ సమయ ప్రమాణంగా పరివర్తన అవ్వటం మరియు స్వయం యొక్క శ్రేష్ట సంకల్పంతో పరివర్తన అవ్వటం - వీటిలో ప్రాప్తి యొక్క అనుభూతిలో రాత్రి - పగలుకి ఉన్న తేడా ఉంది. ఈరోజుల్లో కార్లలో తిరుగుతారు కదా! ఒకటి సెల్ఫ్ స్టార్ట్ అవ్వటం, రెండు నెట్టటం ద్వారా స్టార్ట్ అవ్వటం. రెండింటిలో తేడా ఉంది కదా! అదేవిధంగా సమయం నెట్టడం ద్వారా పరివర్తన అవ్వటం అంటే పురుషార్థం అనే కారు నెట్టడం ద్వారా నడుస్తుంది. అంటే అది కారులో వెళ్ళటం కాదు, వెళ్ళటానికి కారుని నెట్టవలసి వచ్చింది.

సమయం ఆధారంగా పరివర్తన అవ్వటం అంటే కేవలం కొద్ది మొత్తమే ప్రాప్తి పొందటం. ఉదాహరణకి ఒకరు మొత్తానికి యజమాని. రెండవరకం వారు కొద్దిగా షేర్స్ పంచుకుంటారు. అధికారి, యజమాని ఎక్కడ? మరియు భాగం పంచుకునేవారు ఎక్కడ? తేడా ఉంది కదా! దీనికి కారణం ఏమిటి? శాంతిశక్తి యొక్క అనుభూతి లేదు. శాంతిశక్తి యొక్క అనుభూతి ద్వారా పరిశీలనా శక్తి మరియు నిర్ణయ శక్తి లభిస్తుంది. దాని వలన పరివర్తన కూడా తీవ్రంగా జరుగుతుంది. కనుక శాంతిశక్తి ఎంత ఉన్నతమైనదో అర్ధమైందా? శాంతిశక్తి క్రోధాగ్నిని శీతలం చేస్తుంది. శాంతిశక్తి వ్యర్దసంకల్పాల యొక్క అలజడిని సమాప్తి చేస్తుంది. శాంతిశక్తియే ఎటువంటి పాత సంస్కారాలనైనా సమాప్తి చేస్తుంది. శాంతిశక్తి అనేకరకాలైన మానసిక రోగాలను సహజంగా సమాప్తి చేస్తుంది. శాంతిశక్తి శాంతిసాగరుడైన బాబాతో అనేక ఆత్మలను కలుపుతుంది. శాంతిశక్తి అనేక జన్మల నుండి భ్రమిస్తున్న ఆత్మలకు గమ్యం యొక్క అనుభూతి చేయిస్తుంది. మహాన్ ఆత్మ, ధర్మాత్మ అందరినీ తయారుచేస్తుంది. శాంతిశక్తి ఒక్క సెకనులో మూడులోకాలను విహరింజేస్తుంది. కనుక శాంతిశక్తి ఎంత గొప్పదో అర్థమైందా? శాంతి శక్తి ద్వారా తక్కువ శ్రమ, తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం వస్తుంది. శాంతిశక్తి ద్వారా సమయం యొక్క ఖజానా కూడా పొదుపు అవుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సఫలతను పొందవచ్చు. శాంతిశక్తి హాహా కారాలను జై జై కారాలుగా చేస్తుంది. శాంతిశక్తి సదా మీ మెడలో సఫలతా వరమాలలను వేస్తుంది. జై జై కారాలు కూడా వచ్చాయి, మాలలు కూడా పడ్డాయి. ఇక ఏమి మిగిలి ఉంది? అన్నీ అయిపోయాయి కదా! కనుక మీరు ఎంత ఉన్నతమైనవారో విన్నారు కదా? ఈ ఉన్నతమైన శక్తిని తక్కువగా కార్యంలో ఉపయోగిస్తున్నారు.

వాచా ద్వారా బాణం వేయడం వచ్చింది. ఇప్పుడు శాంతి యొక్క బాణం వేయండి. దీని ద్వారా ఇసుక భూమిలో కూడా పచ్చదనం తీసుకురాగలరు. ఎంత కఠినపర్వతం అయినా నీటిని పుట్టించవచ్చు. వర్తమాన సమయంలో శాంతి శక్తిని ప్రత్యక్షంలోకి తీసుకురండి. మధువనభూమి కూడా ఎందుకు ఆకర్షిస్తుంది? శాంతి యొక్క అనుభూతి అవుతుంది. అందువలనే కదా! అదేవిధంగా నలువైపుల సేవాకేంద్రాలను మరియు కుటుంబ స్థానాలను శాంతికుండంగా తయారు చేసుకోండి. అప్పుడు నలువైపుల యొక్క శాంతి కిరణాలు విశ్వంలోని ఆత్మలను శాంతి యొక్క అనుభూతి వైపుకి ఆకర్షితం చేస్తాయి. అయస్కాంతంగా అవుతాయి. ఈ విధమైన సమయం కూడా రానున్నది. మీ యొక్క అన్ని స్థానాలు శాంతిని ప్రాప్తింపజేసే స్థానాలుగా అయిపోతాయి, మీరు వెళ్ళవలసిన అవసరం ఉండదు. వారికి వారే మీ దగ్గరికి వస్తారు. కానీ ఎప్పుడైతే అందరిలో సంకల్పం, మాట, కర్మలో శాంతి యొక్క మహాన్ శక్తి నిరంతరం ఉంటుందో అప్పుడే అందరు ఆకర్షితం అయ్యి వస్తారు. అప్పుడే మాస్టర్ శాంతిదేవ్ గా అవుతారు. కనుక ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా?మంచిది.

సదా స్వ స్వరూపం, స్వదర్మం, స్వదేశం యొక్క స్మృతి స్వరూపంగా, శాంతి మూర్తిగా అయ్యి సదా శాంతి శక్తి ద్వారా సర్వులను శాంతిస్వరూపంగా చేసేవారికి, శాంతిసాగరుని యొక్క శాంతి అలలలో తేలియాడుతూ అనేకులకు ధర్మాత్మ, మహాన్ ఆత్మగా అయ్యేవారికి, ఇటువంటి శాంతిస్వరూప శ్రేష్ట పుణ్యాత్మగా అయ్యే వారికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.