12.03.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


''ఆత్మీయతకు సహజ విధి - స౦తుష్టత''

ఈ రోజు బాప్దాదా నలువైపులా దూరంగా ఉన్నా సమీపంగా ఉండే పిల్లలందరి సంతుష్టత లేక ఆత్మీయత మరియు ప్రసన్నతతో కూడిన చిరునవ్వును చూస్తున్నారు. సంతుష్టత ఆత్మీయతకు సహజ విధి, ప్రసన్నత సహజ సిద్ధి. ఎవరి వద్ద అయితే సంతుష్టత ఉందో వారు సదా ప్రసన్న స్వరూపులుగా తప్పకుండా కనిపిస్తారు. సంతుష్టత సర్వ ప్రాప్తి స్వరూపము. సంతుష్టత సదా ప్రతి విశేషతను ధారణ చేసేందుకు సహజ సాధనము. సంతుష్టత అనే ఖజానా అన్ని ఖజానాలను స్వతహాగా తనవైపు ఆకర్షిస్తుంది. సంతుష్టత జ్ఞాన సబ్జెక్టుకు ప్రత్యక్ష ప్రమాణము. సంతుష్టత చింతలేని చక్రవర్తులుగా చేస్తుంది. సంతుష్టత సదా స్వమానమనే సీటు పై సెట్అయ్యి ఉండేందుకు సాధనము. సంతుష్టత మహాదానులుగా, విశ్వ కళ్యాణకారులుగా, వరదానులుగా సదా మరియు సహజంగా తయారు చేస్తుంది. సంతుష్టత హద్దులోని నీది-నాది అనే చక్రము నుండి ముక్తముగా చేయించి స్వదర్శన చక్రధారులుగా చేస్తుంది. సంతుష్టత సదా నిర్వికల్పముగా, ఏకరసంగా ఉండు విజయీ ఆసనానికి అధికారిగా చేస్తుంది. సదా బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా, సహజ స్మృతి తిలకధారులుగా, విశ్వ పరివర్తన చేసే సేవకు కిరీటధారులుగా అయ్యే అధికారుల సంపన్న స్వరూపం స్థితం చేస్తుంది. సంతుష్టత బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానము. బ్రాహ్మణ జీవన ఉన్నతికి సహజ సాధనము. స్వయం సంతుష్టంగా, పరివారంతో సంతుష్టంగా మరియు పరివారము వారితో సంతుష్టంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, వాయుమండలము, వైబ్రేషన్ల అలజడిలో కూడా సంతుష్టంగా ఉండాలి. ఇటువంటి సంతుష్టతా స్వరూపులు, శ్రేష్ఠ ఆత్మలు, విజయీ రత్నమనే సర్టిఫికెట్ తీసుకునేందుకు అధికారులుగా ఉంటారు. మూడు సర్టిఫికెట్లను తీసుకోవలసి ఉంటుంది - 1. స్వయంతో స్వయం సంతుష్టత 2. తండ్రి ద్వారా సదా సంతుష్టత 3. బ్రాహ్మణ పరివారం ద్వారా సంతుష్టత.

ఈ సర్టిఫికెట్లతో తమ వర్తమానము మరియు భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకోగలరు. ఇప్పుడు కూడా సర్టిఫికెట్ తీసుకునేందుకు సమయము ఉంది, తీసుకోవచ్చు కాని చాలా సమయం లేదు. ఇప్పుడు లేట్అయ్యింది కాని టూలేట్అవ్వలేదు. ఇప్పుడు కూడా సంతుష్టత అనే విశేషతతో ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు లాస్ట్ సో ఫాస్ట్, సో ఫస్ట్ గా అయ్యేందుకు(చివరలో వచ్చినా వేగంగా ముందుకు వెళ్లేందుకు) అవకాశముంది. తర్వాత లాస్టులో వచ్చేవారు లాస్ట్ గా అయిపోతారు. కావున ఈ రోజు బాప్దాదా ఈ సర్టిఫికెట్ చెక్ చేస్తున్నారు. స్వయం మీరు కూడా మిమ్ములను చెక్ చేసుకోగలరు. ప్రసన్నచిత్తులుగా ఉన్నారా లేక ప్రశ్నచిత్తులుగా ఉన్నారా? డబల్ విదేశీయులు ప్రసన్నచిత్తులుగా, సంతుష్టంగా ఉన్నారా? ప్రశ్నలు సమాప్తమైతే ప్రసన్నంగా అవ్వనే అవుతారు. సంగమయుగమే సంతుష్టంగా ఉండే సమయం. సంతుష్టతను గురించిన జ్ఞానము ఇప్పుడే ఉంది. అక్కడ ఈ సంతుష్టత, అసంతుష్టతను గురించిన జ్ఞానానికి అతీతంగా ఉంటారు. ఇప్పుడిది సంగమయుగ ఖజానాయే. సంతుష్ట ఆత్మలందరూ సర్వులకు సంతుష్టతా ఖజానాను ఇచ్చేవారే. దాత పిల్లలైన మీరు మాస్టర్ దాతలు. ఇంతగా జమ చేసుకున్నారు కదా! స్టాక్ పూర్తిగా నింపుకున్నారా లేక కొంచెం తక్కువ ఉందా! ఒకవేళ స్టాక్ తక్కువగా ఉన్నట్లయితే విశ్వకళ్యాణకారులుగా అవ్వలేరు. కేవలం కళ్యాణికారులుగా అయిపోతారు. కాని తండ్రి సమానంగా అవ్వాలి కదా! మంచిది.

దేశ-విదేశాలవారు అందరూ సర్వ ఖజానాలతో సంపన్నమై మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి వెళ్తున్నారు కదా! రావాలి అంటే వెళ్ళాలి కూడా. తండ్రి కూడా వస్తారు, మళ్లీ వెళ్తారు కూడా కదా! పిల్లలు కూడా వస్తారు, సంపన్నమై వెళ్తారు. ఇతరులను తండ్రి సమానంగా చేసేందుకు వెళ్తారు. తమ బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు వెళ్తారు. దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు వెళ్తారు. అందుకే వెళ్తున్నారు కదా! మీరు ఇష్టముతో లేక బంధనం వలన వెళ్ళడం లేదు. కాని తండ్రి ఆదేశానుసారము సేవ గురించి కొద్ది సమయం కొరకు వెళ్తున్నారు. ఇలా భావించి వెళ్తున్నారు కదా? మేమైతే అమెరికాకు చెందినవారము, ఆస్ట్రేలియాకు చెందినవారము అని భావించడం లేదు కదా. కొద్ది సమయానికి, బాప్దాదా సేవ కొరకు నిమిత్తంగా చేసి పంపించారు. బాప్దాదా పంపిస్తున్నారు. అంతేకానీ మీ మనసుతో వెళ్ళడం లేదు. నా ఇల్లు, నా దేశం ఇలా భావించడం లేదు. తండ్రి, సేవాస్థానాలకు పంపుతున్నారు. అందరూ సదా అతీతమైనవారు మరియు తండ్రికి ప్రియమైనవారు. ఏ బంధనమూ లేదు. సేవా బంధనము కూడా లేదు. తండ్రి పంపించారు. కనుక తండ్రికే తెలుసు. నిమిత్తంగా అయ్యారు. ఎప్పటి వరకు, ఎక్కడ నిమిత్తంగా చేస్తారో అంతవరకు అక్కడ నిమిత్తంగా ఉంటారు. అనగా డబల్ లైట్ గా ఉన్నారు కదా! పాండవులు కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు కదా! బంధనమున్న వారెవ్వరూ లేరు. అతీతంగా అవ్వడమే ప్రియంగా అవ్వడం.

సదా సంతుష్టత ద్వారా అత్మీయతలో ఉండేవారికి, ప్రసన్నచిత్తులుగా ఉండేవారికి, సదా ప్రతి సంకల్పము, మాట, కర్మల ద్వారా సర్వులకు సంతుష్టతా బలాన్ని ఇచ్చేవారికి, నిరుత్సాహంతో ఉన్న ఆత్మలను ఖజానాలతో శక్తిశాలిగా చేసేవారికి, సదా విశ్వ కళ్యాణకారులకు, అనంతమైన నిశ్చింత చక్రవర్తులకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్దాదాతో దాదీజీ మరియు జానకి దాదీజీల కలయిక

హోలీహంసల జంట లేక జ్ఞాన-యోగాల జంట బాగుంది. ఈమె(జానకి దాది) శాంతి ద్వారా రూప్(యోగి)గా అయ్యి సేవను ఎక్కువగా ఇష్టపడ్తుంది. ఈమె(దాదీజీకి) అయితే తప్పకుండా మాట్లాడవలసి ఉంటుంది. ఈమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏకాంతంలోకి వెళ్లిపోతుంది. ఈమెకు రూపంతో సేవ చేయడం ఇష్టం. అందరూ ఆల్ రౌండర్ లే కాని వీరిది రూప-బసంత్ ల జంట. నిజానికి రెండు సంస్కారాలు అవసరమే - ఎక్కడ వాణి పని చేయదో, అక్కడ రూపం పని చేస్తుంది. ఎక్కడ రూపము పని చేయలేదో అక్కడ బసంత్(జ్ఞానము) పని చేస్తుంది. కనుక ఈ జంట బాగుంది. ఎవరైతే జంటగా అవుతారో, వారందరూ బాగున్నారు. ఆ జంట కూడా బాగుండేది. (దాదీ, దీదీ). ఇది కూడా బాగుంది. డ్రామాలో ఆమె(దీదీ) గుప్త నదిగా అయిపోయింది. వారంటే డబల్ విదేశీయులకు కూడా చాలా ప్రేమ. ఏమీ పరవాలేదు. దీదీ యొక్క రెండవ రూపాన్ని చూశారు. అందరూ చూసి ఎంతగా సంతోషిస్తారు. మహారథులందరూ తోడుగా ఉన్నారు. బృజేంద్ర, నిర్మలశాంత అందరూ దూరంగా ఉంటున్నా తోడుగా ఉన్నారు. శక్తుల మధ్య మంచి సహయోగం ఉంది. అందరూ ఒకరినొకరు ముందు ఉంచిన కారణంగా ముందుకు వెళ్తున్నారు మరియు నిమిత్తమైన శక్తులను ముందు ఉంచిన కారణంగా అందరూ ముందు ఉన్నారు. సేవ పెరిగేందుకు కారణం ఇదే. ఒకరినొకరు ముందుకు తీసుకెెళ్లడం. పరస్పరంలో ప్రేమ ఉంది, ఐకమత్యం ఉంది. సదా ఇతరుల విశేషతలను వర్ణన చేయడం - ఇదే సేవలో వృద్ధి చేయడం. ఇదే విధితో సదా వృద్ధి జరిగింది, ఇకమీదట కూడా వృద్ధి జరుగుతూనే ఉంటుంది. సదా విశేషతలను చూడడం మరియు విశేషతలను చూడడాన్ని ఇతరులకు నేర్పించడం - ఇదే సంఘటన అనే మాలలో కూర్చేందుకు దారము. ముత్యాలు కూడా దారంలో కూర్చబడ్తాయి కదా! సంఘటనకు దారమైతే ఇదే. విశేషతలు తప్ప ఇంకేమి వర్ణన చేయరాదు. ఎందకంటే ఇది మహోన్నతమైన మధువన భూమి. మహాభాగ్యం కూడా ఉంది, అలాగే మహాపాపము కూడా ఉంది. మధువనం నుండి వెళ్ళి ఒక వేళ ఏదైనా వ్యర్థ మాటలు మాట్లాడితే అది మహాపాపంగా అవుతుంది. అందువలన సదా విశేషతలను చూసే కళ్ళజోడునే ధరించి ఉంటే వ్యర్థమును చూడలేరు. ఉదాహరణానికి ఎరుపు రంగు కళ్ళజోడుతో ఎరుపు తప్ప ఇంకేమైనా చూడగలరా? కనుక సదా విశేషతలకు చూసే కళ్ళజోడే ధరించి ఉండండి. ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని చూపినా దానినెప్పుడూ వర్ణించకండి. వర్ణించారంటే భాగ్యం పోతుంది. ఏవైనా లోపాలు మొదలైనవి ఉంటే దానికి తండ్రియే బాధ్యులు. ఎందుకంటే నిమిత్తంగా చేసిందెవరు! తండ్రి. కనుక నిమిత్తంగా ఉన్నవారి లోపాలను వర్ణించడం అనగా తండ్రి లోపాలను వర్ణించినట్లవుతుంది. అందువలన వీరి కొరకు ఎప్పుడు కూడా శుభ భావనలు తప్ప ఇంకేమి వర్ణన చేయరాదు.

బాప్దాదా అయితే రత్నాలైన మిమ్ములను తమకన్నా శ్రేష్ఠంగా చూస్తారు. వీరు తండ్రికి అలంకారము కదా! కనుక తండ్రిని అలంకరింపజేసే పిల్లలైతే శ్రేష్ఠమైనవారే కదా! బాప్దాదా అయితే పిల్లలను మహిమ చేసి సంతోషిస్తూ ఉంటారు. వాహ్ నా ఫలానా రత్నమా! వాహ్ నా ఫలానా రత్నమా! అని మహిమ చేస్తూ ఉంటారు. తండ్రి ఎప్పుడూ ఎవ్వరి బలహీనతను చూడరు. సూచించినా కూడా విశేషతా పూర్వకంగా రిగార్డుతో(గౌరవంతో) సూచిస్తారు. నిజానికి తండ్రికి అథారిటీ(అధికారం) ఉంది కదా! కాని సదా గౌరవమునిచ్చిన తర్వాత సూచిస్తారు(లోపాలను). తండ్రిలో గల ఈ విశేషతే సదా పిల్లల్లో కూడా ఇమర్జ్అయ్యి(ప్రత్యక్షంగా) ఉండాలి. తండ్రిని అనుసరించాలి కదా!

బాప్దాదా ముందు ముఖ్యమైన అక్కయ్యలు (దాదీలు) కూర్చుని ఉన్నారు

జీవన్ముకుడైన జనకుడు అనేది మీ గాయనమే కదా! జీవన్ముక్తులు మరియు విదేహులు అనే రెండు టైటిళ్లు ఉన్నాయి. ఈమె అయితే మణిగానే ఉన్నారు(దాది కొరకు). సంతుష్టమణి, మస్తకమణి, సఫలతామణి..... ఎంతమంది మణులు ఉన్నారు. అందరూ మణులే మణులు. మణులను ఎంతగా దాచి ఉంచినా మణి మెరుపు ఎప్పుడూ దాగి ఉండదు. ధూళిలో కూడా మెరుస్తుంది. లైటు చేసే పని చేస్తుంది. కనుక పేరు కూడా అదే, పని కూడా అదే. ఈమె(జానకి దాది) గుణం కూడా అదే. దేహ ముక్తులు, జీవన్ముక్తులు. సదా జీవితంలో సంతోషపు అనుభవాల లోతులో ఉంటారు. దీనినే జీవన్ముక్తి అని అంటారు. మంచిది.

అవ్యక్త మహావాక్యాలు - నిరహంకారులుగా అయ్యి విశ్వ నవనిర్మాణము చేయండి

సేవలో సహజంగా సదా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు మూల ఆధారము - నిరహంకారులుగా అవ్వడము. నిరహంకారులుగా అవ్వడమే స్వమానము అంతేకాక అందరి ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము. నిరహంకారిగా ఉండడం, తల వంచడం కాదు. కాని అందరినీ తమ విశేషతలు మరియు ప్రేమతో తల వంచేలా చేయడం. మహానతకు గుర్తు నిరహంకారత. ఎంత నిరహంకారిగా ఉంటారో అంత అందరి హృదయంలో స్వతహాగా మహాన్ (గొప్పవారి)గా అవుతారు. ఈ గుణము సులభంగా నిరహకారులుగా చేస్తుంది. నిరహంకారత అనే బీజం మహానత అనే ఫలాన్ని స్వతహాగా ప్రాప్తి చేయిస్తుంది. ఈ గుణము అందరి హృదయ పూర్వక ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము. నిరహంకారిగా అయిన దానికి విశేషమైన గుర్తు - నమ్రత(నిర్మానత). వృత్తి, దృష్టి, వాణి, సంబంధ-సంపర్కాలు అన్నిటిలో నిర్మానత గుణాన్ని ధారణ చేస్తే మహాన్ గా అయిపోతారు. ఎలాగైతే వృక్షము వంగడం వల్ల సేవ చేస్తుందో, అలా నిర్మాన్ గా అవ్వడం అనగా వంగడమే సేవాధారిగా అవ్వడం, అందువలన ఒకవైపు మహానత ఉంటే రెండవవైపు నిర్మానత ఉంటుంది. ఎవరైతే నిర్మానులుగా ఉంటారో, వారు సర్వుల ద్వారా గౌరవాన్ని పొందుతారు. స్వయం నిర్మానులుగా ఉంటే ఇతరులు గౌరవాన్ని ఇస్తారు. ఎవరైతే అభిమానంలో ఉంటారో, వారికి ఎవ్వరూ గౌరవమివ్వరు. వారి నుండి దూరంగా పారిపోతారు. ఎవరైతే నిర్మానులుగా ఉంటారో వారు అందరికీ సుఖమునిస్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా వారు సుఖమునిచ్చేవారిగా ఉంటారు. వారి సంబంధ-సంపర్కాలలోకి ఎవరు వచ్చినా వారు సుఖాన్ని అనుభవం చేస్తారు.

సేవాధారుల విశేషత - ఒకవైపు అతినిరహంకారులైన వరల్డ్ సర్వెంట్(విశ్వసేవాధారులు), రెండవవైపు జ్ఞానములో అథారిటీగా ఉంటారు. ఎంత నిరహంకారులుగా ఉంటారో అంత చింత లేని చక్రవర్తులు. నిరహంకారత మరియు అథారిటి రెండిటి బ్యాలెన్సు. నిర్మాన భావము, నిమిత్త భావము, అనంతమైన భావము - ఇవే సేవలో సఫలతకు విశేషమైన ఆధారము. ఎంత స్వమానంలో ఉంటారో అంత నిర్మానులుగా ఉంటారు. స్వమానము యొక్క అభిమానముండరాదు. మేము ఉన్నతంగా అయిపోయాము, ఇతరులు తక్కువ వారని లేక వారి పట్ల ఘృణా భావము ఉండరాదు. ఎటువంటి ఆత్మలనైనా దయాదృష్టితో చూడాలి, అభిమాన దృష్టితో కాదు. అభిమాన భావమూ ఉండరాదు, అవమాన భావమూ ఉండరాదు. ఇవి ఇప్పటి బ్రాహ్మణ జీవితపు నడవడిక కాదు. ఒకవేళ అభిమానము లేకపోతే అవమానము, అవమానముగా అనిపించదు. వారు సదా నిరహంకారులుగా ఉండి నిర్మాణ కార్యంలో బిజీగా ఉంటారు. ఎవరైతే నిమిత్తంగా ఉంటారో, వారే నవ నిర్మాణాన్ని చేయగలరు. శుభ భావన లేక శుభ కామనకు బీజమే నిమిత్త భావము మరియు నిర్మాన భావము. హద్దులోని మానము కాదు నిర్మానము. అసభ్యతకు గుర్తు మొండితనము(జిద్దు) సభ్యతకు గుర్తు నిర్మానము. నిర్మానులుగా అయ్యి, సభ్యతా పూర్వకంగా వ్యవహారం చేయడమే సభ్యత లేక సత్యత. ఎప్పుడైతే స్వంత సఫలత గురించి అభిమానం ఉండదో, దానిని వర్ణించరో అప్పుడే సఫలతా నక్షత్రాలుగా అవుతారు. తమ మహిమను చేసుకోరు కాని ఎంత సఫలత ఉంటుందో అంత నమ్రచిత్తులుగా, నిర్మానులుగా, నిర్మల స్వభావులుగా ఉంటారు. ఇతరులు వారిని మహిమ చేసినా వారు సదా తండ్రి గుణాలనే గాయనం చేస్తారు, మహిమ చేస్తారు. ఇటువంటి నమ్రత నిర్మాణ కార్యాన్ని సహజంగా చేస్తుంది. ఎంతవరకు నిర్మానులుగా అవ్వరో అంతవరకు నిర్మాణం చేయలేరు. నమ్రచిత్తులు, నిర్మానులు లేక హాజీ పాఠాన్ని చదివే ఆత్మ పట్ల ఇతరులకు ఎప్పుడైనా అపార్థంతో అది ఓటమి రూపంగా కనిపిస్తుంది. కాని నిజానికి అది వారి విజయము. కేవలం ఆ సమయంలో ఇతరులు అన్నందువల్ల లేక వాయుమండలంలో స్వయం నిశ్చయబుద్ధి నుండి మారి అనుమాన రూపంగా అవ్వరాదు. ఇది ఓటమా లేక గెలుపా అని అనుమానపడరాదు. ఇటువంటి అనుమానాన్ని ఉంచుకోకుండా తమ నిశ్చయంలో పక్కాగా ఉండాలి. ఎందుకంటే ఇతరులు ఎవరినైతే ఓడిపోయారని అంటారో, రేపు వారే వాహ్ వాహ్ అనే పుష్పాలు సమర్పిస్తారు. సంస్కారాలలో నిర్మానత మరియు నిర్మాణము - ఈ రెండు విశేషతలు యజమానత్వానికి గుర్తులు. తోడు తోడుగా సర్వ ఆత్మల సంపర్కంలోకి రావడం, స్నేహీగా అవ్వడం, సర్వుల హృదయాల స్నేహమనే ఆశీర్వాదాలు అనగా శుభ భావన అందరి లోపలి నుండి ఆ ఆత్మ పట్ల వెలువడాలి. తెలిసినా, తెలియకపోయినా, దూర సంబంధము లేక సంపర్కమున్నా, ఎవరు చూసినా, వారు స్నేహము కారణంగా వీరు తమవారనే అనుభవం చేయాలి. ఎంతగా గుణాల ధారణతో సంపన్నంగా, గుణాల రూపి ఫల స్వరూపంగా అవుతారో అంత నిర్మానులుగా అవ్వండి. నిర్మాన స్థితి ద్వారా ప్రతి గుణాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడు ధర్మసత్తా కలిగిన మహాన్ఆత్మలని అంటారు. సేవాధారులనగా నిర్మాణం చేసేవారు మరియు నిర్మానులుగా ఉండేవారు. నిర్మానతయే సేవలో సఫలతకు సాధనము. నిర్మానులుగా(నిరహంకారిగా) అవ్వడం వలన సదా సేవలో తేలికగా ఉంటారు. నిరహంకారత లేకుండా, గౌరవం కావాలనే కోరిక ఉన్నట్లయితే భారమైపోతుంది. బరువున్నవారు సదా ఆగి ఉంటారు, వేగంగా వెళ్ళలేరు. కనుక ఒకవేళ ఏదైనా బరువు అనుభవమైతే నిర్మానత లేదని అర్థం చేసుకోండి. ఎక్కడ నిర్మానత ఉంటుందో, అక్కడ ఆవేశం ఉండదు, ఆత్మీయత ఉంటుంది. ఎలాగైతే తండ్రి ఎంత నమ్రచిత్తులై వస్తారో, అలా తండ్రిని అనుసరించండి. ఒకవేళ సేవలో ఏ కొంచెం ఆవేశం వచ్చినా ఆ సేవ సమాప్తమైపోతుంది. బ్రహ్మబాబా స్వయాన్ని ఎంత క్రిందుగా ఉంచుకున్నారు - ఎంత నిరహంకారంగా ఉండి సేవాధారిగా అయ్యాడంటే పిల్లల పాదాలను ఒత్తడానికి కూడా సిద్ధంగా ఉండేవాడు. పిల్లలు నా కంటే ముందు ఉన్నారు. పిల్లలు నా కంటే బాగా ఉపన్యాసము చేయగలరు అని అనేవాడు. ''నేను-ముందు'' అని ఎప్పుడూ అనలేదు. ముందు పిల్లలు, మొదట పిల్లలు, పెద్ద పిల్లలు అని అనడం స్వయాన్ని తక్కువగా చేసుకోవడం, తక్కువగా అవ్వడం కాదు. ఉన్నతంగా వెళ్ళడం. కనుక వీరిని సత్యమైన నంబరువన్ యోగ్య సేవాధారులని అంటారు. ఇతరులకు గౌరవమునిచ్చి స్వయం నిర్మాన్ గా అవ్వడమే పరోపకారం. ఇలా ఇవ్వడమే సదా కొరకు తీసుకోవడం. అల్పకాల వినాశీ గౌరవాన్ని త్యాగం చేసి స్వమానంలో స్థితమై ఉండి, నిరహంకారులుగా అయ్యి గౌరవమిస్తూ వెళ్లండి. ఈ ఇవ్వడమే తీసుకోవడమవుతుంది. గౌరవమివ్వడం అనగా ఆ ఆత్మను ఉమంగ-ఉత్సాహంలోకి తీసుకొచ్చి ముందు ఉంచడం. ఈ సదాకాలపు ఉల్లాస-ఉత్సాహాలు అనగా సంతోష ఖజానా లేక స్వయం సహయోగమిచ్చే ఖజానా, ఆత్మను సదా కొరకు పుణ్యాత్మగా తయారు చేస్తుంది.