10.04.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బ్రాహ్మణ జీవితానికి ఆధారము ప్రభు ప్రేమ

ఈ రోజు బాప్‌దాదా తమ స్నేహీ, సహయోగి, సహజయోగి ఆత్మలను చూస్తున్నారు. అందరూ యోగీ ఆత్మలే. అలాగే దీనిని యోగుల సభ అని అంటారు. అందరూ యోగయుక్త ఆత్మలు అనగా ప్రభు ప్రియ ఆత్మలు కూర్చున్నారు. ఎవరైతే ప్రభువుకు ప్రియమనిపిస్తారో వారు విశ్వానికి ప్రియంగా అవ్వనే అవుతారు. మేము పరమాత్మకు ప్రియమైనవారిగా, భగవంతునికి ప్రియమైనవారిగా, జగత్తుకు ప్రియమైనవారిగా అయిపోయామని అందరికీ ఈ ఆత్మిక నషా, ఆత్మిక హుందాతనము, ఆత్మిక గర్వము సదా ఉంటోందా? కేవలం ఒక్క క్షణము, అర క్షణము దృష్టి పడాలి అని భక్తులు ఎంతో దాహంతో ఉంటారు, దానినే మహోన్నతమని భావిస్తారు. కానీ మీరు ఈశ్వరీయ ప్రేమకు పాత్రులుగా అయ్యారు, ప్రభు ప్రియులుగా అయ్యారు. ఇది ఎంత మహోన్నతమైన భాగ్యము! ఈ రోజుల్లో ప్రతి ఆత్మ బాల్యము నుండి మృత్యువు వరకు ఏం కోరుకుంటోంది? ఏమీ అర్థం చేసుకోని బాలుడు కూడా జీవితములో ప్రేమ కోరుకుంటాడు. మొదట ప్రేమను కోరుకుంటాడు, ఆ తర్వాతనే ధనము కోరుకుంటాడు. ప్రేమ లేకపోతే ఆ జీవితాన్ని నిరాశమయమైన జీవితముగా, రసహీనంగా అనుభవం చేస్తారు. కానీ ఆత్మలైన మీ అందరికీ పరమాత్మ ప్రేమ లభించింది. పరమాత్మకు ప్రియమైనవారిగా అయ్యారు. దీని కంటే పెద్ద వస్తువు ఇంకేదైనా ఉందా? ప్రేమ ఉంటే ప్రపంచమూ ఉంది, ప్రాణమూ ఉంది. ప్రేమ లేకపోతే ప్రాణమూ లేదు, ప్రపంచమూ లేదు. ప్రేమ లభించిందంటే ప్రపంచం లభించినట్లే. అటువంటి ప్రేమను, శ్రేష్ఠమైన భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? ప్రపంచం దీని కోసం దాహముతో ఉంది. ప్రపంచము ఒక్క బిందువు కోసం దాహంతో ఉంది, కాని పిల్లలైన మీకు ఈ ప్రభు ప్రేమ ఆస్తి వంటిది. ఇదే ప్రభు ప్రేమతో పాలింపబడ్తున్నారు అనగా బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఇలా అనుభవం చేస్తున్నారా? ప్రేమ సాగరంలో లవలీనమై ఉంటున్నారా? లేక కేవలం వినడం లేక తెలుసుకోవడంలోనే ఉన్నారా? అనగా సాగర తీరంలో నిల్చొని కేవలం ఆలోచిస్తూ, చూస్తూ ఉంటున్నారా? కేవలం వినడము, తెలుసుకోవడం అనగా తీరం పై నిల్చొని ఉండడం. అంగీకరించి ఇమిడిపోవడాన్ని ప్రేమ సాగరములో లవలీనమవ్వడం అని అంటారు. ప్రభువుకు ప్రియమైనవారిగా అయ్యాక కూడా సాగరంలో ఇమిడిపోవడం లేక లీనమైపోవడం అనుభవం చెయ్యకుంటే ప్రభు ప్రేమకు పాత్రులుగా అయ్యి, పొందినవారిగా కాక దాహంతో ఉండినట్లే. సాగరం వద్దకు వచ్చి కూడా దాహంతో ఉండడాన్ని ఏమంటారు? ఎవరు తమవారిగా చేసుకున్నారో ఆలోచించండి. మీరు ఎవరికి ప్రియమైనవారిగా అయ్యారో, ఎవరి పాలనలో పాలింపబడుతున్నారో ఆలోచించండి. అప్పుడు ఏమవుతుంది? సదా స్నేహములో ఇమిడి ఉన్న కారణంగా సమస్యలు లేక ఏ విధమైన అలజడుల ప్రభావము పడజాలదు. సదా విఘ్నవినాశకులుగా, సమాధాన స్వరూపులుగా, మాయాజీతులుగా అనుభవం చేస్తారు. చాలామంది పిల్లలు - ''జ్ఞానములోని గుహ్యమైన విషయాలు గుర్తుండడం లేదని, కాని నేను పరమాత్మకు ప్రియమైనవాడిని, పరమాత్మ ప్రేమకు అధికారిని అన్న ఒక్క విషయము గుర్తుంటుంది అని అంటారు.'' ఈ ఒక్క స్మృతి ఉన్నా సదా సమర్థులుగా అయిపోతారు. ఇది సహజమే కదా! ఇది కూడా మర్చిపోతే, బయటకు వచ్చే దారి తెలియని ఆటలో(భూల్‌భులయ్యా) చిక్కుకుపోయినట్లే. కేవలం ఈ ఒక్క విషయము సర్వ ప్రాప్తులకు అధికారిగా చేస్తుంది. కావున నేను ప్రభువుకు ప్రియమైనవాడిని, జగత్తుకు ప్రియమైనవాడిని అని సదా గుర్తుంచుకోండి, అనుభవం చేయండి. అర్థమయ్యిందా! ఇది సులభమే కదా! మంచిది. వినడమైతే చాలా విన్నారు. ఇప్పుడు ఇముడ్చుకోవాలి. ఇముడ్చుకోవడమే సమానంగా అవ్వడం. అర్థమయ్యిందా! ప్రభు ప్రేమకు పాత్రులైన పిల్లలందరికి, స్నేహంలో ఇమిడిపోయి ఉన్న శ్రేష్ఠమైన ఆత్మలందరికీ, ప్రేమతో పాలింపబడేందుకు అధికారి పిల్లలకు, ఆత్మిక గర్వంతో ఉండేవారికి, ఆత్మిక నషాలో ఉండే శ్రేష్ఠమైన ఆత్మలకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక- 1. అందరూ సహజయోగి ఆత్మలే కదా! సర్వ సంబంధాల స్మృతి సహజ యోగులుగా చేస్తుంది. ఎక్కడ సంబంధముంటుందో, అక్కడ సులభమవుతుంది. నేను సహజయోగి ఆత్మను - ఈ స్మృతి సర్వ సమస్యలను సహజంగా సమాప్తం చేయిస్తుంది. ఎందుకంటే సహజయోగులు అనగా సదా తండ్రి జతలో ఉండేవారు. ఎక్కడైతే సర్వ శక్తివంతుడైన తండ్రి జతలో ఉన్నారో అక్కడ సర్వ శక్తులు తోడుగా ఉంటాయి కనుక సమస్య సమాధాన రూపంలోకి మారిపోతుంది. ఏ సమస్య అయినా తండ్రికి తెలుసు, సమస్యకు తెలుసు. ఇలా సంబంధం వలన కలిగిన అధికారంతో సమస్య సమాప్తమైపోతుంది. నేనేమి చేయాలి అని కాదు, తండ్ర్రికి తెలుసు, సమస్యకు తెలుసు. సమస్యకే నేను అతీతంగా, తండ్రికి ప్రియంగా ఉన్నాను. కనుక భారమంతా తండ్రిదైపోతుంది, మీరు తేలికైపోతారు. ఎప్పుడైతే స్వయం తేలికగా అవుతారో, అప్పుడిక అన్ని విషయాలు కూడా తేలికైపోతాయి. కొద్దిగా సంకల్పాలు నడిచినా భారంగా అయిపోతారు, విషయాలు కూడా భారంగా అయిపోతాయి. కనుక నేను తేలికగా ఉన్నాను, అతీతంగా ఉన్నానని అనుకుంటే అన్ని విషయాలు తేలికైపోతాయి. ఇదే విధి. ఈ విధి ద్వారా సిద్ధి ప్రాప్తిస్తుంది. వెనుకటి లెక్కాచారాలు చుక్త అవుతున్నా భారము అనుభవమవ్వదు. ఈ విధంగా సాక్షిగా ఉండి చూసినట్లైతే గతం చుక్త అవుతున్నా, వర్తమాన శక్తి ద్వారా సాక్షిగా అయ్యి చూస్తున్నట్లుగా ఉంటుంది. జమ కూడా అవుతోంది, చుక్త కూడా అవుతోంది. జమా శక్తి వలన చుక్త అగుట బరువనిపించదు. కనుక సదా వర్తమానాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఒకవైపు భారీగా అవుతుందో అప్పుడు రెండవ వైపు స్వతహాగానే తేలికైపోతుంది. కనుక వర్తమానము భారీగా ఉన్నట్లయితే గతం తేలికైపోతుంది కదా! వర్తమాన ప్రాప్తి స్వరూపాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటే అంతా తేలికైపోతుంది. కనుక వెనుకటి ఖాతాను తేలిక చేసుకునేందుకు సాధనము - వర్తమానాన్ని శక్తిశాలిగా చేసుకోండి. వర్తమానము శక్తిశాలిగానే ఉంది. వర్తమాన ప్రాప్తిని ముందు ఉంచుకుంటే అంతా సహజమైపోతుంది. గతము శూలం నుండి ముల్లు వలె అయిపోతుంది. ఏమిటి, ఎందుకు అన్నది లేదు. అదంతా గతం. గతాన్ని చూసేదెందుకు? ఎక్కడైతే లగ్నము(పట్టుదల) ఉంటుందో అక్కడ విఘ్నం భారంగా అనిపించదు. ఆటగా అనిపిస్తుంది. వర్తమాన సమయములోని సంతోషాల ఆశీర్వాదాలతో(దువా), ఔషధంతో (దవా) అన్ని లెక్కాచారాలు చుక్త చేసుకోండి.

టీచర్లతో- సదా ప్రతి అడుగులో సఫలతను అనుభవం చేసేవారే కదా! అనుభవీ ఆత్మలే కదా! అనుభవమే అన్నటికంటే గొప్ప అథారిటి. ఈ అథారిటీ గలవారు ప్రతి కార్యంలో సఫలంగా ఉండనే ఉంటారు. సేవకు నిమిత్తంగా అయ్యే అవకాశము లభించడం కూడా విశేషతకు ఒక గుర్తు. కనుక ఏ అవకాశము లభించినా దానిని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. సదా నిమిత్తంగా అయ్యి ముందుకు వెళ్తూ, ముందుకు తీసుకెెళ్తూ ఉంటారు. ఈ నిమిత్త భావమే సఫలతను ప్రాప్తి చేయిస్తుంది. నిమిత్తము మరియు నమ్రతల విశేషతను సదా జతలో ఉంచుకోండి. ఈ విశేషతే సదా విశేష ఆత్మలుగా చేస్తంది. నిమిత్తంగా అయ్యే పాత్ర స్వయానికి కూడా లిఫ్టు ఇస్తుంది. ఇతరులకు నిమిత్తంగా అవ్వడం అనగా స్వయం సంపన్నంగా అవ్వడం. ధృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకుంటూ వెళ్లండి. అంతా సఫలతే సఫలత - ఈ ధృఢత ద్వారా స్వయం సఫలతయే ముందుకు వెళ్తుంది (తీసుకెళ్తుంది).

జన్మిస్తూనే సేవాధారిగా అయ్యే స్వర్ణిమ అవకాశం లభించింది. కనుక అత్యంత గొప్ప ఛాన్స్‌లర్‌గా అయిపోయారు కదా! బాల్యము నుండే సేవాధారిగా అయ్యే భాగ్యాన్ని తీసుకొని వచ్చారు. భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చారు. ఎంతమంది ఆత్మల శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసే కర్తవ్యానికి నిమిత్తంగా అయ్యారు! కనుక ఓహో! నా శ్రేష్ఠ భాగ్యాన్ని చూపించే శ్రేష్ఠ రేఖ! అని సదా గుర్తుండాలి. తండ్రి లభించారు, సేవ లభించింది, సేవాస్థానము లభించింది, సేవకు తోడు తోడుగా శ్రేష్ఠ ఆత్మల శ్రేష్ఠ పరివారము లభించింది. ఇక లభించనిది ఏమిటి? రాజ్య భాగ్యమంతా లభించింది. ఈ సంతోషము సదా ఉండాలి. విధి ద్వారా సదా వృద్ధిని పొందుతూ ఉండండి. నిమిత్త భావముతో ఉండు విధి ద్వారా సేవలో వృద్ధి జరుగుతూ ఉంటుంది.

కుమారులతో - కుమార జీవితంలో రక్షింపబడడం(తప్పించుకోవడం), అన్నిటికంటే గొప్ప భాగ్యము. ఎన్ని జంజాటాల నుండి రక్షింపబడ్డారు! కుమారులు అనగా బంధనముక్త ఆత్మలు. కుమార జీవితము బంధనముక్త జీవితము. కాని కుమార జీవితంలో కూడా ఫ్రీగా ఉండడం అనగా భారమును ఎత్తుకోవడం. కుమారుల కొరకు బాప్‌దాదా డైరెక్షన్‌ ఏమిటంటే - లౌకికంలో ఉంటూ అలౌకిక సేవను చేయాలి. లౌకిక సేవ, సంపర్కాన్ని తయారు చేసుకునే సాధనము. ఇందులో బిజీగా ఉన్నట్లయితే అలౌకిక సేవ చేయగలరు. లౌకికంలో ఉంటూ, అలౌకిక సేవను చేయండి. అప్పుడు బుద్ధి భారంగా అవ్వదు. అందరికీ మీ అనుభవాన్ని వినిపించి సేవ చేయండి. లౌకిక సేవను, సేవా సాధనంగా భావించి చేయండి. అప్పుడు లౌకిక సాధనము - సేవకు చాలా అవకాశాలను ఇప్పిస్తుంది. లక్ష్యమేమో ఈశ్వరీయ సేవ. అయితే అందుకు ఇది సాధనమవుతుంది. ఇలా భావించి లౌకిక సేవ చేయండి. కుమారులు అనగా ధైర్యము గలవారు. వారు ఏది కావాలంటే, అది చేయగలరు. కనుక బాప్‌దాదా సదా సాధనాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే సలహాను ఇస్తారు. కుమారులు అనగా నిరంతర యోగులు. ఎందుకంటే కుమారుల ప్రపంచమే ఒక్క(తండ్రి) బాబా. తండ్రియే ప్రపంచమైనప్పుడు, ప్రపంచంలోకి తప్ప బుద్ధి ఇంకెక్కడికి వెళ్తుంది! ఎప్పుడైతే ఒక్కరే అయిపోయారో అప్పుడు ఒక్కరి స్మృతియే ఉంటుంది కదా! అంతేకాక ఒక్కరినే స్మృతి చేయడం చాలా సులభము. అనేకుల నుండి అయితే ముక్తులైపోయారు. ఒక్కరిలోనే అందరు ఇమిడిపోయి ఉన్నారు. సదా ప్రతి కర్మ ద్వారా సేవ చేయాలి. దృష్టి ద్వారా, నోటి ద్వారా సేవయే సేవ జరగాలి. ఎవరి పై ప్రేమ ఉంటుందో వారిని ప్రత్యక్షం చేసే ఉత్సాహం ఉంటుంది. ప్రతి అడుగులోనూ తండ్రి మరియు సేవ సదా తోడుగా ఉండాలి. మంచిది.

ఎన్నుకోబడిన విశేష అవ్యక్త మహావాక్యాలు - కర్మబంధనమ్తు కర్మాతీతులుగా , విదేహులుగా అవ్వండి .

విదేహి లేక కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు -

1. హద్దులోని నాది - నాది అన్న దేహాభిమానం నుండి ముక్తులుగా అవ్వండి.

2. లౌకికం మరియు అలౌకికం, కర్మ మరియు సంబంధం రెండిటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా అవ్వండి.

3. గత జన్మల కర్మల లెక్కాచారము లేక వర్తమాన పురుషార్థంలో బలహీనత కారణంగా ఏ వ్యర్థ స్వభావ - సంస్కారాలకు వశమవ్వడం నుండి ముక్తులుగా అవ్వండి.

4. ఏదైనా సేవ గాని, సంఘటన గాని, ప్రకృతి ద్వారా పరిస్థితి గాని, స్వ స్థితిని లేక శ్రేష్ఠ స్థితిని అలజడి చేస్తున్నట్లయితే - ఇది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధనం నుండి కూడా ముక్తులుగా అవ్వండి.

5. పాత ప్రపంచంలో, పాత అంతిమ శరీరంలో ఏ విధమైన వ్యాధి అయినా తమ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకు రాకూడదు. దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి. వ్యాధి రావడం, ఇది నిశ్చితం కాని స్థితి కదిలిపోవడం ఇది బంధన యుక్తుల(బంధనంలో ఉన్నవారి) గుర్తు. స్వ చింతన, జ్ఞాన చింతన, శుభ చింతకులుగా అయ్యే చింతన మారిపోయి శరీర వ్యాధి గురించి చింతన నడవడం - దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. కర్మయోగిగా అయ్యి కర్మబంధనాల నుండి సదా అతీతంగా, సదా తండ్రికి ప్రియంగా అవ్వండి - ఇదే కర్మాతీత విదేహి స్థితి. కర్మాతీతము అనగా కర్మల నుండి అతీతమైపోవడమని కాదు. కర్మ నుండి అతీతంగా కాదు, కర్మ బంధనంలో చిక్కుకోవడం నుండి అతీతంగా అవ్వండి. ఎంత పెద్ద కార్యమైనా గాని పని చేయడం లేదు, ఆటలాడుతున్నామని అనిపించాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, లెక్కాచారాలను సమాప్తం చేసే ఏ ఆత్మ అయినా ఎదుర్కునేందుకు వస్తూ ఉన్నా, శరీర కర్మభోగం ఎదుర్కునేందుకు వస్తూ ఉన్నా, హద్దు కామనల నుండి ముక్తులుగా ఉండడమే విదేహి స్థితి. ఎప్పటి వరకు ఈ దేహముంటుందో, కర్మేంద్రియాలతో కలిసి ఈ కర్మక్షేత్రం పైన పాత్రను అభినయిస్తున్నారో, అంతవరకు కర్మలు లేకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరు. కాని కర్మలు చేస్తూ కర్మ బంధనాలకు దూరంగా ఉండడమే కర్మాతీత విదేహి స్థితి. కనుక కర్మేంద్రియాల ద్వారా కర్మ సంబంధంలోకి రావాలి. కర్మబంధనంలో బంధింపబడరాదు. కర్మల వినాశి ఫలము యొక్క కోరికకు వశమవ్వరాదు. కర్మాతీతము అనగా కర్మలకు వశమయ్యేవారు కాదు. యజమానిగా అయ్యి అథారిటీగా అయ్యి కర్మేంద్రియాల సంబంధములోకి రావడం, వినాశి కామనల నుండి అతీతంగా ఉండి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించాలి. యజమాని అయిన ఆత్మను కర్మ తన అధీనం చేసుకోరాదు. కాని అధికారిగా అయ్యి కర్మలను చేయిస్తూ ఉండాలి. చేయించేవారిగా అయ్యి కర్మలు చేయించాలి. దీనినే కర్మ సంబంధంలోకి రావడమని అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధంలోకి వస్తుంది, బంధనంలోకి కాదు. కర్మాతీతము అనగా దేహము, దేహ సంబంధాలు, పదార్థాలు, లౌకికమైన, అలౌకికమైన రెండు సంబంధాల నుండి, బంధనాల నుండి అతీతం అనగా న్యారా(భిన్నము). భలే సంబంధం అనే శబ్ధము - దేహ సంబంధం, దేహ సంబంధీకుల సంబంధం అని అనడానికి వస్తుంది. కాని దేహంలో లేక సంబంధంలో ఒకవేళ అధీనత ఉన్నట్లయితే, సంబంధం కూడా బంధనంగా అయిపోతుంది. కర్మాతీత స్థితిలో కర్మ సంబంధం మరియు కర్మ బంధన రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా సదా ప్రతి విషయంలో రాజీగా(సంతుష్టంగా) ఉంటారు. ఎప్పుడూ కోపగించుకోరు. వారు తమ గత కర్మల లెక్కాచారాల బంధనాల నుండి కూడా ముక్తులుగా అవుతారు. గత కర్మల లెక్కాచారాల ఫల స్వరూపంగా తనవుకు రోగమున్నా, మనసు యొక్క సంస్కారాలు, అన్య ఆత్మల సంస్కారాలతో సంఘర్షిస్తున్నప్పుడు గాని, కర్మాతీతమైన వారు కర్మభోగానికి వశమవ్వకుండా యజమానిగా అయ్యి చుక్త చేయిస్తారు. కర్మయోగిగా అయ్యి కర్మ భోగాన్ని తీర్చుకోవడము - ఇది కర్మాతీతంగా అయిన దానికి గుర్తు. యోగం ద్వారా కర్మభోగాన్ని చిరునవ్వు నవ్వుతూ శూలం నుండి ముల్లుగా చేసి భస్మం చేయడం అనగా కర్మ భోగాన్ని తీర్చుకోవడం. కర్మయోగి స్థితి ద్వారా కర్మ భోగాన్ని పరివర్తన చేసుకోవడమే - కర్మాతీత స్థితి.

వ్యర్థ సంకల్పాలే కర్మ బంధనములోకి తెచ్చే సూక్ష్మ దారాలు. కర్మాతీత ఆత్మ చెడులో కూడా మంచిని అనుభవం చేసుకుంటుంది. ఏమి జరుగుతున్నా అది మంచిదే, నేను కూడా మంచివాడను, తండ్రి కూడా మంచివారే, డ్రామా కూడా మంచిదే - ఈ సంకల్పము బంధనాన్ని కత్త్తిరించే కత్తెర వలె పని చేస్తుంది. బంధనాలు తెగిపోయాయంటే, కర్మాతీతంగా అయిపోతారు. విదేహి స్థితిని అనుభవం చేసేందుకు (ఇచ్ఛా మాత్రం అవిద్యగా) కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా అవ్వండి. ఇటువంటి హద్దు కోరికల నుండి మ్తుమైన ఆత్మ తండ్రి సమానంగా సర్వుల కోరికలను పూర్తి చేసే కామధేనువుగా అవుతుంది. ఎలాగైతే తండ్రి యొక్క సర్వ భండారాలు, సర్వ ఖజానాలు సదా నిండుగా ఉంటాయో, అప్రాప్తి అనే నామ-రూపాలు ఉండవో, అలా తండ్రి సమానంగా సదా మరియు సర్వ ఖజానాలతో నిండుగా అవ్వండి. సృష్టి చక్రంలో పాత్రను అభినయిస్తూ, అనేక దు:ఖాల చక్రాల నుండి ముక్తులుగా ఉండడమే జీవన్ముక్త స్థితి. ఇటువంటి స్థితిని అనుభవం చేసేందుకు అధికారిగా అయ్యి, యజమానిగా అయ్యి సర్వ కర్మేంద్రియాలతో కర్మలను చేయించేవారిగా అవ్వండి. కర్మలోకి రండి, మళ్లీ కర్మ పూర్తవుతూనే అతీతంగా అవ్వండి. ఇదే విదేహి స్థితిని అభ్యాసము చేయడం. ఆత్మ యొక్క ఆది మరియు అనాది స్వరూపం స్వతంత్రమైనది. ఆత్మయే రాజు, ఆత్మయే యజమాని. మానసిక బంధనం కూడా ఉండరాదు. ఒకవేళ మానసిక బంధనమున్నా, ఈ ఒక్క బంధనము అనేక బంధనాలను తీసుకొస్తుంది. కనుక స్వరాజ్య అధికారి అనగా బంధన ముక్తులైన రాజుగా అవ్వండి. అందుకు బ్రేకును శక్తిశాలిగా ఉంచుకోండి. ఏది చూడాలనుకుంటారో అదే చూడండి. ఏది వినాలనుకుంటారో అదే వినండి. ఇంత కంట్రోలింగ్‌ పవర్‌ ఉన్నప్పుడే చివర్లో పాస్‌ విత్‌ ఆనర్‌గా(గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులుగా) అవుతారు అనగా ఫస్ట్‌ డివిజన్‌లోకి రాగలరు.