19.04.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


''భావుక ఆత్మలు మరియు జ్ఞానీ ఆత్మల లక్షణాలు''

ఈ రోజు బాప్దాదా పిల్లందరినీ చూస్తున్నారు. ఎలాంటి పిల్లలు భావనతో తండ్రి వద్దకు చేరుకున్నారు, ఎలాంటి పిల్లలు గుర్తించి పొందేందుకు అనగా తయారయ్యేందుకు చేరుకున్నారు. రెండు రకాల పిల్లలు తండ్రి ఇంటికి చేరుకున్నారు. భావన ఉన్నవారు భావన యొక్క ఫలము యథాశక్తి సంతోషము, శాంతి, జ్ఞానము మరియు ప్రేమల ఫలము పొంది అందులోనే సంతోషపడ్తారు. భక్తిమార్గములోని భావనకు, ఇప్పుడు తండ్రి పరిచయము ద్వారా తండ్రి మరియు పరివారము పట్ల ఉన్న భావనకు తేడా(అంతరం) ఉంది. భక్తిమార్గములోని భావన గుడ్డినమ్మకాల భావన. పరోక్షంగా కలుసుకునే భావన, అల్పకాలిక స్వార్థ భావన. వర్తమాన సమయంలో జ్ఞానం ఆధారంతో ఉన్న పిల్లల భావన భక్తిమార్గం కంటే అత్యంత శ్రేష్ఠమైనది. ఎందుకంటే పరోక్షంగా దేవాత్మల ద్వారా లభించేది కాదు, ప్రత్యక్షంగా తండ్రి పట్ల భావన ఉంది. పరిచయం ఉంది కాని భావనతో ఉన్న పరిచయం మరియు జ్ఞానం ద్వారా ఉన్న పరిచయానికి అంతరం ఉంది. జ్ఞానం ద్వారా పరిచయం అనగా తండ్రి ఎవరు, ఎలాంటి వారు, నేను కూడా ఎవరిని, ఎలాంటి వాడిని అని విధి పూర్వకంగా తెలుసుకోవడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. తెలుసుకోవడం అయితే అందరూ తెలుసుకున్నారు కాని భావనా పూర్వకంగా మరియు జ్ఞానం ద్వారా విధి పూర్వకంగా....... ఈ తేడాను తెలుసుకోవాల్సి ఉంటుంది. కావున ఈ రోజు బాప్దాదా చాలామంది పిల్లల భావనను చూస్తున్నారు. భావన ద్వారా తండ్రిని గుర్తించినా వారసత్వమైతే ప్రాప్తి చేసుకుంటారు. కాని 'సంపూర్ణ వారసత్వానికి అధికారి' మరియు 'వారసత్వానికి అధికారి' ఈ అంతరం ఉంటుంది. స్వర్గ భాగ్యము లేక జీవన్ముక్తికి అధికారము భావన ఉన్నవారికి మరియు జ్ఞానం ఉన్నవారికి ఇరువురికీ లభిస్తుంది. కేవలం పదవిని ప్రాప్తి చేసుకోవడంలో తేడా వచ్చేస్తుంది. 'బాబా' అనే శబ్ధము ఇరువురూ అంటారు, సంతోషంగా చెప్తారు అందువలన బాబా అని అనడం మరియు అర్థం చేసుకున్నందుకు ఫలముగా వారసత్వ ప్రాప్తి అయితే తప్పకుండా జరగాల్సిందే. జీవన్ముక్తి అధికారానికి హక్కుదారులుగా అయితే అవుతారు. కాని అష్టరత్నాలు, 108 విజయీ రత్నాలు, 16 వేలు, తర్వాత 9 లక్షలు. ఎంత తేడా అయిపోయింది. 16 వేల మాల కూడా ఉంది, 108 మాల కూడా ఉంది. 108లో 8 విశేషమైనవారు కూడా ఉన్నారు. మాలలోని మణులుగా అయితే అందరూ అవుతారు. ఇరువురిని మణులనే అంటారు. 16 వేల మాలలోని పూసలు కూడా సంతోషంగా నషాతో నా బాబా, నా రాజ్యము అని అంటారు. రాజ్య పదవిలో రాజ్య సింహాసనానికి అధికారులు, రాజ్యవంశంలోని అధికారులు, రాజ్యవంశం సంపర్కంలోకి వచ్చే అధికారులు, ఈ అంతరం అయితే ఉంటుంది.

భావుక ఆత్మలకు, జ్ఞాన యుక్త అత్మలకు ఇరువురికీ నషా ఉంటుంది. ప్రభు ప్రేమకు సంబంధించిన విషయాలు చాలా మంచిగా వినిపిస్తారు. ప్రేమ స్వరూపంలో ప్రపంచాన్ని కూడా పూర్తిగా మర్చిపోతారు. నాకు ఒక్కడే తండ్రి అని ఇదే ఏకాగ్రతతో(లగనముతో) పాటలు కూడా మంచిగా పాడ్తారు. కాని శక్తి రూపంగా ఉండరు. చాలా సంతోషంగా కూడా ఉన్నట్లు చూస్తాము. కాని మాయ ద్వారా చిన్న విఘ్నము వచ్చినట్లయితే భావన కలిగిన ఆత్మలు చాలా త్వరగా భయపడ్తారు. ఎందుకంటే జ్ఞాన శక్తి తక్కువగా ఉంటుంది. ఇప్పుడిప్పుడు చాలా సంతోషంగా తండ్రి పాటలు పాడుతూ ఉంటారు, ఇప్పుడిప్పుడే మాయ ద్వారా వచ్చే చిన్న దాడిని కూడా ఎదిరించలేక సంతోషంగా పాడే పాటలకు బదులు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమవుతుంది, ఎలా అవుతుంది...... ఇలా ఏమిటి, ఎందుకు అనే పాటలు పాడడంలో కూడా తక్కువగా ఏమీ ఉండరు. జ్ఞానీ ఆత్మలు సదా స్వయాన్ని తండ్రి జతలో ఉండే మాస్టర్ సర్వ శక్తివంతులుగా భావించినందున మాయను దాటుకుంటారు. ఏమిటి, ఎందుకు అనే పాటలు పాడరు. భావన కలిగిన ఆత్మలు కేవలం ప్రేమ శక్తితో ముందుకు వెళ్తూ ఉంటారు. మాయను ఎదుర్కునే శక్తి ఉండదు. జ్ఞానీ ఆత్మలు సమానంగా అయ్యే లక్ష్యంతో సర్వ శక్తులను అనుభవం చేసుకొని ఎదుర్కోగలరు. ఇప్పుడు మిమ్ములను మీరు నేను ఎవరు? అని ప్రశ్నించుకోండి. భావన కల్గిన ఆత్మనా లేక జ్ఞానీ ఆత్మనా? తండ్రి ఏమో భావన కలిగిన వారిని చూసి కూడా సంతోషిస్తారు. నా బాబా అని అన్నందున అధికారులుగా అయితే అయ్యారు కదా! అంతేకాక అధికారం తీసుకునేందుకు కూడా హక్కుదారులుగా అవ్వనే అయ్యారు. పూర్తిగా తీసుకోవడం లేక కొద్దిగా తీసుకోవడం - అది పురుషార్థం ప్రమాణంగా ఒడి(జోలె) ఎంత నింపుకోవాలంటే అంత నింపుకోవచ్చు. ఎందుకంటే 'నా బాబా' అని అన్నారు కనుక ఆ తాళంచెవి అయితే పెట్టనే పెట్టారు కదా! ఇక ఏ ఇతర తాళం చెవి లేదు. ఎందుకంటే బాప్దాదా సాగరుడు కదా! తరగనివారు, అనంతమైనవారు. తీసుకునేవారు అలసిపోతారు, ఇచ్చేవారు అలసిపోరు. ఎందుకంటే వారు ఏం శ్రమ చెయ్యవలసి ఉంటుంది? దృష్టి ఇచ్చారు, అధికారం ఇచ్చారు. తీసుకునే వారికి కూడా కష్టము లేదు. కేవలం నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకుంటారు. తమ బలహీనత కారణంగా పోగొట్టుకొని మళ్లీ పొందేందుకు శ్రమ చెయ్యవలసి పడ్తుంది. పోగొట్టుకోవడం పొందడం, పొందడం పోగొట్టుకోవడం ఈ శ్రమ కారణంగా అలసిపోతారు. జాగ్రత్తగా తెలివిగలవారిగా ఉంటే సదా ప్రాప్తి స్వరూపంగా ఉంటారు. ఎలాగైతే సత్యయుగంలో దాసీలు సదా ముందు, వెనుక సేవ కొరకు తోడుగా(రెడీగా) ఉంటారో అలా జ్ఞానీ ఆత్మకు, తండ్రి సమానంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మకు ఇప్పుడు సర్వశక్తులు, సర్వగుణాలు సేవాధారి రూపంలో సదా తోడు నిభాయిస్తాయి. ఏ శక్తిని ఆహ్వానం చేసినా, ఏ గుణాన్ని ఆహ్వానం చేసినా చిత్తం ప్రభూ(జీ హాజిర్) అని ప్రత్యక్షం అవుతాయి. ఇలాంటి స్వరాజ్య అధికారులు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. కావున శ్రమ(కష్టం) అనిపించదు కదా. ప్రతి శక్తి, ప్రతి గుణము ద్వారా సదా విజయమే అని అనుభవం చేస్తారు. ఉదాహరణానికి డ్రామా చేసి చూపిస్తారు కదా! రావణుడు తన సాథీలను(వికారాలను) గర్జించి యుద్ధానికి పురికొల్పుతాడు. బ్రాహ్మణ ఆత్మ, స్వరాజ్యాధికారి ఆత్మ తన శక్తులు, గుణాలను ప్రోత్సహిస్తాడు. కావున ఇలాంటి స్వరాజ్య అధికారులుగా అయ్యారా? లేక సమయానికి ఈ శక్తులను కార్యంలోకి తీసుకు రాలేకున్నారా? బలహీనమైన రాజును ఎవ్వరూ గౌరవించరు. రాజును ప్రజలు గౌరవించవలసి ఉంటుంది. పరాక్రమశాలి రాజు అందరినీ తన ఆజ్ఞానుసారము నడిపిస్తాడు, రాజ్యాన్ని పొందుతాడు(ప్రాప్తి చేసుకుంటాడు). కావున సహజాన్ని కష్టంగా చేసుకోవడం, తర్వాత అలసిపోవడం ఇది నిర్లక్ష్యానికి గుర్తు. పేరుకు రాజు కాని అధికారంలో ఎవ్వరూ లేరు. దీనిని ఏమంటారు? చాలామంది, సహనశక్తి ఉండాలని అర్థం చేసుకున్నాను కాని తర్వాత జ్ఞాపకం వచ్చింది అని అంటారు. ఆ సమయంలో ఆలోచిస్తూ కూడా సహన శక్తి ద్వారా పని తీసుకోలేరు. దీని అర్థం - ఇప్పుడు పిలిచారు కాని రేపు వస్తుంది. అలా వచ్చినట్లయితే ఆర్డర్లో ఉన్నట్లు అవుతుందా! జరిగిపోయింది అనగా తమ శక్తి ఆర్డర్లో లేదు అని అర్థము. సేవాధారి, సమయానికి సేవ చెయ్యకపోతే అటువంటి సేవాధారులను ఏమంటారు? కనుక సదా స్వరాజ్యాధికారులుగా అయ్యి సర్వ శక్తులను, గుణాలను స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సేవలో వినియోగించండి. అర్థమయ్యిందా! కేవలం భావుక ఆత్మలుగా అవ్వకండి. శక్తిశాలురుగా అవ్వండి. మంచిది - వెరైటీ రకాల ఆత్మల మేళాను చూసి సంతోషిస్తున్నారు కదా. మధువనంవారు ఎన్ని మేళాలు చూస్తారు! ఎన్ని వెరైటీ గ్రూపుల వారు వస్తారు. బాప్దాదా కూడా వెరైటీ పుష్పగుచ్ఛాన్ని చూసి సంతోషిస్తారు. భలే వచ్చారు. శివుని ఊరేగింపుకు ఉన్న గాయనాన్ని చూస్తున్నారు కదా! బాబా బాబా అంటూ అందరూ బయలుదేరారు కదా! మధువనానికి అయితే చేరుకున్నారు. ఇప్పుడు సంపూర్ణ గమ్యానికి చేరుకోవాలి. మంచిది.

సదా శ్రేష్ఠ అధికారాన్ని పొందే విజయీ ఆత్మలకు, సదా తమ అధికారంతో సర్వ శక్తుల ద్వారా సేవ చేసే శక్తిశాలి ఆత్మలకు, సదా రాజ్య సింహాసనాధికారిగా అయ్యే అధికారి ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

వేరు వేరు పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక

పంజాబ్ జోన్ తో :- పంజాబ్ నివాసులందరూ మహావీరులుగా ఉన్నారు కదా! భయపడేవారైతే కారు కదా? ఏ విషయానికీ భయం లేదు. అన్నిటికంటే పెద్ద భయం మృత్యువు. ఇప్పుడు మీరందరూ చనిపోయే ఉన్నారు. చనిపోయిన వారికి మరణమంటే భయమేముంది! మృత్యువుతో భయం ఎప్పుడు ఉంటుందంటే - ఇప్పుడు ఇది చెయ్యాలి, వీరు చేస్తే బాగుండును అని ఆలోచించినప్పుడు అది పూర్తి అవ్వకపోతే మృత్యువంటే భయం ఉంటుంది. మీరందరు అన్ని పనులు పూర్తి చేసి ఎవరెడీగా ఉన్నారు. ఈ పాత శరీరం విడిచిపెట్టేందుకు ఎవరెడీగా ఉన్నారు కదా. అందువలన మీకు భయం లేదు. అంతేకాక భయభీత ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా శక్తిశాలిగా తయారుచేసేవారిగా, దు:ఖం సమయంలో సుఖాన్ని ఇచ్చే ఆత్మలుగా ఉన్నారు. మీరు సుఖదాత పిల్లలు. ఎలాగైతే చీకటిలో, చీకటికి వెలుతురు ఉన్నట్లయితే ప్రకాశంగా అవుతుందో అలా దు:ఖ వాతావరణంలో సుఖాన్ని ఇచ్చే శ్రేష్ఠ ఆత్మలు మీరు. కావున సదా సుఖాన్ని ఇచ్చే శ్రేష్ఠ భావనయే ఉంటుంది! సదా సుఖం ఇవ్వాలి, శాంతి ఇవ్వాలి. శాంతిదాత పిల్లలు శాంతి దేవతలు. కావున శాంతి దేవతలు ఎవరు? ఒంటరిగా తండ్రి ఒక్కరే కాదు మీరందరూ కూడా. కావున శాంతిని ఇచ్చే శాంతిదేవతల్లారా! శాంతిని ఇచ్చే కార్యము చేస్తున్నారు కదా! మీరు ఏం సేవ చేస్తారు? అని మనుష్యులు అడుగుతారు. కావున మీరందరు ఇదే చెప్పండి. ఈ సమయంలో విశేషంగా ఏది అవసరమో ఆ కార్యము మేము చేస్తున్నాము. మంచిది, బట్టలు కూడా ఇస్తారు, ధాన్యం కూడా ఇస్తారు కాని అన్నింటికంటే అవసరమైనది శాంతి. కావున అందరికీ అవసరమైన వస్తువు ఏదైతే ఉందో అది మేము ఇస్తున్నాము. దీనికంటే గొప్ప సేవ ఇంకేముంది? మనసు శాంతిగా ఉన్నట్లయితే ధనం కూడా పనికి వస్తుంది. మనసు శాంతిగా లేకపోతే ధన శక్తి కూడా బాధపెడ్తుంది. ఇప్పుడు ఇలాంటి శాంతి యొక్క శక్తిశాలి అలను వ్యాపింపజేయ్యండి. తద్వారా దేశం మొత్తంలో ఇది శాంతినిచ్చే స్థానం అని అందరూ అనుభవం చెయ్యాలి. ఒకరు ఇంకొకరితో వినాలి, రెండు ఘడియలైనా ఇక్కడ చాలా శాంతి లభిస్తుందని అనుభవం చేసుకునేందుకు రావాలి. ఈ శబ్ధము వ్యాపించాలి. శాంతికి కేంద్రం ఇదే సేవాస్థానం అనే ధ్వని వ్యాపించాలి. ఎంత అశాంతి ఆత్మ అయినా కావచ్చు. ఎలాగైతే రోగి ఆసుపత్రికి చేరుకుంటాడో అలా అశాంతి సమయంలో ఈ శాంతి స్థానానికే వెళ్ళాలని అనుకోవాలి. ఇలాంటి అలను వ్యాపింపజేయండి. ఇది ఎలా వ్యాపిస్తుంది? దీని కొరకు ఒకరు - ఇద్దరు ఆత్మలను పిలిపించి అనుభవం చేయించండి. ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి ఇలా వ్యాపిస్తూ ఉంటుంది. ఎవరైతే అశాంతిగా ఉన్నారో వారిని ముఖ్యంగా పిలిపించి కూడా శాంతిని అనుభవం చేయించండి. ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారికి శాంతిని అనుభవం చేసుకోండి అని సందేశం ఇవ్వండి. పంజాబ్ వారు విశేషంగా ఈ సేవ చెయ్యాలి. ఇప్పుడు శబ్ధాన్ని బిగ్గరగా వ్యాపింపచేసేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు భ్రమిస్తున్నారు. ఏదో ఒక స్థానం కావాలి. అది ఏ స్థానం...... ఆ పరిచయం లేదు. వెతుకుతూ ఉన్నారు. ఒక స్థానం నుండి అయితే భ్రమించారు, ఇది స్థానం కాదు అని అర్థం చేసుకున్నారు. ఇలా భ్రమిస్తున్న ఆత్మలకు ఇప్పుడు సహజంగా ఆశ్రయం ఇవ్వలేరా? ఇలాంటి సేవ చెయ్యండి. కర్ఫ్యూ ఉండవచ్చు ఏదైనా జరగవచ్చు. సంపర్కంలోకి అయితే వస్తారు కదా! సంపర్కంలో ఉన్నవారికి అనుభవం చేయించినట్లయితే ఇలాంటి ఆత్మలు ధ్వనిని వ్యాపింపచేస్తాయి. వారికి ఒకటి రెండు గంటలు అయినా యోగశిబిరం చేయించండి. కొంచెం శాంతిని అనుభవం చేసినా చాలా సంతోషిస్తారు. ధన్యవాదాలు తెలుపుతారు. మేము చెయ్యవలసిందే అని లక్ష్యం ఉంటే మార్గం కూడా లభిస్తుంది. ఈ విధంగా పేరు ప్రసిద్ధి చేసి చూపించండి. పంజాబ్ భూమి ఎంత కఠినమైనదో దానిని అంత మెత్తగా చెయ్యగలరు.

2. సదా స్వయాన్ని ఫరిస్తా అనగా డబల్ లైటుగా అనుభవం చేస్తున్నారా? ఈ సంగమయుగం యొక్క అంతిమ స్వరూపం ఫరిస్తా కదా. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తియే ఫరిస్తా జీవితము. ఫరిస్తాలు అనగా వారికి దేహము మరియు దేహ సంబంధాలతో సంబంధం ఉండదు. దేహము మరియు దేహ సంబంధాలు, అందరితో సంబంధం సమాప్తి అయ్యిందా? లేక కొంచెం అంటుకొని ఉందా? కొంచెము సూక్ష్మ తగుల్పాటు అనే తాడు ఉన్నా ఎగరలేరు. క్రిందకు వచ్చేస్తారు. అందువలన ఫరిస్తా అనగా ఏ పాత సంబంధాలు లేవు. జీవితమే కొత్తది అయినప్పుడు అన్నీ కొత్తవిగానే ఉంటాయి. సంకల్పాలు కొత్తవి, సంబంధాలు కొత్తవి, వృత్తి కొత్తది. అన్నీ కొత్తవిగానే ఉంటాయి. ఇప్పుడు పాత జీవితం స్వప్నంలో కూడా స్మృతిలోకి రాజాలదు. కొంచెం దేహ భ్రాంతిలోకి వచ్చినా ఎక్కడో సంబంధం ఉంటుంది అందుకే దేహ భ్రాంతిలోకి వస్తారు. సంబంధమే లేకుంటే బుద్ధి వెళ్ళలేదు. విశ్వంలో ఇంతమంది ఆత్మలు ఉన్నారు వారితో సంబంధం లేకుంటే గుర్తుకు రారు కదా! సంబంధం ఎవరితో ఉంటే వారు గుర్తుకొస్తారు. కావున దేహ భావములోకి రావడం అనగా దేహ సంబంధముంది అని అర్థము. దేహముతో ఏ కొద్దిగా ఆకర్షణ ఉన్నా ఎలా ఎగరగలరు! బరువున్న వస్తువును ఎంత పైకి విసిరినా కిందికే వస్తుంది. కావున ఫరిస్తా అనగా తేలికగా ఉండేవారు. ఏ భారము ఉండదు. మరజీవాగా అవ్వడం అనగా భారం నుండి ముక్తులుగా అవ్వడం. ఒకవేళ ఏ కొంచెం ఉన్నా త్వరత్వరగా సమాప్తి చెయ్యండి. లేకపోతే సమయం ఈల మ్రోగగానే అందరూ ఎగరడం ప్రారంభిస్తారు. భారం ఉన్నవారు క్రిందనే మిగిలిపోతారు. భారం ఉన్నవాళ్ళు ఎగిరేవారిని చూచేవారిగా అవుతారు.

కావున ఏ సూక్ష్మ దారము కూడా మిగిలి లేదు కదా అని చెక్ చేసుకోండి. అర్థమయ్యిందా! ఈ రోజు విశేష వరదానాన్ని గుర్తుంచుకోండి. ''నిర్భంధన ఫరిస్తా ఆత్మలు, బంధనముక్త్ఆత్మలు'' ఫరిస్తా శబ్ధము ఎప్పుడూ మర్చిపోకండి. ఫరిస్తాలుగా భావిస్తే ఎగిరిపోతారు. వరదాత ఇచ్చిన వరదానం గుర్తుంచుకుంటే సదా సంపన్నంగా ఉంటారు.

3. సదా స్వయాన్ని శాంతి సందేశాన్ని ఇచ్చే శాంతి సందేశకులుగా భావిస్తున్నారా? బ్రాహ్మణ జీవితములోని కార్యము - సందేశాన్ని ఇవ్వడము. ఎప్పుడూ ఈ కార్యాన్ని మర్చిపోవడం లేదు కదా? ప్రతి రోజూ, శ్రేష్ఠ ఆత్మనైన నా శ్రేష్ఠ కార్యమును ఎంతవరకు చేశాను?ఎంతమందికి సందేశం ఇచ్చాను? ఎంతమందికి శాంతిని దానం చేశాను? అని చెక్ చేసుకోండి. మీరు సందేశాన్ని ఇచ్చే మహాదానీ వరదానీ ఆత్మలు. మీకు ఎన్ని టైటిల్స్ఉన్నాయి? ఈనాటి ప్రపంచంలో ఎంత పెద్ద టైటిల్స్అయినా మీ ముందు అవన్నీ చిన్నవే. ఆ టైటిల్స్ఇచ్చేవారు ఆత్మలు. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు టైటిల్ఇచ్చేవారు తండ్రి. కావున తమ భిన్న భిన్న టైటిల్స్ ని స్మృతిలో ఉంచుకొని సదా అదే సంతోషం అదే సేవలో ఉండండి. టైటిల్స్ స్మృతిలో ఉంటే సేవ స్వత:గానే స్మృతిలోకి వస్తుంది. మంచిది.