17.12.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'' వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సాధనము-సమర్థ సంకల్పాల ఖజానా అయిన జ్ఞాన మురళి ''

ఈ రోజు బాప్దాదా సంగమయుగ అలౌకిక ఆత్మిక సభలోకి పిల్లలతో మిలనము చేసేందుకు వచ్చారు. ఇది ఆత్మిక సభ. ఆత్మిక మిలనము కల్పమంతటిలో ఇప్పుడు మాత్రమే చేయగలరు. ఆత్మలతో పరమాత్ముని మిలనము. ఈ శ్రేష్ఠమైన మిలనము సత్యయుగ సృష్టిలో కూడా జరగదు. అందుకే ఈ యుగాన్ని మహాన్ యుగము, మహా మిలనము చేసే యుగము, సర్వ ప్రాప్తుల యుగము, అసంభవము నుండి సంభవముగా అయ్యే యుగము, సహజంగా శ్రేష్ఠమైన అనుభూతులు చేయించే యుగము, విశేష పరివర్తన యుగము, విశ్వ కళ్యాణకారి యుగము, సహజంగా వరదానాలు లభించే యుగమని అంటారు. ఇటువంటి యుగములో మహోన్నతమైన పాత్రధారులు ఆత్మలైన మీరే. ఇటువంటి మహాన్(గొప్ప) నషా సదా ఉంటోందా? మొత్తం విశ్వమంతా ఏ తండ్రినైతే ఒక్క క్షణం చూచేందుకు ఛాత్రకులుగా ఉన్నారో ఆ తండ్రి వారసత్వానికి సెకండులో అధికారులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలము మేము అన్నది స్మృతి ఉంటోందా? ఈ స్మృతి స్వతహాగానే సమర్థులుగా చేస్తుంది. ఇటువంటి సమర్థ ఆత్మలుగా అయ్యారా? సమర్థులు అనగా వ్యర్థమును సమాప్తము చేసేవారు. వ్యర్థము ఉంటే సమర్థత ఉండదు. ఒకవేళ మనసులో వ్యర్థ సంకల్పాలు ఉంటే సమర్థ సంకల్పాలు నిలువజాలవు. వ్యర్థము పదే పదే క్రిందకు తీసుకొస్తుంది. సమర్థ సంకల్పాలు సమర్థుడైన తండ్రితో మిలనాన్ని కూడా అనుభవం చేయిస్తాయి, మాయాజీతులుగా కూడా చేస్తాయి, సఫలతా స్వరూపులైన సేవాధారులుగా కూడా తయారు చేస్తాయి. వ్యర్థ సంకల్పాలు ఉల్లాస-ఉత్సాహాలను సమాప్తం చేస్తాయి. వారు సదా ఎందుకు, ఏమిటి అనే తికమకలోనే ఉంటారు. కావున చిన్న చిన్న విషయాలలో స్వయంతో నిరుత్సాహంగా ఉంటారు. వ్యర్థ సంకల్పాలు సదా సర్వ ప్రాప్తుల ఖజానాను అనుభవం చేయడం నుండి వంచితులుగా చేసేస్తాయి. వ్యర్థ సంకల్పాలు చేసే వారి మానసిక కోరికలు లేక ఇష్టాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇది చేస్తాను, ఇది చేయాలి, ఇటువంటి ప్లాన్లు చాలా త్వరగా చేస్తారు అనగా తీవ్ర వేగంతో తయారు చేస్తారు ఎందుకంటే వ్యర్థ సంకల్పాల వేగం తీవ్రంగా ఉంటుంది. అందువలన చాలా ఉన్నతమైన విషయాలను ఆలోచిస్తారు. కానీ సమర్థంగా లేని కారణంగా ప్లానుకు, ప్రాక్టికల్(ఆచరణ)కు చాలా వ్యత్యాసము వచ్చేస్తుంది. కావున నిరుత్సాహంగా అయిపోతారు. సమర్థ సంకల్పాలు చేయువారు సదా ఏమి ఆలోచిస్తారో అది చేస్తారు. ఆలోచించడం మరియు చేయడం రెండూ సమానంగా ఉంటాయి. సదా ఓర్పుతో నెమ్మదిగా సంకల్పాలు చేస్తారు మరియు కర్మలలో సఫలత పొందుతారు. వ్యర్థ సంకల్పాలు తీవ్రమైన తుఫాను వలె అలజడిలోకి తీసుకొస్తాయి. సమర్థ సంకల్పాలు సదా వసంత ఋతువు వలె సస్యశ్యామలంగా చేసేస్తాయి. వ్యర్థ సంకల్పాలు ఎనర్జీని(శక్తిని) అనగా ఆత్మిక శక్తిని, సమయాన్ని పోగొట్టుకునేందుకు నిమిత్తంగా అవుతాయి. సమర్థ సంకల్పాలు సదా ఆత్మిక శక్తిని అనగా ఎనర్జీని జమ చేస్తాయి. సమయాన్ని సఫలం చేస్తాయి. వ్యర్థ సంకల్పాలు రచనయే అయినా ఈ వ్యర్థ రచన, రచయిత అయిన ఆత్మను కూడా వ్యాకుల పరుస్తాయి అనగా మాస్టర్ సర్వశక్తివంతుడైన సమర్థ ఆత్మను తన గౌరవము నుండి దూరం చేసేస్తాయి. సమర్థ సంకల్పాల ద్వారా సదా శ్రేష్ఠ గౌరవం యొక్క స్మృతి స్వరూపులుగా ఉంటారు. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు కూడా. అయినా చాలామంది పిల్లలు వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకూ వ్యర్థ సంకల్పాలు ఎందుకు నడుస్తున్నాయి? దీనికి కారణం ఏమిటి? బాప్దాదా సమర్థ సంకల్పాల ఖజానా ఏదైతే ఇచ్చారో అది - ఈ జ్ఞాన మురళి. మురళిలోని ఒక్కొక్క మహావాక్యము సమర్థమైన ఖజానా. ఈ సమర్థ సంకల్పాల ఖజానా మహత్వము తక్కువగా ఉన్న కారణంగా సమర్థ సంకల్పాలు ధారణ అవ్వడం లేదు. కనుక వ్యర్థానికి ఛాన్సు(అవకాశం) లభిస్తుంది. ప్రతి సమయం ఒక్కొక్క మహావాక్యాన్ని మననం చేస్తూ ఉంటే సమర్థ బుద్ధిలో వ్యర్థము రాజాలదు. బుద్ధి ఖాళీగా ఉన్నట్లయితే స్థానము ఖాళీగా ఉన్నందున వ్యర్థము వచ్చేస్తుంది. అసలు మార్జినే(అవకాశమే) లేకపోతే వ్యర్థము ఎలా రాగలదు? సమర్థ సంకల్పాలతో బుద్ధిని బిజీగా ఉంచుకునే విధానం రాకపోవడం అనగా వ్యర్థ సంకల్పాలను ఆహ్వానించడమే.

బిజీగా ఉండే బిజినెస్ మెన్ (వ్పాపారస్థునిగా) అవ్వండి. రాత్రింబవళ్ళు ఈ జ్ఞానరత్నాల బిజినెస్ మెన్ అవ్వండి. ఖాళీ ఉండదు, వ్యర్థ సంకల్పాలకు మార్జిన్ కూడా ఉండదు. కావున విశేషమైన విషయమేమిటంటే - బుద్ధిని సమర్థ సంకల్పాలతో సదా నిండుగా ఉంచుకోండి. అందుకు ఆధారం - ప్రతిరోజూ మురళి వినడం, ఇముడ్చుకోవడం మరియు స్వరూపంగా అవ్వడం. ఈ మూడు స్థితులు ఉండాలి. వినడం చాలా మంచిగా అనిపిస్తుంది. వినకుండా ఉండజాలరు. ఇది ఒక స్థితియే. ఇటువంటి స్థితిలో ఉన్నవారు విన్నంతసేపు వినాలనే కోరిక, కర్ణ రసము ఉన్న కారణంగా ఆ సమయం వరకు అదే రసము యొక్క ఆనందంలో ఉంటారు. వినడంలో ఆనందంగా కూడా ఉంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది..... అను పాట కూడా సంతోషంగా పాడ్తారు కానీ వినడం సమాప్తమైతే ఆ రసము కూడా సమాప్తమైపోతుంది. ఎందుకంటే ఇముడ్చుకోలేదు. ఇముడ్చుకునే శక్తి ద్వారా బుద్ధిని సమర్థ సంకల్పాలతో సంపన్నం చేసుకోకపోతే వ్యర్థం వస్తూ ఉంటుంది. ఇముడ్చుకునేవారు సదా నిండుగా ఉంటారు కావున వ్యర్థ సంకల్పాల నుండి దూరంగా ఉంటారు. కానీ స్వరూపంగా అయ్యేవారు శక్తిశాలిగా అయ్యి, ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తారు. కావున ఆ లోపముండిపోతుంది.

వ్యర్థము నుండైతే సురక్షితంగా ఉంటారు, శుద్ధ సంకల్పాలలో ఉంటారు. కానీ శక్తి స్వరూపులుగా అవ్వజాలరు. స్వరూపంగా అయ్యేవారు సదా సంపన్నంగా, సదా సమర్థంగా శక్తిశాలి కిరణాల ద్వారా ఇతరుల వ్యర్థమును కూడా సమాప్తం చేసేవారిగా ఉంటారు. కావున నేను ఎవరిని అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. వినేవారిగా ఉన్నామా, విని ఇముడ్చుకునే వారిగా ఉన్నామా లేక స్వరూపంగా అయ్యేవారిగా ఉన్నామా? శక్తిశాలి ఆత్మ సెకనులో వ్యర్థమును సమర్థములోకి పరివర్తన చేసేస్తుంది. మీరు శక్తిశాలి ఆత్మలు కదా? కనుక వ్యర్థమును పరివర్తన చేయండి. ఇప్పటివరకు వ్యర్థములోనే శక్తిని, సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటే సమర్థంగా ఎప్పుడవుతారు? చాలాకాలం సమర్థంగా ఉన్నవారే చాలాకాలం సంపన్నంగా రాజ్యం చేయగలరు. అర్థమయ్యిందా!

ఇప్పుడిది మీ సమర్థ స్వరూపము ద్వారా ఇతరులను సమర్థంగా చేసే సమయము. స్వయంలోని వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ధైర్యం ఉంది కదా? మాహారాష్ట్ర అన్న పేరు ఎలా ఉందో అలా మీరు మహాన్ గా ఉన్నారు కదా! మహా సంకల్పము చేసేవారు కదా. బలహీన సంకల్పాలు చేసేవారు కాదు. సంకల్పం చేస్తూనే జరుగుతుంది. దీనినే మహాన్ సంకల్పము అని అంటారు. అలాంటి మహాన్ఆత్మలు కదా! పంజాబ్ వారు ఏం ఆలోచిస్తున్నారు? పంజాబ్ వారు సాహసవంతులు. పంజాబులో మాయ శక్తి కలిగినవారు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈశ్వరీయ శక్తి కలిగినవారు మాయను ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మాయను ఛాలెంజ్ చేసేవారు కదా! భయపడేవారు కాదు కదా! ఎలాగైతే వారు మా రాజ్యము కావాలి అని అంటున్నారో, అలా మీరు కూడా మాయను ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మా రాజ్యము రానున్నది అని గర్జిస్తున్నారు. ఇటువంటి పరాక్రమవంతులు కదా! పంజాబ్ వారు కూడా సాహసవంతులే. మహారాష్ట్రవారు మహాన్ఆత్మలు. కర్ణాటకవారి విశేషత - మహోన్నతమైన భావన. భావన కారణంగా భావనకు ఫలము సహజంగా లభిస్తూ ఉంటుంది. కర్ణాటక వారు భావన ద్వారా మహా ఫలాన్ని భుజించేవారు. కావున సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. సంతోషమనే ఫలమును తినే భాగ్యశాలీ ఆత్మలు. కావున మహారాష్ట్రవారు మహాన్ సంకల్పధారులు, పంజాబ్ వారు గొప్ప ఛాలెంజ్ చేసే మహారాజ్యాధికారులు, కర్ణాటకవారు మహాన్ ఫలాన్ని భూజించేవారు. ముగ్గురూ మహాన్ అయిపోయారు కదా!

మహారాష్ట్ర అనగా అన్నిటిలోనూ మహాన్. ప్రతి సంకల్పము మహాన్(గొప్పది), స్వరూపమూ మహాన్, కర్మ మహాన్, సేవ కూడా మహానే(గొప్పదే). అన్నిటిలోనూ మహాన్ గా ఉండేవారు. కావున ఈ రోజు మూడు గొప్ప నదులు కలిసాయి. మహాన్ నదులు కలిశాయి కదా! ఈ రోజు మహాన్ నదులు, మహాసాగరముతో కలుస్తాయి. కావున మిలన సభలోకి వచ్చారు. ఈ రోజు సభను కూడా జరుపుకోవాలి కదా! మంచిది.

ఇటువంటి సదా సమర్థులకు, సదా ప్రతి మహావాక్యపు స్వరూపంగా అయ్యేవారికి, బహుకాలపు సమర్థులైన ఆత్మలను సమర్థులుగా చేసే బాప్దాదాల సర్వ సమర్థతలతో సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో :- ఇక్కడ మహామండలి కూర్చుంది. ఆదిలో ఓంమండలిగా ఉండేది, అంతములో మహామండలిగా అయ్యింది. మహాన్ఆత్మలందరి మండలి కదా! వారు తమను మహామండలేశ్వరులుగా పిలిపించుకుంటారు, మీరు స్వయాన్ని మహాసేవాధారులని పిలిపించుకుంటారు. మీరు మహామండలేశ్వరులుగా లేక మహామండలేశ్వరీలుగా కాదు, మీరు మహా సేవాధారులని పిలిపించుకుంటారు. కావున ఇది మహాన్ సేవాధారుల మహామండలి. మహాసేవాధారి అనగా ప్రతి సంకల్పంతో స్వతహాగానే సేవకు నిమిత్తులై ఉన్నవారు. ప్రతి సంకల్పం ద్వారా సేవ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే స్వతహా యోగులుగా ఉంటారో, వారు స్వతహాగానే సేవాధారులుగా ఉంటారు. స్వతహాగా సేవ జరుగుతోందా? అని చెక్ చేసుకోండి. అప్పుడు సేవ లేకుండా ఒక్క సెకను మరియు సంకల్పము కూడా గడవజాలదని అనుభవం చేస్తారు. నడుస్తూ, తిరుగుతూ, ప్రతి కార్యము చేసూ,్త శ్వాస-శ్వాసలో, సెకను-సెకనులో సేవ ఇమిడి ఉంది. వీరినే స్వతహాగా సేవాధారులని అంటారు. అలాగే ఉన్నారు కదా! ఇప్పుడు విశేష ప్రోగ్రామ్ ద్వారా సేవ చేసే స్థితి సమాప్తమయ్యింది. స్వతహాగా మీరే సేవకు నిమిత్తంగా అయిపోయారు. ఇప్పుడు ఇతరులకు ఛాన్స్ఇచ్చారు. వారు ప్రోగ్రామ్ కూడా తయారు చేస్తారు, ప్రాక్టికల్ గా కూడా చేస్తారు. కానీ మీ సేవ ఇప్పుడు స్వతహాగా సేవాధారులది. ప్రోగ్రామ్ సమయం వరకే కాదు, సదా ప్రోగ్రామ్ లో ఉన్నారు. సదా సేవ స్టేజి పై ఉన్నారు. మీరు ఇటువంటి మండలియే కదా! ఎలాగైతే శరీరము శ్వాస లేకుండా ఉండజాలదో, అలా ఆత్మ సేవ లేకుండా ఉండజాలదు. ఈ శ్వాసలు తమంతట తామే(స్వతహాగానే) నడుస్తూ ఉంటాయి కదా! అలా సేవ కూడా స్వతహాగానే నడుస్తుంది. సేవయే ఆత్మ యొక్క శ్వాసగా అయ్యింది. మీరు ఇలా ఉన్నారు కదా! ఎన్ని గంటలు సేవ చేశారో లెక్క తీయగలరా? ధర్మం, కర్మ అంతా సేవయే. నడవడమూ సేవయే, మాట్లాడడం కూడా సేవయే, చేయడం కూడా సేవయే. కావున స్వతహాగా సేవాధారులుగా, సదా సేవాధారులుగా ఉన్నారు. ఏ సంకల్పము ఉత్పన్నమైనా అందులో సేవ ఇమిడి ఉంది. ప్రతి మాటలో సేవ ఇమిడి ఉంది. ఎందుకంటే వ్యర్థమైతే సమాప్తమైపోయింది. కావున సమర్థము అనగా సేవ. ఇటువంటి వారినే మహామండలికి చెందిన మహాన్ఆత్మలని అంటారు. మంచిది.

మీ సహచరులందరు కూడా బాప్దాదా సన్ముఖంలో ఉన్నారు. ఓంమండలి వారు, మహామండలి వారందరూ ఆదిలోని సేవాధారులు, సదా సేవాధారులు. బాప్దాదా ముందు మహామండలికి చెందిన మహాన్ఆత్మలందరూ ఉన్నారు. బాధ్యత తీసుకునేవారు మహాన్మండలి వారే కదా! బాధ్యత తీసుకున్నారు కదా! ఏమీ ఆలోచించకుండా, సంకల్పము చేయకుండా దృఢ సంకల్పము చేశారు, నిమిత్తులుగా అయిపోయారు. అటువంటి వారినే మహాన్ఆత్మలని అంటారు. మీరు మహాన్ కర్తవ్యానికి నిమిత్తులుగా అయ్యారు. ఉదాహరణంగా అయితే అయ్యారు. ఉదాహరణను చూడకనే విశ్వానికి ఒక ఉదాహరణంగా అయ్యారు. తక్షణ దానము మహాపుణ్యము. అటువంటి మహాన్ఆత్మలుగా ఉన్నారు. మంచిది.

పార్టీలతో

1. మహారాష్ట్ర మరియు పంజాబ్ గ్రూపు :- పిల్లలైన మీరంతా నిర్భయులుగా ఉన్నారు కదా! ఎందుకు? ఎందుకంటే మీరు సదా నిర్వైరులు(వైరము లేనివారు). మీకు ఎవ్వరితోనూ వైరము లేదు. ఆత్మలందరి పట్ల సోదర భావము(భాయి-భాయి) యొక్క శుభ భావన, శుభ కామన ఉంది. ఇటువంటి శుభ భావన, శుభ కామన గల ఆత్మలు సదా నిర్భయులుగా ఉంటారు. భయభీతులుగా అయ్యేవారు కాదు. స్వయం యోగయుక్త స్థితిలో స్థితులై ఉంటే ఎటువంటి పరిస్థితిలోనైనా తప్పకుండా సురక్షితంగా ఉంటారు. కావున మీరు సదా సురక్షితంగా ఉండేవారు కదా! తండ్రి ఛత్రఛాయలో ఉండేవారు సదా సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ నుండి బయటకు వచ్చినట్లయితే మళ్లీ భయముంటుంది. ఛత్రఛాయ లోపల నిర్భయులుగా ఉంటారు. అలజడిలో కూడా అచలంగా ఉంటారు. భయపడేవారిగా కాదు. ఇప్పుడు మీరు చూసింది పెద్దదేమీ కాదు. ఇది రిహార్సల్ మాత్రమే. రియల్(అసలైనది) వేరుగా ఉంది. పక్కా చేయించేందుకే రిహార్సల్ చేయించబడ్తుంది. కావున పక్కాగా అయిపోయారా? సాహసవంతులుగా అయిపోయారా? తండ్రి పై లగ్నముంది కావున పరిస్థితులు ఎలా ఉన్నా వచ్చి చేరుకున్నారు. సమస్యా జీతులుగా అయిపోయారు. లగ్నము నిర్విఘ్నంగా అయ్యే శక్తిని ఇస్తుంది. కేవలం ' మేరా బాబా(నా తండ్రి) ' అన్న ఈ మహామంత్రము గుర్తుండాలి. ఇది మర్చిపోలేదు కదా! ఇది గుర్తుంటే సదా సురక్షితంగా ఉంటారు.

2. సదా స్వయాన్ని అచలమైన, స్థిరమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఏ విధమైన అలజడి అయినా అచలమైన, స్థిరమైన స్థితిలో విఘ్నాలు కలిగించరాదు. ఇటువంటి విఘ్న వినాశక అచలమైన, స్థిరమైన ఆత్మలుగా అయ్యారా? విఘ్న వినాశక ఆత్మలు ప్రతి విఘ్నాన్ని, ఇది విఘ్నము కాదు ఒక ఆట అన్నట్లుగా దాటుకుంటారు. కావున ఆట ఆడడంలో సదా ఆనందం కలుగుతుంది కదా! ఏదైనా పరిస్థితిని దాటేందుకు, ఆట ఆడేందుకు తేడా ఉంటుంది కదా! ఒకవేళ విఘ్న వినాశక ఆత్మలుగా ఉంటే పరిస్థితి ఆట వలె అనుభవమవుతుంది. పర్వతం ఆవగింజ వలె అనుభవమవుతుంది. ఇటువంటి విఘ్న వినాశకులు కదా, భయపడేవారైతే కాదు కదా! నాలెడ్జ్ ఫుల్ఆత్మలు - ఇవన్నీ రావాల్సిందే, జరగాల్సిందే అని ముందు నుండే తెలుసుకుంటారు. ముందు నుండే తెలిసి ఉంటే ఏ విషయమూ పెద్దదిగా అనిపించదు. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ముందే తెలిసి ఉంటే పెద్ద విషయం కూడా చిన్నదిగా అనిపిస్తుంది. మీరందరు నాలెడ్జ్ ఫుల్(జ్ఞాన సంపన్నులు) కదా! నాలెడ్జ్ ఫుల్ గానే ఉన్నారు కానీ పరిస్థితుల సమయం ఎప్పుడైతే వస్తుందో, ఆ సమయంలో నాలెడ్జ్ ఫుల్ స్థితిని మర్చిపోరాదు. అనేకసార్లు చేసినదానిని ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. ఏదీ కొత్తది కానప్పుడు అన్నీ సహజమే. మీరందరూ కోటలోని పక్కా ఇటుకలు. ఒక్కొక్క ఇటుకకు ఎంతో మహత్వము ఉంది. ఒక్క ఇటుక కదిలినా అది మొత్తం గోడనంతా కదిలించేస్తుంది. కావున ఇటుకలైన మీరు అచలంగా ఉన్నారు. ఎవరు ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా, కదిలించేవారు కదలాలి గానీ మీరు కదలరాదు. అటువంటి అచలమైన ఆత్మలకు, విఘ్నవినాశక ఆత్మలకు బాప్దాదా రోజూ అభినందనలు తెలియజేస్తారు. ఇటువంటి పిల్లలలే తండ్రి అభినందనలకు అధికారులు. ఇటువంటి అచలమైన, స్థిరమైన పిల్లలను చూసి తండ్రి మరియు పరివారమంతా హర్షిస్తారు. మంచిది.