06.04.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సేవకుల మరియు అధికారీ ఆత్మల లక్షణాలు

ఈరోజు బాప్ దాదా రాజఋషుల దర్బారును చూస్తున్నారు. రాజు అనగా అధికారి మరియు ఋషి అనగా సర్వ త్యాగి. త్యాగి మరియు తపస్వీ. అధికారి ఆత్మ మరియు తోడుతోడుగా మహా త్యాగీ ఆత్మ - రెండింని జీవితంలో ప్రత్యక్ష స్వరూపముగా ఎంతవరకు తీసుకువచ్చారు అని బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలందరిని చూస్తున్నారు. అధికారి మరియు త్యాగి, ఈ రెండింలో బ్యాలెన్స్ ఉండాలి. అధికారిగా కూడా పూర్తిగా ఉండాలి మరియు త్యాగిగా కూడా పూర్తిగా ఉండాలి. రెండూ కలిసి ఉండగలవా? దీనిని తెలుసుకున్నారా? అనుభవీలేనా? త్యాగము లేకుండా రాజ్యము పొందగలరా? స్వయముపై అధికారమును అనగా స్వరాజ్యమును పొందగలరా? త్యాగము చేసారు కనుకనే స్వరాజ్య అధికారులుగా అయ్యారు. ఇదైతే అనుభవమే కదా! త్యాగమునకు కల నిర్వచనమును ముందు కూడా వినిపించాము.

త్యాగములోని మొదటి అడుగు దేహభానము యొక్క త్యాగము. దేహభావమును త్యాగము చేసిన తరువాత రెండవది దేహమునకు చెందిన సర్వ సంబంధాల త్యాగము. దేహత్యాగము తొలగిపోయినప్పుడు ఎలా అవుతారు? ఆత్మ, దేహీ లేక యజమాని. దేహ బంధనము నుండి ముక్తము అనగా జీవనముక్త రాజ్య అధికారి. రాజ్య అధికారిగా అయిపోయినట్లయితే అన్నిరకాల అధీనత సమాప్తమైపోతుంది ఎందుకంటే దేహ దాసుల నుండి దేహ యజమానులుగా అయ్యారు. దాసీతనము తొలగిపోయింది. దాసీతనము మరియు అధికారీతనము, రెండూ తోడుతోడుగా ఉండజాలవు. సేవకుల లక్షణము - మనసు ద్వారా, ముఖము ద్వారా ఉదాసీనులుగా ఉండటము. ఉదాసులుగా ఉన్నదానికి గుర్తు దాసీతనము మరియు అధికారి అనగా స్వరాజ్యధారి లక్షణము - మనసు మరియు తనువు ద్వారా సదా హర్షితము. దాసులు ఎప్పుడూ అప్స్ సెట్ గా ఉంటారు. రాజ్య అధికారులు ఎప్పుడూ సింహాసనముపై సెట్ అయి ఉంటారు, దాసులు చిన్న విషయానికే క్షణములో తికమకపడిపోతారు మరియు అధికారులు సదా స్వయమును కంఫర్ట్ గా(విశ్రాంతిగా) అనుభవము చేస్తారు. ఈ లక్షణాల ద్వారా మిమ్మల్ని మీరు చూసుకోండి - నేను ఎవరిని? సేవకుడినా లేక అధికారినా? ఎటువంటిపరిస్థితి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా, ఎటువంటి వైభవము, వాయుమండలమైనా స్వమానము నుండి దూరంగా అనగా జ్ఞానము నుండి దూరంగా తీసుకుపోయి పరేషాన్ చేయటం (వ్యాకుల పరచటం) లేదు కదా! కనుక సేవకుడు అనగా పరేషాన్ మరియు అధికారి అనగా సదా మాస్టర్ సర్వ శక్తివంతుడు, విఘ్న వినాశక స్థితి యొక్క స్వమానములో స్థిరముగా ఉంటాడు. పరిస్థితులను లేక వ్యక్తి, వైభవాలను షాన్(స్వమానము)లో ఉంటూ ఆనందముతో చూస్తూ ఉంటాడు. సేవక ఆత్మ సదా స్వయమును పరీక్షల మధ్య అనుభవం చేసుకుటాండు. అధికారీ ఆత్మ నావికునిగా అయ్యి చాలా ఆనందముతో పరీక్షలనే అలలతో ఆడుకుంటూ-ఆడుకుంటూ నావను తీరానికి చేరుస్తాడు.

సేవక ఆత్మల కర్మలీలను చూసి బాప్ దాదాకు దయ కలగటంతోపాటు నవ్వు కూడా వస్తుంది. సాకారములో కూడా ఒక వినోదభరితమైన కథను వినిపించేవారు. సేవక ఆత్మలు ఏం చేస్తారు, కథ గుర్తుందా? ఇలా వినిపించేవారు ఎలుక వస్తుంది, ఎలుకను పోగొట్తే పిల్లి వస్తుంది, పిల్లిని తరిమేస్తే కుక్క వస్తుంది. ఒకదాన్ని పోగొట్తే మరొకి వస్తుంది, రెండోదాన్ని తొలగిస్తే మూడోది వస్తుంది. ఈ కర్మలీలలోనే బిజీగా ఉంటారు ఎందుకంటే సేవక ఆత్మలు కదా. కనుక ఒక్కోసారి కండ్లనే ఎలుక మోసగిస్తుంది, ఒక్కోసారి చెవులనే పిల్లి మోసగిస్తుంది. ఒక్కోసారి చెడు సంస్కారాలనే పులి యుద్ధము చేస్తుంది, పాపం! సేవక ఆత్మ, వాటిని తరిమేస్తూ-తరిమేస్తూ ఉదాసిగా మిగిలిపోతుంది కనుక బాప్ దాదాకు దయ కూడా వస్తుంది మరియు నవ్వు కూడా వస్తుంది. అసలు సింహాసనమును వదలటమెందుకు? ఆటోమేటిక్ గానే ఎందుకు జారిపోతారు? స్మృతి అనే అయస్కాంతము ద్వారా మిమ్మల్ని మీరు సెట్ చేసుకున్నట్లయితే జారిపోరు. ఇంకా ఏం చేస్తారు? బాప్దా దాదా ముందు అర్జీల పెద్ద ఫైల్ ను పెడతారు. ఒక నెలనుంచి వ్యాకులముగా ఉన్నాను అని ఒకరు అర్జీ పెడ్తే, ఇంకొకరు 3 నెలలనుండి కింద మీద అవుతున్నాను అని అంటారు, మరొకరు 6 నెలలనుండి ఆలోచిస్తున్నాను కానీ అలాగే ఉంది అని అంటారు. ఇన్ని అర్జీలు కలిసి ఫైల్ అయిపోతుంది కానీ దీనిని కూడా ఆలోచించండి, ఎంత పెద్ద ఫైలో అంత ఫైన్ ఇవ్వవలసి ఉంటుంది కనుక అర్జీలను సమాప్తము చేసేందుకు సహజ సాధనము - సదా బాబా మర్జీ(కోరిక) అనుసారంగా నడవండి. ''నా ఇష్టము ఇది'' అని అన్నట్లయితే ఆ మన్మర్జీ(మనస్సుకు నచ్చినట్లు చేయటము) అర్జీల ఫైల్ను తయారుచేస్తుంది. బాబా కోరిక ఏదో అదే నా కోరిక. బాబా కోరిక ఏంటి? ఆత్మలు ప్రతి ఒక్కరూ సదా శుభచింతన చేసేవారుగా, సర్వుల పట్ల సదా శుభచింతనలో ఉండే స్వ కళ్యాణీలుగా మరియు విశ్వ కళ్యాణీలుగా అవ్వాలి. ఈ కోరికను సదా స్మృతిలో ఉంచుకుంటూ కష్టపడకుండా నడుస్తూపోండి. కండ్లు మూసుకుని నడువు అని అంటారు కదా. అలా కాదు, ఇలా అవ్వదు అన్న ఈ కండ్లను తెరవద్దు. వ్యర్థ చింతనమనే ఈ కండ్లను మూసేసి బాబా కోరిక ప్రకారంగా అనగా బాబా అడుగు వెనుక అడుగు వేస్తూ నడవండి. అడుగులో అడుగు పెట్టి నడవటము కష్టమనిపిస్తుందా లేక సహజమమిపిస్తుందా? మరి అలా ఫాలో ఫాదర్ చెయ్యండి. ఫాలో సిస్టర్, ఫాలో బ్రదర్ అనే ఈ క్రొత్త అడుగులు వెయ్యకండి, ఇలా చేసినట్లయితే గమ్యమునుండి వంచితులైపోతారు. గౌరవము ఇవ్వండి కానీ ఫాలో చెయ్యకండి. విశేషతలు మరియు గుణాలను స్వీకరించండి కానీ అడుగుజాడలు బాబా అడుగుజాడలపై ఉండాలి. సమయాన్ని మీ అనుకూలముగా విషయాలను మార్చకండి. అనుకూలముగా మార్చుకునే విషయాలు కూడా చాలా మనోరంజనాన్ని కలిగిస్తాయి. ఆ డైలాగులను మరల వినిపిస్తాము, ఎందుకంటే బాప్ దాదా వద్దకైతే అన్ని సేవా స్టేషన్లనుండి వార్తలు వస్తుంటాయి. మొత్తం ప్రపంచ వార్తలన్నీ వస్తాయి. కనుక సేవక ఆత్మగా అవ్వవద్దు. ఈ కర్మేంద్రియాలు చాలా చిన్నవి. కండ్లు, చెవులు ఎంత చిన్నవి! కానీ ఇవి చాలా పెద్ద వలను పరుస్తాయి. చిన్న సాలెపురుగును చూసారు కదా! అది ఎంత చిన్నది, కానీ ఎంత పెద్ద వల ఉంటుంది. ప్రతి కర్మేంద్రియము యొక్క వల కూడా చాలా పెద్దది, అది ఎంతగా ఇరికించేస్తుందంటే నేను ఇరుక్కుపోయాను అన్నది కూడా తెలియదు. ఇది ఎంత ఇంద్రజాలమైన వల అంటే అది ఈశ్వరీయ హోష్(స్పృహ)నుండి, ఈశ్వరీయ మర్యాదల నుండి బేహోష్ గా(స్పృహ లేకుండా) చేస్తుంది. ఈ వల నుండి బయటకు వచ్చిన ఆత్మలకు, ఆ సేవక ఆత్మలకు ఎంతగా తెలియజెప్పినా, అనుభవము చేయించినాగానీ స్పృహలో లేనివారికి ఏం అనుభవమౌతుంది? స్ధూల రూపంలో కూడా స్పృహలో లేనివారిని ఎంత కదిలించినా, ఎంత అర్థం చేయించినా, పెద్ద పెద్ద మైకులను చెవి దగ్గర పెట్టినాగానీ వారు వింటారా? మరి ఈ వల కూడా అలా స్పృహ లేనివారిగా చేసేస్తుంది కనుక ఏం మజా ఉంటుంది? స్పృహ లేనివారు ఏదోదే వారిలో వారు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ మాటలు అర్థం లేనివిగా ఉంటాయి, అలా ఆత్మికంగా స్పృహ లేని స్థితిలో ఉన్నవారు తమ స్పష్టీకరణను కూడా చాలానే ఇస్తారు కానీ అది అర్థం లేనిదిగా ఉంటుంది. రెండు నెలల క్రితంది, 6 నెలల నాటి పాత విషయాలు, ఇక్కడి విషయాలు, అక్కడి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఆత్మికంగా స్పృహ లేనివారు ఇలా ఉంటారు. విషయాలైతే చిన్నవిగానే ఉంటాయి కానీ స్పృహ లేనితనము అనే వల చాలా పెద్దది. ఈ వల నుండి బయటపడేందుకు చాలా సమయము పడ్తుంది ఎందుకంటే వలలోని ఒక్కొక్క దారాన్ని కత్తిరించే ప్రయత్నము చేస్తారు. వలను ఎప్పుడైనా చూసారా? మీ ప్రదర్శని చిత్రాలలో కూడా ఉంది. వలను అంతము చెయ్యండి. సాలెపురుగు కూడా తన వలను తానే పూర్తిగా తినేస్తుంది. ఇలా విస్తారములోకి వెళ్ళకుండా, విస్తారమునకు బిందువు పై బిందువును తమలో నింపుకోండి. బిందువుగా అవ్వండి. బిందువు పెట్టండి. బిందువులో కలిసిపోయినట్లయితే మొత్తము విస్తారము, మొత్తము వల క్షణములో సమసిపోతుంది మరియు సమయము మిగులుతుంది. కష్టపడటము ఉండదు. బిందువుగా అయ్యి బిందువులో పారవశ్యము చెందుతారు, మరి ఆలోచించండి - వల మూలంగా స్పృహ లేని స్థితి మంచిదా లేక బిందువుగా అయ్యి బిందువులో తన్మయులైౖపోవటము మంచిదా! మరి బాబా కోరిక ఏది? తన్మయులవ్వండి.

వృక్షము ఇప్పుడు పరివర్తన అయ్యేదే ఉంది. వృక్షము అంతిమములో ఏం మిగిలిపోతుంది? ఆది కూడా బీజము, అంతిమము కూడా బీజమే మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ పాత వృక్షము యొక్క పరివర్తన సమయములో వృక్షముపై మాస్టర్ బీజరూప స్థితిలో స్థితులైపోండి. 'బిందువు' ఇదే బీజము. అందరిలోని మొత్తము జ్ఞానము, గుణాలు, శక్తులు సింధువులో లేక బిందువులో కలిసిపోతాయి, దీనినే బాబా సమాన స్థితి అని అంటారు. బాబా సింధువుగా ఉన్నా కూడా బిందువు. ఇటువంటిమాస్టర్ బీజరూప స్థితి ఎంత ప్రియమైనది! ఇటువంటి స్థితిలో సదా స్థితులై ఉండండి. ఏం చెయ్యాలో అర్థమైందా?

చూడండి, రెండు జోన్ల విశేషత కూడా ఇదే. కర్నాటక అనగా నాటకము పూర్తి చేసారు, ఇప్పుడు పదండి, లవలీనులైపోండి. యు.పి.లో కూడా నదులు చాలా ఉన్నాయి. మరి నదులు ఎప్పుడూ సాగరములో కలిసిపోతాయి. మరి మీరు సాగరములో కలిసిపోండి అనగా లవలీనులైపోండి. ఇరువురి విశేషత ఉంది కదా! కనుక ఠీవిగా, సగర్వంగా లవలీన స్థితిలో సదా కూర్చుని ఉండండి. కింద, మీద అవ్వకండి. ఆవాగమన చక్రమునైతే ఇప్పుడు పూర్తి చేసారు కదా! ఇప్పుడైతే చాలా విశ్రాంతిగా, నషాతో కూర్చోండి. అచ్ఛా!

సర్వ అధికారులు మరియు సర్వ త్యాగులు, స్పృహ లేనితనము అనే వల నుండి సదా ముక్తులు, ఆవాగమనము నుండి ముక్తులు, మాస్టర్ బీజరూప స్థితిలో లవలీనులై ఉండేవారు అయిన ఇటువంటి రాజఋషి ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

టీచర్లతో--అందరూ నిమిత్త ఆత్మలే కదా? సదా స్వయమును సేవార్థము నిమిత్తమైయున్న ఆత్మను - ఇలా భావించి నడుచుకుంటారా? నిమిత్త ఆత్మగా భావించటంద్వారా ఎప్పుడూ రెండు విశేషతలు సాకార రూపములో కనిపిస్తాయి. 1. నమ్రత ద్వారా సదా నిర్మాణము చేస్తూ ఉంటారు. 2. సదా సంతుష్టతా ఫలాన్ని తింటూ మరియు తినిపిస్తూ ఉంటారు. కనుక నేను నిమిత్తమును - అన్న దాని ద్వారా అతీతంగా మరియు బాబాకు ప్రియమైనవారిగా అనుభవము చేస్తారు. నేను చేసాను, అన్న దానిని కూడా ఎప్పుడూ వర్ణించరు. నేను అన్న మాట సమాప్తమైపోతుంది. ''నేను'' అన్నదానికి బదులు ''బాబా, బాబా''. బాబా, బాబా అని అనటం ద్వారా అందరి బుద్ధి బాబా వైపుకు పోతుంది. ఎవరైతే నిమిత్తంగా చేసారో వారివైపుకు బుద్ధి పోవటం ద్వారా రాబోయే ఆత్మలకు విశేష శక్తి యొక్క అనుభవము కలుగుతుంది ఎందుకంటే సర్వ శక్తివంతునితో యోగము కుదురుతుంది. శక్తి స్వరూపమును అనుభవము చేస్తారు. లేకపోతే బలహీనులుగానే ఉండిపోతారు. కనుక నిమిత్తులుగా భావించి నడవడటము - ఇదే సేవాధారి విశేషత. చూడండి - అందరికంటే అతి పెద్ద సేవాధారి బాబా, వారి విశేషత - స్వయమును నిమిత్తముగా భావించటము. యజమాని అయినా కూడా నిమిత్తముగా భావించరు. నిమిత్తమనుకున్న కారణంగా అందరికీ ప్రియమైనవారిగా అయిపోయారు. కనుక నిమిత్తమును, అతీతమును, ప్రియమైనవానిని - వీటినే సదా స్మృతిలో ఉంచుకుని నడవండి. సేవనైతే అందరూ చేస్తున్నారు, ఈ లాటరీ లభించింది కానీ లభించిన ఈ లాఠరీని ఇంకా ఎక్కువ చేసుకోవటము లేక అక్కడనే ఉండిపోవటము అన్నది మీ చేతులలో ఉంది. బాబా అయితే ఇచ్చేసారు, పెంచుకోవటము మీ పని. అందరికీ ఒకేవిధంగా భాగ్యాన్ని పంచారు కానీ కొందరు దానిని సంభాళించుకుని పెంచుకుంటారు, కొందరు పెంచుకోరు. దీనివల్లనే నంబర్ తయారైంది. కనుక సదా స్వయమును ఉన్నతి చేసుకుంటూ, ఇతరులను కూడా ముందుకు తీసుకుపోతూ ఉండండి. ఇతరులను ముందుకు తీసుకుపోవటమే ఉన్నతి చెందటము. బాబాను చూడండి, బాబా మమ్మాను ముందు ఉంచారు, అయినా నంబర్ వన్ నారాయణునిగా అయ్యారు. మమ్మా సెకండ్ నంబర్ లో లక్ష్మిగా అయింది. ముందుకు తీసుకుపోవటం ద్వారా ఉన్నతి చెందారు. ముందుకు తీసుకుపోవటము అనగా వెనక ఉండిపోవటము అని కాదు, ముందుకు తీసుకుపోవటము అనగా ఉన్నతి చెందటము.

సేవాధారులందరూ చాలా బాగా శ్రమిస్తున్నారు. వారి శ్రమను చూసి బాప్ దాదా సంతోషిస్తారు కానీ నిమిత్తముగా భావించి సేవ చేసినట్లయితే సేవ ఒకటికి నాలుగురెట్లుగా అయిపోతుంది. బాబా సమానంగా సీట్ లభించింది, ఇప్పుడు ఈ సీట్ పై సెట్ అయ్యి సేవను పెంచండి. అచ్ఛా!

పార్టీలతో -

1. విశేష ఆత్మగా అయ్యేందుకు సర్వుల విశేషతలను చూడండి.

బాప్ దాదా ఎల్లప్పుడూ పిల్లల విశేషతల గుణగానాన్ని చేస్తారు. బాబా ఏవిధంగా పిల్లలందరిలోని విశేషతలను చూస్తారో అలా విశేష ఆత్మలైన మీరందరుకూడా సర్వులలోని విశేషతలను చూస్తూ స్వయమును విశేష ఆత్మగా చేసుకుంటూ నడవండి. విశేష ఆత్మల కార్యము - విశేషతను చూడటము మరియు విశేషంగా అవ్వటము. ఎప్పుడు ఏ ఆత్మ సంపర్కములోకి వచ్చినా వారి విశేషతలపైకే దృష్టి పోవాలి. తేనెటీగల దృష్టి ఎప్పుడూ ఏవిధంగా పూలపైనే ఉంటుందో అలా మీ దృష్టి సర్వుల విశేషతల పైనే ఉండాలి. ప్రతి బ్రాహ్మణ ఆత్మను చూస్తూ సదా ఈ గుణాన్నే గానము చేస్తూ ఉండండి - ''వాహ్, శ్రేష్ట ఆత్మా, వాహ్''! ఒకవేళ ఇతరుల బలహీనతను చూసినట్లయితే స్వయము కూడా బలహీనులుగా అయిపోతారు. కనుక మీ దృష్టి ఇతరులలోని బలహీనతలనే రాళ్ళ వైపుకు పోకూడదు. హోలీహంసలైన మీరు గుణాలనే ముత్యాలనే గ్రోలుతూ ఉండండి.

2. సమయము మరియు స్వయములోని మహత్వమును స్మృతిలో ఉంచుకున్నట్లయితే మహానులుగా అయిపోతారు..

సంగమయుగములో ఒక్కొక్క క్షణము మొత్తము కల్పము యొక్క ప్రాలబ్ధమును తయారుచేసుకునేందుకు ఆధారము, ఇలా సమయ మహత్వమును తెలుసుకుంటూ ప్రతి అడుగును వేస్తున్నారా? సమయము ఎలా మహత్వపూర్ణమైనదో అలా మీరు కూడా మహానులు ఎందుకంటే బాప్ దాదా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికీ మహానాత్మలుగా అయ్యే వారసత్వము లభించింది. కనుక స్వయములోని మహత్వమును తెలుసుకుని ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మను గొప్పగా తయారుచేసుకోండి. మేము మహాన్ బాబా యొక్క పిల్లలము, మహానులము అన్న ఈ స్మృతిలోనే ఉండండి. ఇలా అనుకోవటం ద్వారానే ఎంత శ్రేష్ట భాగ్యమును తయారుచేసుకోవాలనుకుంటారో అంత తయారుచేసుకోగలరు. సంగమయుగమునకు కల వరదానము ఇదే. బాబా ద్వారా లభించిన ఖజానాలతో ఎల్లప్పుడు ఆడుకుంటూ ఉండండి. తరగనటువంటి ఎన్ని ఖజానాలు లభించాయి! లెక్కపెట్టగలరా! కనుక సదా జ్ఞానరత్నాలతో, సంతోషపు ఖజానాలతో, శక్తుల ఖజానాలతో ఆడుకుంటూ ఉండండి. నోటినుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి, మనసులో జ్ఞాన మననము నడుస్తూ ఉండాలి. ఇటువంటి ధారణా స్వరూపులుగా ఉండండి. గొప్ప సమయము, గొప్ప ఆత్మను - దీనినే ఎల్లప్పుడు గుర్తుంచుకోండి. అచ్ఛా! ఓం శాంతి.