20.01.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'' మహాదానులుగా అవ్వండి, వరదానులుగా అవ్వండి ''

ఈ రోజు బాప్దాదా పిల్లలందరి పవిత్రతా పర్సనాలిటీని(పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని), సర్వ ప్రాప్తి స్వరూపము యొక్క రాయల్టీని(ఠీవిని), ఆత్మిక స్మృతి స్వరూపము యొక్క రియాల్టీని (సత్యతను) చూస్తున్నారు. పిల్లలందరినీ పవిత్రతా పర్సనాలిటీతో ప్రకాశిస్తున్న(మెరుస్తున్న) ప్రకాశ కిరీటధారులుగా చూస్తున్నారు. ఒకవైపు సర్వ ప్రాప్తి స్వరూపులైన పిల్లల సంఘటనను చూస్తున్నారు. రెండవ వైపు విశ్వములోని అప్రాప్తి ఆత్మలు, సదా అల్పకాలిక ప్రాప్తులు కలుగుతున్నా ప్రాప్తి స్వరూపులుగా లేరు, సంతుష్టంగా లేరు. వారికి సదా ఏదో ఒకటి పొందాలనే కోరిక ఉంటూనే ఉంటుంది. సదా ఇది కావాలి, అది కావాలి అన్న ధునిలోనే(చింతలోనే) ఉంటారు. ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. దాహార్తులై ఇక్కడ - అక్కడ తనువు ద్వారా, మనసు ద్వారా, ధనము ద్వారా, జనుల ద్వారా ఏదో ఒకటి ప్రాప్తి అవ్వాలనే కోరికతో భ్రమిస్తున్నారు. విశేషంగా మూడు విషయాల వైపు కోరిక ఉంచి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటేమో తనువు యొక్క శక్తి కావాలి, ధనము యొక్క, పదవి యొక్క మరియు బుద్ధి యొక్క శక్తి కావాలి. ఇంకొకటి భక్తి కావాలి. రెండు క్షణాలు సత్యమైన హృదయంతో భక్తి చేయగలగాలని, ఇటువంటి భక్తి చేయాలనే కోరికను కూడా భక్త ఆత్మలు కలిగి ఉంటారు. మూడవది - అనేక ఆత్మలు ద్వాపర యుగము నుండి దు:ఖము మరియు పిలుపుల ప్రపంచాన్ని చూసి చూసి దు:ఖము మరియు అశాంతి కారణంగా అల్పకాలిక ప్రాప్తులను మృగతృష్ణగా (ఎప్పటికీ తీరని దాహముగా) భావిస్తూ ఈ దు:ఖ ప్రపంచము నుండి, ఈ వికారీ దు:ఖ బంధనాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు. భక్తులు భక్తిని కోరుకుంటారు, కొందరు శక్తిని కోరుకుంటారు, కొందరు ముక్తిని కోరుకుంటారు. ఇటువంటి అసంతుష్ట ఆత్మలకు సుఖ-శాంతులు మరియు పవిత్రతను గురించిన జ్ఞానమునిచ్చే లేక ప్రాప్తిని కలిగించే సంతుష్టమణులు ఎవరు? మీరే కదా?ఎలాగైతే దయాహృదయుడైన తండ్రికి దాత పిల్లలు ఇలా అల్పకాలిక ప్రాప్తి కొరకు కావాలి, కావాలి, కావాలి అనే నినాదాలు చేస్తూ ఉండడం చూసి దయ కలుగుతుందో, అలా మాస్టర్ దాతలు, ప్రాప్తి స్వరూపులైన పిల్లలైన మీకు విశ్వ ఆత్మల పట్ల దయ కలుగుతోందా? మా సోదరులు అల్పకాలికమైన కోరికలతో ఎంతగానో భ్రమిస్తున్నారు, వారి పై దయ చూపించాలి అని ఉత్సాహం కలుగుతోందా? దాత పిల్లలైన మీరు మీ సోదరుల పై దయా దృష్టిని ఉంచండి, మహాదానులుగా అవ్వండి, వరదానులుగా అవ్వండి. ప్రకాశిస్తున్న సంతుష్టమణులుగా అయ్యి సర్వులకు సంతోషమునివ్వండి. ఈ రోజుల్లో సంతోషిమాతను ఎక్కువగా పిలుస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో, అక్కడ అప్రాప్తి ఉండదు. సంతుష్టత ఆధారం పై స్థూల ధనములో కూడా సంపన్నతను(వృద్ధిని) అనుభవం చేస్తారు. సంతుష్టంగా ఉన్న వారి ధనము రెండు రూపాయలు కూడా రెండు లక్షలతో సమానము. కోటీశ్వరులుగా ఉన్నా సంతుష్టత లేకుంటే కోట్లు కోట్లు కావు. కోరికల భికారి. కోరికలు అనగా వ్యాకులత. కోరికలు ఎప్పుడూ మంచిగా అవ్వనివ్వవు. ఎందుకంటే వినాశి కోరికలు పూర్తి అవ్వడంతో పాటు ఇంకా అనేక కోరికలకు జన్మనిస్తాయి. అందువలన కోరికల చక్రములో సాలెపురుగు గూడులో చిక్కుకున్నట్లుగా చిక్కుకుపోతారు. విముక్తులవ్వాలనుకున్నా అవ్వలేరు. కావున అటువంటి వలలో చిక్కుకున్న మీ సోదరులను వినాశీ కోరికల నుండి ఇచ్ఛా మాత్రం అవిద్యగా(కోరికలంటే ఏమిటో తెలియని వారిగా) తయారు చేయండి. వ్యాకులత(పరేశాన్) అనగా స్వమానానికి(శాన్కు, గౌరవానికి) దూరమవ్వడం. మనమంతా ఈశ్వరుని పిల్లలము, దాత పిల్లలము. సర్వ ప్రాప్తులు మన జన్మ సిద్ధ అధికారము. ఈ స్వమానం(శాన్) నుండి దూరమైపోయిన కారణంగా వ్యాకులతలో(పరేశాన్లో) ఉన్నారు. అలాంటి ఆత్మలకు తమ శ్రేష్ఠ స్వమానం గురించి తెలియజేయండి. ఏమి చేయాలో అర్థమయిందా?

డబల్ విదేశీ పిల్లలందరూ తమ తమ స్థానాలకు వెళ్తున్నారు కదా! వెళ్లి ఏం చేస్తారు? మహాదానులు, వరదానులుగా అయ్యి సుఖ-శాంతుల ప్రాప్తుల ద్వారా సర్వ ఆత్మల జోలెను నింపెయ్యాలన్న సంకల్పమునే తీసుకెళ్తున్నారు కదా! బాప్దాదా పిల్లల ధైర్యాన్ని, స్నేహాన్ని చూసి ప్రతిఫలంగా పదమాల రెట్ల స్నేహమునిస్తారు. దూరదేశంలోని వారు గుర్తించి ప్రాప్తి ద్వారా సమీపంగా అయిపోయారు. దేశంలోని వారు పరిచయము మరియు ప్రాప్తి నుండి దూరంగా ఉండిపోయారు. కావున సదా డబల్ విదేశీ పిల్లలు ప్రాప్తి స్వరూపం యొక్క దృఢత్వములో మరియు సంతుష్టత యొక్క ఉల్లాసంలో ముందుకు వెళ్తూ ఉండండి. భాగ్యవిధాత, సర్వ ప్రాప్తుల దాత సదా మీ తోడుగా ఉన్నారు. మంచిది.

ఇటువంటి దయాహృదయులైన తండ్రి యొక్క దయాహృదయులైన పిల్లలకు, సర్వులను సంతుష్టతా ఖజానా ద్వారా సంపన్నంగా చేసే సంతుష్టమణులైన పిల్లలకు, సదా సర్వ ప్రాప్తి స్వరూపులుగా అయ్యి సర్వులకు ప్రాప్తి చేయించే శుభ భావనలో ఉండే శుభ చింతకులైన పిల్లలకు, సర్వులను వినాశీ కోరికల నుండి ఇచ్ఛా మాత్రం అవిద్యగా తయారు చేసేవారికి, సర్వ సమర్థులైన పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ పిల్లలను చూస్తూ బాప్దాదా చెప్పారు –

ఈ గ్రూపులో ఎవరితోనైనా ఇక్కడేకూర్చుండిపోండి అని అన్నట్లయితే ఎవర్రెడీగా ఉన్నారా? ఎవ్వరికీ వెనుక ఏ బంధనమైతే లేదు కదా? అలా కూడా జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు అందరి టికెట్లు రద్దు చేయించి ఇక్కడే కూర్చోబెట్టడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఎలాంటి రక్షణ కూడా తీసుకోరు. బ్రహ్మాబాబా అవ్యక్తమైనప్పుడు ఆ నాలుగు రోజులు ఎలా గడిపారో అందరికీ గుర్తుందా? ఇల్లు పెద్దదిగా ఉందా? వంట వండారా? మరి ఆ నాలుగు రోజులు ఎలా గడిచాయి? వినాశనం జరిగే రోజులు కూడా అలాగే గతించిపోతాయి. ఆ సమయంలో లవలీనంగా ఉన్నారు కదా! అలాంటి లవలీన స్థితిలో సమాప్తి జరుగుతుంది. అప్పుడు ఇక్కడి పర్వతాల పైన ఉండి తపస్సు చేస్తారు. మూడవ నేత్రంతో మొత్తం వినాశనమంతా చూస్తారు. అలా నిశ్చింతులుగా ఉన్నారు కదా! ఇంటి గురించి, పరివారం గురించి, పని గురించి ఏ చింతా లేదు. సదా నిశ్చింత. ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నే లేదు. ఏమి జరిగినా మంచే జరుగుతుంది. దీనినే నిశ్చింత అని అంటారు. సెంటరు ఉండే ఇల్లు గుర్తుకు రావడం, బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తుకు రావడం............ ఏదీ గుర్తు రాకూడదు. ఎందుకంటే మీది సత్యమైన ధనము కదా! ఇళ్లను నిర్మించేందుకు ఉపయోగించినా, బ్యాంకులో ఉన్నా మీదైతే పదమాల రెట్లుగా అయ్యి మీకు లభిస్తుంది. మిమ్ములను మీరు ఇన్ష్యూర్(భీమా) చేసుకున్నారు కదా! మట్టి - మట్టిగా అయిపోతుంది మరియు మీ హక్కు మీకు పదమాల రెట్లుగా అయ్యి లభిస్తుంది. ఇంకేం కావాలి! సత్యమైన ధనము ఎప్పుడూ వ్యర్థమవ్వజాలదు. అర్థమయ్యిందా! ఇలా సదా నిశ్చింతులుగా ఉండండి. సెంటరు ఏమవుతుందో తెలియదు, ఇంటికి ఏమవుతుందో తెలియదు అన్న ప్రశ్నే వద్దు. సఫలమయ్యే ఉంది. సఫలమవుతుందా, అవ్వదా! అన్న ప్రశ్నే లేదు. మొదటే విల్లు చేశారు కదా! ఎవరైనా విల్లు చేసి వెళ్లిపోతే, వారు ముందు నుండే నిశ్చింతగా ఉంటారు కదా! కావున మీరందరూ మీ ప్రతి శ్వాసను, సంకల్పాన్ని, సమయాన్ని, సంపదను, శరీరమును అన్నింటినీ విల్లు చేసేశారు కదా! విల్లు చేయబడిన వస్తువును ఎప్పుడూ స్వయం కోసం ఉపయోగించజాలరు.

శ్రీమతము లేకుండా ఒక్క సెకండు లేక ఒక్క పైసను కూడా ఉపయోగించజాలరు. అంతా పరమాత్మదే అయిపోయాక ఆత్మలు తమ పట్ల లేక ఆత్మల పట్ల ఉపయోగించజాలరు. డైరెక్షన్ అనుసారంగా ఉపయోగించగలరు. లేకుంటే తాకట్టులో నమ్మకద్రోహం చేసినట్లు అయిపోతుంది కదా. ధనాన్ని కొద్దిగానైనా డైరెక్షన్ లేకుండా ఎక్కడ ఉపయోగించినా ఆ ధనము మిమ్ములను కూడా అటువైపుకు లాగుతుంది. ధనము మనసును లాగుతుంది. మనసు తనువును లాగుతుంది, వ్యాకులపరుస్తుంది. కావున మీరు విల్లు చేసేశారు కదా! డైరెక్షన్ అనుసారం చేసినట్లైతే ఏ పాపము ఉండదు, ఏ భారము ఉండదు. అందుకు మీరు స్వతంత్రులు. డైరెక్షన్ అయితే అర్థం చేసుకున్నారు కదా! అన్ని డైరెక్షన్లు లభించాయి. స్పష్టంగా ఉన్నాయి కదా! ఎప్పుడూ తికమకపడరు కదా! ఈ కార్యంలో ఇది చేయవచ్చా, చేయరాదా అని తికమకపడడం లేదు కదా? ఎక్కడ కొద్దిగా తికమకపడినా ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో వారితో వెరిఫై(పరిశీలన) చేయించుకోండి లేక స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే అమృతవేళలో లభించే టచింగ్ సదా యదార్థంగా ఉంటుంది. అమృతవేళలో మీ మనోభావాలను మిక్స్ చేసి కూర్చోకండి. స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అయ్యి కూర్చోండి. టచింగ్ యదార్థంగా ఉంటుంది.

చాలామంది పిల్లలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ మనోభావాన్ని నింపుకొని కూర్చుంటారు. చేయాలంటే ఇదే చేయాలి, జరగాలంటే ఇదే జరగాలి. నా అభిప్రాయం ప్రకారం ఇది సరియైనది అని భావిస్తూ కూర్చుంటారు. అప్పుడు టచింగ్ కూడా యదార్థంగా లభించదు. తమ మనసులోని సంకల్పాలే జవాబుగా లభిస్తాయి. అందువలన ఎక్కడో అక్కడ సఫలత లభించదు. ఆ తర్వాత అమృతవేళ డైరెక్షన్ అయితే ఇదే లభించింది కదా! మళ్లీ ఇలా ఎందుకు జరిగింది, సఫలత ఎందుకు లభించలేదు అని తికమక చెందుతారు. కాని మీ భావమును దేనినైతే కలిపేశారో, ఆ భావము యొక్క ఫలమే లభిస్తుంది. మన్మతానికి ఏ ఫలము లభిస్తుంది? తికమక చెందుతారు కదా! అందుకే మీ మనసా సంకల్పాలను కూడా విల్లు చేయండి అని అంటారు. నా సంకల్పము ఇలా చెప్తూ ఉంది కాని బాబా ఏం చెప్తున్నారు? మంచిది.

టీచర్లతో - బాప్దాదాకు టీచర్ల పై విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకంటే సమానంగా ఉన్నారు. తండ్రి, టీచరు, మీరు మాస్టర్ టీచర్లు. సమానమైనవారు ఎలాగూ ప్రియమనిపిస్తారు. చాలా మంచి ఉత్సాహ-ఉల్లాసాలతో సేవలో ముందుకు వెళ్తున్నారు. అందరూ చక్రవర్తులే. చక్రమును తిప్పుతూ అనేక ఆత్మల సంబంధములోకి వచ్చి అనేక ఆత్మలను సమీపంగా తీసుకొచ్చే కార్యాన్ని చేస్తున్నారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. బాప్దాదా మా పైన ప్రసన్నంగా ఉన్నారని అనిపిస్తుంది కదా! లేక ఇప్పుడింకా కొద్దిగా ఏదైనా చేయాలని భావిస్తున్నారా! సంతోషంగా ఉన్నారు, ఇంకా సంతోషింపజేయాలి. మంచి శ్రమ చేస్తున్నారు. ప్రేమతో శ్రమ చేస్తున్నారు. అందువలన శ్రమ అనిపించదు. బాప్దాదా సేవాధారీ పిల్లలను సదా శిరోకిరీటాలని అంటారు. మీరు శిరోకిరీటాలు. బాప్దాదా పిల్లల ఉల్లాస - ఉత్సాహాలను చూసి ఇంకా ఉల్లాస-ఉత్సాహాలను పెంచే సహయోగమునిస్తారు. ఒక అడుగు పిల్లలది, పదమాల అడుగులు తండ్రివి. ఎక్కడ ధైర్యముందో, అక్కడ ఉల్లాసము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ధైర్యము ఉంటే తండ్రి సహాయముంటుంది. కావున మీరు చింతలేని మహారాజులు. సేవ చేస్తూ ఉండండి. సఫలత లభిస్తూ ఉంటుంది. మంచిది.