19.03.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


కర్మ - ఆత్మను దర్శింపచేసే దర్పణము

సర్వ శక్తివంతుడైన బాబా ఈరోజు తన శక్తిసేనను చూసి హర్షితులవుతున్నారు. మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ శక్తులను తమలో ధారణ చేసారు? విశేష శక్తుల గురించి మంచిరీతిగా తెలుసు మరియు తెలుసుకున్న ఆధారముపై చిత్రమును తయారుచేస్తారు. ఈ చిత్రము చైతన్య స్వరూపమునకు గుర్తు - ''శ్రేష్టత మరియు మహానత''. ప్రతి కర్మ శ్రేష్టమయినది, గొప్పది. శక్తులను చరిత్రలోకి అనగా కర్మలోకి తీసుకువచ్చారు అన్నది దీని ద్వారా నిరూపణ అవుతుంది. నిర్బల ఆత్మనా లేక శక్తిశాలీ ఆత్మనా, సర్వ శక్తిసంపన్నమా లేక శక్తి స్వరూప సంపన్నమా - వీటన్నింటినీ కర్మల ద్వారానే తెలుసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే కర్మల ద్వారానే వ్యక్తి లేక పరిస్థితుల సంబంధములోకి, సంపర్కములోకి వస్తారు. కనుకనే కర్మక్షేత్రము, కర్మ సంబంధము, కర్మేంద్రియాలు, కర్మభోగము, కర్మయోగము అన్న పేర్లు ఉన్నాయి. ఏవిధంగా, నిరాకార వతనపు విశేషత కర్మలకు అతీతమైనదో అలా సాకార వతనము అనగా కర్మ. కర్మ శ్రేష్టమైనదైనట్లయితే శ్రేష్ట ప్రాలబ్ధము, కర్మ భ్రష్టమైనదైతే దుఃఖ ప్రాలబ్ధము ఉంటుంది, కానీ ఈ రెండింకీ ఆధారము కర్మనే. కర్మ ఆత్మను దర్శింపచేసే దర్పణము. కర్మరూపీ దర్పణము ద్వారా తమ శక్తి స్వరూపమును తెలుసుకోగలరు. ఒకవేళ కర్మ ద్వారా ఏ శక్తికి చెందిన ప్రత్యక్ష రూపమైనా కూడా కనిపించనట్లయితే నేను మాస్టర్ సర్వ శక్తివంతుడిని అని ఎవరు ఎంతగా చెప్పినా గానీ కర్మక్షేత్రములో ఉంటూ కర్మలలో కనిపించనట్లయితే ఒప్పుకుంటారా? ఎవరైనా చాలా తెలివైన యోధుడు ఉన్నాడనుకోండి, యుద్ధములో చాలా తెలివైనవాడు కానీ యుద్ధ మైదానములో శత్రువుల ముందు యుద్ధము చెయ్యలేకపోయినట్లయితే, ఓడిపోయినట్లయితే ఇతను చాలా తెలివైన యోధుడు అని ఎవరైనా ఒప్పుకుంటారా! అలాగే నేను శక్తి స్వరూపమును అని ఒకవేళ ఎవరైనా తమ బుద్ధిలో అనుకుంటున్నట్లయితే, పరిస్థితుల సమయములో, సంపర్కములోకి వచ్చే సమయములో, ఏ సమయములో ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కర్మలోకి తీసుకురానట్లయితే వీరు శక్తి స్వరూపము అని ఎవరైనా ఒప్పుకుంటారా! కేవలము బుద్ధి వరకు తెలుసుకోవటము అంటే ఇంట్లో కూర్చుని నేను తెలివైనవాడిని అని అనుకోవటములా ఉంటుంది. కానీ సమయము వచ్చినప్పుడు స్వరూపమును చూపించనట్లయితే, సమయము వచ్చినప్పుడు శక్తిని కార్యములో పెట్టనట్లయితే, సమయము గడిచిపోయిన తరువాత ఆలోచించినట్లయితే శక్తి స్వరూపము అని అనబడుతుందా? ఈ కర్మలలోనే శ్రేష్టత ఉండాలి. సమయమునకు తగినటువంటి శక్తిని కర్మ ద్వారా కార్యములో పోటీ. మేము మాస్టర్ సర్వ శక్తివంతులుగా ఎంతవరకు అయ్యాము అన్నదానిని మీకు మీరే మీ దినచర్యలోని కర్మలీలలద్వారా పరిశీలించుకోండి.

విశేషంగా ఏ శక్తి అవసరమైన సమయములో విజయులుగా చేస్తుంది మరియు విశేషంగా ఏ శక్తికి చెందిన బలహీనత పదే-పదే ఓటమిని తీసుకువస్తుంది? చాలామంది పిల్లలకు తమ బలహీన శక్తిని గురించి తెలుసు కూడా. ఎప్పుడైనా ఏదైనా ధారణాయుక్త సంఘటన ఉన్నా లేక తమ స్వ పురుషార్థుల వాయుమండలము ఉన్నా వర్ణిస్తారు కూడా, కానీ సాధారణ రీతిలో వర్ణిస్తారు. కానీ ఎక్కువమంది తమలోని బలహీనతను ఇతరుల ముందు దాచిపెట్టేందుకు ప్రయత్నము చేస్తారు. సమయము వచ్చినప్పుడు ఎవరైనా వినిపిస్తారుకూడా, అయినాకూడా ఆ బలహీనపు బీజాన్ని తక్కువగా గుర్తిస్తారు. పైపైన వర్ణిస్తారు. బాహ్యరూపపు విస్తారమును వర్ణిస్తారు కానీ బీజము వరకు వెళ్ళరు, కనుక ఏ రిజల్టు ఉంటుంది - ఆ బలహీనతకు చెందిన పైపైన కొమ్మలనైతే నరుకుతారు, కనుక కొద్ది సమయమైతే సమాప్తమైపోయాయన్న అనుభవము ఉంటుంది. కానీ బీజము ఉండిపోయిన కారణంగా కొంత సమయము తరువాత పరిస్థితులనే నీరు లభించటం ద్వారా మరల ఆ బలహీనపు శాఖ బయటపడుతుంది, పెరుగుతుంది. ఏవిధంగా, నేటి వాయుమండలములో, ప్రపంచములో అనారోగ్యము అంతమవ్వదు. ఎందుకంటే రోగానికి కల బీజాన్ని డాక్టర్ తెలుసుకోడు కనుక బీజము అణుగుతుంది కానీ అంతమవ్వదు. అలాగే ఇక్కడ కూడా బీజాన్ని తెలుసుకుని బీజాన్ని అంతము చెయ్యండి. చాలామందికి బీజాన్ని గురించి తెలుసు కూడా కానీ నిర్లక్ష్యము కారణంగా అయిపోతుందిలే, ఒక్కసారిగా పోతుందా ఏంటి, సమయమైతే పడ్తుంది కదా అని అంటారు. అతి తెలివైనవాళ్ళు ఇలా చేస్తుంటారు. ఏ సమయములో శక్తిసంపన్నులుగా కావలసి ఉంటుందో ఆ సమయములో నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. కానీ నాలెడ్జ్ యొక్క శక్తి ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ని శక్తి రూపములో ఉపయోగించరు, పాయింట్ రూపములో ఉపయోగిస్తారు కానీ జ్ఞానమునకు చెందిన ప్రతి పాయింట్ శస్త్రము వంటిది, శస్త్రరూపములో దానిని ఉపయోగించరు. కనుక బీజాన్ని తెలుసుకోండి, నిర్లక్ష్యములోకి వచ్చి తమ సంపన్నతలో మరియు సంపూర్ణతలో తక్కువ చేసుకోకండి. బీజమును తెలుసుకున్న తరువాత స్వయములో తెలుసుకునే శక్తిని అనుభవము చేస్తారు కానీ దానిని భస్మము చేసే శక్తి తమలో ఉందని భావించరు. కనుక అప్పుడు ఇతర జ్వాలా స్వరూప శ్రేష్ట ఆత్మల సహయోగమును తీసుకోవచ్చు. ఎందుకంటే బలహీన ఆత్మ అయిన కారణంగా డైరెక్ట్ బాబా ద్వారా కనెక్షన్ మరియు కరెక్షన్ లను చేసుకోలేకపోతారు, కనుక సెకండ్ నంబర్ శ్రేష్ట ఆత్మల సహయోగమును తీసుకొని స్వయమును వెరిఫై చేసుకోండి. వెరిఫై అవ్వటం ద్వారా సహజంగా ప్యూరిఫై అయిపోతుంది. మరి ఏం చెక్ చేసుకోవాలి మరియు ఎలా చెక్ చేసుకోవాలి అన్నది అర్థమైందా?

ఒకటేమో, దాచిపెట్టవద్దు. రెండవది, తెలుసుకున్న తరువాత వాయిదా వెయ్యవద్దు, నడిపించకండి. నడిపించినట్లయితే (బాధతో) అరుస్తారు కూడా. మరి ఈరోజు బాప్ దాదా శక్తిసేన యొక్క శక్తిని చూస్తున్నారు. ప్రాప్తించిన శక్తులను ఇప్పుడు కర్మలలోకి తీసుకురండి. ఎందుకంటే విశ్వములోని సర్వాత్మల ముందు కర్మలే మిమ్మల్ని గుర్తింపచేస్తాయి. కర్మల ద్వారా వారు సహజంగానే తెలుసుకుంటారు. కర్మ అన్నింటికంటే స్థూలమైన వస్తువు. సంకల్పములు సూక్ష్మ శక్తి. నేటి ఆత్మలు స్థూలంగా, పెద్ద రూపంలో ఉన్న దానిని త్వరగా తెలుసుకోగలరు. అలాగే సూక్ష్మ శక్తి స్థూలము కంటే చాలా శ్రేష్టమైనది, కానీ జనులకు సూక్ష్మ శక్తికి చెందిన వైబ్రేషన్లను క్యాచ్ చెయ్యటము ఇప్పుడు కష్టము. కర్మల శక్తి ద్వారా మీ సంకల్పశక్తిని కూడా తెలుసుకుంటూ ఉంటారు. మనసాసేవ కర్మణ కంటే కూడా శ్రేష్టమైనది. వృత్తి(ఆలోచనల) ద్వారా వృత్తులను, వాయుమండలమును పరివర్తన చెయ్యటము - ఈ సేవ కూడా చాలా శ్రేష్టమైనది. కానీ దీనికంటే సహజమైనది కర్మ. దాని నిర్వచనమైతే ముందు కూడా వినిపించి ఉన్నాము. కానీ కర్మల ద్వారా శక్తి స్వరూపపు దర్శనమును లేక సాక్షాత్కారమును చేయించండి అని ఈరోజు ఈ విషయమును స్పష్టము చేస్తున్నారు. కర్మల ద్వారా సంకల్పశక్తి వరకు చేరుకోవటము సహజమైపోతుంది. లేనట్లయితే బలహీనపు కర్మ, సూక్ష్మ శక్తి బుద్ధిని కూడా, సంకల్పములను కూడా కిందకు తీసుకువస్తాయి. భూమాకర్షణ శక్తి పైన ఉన్న వస్తువును కూడా కిందకు తీసుకువస్తుంది. కనుక చిత్రమును చరిత్రలోకి తీసుకురండి. అచ్ఛా!

ఇలా ప్రతి శక్తిని కర్మల ద్వారా ప్రత్యక్షముగా చూపించేవారు, తమ శక్తి స్వరూపము ద్వారా సర్వ శక్తివంతుడైన బాబాను ప్రత్యక్షము చేసేవారు, సదా పరిశీలించే శక్తి మరియు పరివర్తన శక్తి స్వరూపులు, చరిత్ర ద్వారా సదా విచిత్ర బాబాను సాక్షాత్కారము చేయించేవారు అయిన మాస్టర్ సర్వ శక్తివంతులు, శ్రేష్టకర్మ కర్తలు, శక్తి స్వరూప ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో:-

1. మాయకు ఆతిథ్యమిచ్చినందుకు రిజల్టు - దుఃఖము

స్వయమును సదా బాప్ దాదా సహచరులుగా భావిస్తున్నారా? సదా బాబా తోడు యొక్క అనుభవము ఉన్నట్లయితే దాని లక్షణము - సదా విజయులు. ఒకవేళ ఎక్కువ సమయము యుద్ధములో పోతున్నట్లయితే, కష్టము యొక్క అనుభవము ఉన్నట్లయితే బాబా తోడు లేదు అని దీని ద్వారా నిరూపణ అవుతుంది. ఎవరైతే సదా తోడు యొక్క అనుభవీలో వారు ప్రేమలో లవలీనులై ఉంటారు. ప్రేమ సాగరములో లీనమైన ఆత్మ ఎటువంటి ప్రభావములోకీ రాజాలదు. మాయ రావటమనేది ఏమంత పెద్ద విషయము కాదు. కానీ అది తన రూపమును చూపించకూడదు. ఒకవేళ మాయకు ఆతిథ్యమిచ్చినట్లయితే నడుస్తూ నడుస్తూ దుఃఖపు అనుభవము కలుగుతుంది. ముందుకు పోవటం లేదు, వెనుకనే ఉండిపోతున్నాము అన్న అనుభవము చేస్తారు. వెనక కూడా ఆగిపోలేరు, ముందుకుకూడా పోలేరు - ఇది మాయ ప్రభావము. మాయ ఆకర్షణ ఎగరనివ్వదు. వెనక ఉండిపోవటమన్న ప్రశ్నే లేదు కానీ ఒకవేళ ముందుకు పోనట్లయితే బీజమును పరిశీలించండి మరియు దానిని భస్మము చెయ్యండి. నడుస్తున్నాము, వస్తున్నాము, వింటున్నాము, యథాశక్తి సేవ చేస్తున్నాము అని ఇలా ఉండకూడదు. కానీ మీ స్పీడ్ మరియు స్టేజ్ ఎంతవరకు ఉన్నతి చెందాయి అన్నదానిని పరిశీలించుకోండి. అచ్ఛా -

2. ఎవరైతే ఒక్క వేటున బాబాపై బలి అవుతారో వారే మహా ప్రసాదముగా అవుతారు

పిల్లలందరూ జీవన్ముక్తి స్థితికి చెందిన విశేష వారసత్వమును అనుభవము చేస్తున్నారా? జీవన్ముక్తులా లేక జీవన్బంధనులా? ట్రస్ట్ అనగా జీవనముక్తము. మరి మరజీవులుగా అయ్యారా లేక మరణిస్తూ ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు మరణిస్తారు? భక్తిమార్గములో కూడా జడచిత్రాలకు ఏ ప్రసాదమును పెడతారు? ఒక్క వేటుకు ఏదైతే మరణిస్తుందో దానినే ప్రసాదంగా పెడతారు, కొట్టుకొని ఆర్తనాదాలతో మరణించినదానిని ప్రసాదముగా భావించరు. ఎవరైతే ఒక్క వేటుతో మరణిస్తారో వారే బాబా ముందు ప్రసాదంగా అవుతారు. ఒక్కసారిగా ఎక్కేవారు. ఆలోచించారు, సంకల్పం చేసారు, మేరా బాబా, నేను బాబావారిని అని అనుకున్నట్లయితే ఒక్క వేటున బాబాపై బలి అవ్వడము. సంకల్పము చేసారు అంటే అయిపోయినట్లు, కత్తి గుచ్చుకున్నట్లు. ఒకవేళ ఆలోచిస్తాములే, అవుతాములే, అయిపోతుందిలే..... మరి లే, లే అనటము అనగా ఆర్తనాదాలు చేయటము. లే, లే అని అనేవారు జీవన్ముక్తులు కారు. బాబా ఎలానో పిల్లలూ అలా. బాబా సాగరులు మరియు పిల్లలు బికారులు, ఇలా జరగజాలదు. నా వారు అయినట్లయితే ఇందులో ఆలోచించే అవసరము లేదు అని బాబా ఆఫర్ ఇచ్చారు. అచ్ఛా-