26.02.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'' బాప్దాదాగారి అద్భుతమైన చిత్రశాల ''

బాప్దాదా ఈ రోజు తన చిత్రశాలను చూస్తున్నారు. బాప్దాదా వద్ద ఎలాంటి చిత్రశాల ఉందో తెలుసా? ఈ రోజు వతనంలో ప్రతి పుత్రుని చరిత్ర యొక్క చిత్రాన్ని చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటివరకు ప్రతి ఒక్కరి చరిత్రను తెలిపే చిత్రము ఎలా ఉందో చూస్తున్నారు. కనుక చిత్రశాల ఎంత పెద్దదిగా ఉంటుందో ఆలోచించండి. ఆ చిత్రంలో విశేషంగా ప్రతి పుత్రునికి సంబంధించిన మూడు విషయాలను చూశారు. ఒకటి - పవిత్రత యొక్క పర్సనాలిటి, రెండవది - సత్యత యొక్క రాయల్టీ, మూడవది - సంబంధాలలో సమీపత. ఈ మూడు విషయాలను ప్రతి ఒక్కరి చిత్రంలో చూశారు.

పవిత్రత యొక్క వ్యక్తిత్వము ఆకార రూపంలో చిత్రం నలువైపులా మెరుస్తూ ఉన్న ప్రకాశం కనిపిస్తూ ఉంది. రియాల్టీ(వాస్తవికత) యొక్క రాయల్టీ ముఖం పైన హర్షితముఖత మరియు స్వచ్ఛత మెరుస్తూ ఉంది మరియు సంబంధాలలో సమీపత మస్తకం మధ్యలో మెరుస్తూ ఉన్న నక్షత్రం కొంతమందికి ఎక్కువగా నలువైపులా వ్యాపిస్తున్న కిరణాలతో మెరుస్తూ ఉంది. కొంతమందికి కొన్ని కిరణాలతో మెరుస్తూ ఉంది. సమీపంగా ఉన్న ఆత్మలు తండ్రికి సమానంగా బేహద్ అనగా నలువైపులా వ్యాపిస్తున్న కిరణాలు కలిగినవిగా ఉన్నాయి. లైట్ మరియు మైట్ రెండింటిలో తండ్రి సమానంగా కనిపిస్తున్నాయి. ఈ మూడు విశేషతలతో ప్రతి ఒక్కరి చరిత్ర యొక్క చిత్రాన్ని చూశారు. దీనితో పాటు ఆది నుండి అంతిమం అనగా ఇప్పటి వరకు మూడు విషయాలలో సదా శ్రేష్ఠంగా ఉన్నారా లేక ఒకప్పుడు ఒకలాగా, మరొకప్పుడు మరోలాగా ఉన్నారా? అనే ఫలితాన్ని ప్రతి ఒక్కరి చిత్రంలో చూశారు. స్థూల శరీరంలో నాడిని చూసి బాగా నడుస్తోందా లేక హెచ్చు-తగ్గులు అవుతోందా, నెమ్మదిగా ఉందా లేక వేగంగా ఉందా అని పరిశీలించి తద్వారా ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. అలా ప్రతి ఒక్కరి హృదయం మధ్యలో ప్రకాశం క్రింద నుండి పై వరకు వెళ్తూ ఉంది. అందులో వేగం కూడా కనిపిస్తూ ఉంది. ఒకే వేగంతో ప్రకాశం క్రింద నుండి పైకి వెళ్తూ ఉందా లేక ఒక్కొక్క సమయంలో వేగంలో తేడా వస్తూ ఉందా? మధ్య-మధ్యలో కాంతి యొక్క రంగు మారుతూ ఉందా లేక ఒకే విధంగా ఉందా? మూడవది నడుస్తూ - నడుస్తూ ప్రకాశం అక్కడక్కడ ఆగుతూ ఉందా లేక అవిరామంగా నడుస్తూ ఉందా? ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరి చరిత్ర యొక్క చిత్రాన్ని చూశారు. మీరు కూడా మీ చిత్రాన్ని చూసుకోగలరు కదా!

పర్సనాలిటీ, రాయల్టీ మరియు సమీపత్వం ఈ మూడు విశేషతలతో నా చిత్రం ఎలా ఉంటుంది అని పరిశీలించుకోండి. నా ప్రకాశ వేగం ఎలా ఉంది. నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటుంది కానీ మూడు విశేషతలు మరియు మూడు రకాల లైట్ యొక్క వేగం ఆది నుండి ఇప్పటి వరకు సదా ఉన్న చిత్రం మెజారిటీలో లేదు, మైనారిటీలో ఉంది. మూడు ప్రకాశాల వేగం మరియు మూడు విశేషతలు కలిసి ఆరు విషయాలు అయినాయి కదా! ఆరు విషయాలలో మెజారిటి నాలుగు-అయిదు వరకు, మరికొంతమంది మూడు వరకు ఉన్నారు. పవిత్రతా పర్సనాలిటీ యొక్క లైట్ ఆకారము కొంతమందికి కేవలం కిరీటం లాగా ముఖం చుట్టూ దగ్గరగా ఉంది, కొంతమందికి సగం శరీరం వరకు ఉంది, మరి కొంతమందికి మొత్తం శరీరం చుట్టూ నలువైపులా కనిపిస్తూ ఉంది. ఫొటో తీస్తారు కదా అలా ఉంది! మనసా-వాచా-కర్మణా మూడింటిలో ఆది నుండి ఇప్పటి వరకు పవిత్రంగా ఉన్నారు. మనస్సులో స్వయం పట్ల లేక ఎవ్వరి పట్లనైనా వ్యర్థం అనే అపవిత్ర సంకల్పాలు కూడా నడవనివారు, ఎలాంటి బలహీనత లేక అవగుణం అనే అపవిత్ర సంకల్పం కూడా ధారణ చేయనివారు, సంకల్పంలో జన్మతోనే వైష్ణవులుగా ఉన్నారు. సంకల్పాలు బుద్ధికి భోజనము. జన్మతోనే వైష్ణవులు అనగా అశుద్ధతను లేక అవగుణాలను వ్యర్థ సంకల్పాలను బుద్ధి ద్వారా, మనసు ద్వారా గ్రహించి ఉండరాదు. అటువంటివారినే సత్యమైన వైష్ణవులు లేక బాలబ్రహ్మచారులు అని అంటారు. కావున ప్రతి ఒక్కరి చిత్రంలో ఇలాంటి పవిత్రత యొక్క పర్సనాలిటీ రేఖలు లైట్ ఆకారం ద్వారా చూశారు.

మనసా-వాచా-కర్మణా మూడింటిలో పవిత్రంగా ఉండాలి. (కర్మణా సేవలో సంబంధం- సంపర్కం అన్నీ వస్తాయి). వారి మస్తకం నుండి పాదాల వరకు లైట్ ఆకారంలో మెరుస్తూ ఉన్న చిత్రం ఉంది. అర్థమయిందా! దర్పణంలో తమ చిత్రాన్ని చూసుకుంటున్నారా? బాప్దాదా చూసిన నా చిత్రం ఎలా ఉంది అని బాగా చూసుకోండి. మంచిది.

కలుసుకునే వారి లిస్టు పెద్దగా ఉంది. అవ్యక్త వతనంలో అయితే నంబరూ ఉండదు మరియు సమయం యొక్క విషయమూ ఉండదు. ఎప్పుడు కావాలంటే, ఎంత సమయం కావాలంటే, ఎంత మంది కలుసుకోవాలంటే అంతమంది కలుసుకోవచ్చు. ఎందుకంటే అది హద్దు ప్రపంచానికి అతీతంగా ఉంది. ఈ సాకార ప్రపంచంలో ఇవన్నీ బంధనాలు, అందువలన బంధనాలు లేనివారు(బాబా) కూడా బంధనంలో బంధింపబడి ఉండవలసి ఉంటుంది. మంచిది.

టీచర్లు సంతుష్టంగా అయ్యారు కదా! అందరికీ తమ పూర్తి భాగం లభించింది కదా! మీరు నిమిత్తంగా అయిన విశేష ఆత్మలు. బాప్దాదా కూడా విశేష ఆత్మల పై విశేష గౌరవం ఉంచుతారు. అయినా సేవలో తోడుగా ఉన్నారు కదా. వాస్తవానికి అందరూ తోడుగానే(సాథీలుగానే) ఉన్నారు. అయినా నిమిత్తంగా ఉన్నవారు నిమిత్తులుగా భావించడంలోనే సేవలో సఫలత ఉంటుంది. సేవలో అయితే చాలామంది పిల్లలు చాలా తీవ్ర ఉత్సాహ-ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. అయినా నిమిత్తంగా తయారైన విశేష ఆత్మలకు గౌరవం ఇవ్వడం అనగా తండ్రికి గౌరవం ఇవ్వడం, తండ్రి ద్వారా గౌరవానికి బదులుగా హృదయపూర్వక స్నేహం తీసుకోవాలి. అర్థమయ్యిందా! టీచర్లకు గౌరవం ఇవ్వడం లేదు కానీ అందుకు బదులు తండ్రి ద్వారా హృదయపూర్వక స్నేహాన్ని తీసుకుంటున్నారు. మంచిది.

సదా మనోభిరాముడైన తండ్రి ద్వారా హృదయపూర్వక స్నేహాన్ని తీసుకునేందుకు పాత్రులుగా అనగా సుపాత్రులైన ఆత్మలకు సదా స్వయాన్ని పవిత్రత యొక్క పర్సనాలిటీ రాయల్టీ, సత్యమైన రాయల్టీని అనుభవం చేసే సమీప మరియు సమాన పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే

యు.కె. గ్రూపుతో అవ్యక్త బాప్దాదా యొక్క కలయిక :-

అందరూ సర్వ రహస్యాలతో సంపన్నంగా, రహస్యయుక్తంగా, యోగయుక్త ఆత్మలుగా ఉన్నారు కదా! మొదటి నుండి బాప్దాదా పేరు నలువైపులా ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తమైన ఆత్మలు. బాప్దాదా ఇలాంటి ఆదిరత్నాలను, సేవకు తోడుగా ఉన్నవారిని చూసి సదా సంతోషిస్తారు. అందరూ బాప్దాదాకు రైట్ హ్యాండ్ గ్రూప్, కుడిభుజాల గ్రూపుగా ఉన్నారు. చాలా మంచి-మంచి రత్నాలుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రత్నము. కాని అందరూ రత్నాలే. ఎందుకంటే స్వయం అనుభవీలుగా అయ్యి ఇతరులను కూడా అనుభవీలుగా తయారు చేసేందుకు నిమిత్తంగా అయిన ఆత్మలు. అందరూ ఎంత ఉత్సాహ-ఉల్లాసాలతో స్మృతి మరియు సేవలో సదా నిమగ్నమైన ఆత్మలుగా ఉన్నారో బాప్దాదాకు తెలుసు. స్మృతి మరియు సేవ తప్ప ఇతరవన్నీ సమాప్తమైపోయాయి. కేవలం ఒక్కరే ఉన్నారు. ఒక్కరి వాళ్ళము, ఏకరస స్థితి కలిగిన వాళ్ళము - ఇదే అందరి నుండి వెలువడే శబ్ధము. ఇదే నిజమైన శ్రేష్ఠమైన జీవితము. ఇలాంటి శ్రేష్ఠ జీవితం కలిగినవారు సదా బాప్దాదాకు సమీపంగా ఉంటారు నిశ్చయ బుద్ధికి ప్రత్యక్ష ప్రమాణము ఇచ్చేవారు. సదా 'ఓహో నా బాబా' మరియు 'ఓహో నా శ్రేష్ఠ భాగ్యము' ఇదే స్మృతి ఉంటుంది కదా! బాప్దాదా ఇలాంటి స్మృతి స్వరూప పిల్లలను చూసి 'ఓహో నా శ్రేష్ఠమైన పిల్లలూ' అని సంతోషిస్తారు. బాప్దాదా ఇలాంటి పిల్లల మహిమను పాడ్తారు. లండన్ విదేశ సేవకు పునాది మీరందరూ సేవకు పునాది రాళ్ళు. మీరందరూ దృఢంగా ఉన్న ప్రభావంతో సేవలో వృద్ధి జరుగుతూ ఉంది. భలే పునాది, వృక్షం యొక్క విస్తారంలో దాగిపోతుంది కానీ పునాదిగానే ఉన్నారు కదా! వృక్ష విస్తారము యొక్క అందాన్ని చూసి ఎక్కువగా అటువైపు దృష్టి ఉంటుంది. పునాది గుప్తంగా ఉండిపోతుంది. అలాగే మీరు కూడా కొంచెం నిమిత్తంగా అయ్యి ఇతరులకు అవకాశాన్ని ఇచ్చేవారిగా అయ్యారు. అయినా(ఆదిలో ఉన్నవారు ఆదిలో ఉన్నారు) మొదట ఉన్నవారు మొదటే ఉన్నారు. ఇతరులకు అవకాశాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడంలో మీకు సంతోషం కలుగుతుంది కదా! ఈ డబల్ విదేశీయులు వచ్చారు. మేము దాగబడ్డాము అని భావించడం లేదు కదా! అయినా వారికి ఉత్సాహ-ఉల్లాసాలు ఇచ్చేందుకు మీరే నిమిత్తంగా ఉన్నారు. ఇతరులను ముందు ఉంచేవారు స్వయం ముందే ఉంటారు. ఉదాహరణానికి చిన్న పిల్లలను ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళు అని పెద్దవాళ్ళు వెనక ఉంటారు. చిన్నవాళ్ళను ముందు పెట్టడమే పెద్దవాళ్ళు ముందు ఉండడం. దానికి ప్రత్యక్ష ఫలం లభిస్తూనే ఉంటుంది. మీరు సహయోగులుగా అవ్వకుంటే లండన్లో ఇన్ని సెంటర్లు తెరవబడేవి కాదు. కొందరు ఒకచోట నిమిత్తంగా అయ్యారు, కొందరు మరొక చోట నిమిత్తంగా అయ్యారు. మంచిది.

మలేషియా, సింగపూర్ పార్టీతో :-

అందరూ స్వయాన్ని తండ్రికి స్నేహీ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సదా ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు - ఇదే స్థితిలో స్థితమై ఉంటున్నారా? ఈ స్థితినే ఏకరస స్థితి అని అంటారు. ఎందుకంటే ఎక్కడైతే ఒక్కరే ఉన్నారో అక్కడ ఏకరసం ఉంటుంది. అనేకం ఉంటే స్థితి కూడా కదిలిపోతుంది. తండ్రి ఒక్కరిలోనే అన్నీ చూడండి అని సహజ మార్గం తెలిపించారు. అనేకమందిని స్మృతి చెయ్యడం నుండి, అనేక వైపుల భ్రమించడం నుండి ముక్తులుగా అయ్యారు. ఒక్కరే ఉన్నారు, ఒక్కరి వారిగానే ఉన్నారు. ఇదే ఏకరస స్థితి ద్వారా సదా స్వయాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు.

సింగపూర్ మరియు హాంకాంగ్ వారు ఇప్పుడు చైనాలో సెంటర్ తెరవాలనే సంకల్పం చెయ్యండి. మొత్తం చైనాలో ఇప్పుడు సేవాకెేంద్రము లేదు. వారిని సంబంధంలోకి తీసుకొస్తూ అనుభవం చేయించండి. ధైర్యము చేసి సంకల్పము చేస్తే జరిగిపోతుంది. రాజయోగము ద్వారా ప్రభువు ప్రేమను, శాంతిని, శక్తిని అనుభవం చేయిస్తే ఆత్మలు స్వత:గానే పరివర్తన అవుతారు. రాజయోగులుగా చెయ్యండి. దేవతలుగా కాదు. రాజయోగులు స్వత:గానే దేవతలుగా అవుతారు. మంచిది.

పోలెండ్ గ్రూపుతో :-

పిల్లలందరూ తమ స్వీట్ హోమ్ కు చేరుకున్నారని బాప్దాదాకు సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మేము ఇలాంటి మహాన్ తీర్థ స్థానానికి చేరుకున్నామని సంతోషంగా ఉంది కదా! శ్రేష్ఠ జీవితాన్ని అభ్యాసం చేస్తూ చేస్తూ తయారైపోతారు. కానీ ఈ స్థానంలో తమ సత్యమైన ఈశ్వరీయ స్నేహం కలిగిన పరివారంలోకి చేరుకునే శ్రేష్ఠ భాగ్యాన్ని పొందారు. ఇంత ఖర్చు చేసి వచ్చారు. ఎంతో శ్రమ చేసి వచ్చారు. ఖర్చు మరియు శ్రమ సఫలం అయ్యాయని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? ఏమో తెలియడం లేదు, ఎక్కడకు చేరుకున్నామో అని అనుకోవడం లేదు కదా! పరివారానికి తండ్రికి ఎంత ప్రియంగా ఉన్నారు! బాప్దాదా సదా పిల్లల విశేషతలను చూస్తారు. మీకు మీ విశేషత గురించి తెలుసా? చాలా పట్టుదలతో ఎంతో దూరం నుండి ఇక్కడకు చేరుకున్నారు అంటే ఈ విశేషత అయితే ఉంది. ఇప్పుడు సదా తమ ఈశ్వరీయ పరివారాన్ని మరియు ఈ ఈశ్వరీయ పద్ధతిని, రాజయోగాన్ని సదా తోడుగా ఉంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అక్కడకు వెళ్ళి రాజయోగ కేంద్రాన్ని మంచిగా, ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే కొంతమంది ఆత్మలు సత్యమైన శాంతి, సత్యమైన ప్రేమ మరియు సత్యమైన సుఖానికి దప్పికగొని ఉన్నారు, వారికి మార్గము తెలుపుతారు కదా! ఎవరికైనా దాహంగా ఉంటే ఆ సమయంలో ఎవరైనా వారికి నీళ్ళు త్రాగించినట్లయితే జీవితాంతం వారు వారి గుణాలను గానం చేస్తూ ఉంటారు. కనుక మీరు జన్మ-జన్మాంతరాల కొరకు ఆత్మల సుఖ, శాంతుల దాహాన్ని తీర్చాలి. దీనితో పుణ్యాత్మగా అవుతారు. తమ సంతోషాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. సంతోషమే సేవకు సాధనము. ఈ మహాన్ తీర్థ స్థానానానికి చేరకోవడం వలన అన్ని తీర్థ స్థానాలు ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఈ మహాన్ తీర్థ స్థానంలో జ్ఞాన స్నానం చెయ్యండి మరియు ఏ ఏ బలహీనతలున్నాయో వాటిని దానం చెయ్యండి. తీర్థ స్థానంలో ఏదైనా వదిలి పెట్టాల్సి కూడా ఉంటుంది. ఏం వదిలి పెడ్తారు? ఏ విషయంలో మీరు వ్యాకులపడ్తున్నారో దానిని వదిలినప్పుడు మహాన్ తీర్థము సఫలమవుతుంది. ఇదే దానం చెయ్యండి. ఈ దానంతోనే పుణ్యాత్మగా అవుతారు. ఎందుకంటే చెడును వదిలేయడమంటే మంచిని ధారణ చేయడము. ఎప్పుడైతే అవగుణాలను వదిలి గుణ ధారణ చేస్తారో అప్పుడు పుణ్యాత్మలుగా అవుతారు. ఇదే ఈ మహాన్ తీర్థ స్థానం యొక్క సఫలత. మహాన్ తీర్థానికి వచ్చారు. చాలా మంచిది. రావడం అనగా భాగ్యవంతుల లిస్ట్ లోకి రావడం. ఈ మహా తీర్థానికి ఇంత శక్తి ఉంది. కానీ ఇకముందు ఏం చెయ్యాలి? ఒకటి భాగ్యవంతులుగా అవ్వాలి, రెండవది సౌభాగ్యవంతులుగా అవ్వాలి మరియు దాని తర్వాత పదమాపదం భాగ్యవంతులుగా అవ్వాలి. ఎంత సాంగత్యము చేస్తూ ఉంటారో, గుణాలను ధారణ చేస్తూ ఉంటారో అంత పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. మంచిది.

డబల్ విదేశీ టీచర్లతో :-

ఎప్పుడూ స్వయాన్ని మేము ఇతర ధర్మాల వారి వద్దకు వచ్చామని టీచర్లకు సంకల్పములో కూడా రాకూడదు. ఇవి క్రొత్తవారి విషయాలు. మీరైతే పాతవారు, నిమిత్తంగా కూడా అయ్యారు. మేము వేరే ధర్మం వారము, ఈ ధర్మంలోకి వచ్చామని కాదు. ఈ ధర్మానికి చెందిన వారము, ఇదే ధర్మంలోకి వచ్చాము. మేము మరియు వీరు వేరుగా ఉన్నామనే సంకల్పం స్వప్నంలో కూడా ఉండరాదు. భారతదేశము వేరు, విదేశాలు వేరు అని భావించకండి. ఈ సంకల్పము ఏకమతాన్ని రెండు మతాలుగా చేసేస్తుంది. తర్వాత మేము మరియు మీరు అయ్యారు కదా! ఎక్కడ మేము మరియు మీరుగా అయ్యారో అక్కడ ఏముంటుంది? గొడవలు ఉంటాయి కదా! అందువలన ఒకటిగానే ఉన్నాము. డబల్ విదేశీయులని బాప్దాదా గుర్తు కొరకు చెప్తున్నారు అంతేగాని వేరుగా ఉన్నారని కాదు. మేము డబల్ విదేశీయులము కనుక వేరుగా ఉన్నామని భావించకండి. దేశము వారు వేరే అని అనుకోకండి. బ్రాహ్మణ జన్మ జరిగినప్పుడు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఎవరిగా అయ్యారు? బ్రాహ్మణులు ఒక్క ధర్మానికి చెందినవారు. విదేశీయులని, దేశం వారు అని అందులో ఉండరు. మనమందరము ఒకే బ్రాహ్మణ ధర్మానికి చెందిన వారము. బ్రాహ్మణ జీవితం కలిగిన వారము. ఒక్క తండ్రి సేవకు నిమిత్తంగా ఉన్నాము. ఎప్పుడూ ఈ భాషను కూడా ఉపయోగించండి............ మా ఆలోచనలు ఇలా ఉన్నాయి, భారతీయులైన మీవి ఇలా ఉన్నాయి. ఈ భాష తప్పు. పొరపాటుగా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఆలోచనలు వేరు వేరుగా భారతీయులవి కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. కానీ భారత్ మరియు విదేశం అనే తేడా ఎప్పుడూ చెయ్యవద్దు. విదేశీయులైన మా ఆలోచనలు ఇలాగే నడుస్తాయి అని కాదు. మా స్వభావాలు ఇలా ఉంటాయి. మా సంస్కృతి ఇలా ఉంటుంది అని అనుకోకండి. ఎప్పుడూ ఇలా ఆలోచించకండి. తండ్రి ఒక్కరే, అందరమూ ఆ ఒక్కరి వాళ్ళమే. ఈ నిమిత్త టీచర్లు ఎలాంటి భాష మాట్లాడితే అలా ఇతరులు కూడా మాట్లాడ్తారు. అందువలన చాలా యుక్తి యుక్తంగా ఒక్కొక్క మాట మాట్లాడాలి. యోగయుక్తంగా మరియు యుక్తియుక్తంగా రెండూ తోడు తోడుగా నడవాలి. కొంతమంది యోగంలో చాలా ముందుకు వెళ్ళాలని చూస్తారు, కానీ కర్మలో యుక్తి యుక్తంగా ఉండరు. రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. యోగయుక్తులకు గుర్తు యుక్తి యుక్తంగా ఉండడం. మంచిది.

సేవాధారులతో :- యజ్ఞ సేవ చేసే భాగ్యం లభించడం ఇది కూడా చాలా గొప్ప భాగ్యానికి గుర్తు. ఉపన్యాసము చెయ్యకపోవచ్చు, కోర్సు చేయించలేకపోవచ్చు కానీ సేవకు మార్కులైతే లభిస్తాయి కదా! ఇందులో కూడా పాస్ అవుతారు. ప్రతి సబ్జెక్టుకు దాని మార్కులు ఉంటాయి. మేము ఉపన్యాసం చెయ్యలేకపోతే వెనుక ఉన్నామని అనుకోకండి. సేవాధారులు సదా వర్తమానం మరియు భవిష్యత్ ఫలానికి అధికారులు. సంతోషం ఉంటుంది కదా! మాతలకు మనస్సుతో నాట్యం చెయ్యడం వస్తుంది, ఇంకేమీ చెయ్యకండి. కేవలం సంతోషంగా మనసుతో నాట్యం చేస్తూ ఉంటే కూడా చాలా సేవ జరుగుతుంది.