01.01.1986        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నూతన సంవత్సరంలో నవీనతకు అభినందనలు.

ఈ రోజు నలువైపులా ఉన్న సర్వుల స్నేహీ, సహయోగీ మరియు శక్తిశాలీ పిల్లల మధురాతి-మధురమైన మనసులోని శ్రేష్ఠ సంకల్పాలు, స్నేహం యొక్క ప్రతిజ్ఞలు, పరివర్తనా ప్రతిజ్ఞలు, తండ్రి సమానంగా తయారవుతామనే ఉల్లాస-ఉత్సాహాల యొక్క దృఢ సంకల్పాలు అనగా అనేక ఆత్మిక వాయిద్యాలతో కూడిన మనసులోని పాటలు మనసు యొక్క మిత్రుడు వద్దకు అమృతవేళ నుండి చేరుకున్నాయి. మనసు యొక్క మిత్రుడు అందరి మధురమైన పాటలను విని శ్రేష్ఠ సంకల్పముతో చాలా సంతోషిస్తున్నారు. మనసు యొక్క మిత్రుడు తమ సర్వ ఆత్మిక మిత్రులకు, ఈశ్వరీయ స్నేహితులకు అందరి పాటలకు రెస్పాండ్ (బదులిస్తున్నారు) ఇస్తున్నారు. సదా ప్రతి సంకల్పములో, ప్రతి సెకెండులో, ప్రతి మాటలో హోలీగా, హ్యాపీగా, హెల్దీగా ఉండేందుకు శుభాకాంక్షలు. సదా సహయోగమనే చేయి, మనసు యొక్క మిత్రుని కార్యములో, సహయోగమునిచ్చే సంకల్పము ద్వారా చేతిలో చేయి ఉండాలి. నలువైపులా ఉన్న పిల్లల సంకల్పాలు, ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు మరియు తోడు-తోడుగా స్మృతికి గుర్తుగా స్నేహంతో నిండిన కానుకలన్నీ బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. బాప్ దాదా సదా పిల్లలందరి బుద్ధి రూపీ మస్తకముపై వరదానము యొక్క, సదా సఫలత యొక్క ఆశీర్వాదాల హస్తము, నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా పిల్లలందరికీ ఇస్తున్నారు. నూతన సంవత్సరంలో సదా ప్రతి ప్రతిజ్ఞను ప్రత్యక్ష రూపములోకి తీసుకొచ్చేందుకు అనగా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించే విశేష స్మృతి స్వరూప తిలకాన్ని ఆజ్ఞాకారి పిల్లలందరికీ సద్గురువు ఇస్తున్నారు. ఈరోజున చిన్న పెద్ద అందరి నోట్లో అభినందనల పదాలు మాటిమాటికి ఉంటూనే ఉంటాయి. అలాగే సదా కొత్త సంగీతము, సదా కొత్త క్షణము, సదా కొత్త సంకల్పాలు ఉంటాయి. కావున ప్రతి క్షణానికి అభినందనలు. సదా నవీనతకు అభినందనలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కొత్త వస్తువుకు, కొత్త కార్యానికి తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారు. నవీనతకే శుభాకాంక్షలు ఇవ్వడం జరుగుతుంది. కావున మీ అందరి కోసం సదా అన్నీ కొత్తవే. ఇది సంగమయుగపు విశేషత. సంగమయుగములోని ప్రతి కర్మ ఎగిరేకళలోకి వెళ్ళడానికే. ఈ కారణంగా సదా అన్నీ కొత్త-కొత్తగా ఉంటాయి. ఒక క్షణం ముందు ఏ స్థితి ఉండేదో, వేగం ఉండేదో అది మరుక్షణంలో అంతకన్నా ఉన్నతంగా ఉంటుంది, అనగా ఎగిరేకళ వైపుకు ఉంటుంది. కనుక ప్రతి సెకండులోని స్థితి, వేగము ఉన్నతంగా అనగా కొత్తగా ఉన్నాయి. కావున మీ అందరికీ ప్రతి క్షణం యొక్క సంకల్పములోని నవీనతకు అభినందనలు. సంగమయుగము ఉన్నదే అభినందనల యుగము. సదా నోరు మధురంగా, జీవితము మధురంగా, సంబంధాలు మధురంగా అనుభవం చేసే యుగము. బాప్ దాదా కొత్త సంవత్సరానికి కేవలం అభినందనలు ఇవ్వడమే కాకుండా సంగమయుగములోని ప్రతి క్షణానికి, సంకల్పానికి శ్రేష్ఠ అభినందనలను ఇస్తున్నారు. మనుష్యులైతే ఈరోజు అభినందనలను ఇస్తారు, రేపు సమాప్తం. బాప్దాదా అయితే సదా కోసం అభినందనలు ఇస్తారు, శుభాకాంక్షలు ఇస్తారు. కొత్త యుగము సమీపంగా వస్తున్నందుకు అభినందనలు ఇస్తున్నారు. సంకల్పాల పాటలను తండ్రి చాలా బాగా విన్నారు. వింటూ-వింటూ బాప్దాదా ఆ గీతాల సంగీతములో మరియు రహస్యాలలో ఇమిడిపోయారు.

ఈరోజు వతనంలో గీతమాల కార్యక్రమాన్ని అమృతవేళ నుండే వింటున్నారు. అమృతవేళలు కూడా దేశ విదేశాల లెక్కన ఎవరివి-వారివే ఉంటాయి. పిల్లలు ప్రతి ఒక్కరు తాము అమృతవేళలో వినిపిస్తున్నామని భావిస్తారు. బాప్దాదా అయితే నిరంతరము వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి పాట యొక్క విధానము కూడా చాలా ప్రియంగా ఉంది. రాగాలు కూడా ఎవరివి-వారివే ఉన్నాయి. కాని బాప్దాదాకు అందరి పాటలు ప్రియమైనవే. నోటి ద్వారా ఇచ్చినా, మనసుతో ఇచ్చినా, పద్ధతి ప్రమాణంగా ఇచ్చినా లేక ప్రీతి యొక్క రీతిని నిలబెట్టే శ్రేష్ఠ సంకల్పముతో ఇచ్చినా అభినందనలైతే ఇచ్చారు కదా. ఇక ముందు-ముందు ఏం చేస్తారు? ఎలాగైతే సేవలో 50 సంవత్సరాలు (1986లో) పూర్తవుతున్నాయో అలా సర్వ శ్రేష్ఠ సంకల్పాలను లేక ప్రతిజ్ఞలను పూర్తి చేస్తారా లేక సంకల్పాల వరకే ఉండనిస్తారా? ప్రతిజ్ఞలు అయితే ప్రతి సంవత్సరము ఎంతో మంచి-మంచిగా చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకి ఈనాటి ప్రపంచములో రోజు రోజుకూ ఎంతో మంచి మంచి గ్రీటింగ్ కార్డులను తయారుచేస్తూ ఉన్నారు. అలాగే సంకల్పాలను కూడా ప్రతి సంవత్సరం కంటే శ్రేష్ఠంగా చేస్తారు కాని సంకల్పము మరియు స్వరూపము రెండూ సమానంగా ఉండాలి. ఇదే మహానత. ఇందులో ఎవరు ముందడుగు వేస్తారో వారే అర్జునులు. అలా ఎవరవుతారు? మేము అవుతామని అందరూ భావిస్తారు. ఇతరులు అర్జునులుగా అవుతారా లేక భీములుగా అవుతారా అన్నది చూడకండి. నేను నంబర్ వన్ గా అనగా అర్జునునిగా అవ్వాలి. హే అర్జునా! అనే గాయనం చేశారు. హే భీమా! అని గాయనం చేయలేదు. అర్జునుని విశేషత సదా బిందువులో స్మృతి స్వరూపంగా అయి విజయులుగా అవ్వడం. ఈ విధంగా నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అయ్యే అర్జునులు. సదా గీతా జ్ఞానాన్ని వినే మరియు మననం చేసే అర్జునులు. ఇలా విదేహులుగా జీవిస్తూ కూడా అందరూ మరణించి ఉన్నారనే అనంతమైన వైరాగ్య వృత్తి కలిగిన అర్జునులుగా ఎవరవుతారు? అలా అవ్వాలా లేక కేవలం అలా అనాలా? కొత్త సంవత్సరమని అంటారు, సదా ప్రతి క్షణమూ నవీనత ఉండాలి. మనసులో, మాటలో, కర్మలో, సంబంధాలలో నవీనతను తీసుకురావాలి. ఈ కొత్త సంవత్సర అభినందనలను సదా తోడుగా ఉంచుకోవాలి. ప్రతి క్షణము, అన్నిసమయాల్లో స్థితి యొక్క పర్సంటేజ్ ముందు-ముందుకు వెళ్ళాలి. ఎలాగైతే ఎవరైనా గమ్యానికి చేరుకునేందుకు ఎంతగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారో, అంతగా ప్రతి అడుగులో సమీపతకు దగ్గరగా వెళ్తూ ఉంటారు. ఎక్కడి వారక్కడ ఆగిపోరు. అలా ప్రతి సెకండు లేక ప్రతి అడుగులో సమీపత మరియు సంపూర్ణతకు సమీపంగా వచ్చే లక్షణాలు స్వయానికి కూడా అనుభవమవ్వాలి మరియు ఇతరులకు కూడా అనుభవమవ్వాలి. దీనినే పర్సంటేజ్ ను ముందుకు తీసుకెళ్ళడము అనగా అడుగులు ముందుకు వేయడమని అంటారు. దీనినే పర్సంటేజ్ లో నవీనత, వేగములో నవీనత అని అంటారు. కావున అన్ని సమయాల్లో నవీనతను తీసుకొస్తూ ఉండండి. కొత్తగా ఏం చేయాలని అందరూ అడుగుతారు. ముందుగా స్వయంలో నవీనతను తీసుకువచ్చినట్లయితే సేవలో నవీనత స్వతహాగానే వస్తుంది. ఈ రోజులలో ప్రజలు ప్రోగ్రాంలో నవీనతను కోరుకోవడం లేదు కాని ప్రభావంలో నవీనతను కోరుకుంటున్నారు. కావున స్వయంలో నవీనత ద్వారా ప్రభావంలో నవీనత స్వతహాగానే వస్తుంది. ఈ సంవత్సరం ప్రభావశాలిగా అయ్యే విశేషతను చూపించండి. పరస్పరము బ్రాహ్మణ ఆత్మలు ఎప్పుడైతే సంపర్కములోకి వస్తారో అప్పుడు సదా ప్రతి ఒక్కరి పట్ల మనసులోని భావనలు - స్నేహము, సహయోగము మరియు కళ్యాణముతో ప్రభావశాలిగా ఉండాలి. ప్రతిమాట ఎవరికైనా ధైర్యాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేందుకు ప్రభావశాలిగా ఉండాలి. వ్యర్థంగా ఉండకూడదు. సాధారణ మాటలలో అర్ధగంట కూడా గడిపేస్తారు. ఆ తర్వాత దీని రిజల్టు ఏమిటని ఆలోచిస్తారు. కావున ఈ విధంగా చెడుగా లేక మంచిగా లేని సాధారణమైన మాటలను కూడా ప్రభావశాలి మాటలని అనరు. అలాగే ప్రతి కర్మ స్వయంపట్ల గాని, ఇతరులపట్ల గాని ఫలదాయకంగా ఉండాలి. కావున పరస్పరంలో కూడా అన్ని రూపాలలోనూ ఆత్మిక ప్రభావశాలిగా అవ్వండి. సేవలో కూడా ఆత్మిక ప్రభావశాలిగా అవ్వండి. బాగా కష్టపడుతున్నారు, హృదయపూర్వకంగా చేస్తున్నారు అని అయితే అందరూ అంటారు, కాని వీరు రాజయోగి ఫరిస్తాలు, ఆత్మికత అనేది ఇక్కడే ఉంది, ఇదే పరమాత్మ కార్యము..... ఇలా తండ్రిని ప్రత్యక్షం చేసే ప్రభావముండాలి. జీవితం బాగుంది, కార్యమూ బాగుందని కూడా అంటారు కాని ఇది పరమాత్మ కార్యము, వీరు పరమాత్ముని పిల్లలు, ఇదే సంపన్నమైన జీవితము, సంపూర్ణమైన జీవితము - ఈ ప్రభావముండాలి. సేవలో ఇంకా ప్రభావశాలిగా అవ్వాలి. మేము కూడా మంచిగా అవ్వాలి అని అనే విధంగా ఇప్పుడు ఈ అలను వ్యాపింపజేయండి. మీరు చాలా మంచివారు అనే ఈ భక్తుల మాల తయారవుతుంది కాని ఇప్పుడు విజయమాల అనగా స్వర్గానికి అధికారులుగా అయ్యేవారి మాలను ముందు తయారుచేయండి. మొదటి జన్మలోనే 9 లక్షల మంది కావాలి. భక్తుల మాల చాలా పెద్దది. రాజ్య అధికారులు అనగా రాజ్యము చేసేవారే కాదు, రాజ్యములోకి వచ్చేందుకు అధికారులుగా అయ్యేవారు కూడా ఇప్పుడే తయారవ్వాలి. మంచిదని అనేవారు, మంచిగా అవ్వడంలో సంపర్కములో ఉన్న వారు, తక్కువలో తక్కువ ప్రజల సంబంధములోకైతే రావాలి, ఇటువంటి అలను ఇప్పుడు వ్యాపింపజేయండి. అయినా మీ సంపర్కములోకి వచ్చినట్లయితే స్వర్గానికి అధికారులుగా అయితే చేస్తారు కదా! ఈ విధంగా సేవలో ప్రభావశాలిగా అవ్వండి. ఈ సంవత్సరాన్ని ప్రభావశాలిగా అవ్వడం మరియు ప్రభావం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషత ద్వారా విశేష రూపంలో జరుపుకోండి. మీరు స్వయం ప్రభావితులుగా అవ్వకండి. తండ్రిపై ప్రభావితులుగా చెయ్యండి. అర్థమయ్యిందా! భక్తిలో ఇవన్నీ పరమాత్ముని రూపాలే అని అంటారు కదా! వారు విపరీత భావనతో అలా అంటారు. కాని జ్ఞానపు ప్రభావంతో మీ అందరి రూపాలలో తండ్రిని అనుభూతి చెయ్యాలి. ఎవరిని చూసినా పరమాత్మ స్వరూపంగా అనుభూతి కలగినప్పుడు కొత్త యుగము వస్తుంది. ఇప్పటికీ ఇంకా మొదటి జన్మలోని ప్రజలనే తయారుచేయలేదు. తర్వాత వచ్చే ప్రజలైతే సహజంగా తయారవుతారు. కాని మొదటి జన్మలోని ప్రజలు, ఎలాగైతే రాజు శక్తిశాలిగా ఉంటారో అలా మొదటి ప్రజలు కూడా శక్తిశాలిగా ఉంటారు. కావున సంకల్పమనే బీజాన్ని సదా ఫల స్వరూపంలోకి తీసుకొస్తూ ఉండండి. ప్రతిజ్ఞను ప్రత్యక్ష రూపంలో సదా తీసుకొస్తూ ఉండండి. డబల్ విదేశీయులు ఏం చేస్తారు? అన్నింటిలోను డబల్ ఫలితమును తెప్పిస్తారు కదా! ప్రతి క్షణము యొక్క నవీనత ద్వారా ప్రతిక్షణము తండ్రి నుండి అభినందనలను తీసుకుంటూ ఉండండి. అచ్ఛా.

సదా ప్రతి సంకల్పములో నవీనత అనే మహానతను చూపించేవారు, అన్ని సమయాల్లో ఎగిరే కళను అనుభవం చేసేవారు, సదా ప్రభావశాలిగా అయ్యి తండ్రి ప్రభావాన్ని ప్రత్యక్షం చేసేవారు, ఆత్మలకు కొత్త జీవితాన్ని తయారుచేసుకునే కొత్త ప్రేరణ ఇచ్చేవారు, నవయుగానికి అధికారులుగా తయారుచేసే శ్రేష్ఠమైన అలను వ్యాపింపజేసేవారు - ఇటువంటి సదా వరదాని, మహాదాని ఆత్మలకు సదా బాప్దాదా యొక్క నవీనతా సంకల్పముతో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో:- ఈరోజు శక్తిశాలి సంకల్పాల సహయోగము విశేషంగా అవసరముంది. స్వయం చేసే పురుషార్థము వేరే విషయము కాని శ్రేష్ఠ సంకల్పాల సహయోగము విశేషంగా అవసరము. విశేష ఆత్మలైన మీ సేవ ఇదే. సంకల్పము ద్వారా సహయోగమునిచ్చే ఈ సేవను పెంచాలి. వాణి ద్వారా శిక్షణనిచ్చే సమయం గడిచిపోయింది. ఇప్పుడిక శ్రేష్ఠ సంకల్పము ద్వారా పరివర్తన చేయాలి. శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేయాలి, ఈ సేవ అవసరముంది. ఈ శక్తియే అందరికీ అవసరముంది. సంకల్పాలనైతే అందరూ చేస్తారు కాని సంకల్పంలో శక్తిని నింపడం అవసరము. కనుక ఎవరు ఎంతగా స్వయం శక్తిశాలిగా ఉంటారో అంతగా ఇతరుల సంకల్పంలో కూడా శక్తిని నింపగలరు. ఎలాగైతే ఈ రోజుల్లో సౌర శక్తిని జమ చేసుకుని అనేక కార్యాలు సఫలం చేస్తున్నారు కదా. ఈ సంకల్ప శక్తిని కూడా జమ చేసుకున్నట్లయితే, దాని ద్వారా ఇతరులలో కూడా శక్తిని నింపవచ్చు. కార్యమును సఫలం చేయవచ్చు. మాలో ధైర్యము లేదని వారు స్పష్టంగా చెప్తారు. కావున వారికి ధైర్యమును ఇవ్వాలి. వాచా ద్వారా కూడా ధైర్యము వస్తుంది కాని అది సదాకాలికంగా ఉండదు. వాణితో పాటు శ్రేష్ఠ సంకల్పాల సూక్ష్మ శక్తి ఎక్కువగా పని చేస్తుంది. ఏ వస్తువైతే సూక్ష్మంగా ఉంటుందో అది అంత ఎక్కువ సఫలతను చూపిస్తుంది. వాణి కంటే సంకల్పము సూక్ష్మమైనది కదా! కావున ఈరోజుల్లో దీని అవసరమే ఉంది. ఈ సంకల్ప శక్తి చాలా సూక్ష్మమైనది. ఎలాగైతే ఇంజెక్షన్ ద్వారా రక్తములో శక్తిని నింపుతారు కదా. అలా సంకల్పం కూడా ఒక ఇంజెక్షన్ చేసే పని చేస్తుంది, ఆంతరిక వృత్తిలో సంకల్పము ద్వారా సంకల్పములో శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సేవ ఎంతో అవసరము. అచ్ఛా.

టీచర్లతో:- నిమిత్త సేవాధారులుగా అవ్వడంలో భాగ్యపు ప్రాప్తిని అనుభవం చేస్తున్నారా? సేవకు నిమిత్తం అవ్వడం అనగా స్వర్ణిమ అవకాశం లభించడం, ఎందుకంటే సేవాధారులకు స్వతహాగానే స్మృతి మరియు సేవ తప్ప ఇంకేమీ ఉండదు. సత్యమైన సేవాధారులుగా ఉన్నట్లయితే రాత్రింబవళ్ళు సేవలో బిజీగా ఉన్న కారణంగా సహజంగానే ఉన్నతిని అనుభవం చేస్తారు. ఇది మాయాజీతులుగా అయ్యేందుకు అదనపు లిఫ్ట్. కావున నిమిత్త సేవాధారులు ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అంత సహజంగా ముందుకు వెళ్ళగలరు. ఈ విశేషమైన వరదానముంది. అందుకే అదనపు లిఫ్ట్ లేక స్వర్ణిమ అవకాశము ఏదైతే లభించిందో దాని నుండి లాభాన్ని పొందారు. సేవాధారులు స్వతహాగానే సేవ యొక్క ఫలాన్ని తినే ఆత్మగా అవుతారు ఎందుకంటే సేవకు ప్రత్యక్ష ఫలము ఇప్పుడే లభిస్తుంది. మంచిగా ధైర్యమును ఉంచారు. ధైర్యము గల ఆత్మలపై బాప్దాదా సహాయ హస్తము సదా ఉంటుంది. ఈ సహాయము ద్వారానే ముందుకు వెళ్తున్నారు, ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. తండ్రి సహాయం యొక్క ఈ హస్తమే సదా కొరకు ఆశీర్వాదంగా అవుతుంది. బాప్దాదా సేవాధారులను చూసి విశేషంగా సంతోషిస్తారు ఎందుకంటే తండ్రి సమానమైన కార్యములో నిమిత్తంగా అయ్యారు. సదా తమ సమానమైన శిక్షకుల వృద్ధిని చేస్తూ ముందుకు వెళ్ళండి. సదా కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము స్వయంలో ధారణ చేయండి, అలాగే ఇతరులకు కూడా చూపించండి. మీ ఉత్సాహాన్ని చూసి స్వతహాగానే సేవ జరుగుతూ ఉండాలి. అన్ని సమయాల్లో ఏదో ఒక సేవకు నవీనతతో కూడిన ప్లాను తయారుచేస్తూ ఉండండి. విహంగ మార్గపు సేవకు విశేష సాధనంగా ఉండే విధమైన ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఇటువంటి అద్భుతాన్ని ఏదైనా చేసి చూపించండి. ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నంగా, అచలంగా ఉంటారో అప్పుడు సేవలో సహజంగా నవీనతను చూపించగలరు. ఎంతగా యోగయుక్తంగా అవుతారో అంతగా ఇలా చేయాలనే నవీనత టచ్ అవుతుంది, అలాగే స్మృతి బలము ద్వారా సఫలత లభిస్తుంది. కావున ఏదైనా విశేషమైన కార్యమును చేసి చూపించండి.

పార్టీలతో:-

1) సర్వ ఖజానాలతో సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలమని అనుభవం చేస్తున్నారా? ఎన్ని ఖజానాలు లభించాయో మీకు తెలుసా? వాటిని లెక్కించగలరా? అవినాశిగా మరియు లెక్కలేనన్ని లభించాయి. కనుక ఒక్కొక్క ఖజానాను స్మృతిలోకి తీసుకురండి. ఖజానాలను స్మృతిలోకి తీసుకురావడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఎంతగా ఖజానాల యొక్క స్మృతిలో ఉంటారో అంతగా సమర్థులుగా అవుతూ ఉంటారు. ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం సమాప్తమైపోతుంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము, వ్యర్థ మాటలు అన్నీ మారిపోతాయి. ఇలా అనుభవం చేస్తున్నారా? పరివర్తన అయిపోయింది కదా! కొత్త జీవితంలోకి వచ్చేసారు. కొత్త జీవితము, కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము, ప్రతి ఘడియ కొత్తదే, ప్రతి సమయం కొత్తదే. కావున ప్రతి సంకల్పంలో కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము ఉండాలి. నిన్న ఎలా ఉండేవారు ఈరోజు ఎలా అయ్యారు! ఇప్పుడు పాత సంకల్పాలు, పాత సంస్కారాలు మిగిలి అయితే లేవు కదా! కొద్దిగా కూడా ఉండకూడదు, సదా ఇదే ఉత్సాహముతో ముందుకు వెళ్తూ ఉండండి. ఎప్పుడైతే అన్నీ పొందారో అప్పుడు నిండుగా అయ్యారు కదా! నిండుగా ఉన్న వస్తువు ఎప్పుడూ అలజడిలోకి రాదు. సంపన్నంగా అవ్వడం అనగా అచలంగా అవ్వడం. కావున మేము సంతోషమనే ఖజానాతో నిండైన భాండాగారముగా అయిపోయాము అన్న ఈ స్వరూపాన్ని మీ ముందు ఉంచుకోండి. ఎక్కడైతే సంతోషముంటుందో అక్కడ సదాకాలానికి దుఃఖము దూరమైపోతుంది. ఎవరు ఎంతగా స్వయం సంతోషంగా ఉంటారో అంతగా ఇతరులకు ఈ సంతోషకరమైన వార్తను వినిపిస్తారు. కావున సంతోషంగా ఉండండి, సంతోషకరమైన వార్తలను వినిపిస్తూ ఉండండి.

2) సదా విస్తారాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మిక పూదోటయే కదా! మీరందరూ ఆత్మిక గులాబి పుష్పాలే కదా! అన్ని పుష్పాలలో ఆత్మిక గులాబీ పుష్పము శ్రేష్ఠమైనదిగా మహిమ చేయబడ్తుంది. అది అల్పకాలికమైన సుగంధమును ఇచ్చేది. మీరెవరు? ఆత్మిక గులాబీలు అనగా అవినాశి సుగంధమును ఇచ్చేవారు. సదా ఆత్మికత యొక్క సుగంధములో ఉండేవారు, అలాగే ఆత్మిక సుగంధమును ఇచ్చేవారు. ఆ విధంగా అయ్యారా? అందరూ ఆత్మిక గులాబీలేనా లేక వేరే వేరే పుష్పాలా? ఇంకా రకరకాల పుష్పాలుంటాయి కాని గులాబీ పుష్పానికి ఎంత విలువ ఉందో అంత వేరేవాటికి లేదు. మీరు పరమాత్ముని పూదోటలో సదా వికసించిన పుష్పాలు. మీరెప్పుడూ వాడిపోయే వారు కాదు. సంకల్పములో కూడా ఎప్పుడూ మాయతో వాడిపోకూడదు. మాయ వస్తుందంటే మీరు వాడిపోయినట్లు. మాయాజీలుగా ఉన్నారంటే సదా వికసించి ఉన్నారు. ఎలాగైతే తండ్రి అవినాశిగా ఉన్నారో అలాగే పిల్లలు కూడా సదా అవినాశి గులాబి పుష్పాలు. పురుషార్థము కూడా అవినాశిగా ఉంటే ప్రాప్తి కూడా అవినాశిగా ఉంటుంది.

3) సదా స్వయాన్ని సహయోగిగా అనుభవం చేస్తున్నారా? సహజంగా అనిపిస్తుందా లేక కష్టంగా అనిపిస్తోందా? తండ్రి వారసత్వము పిల్లలకు అధికారము. అధికారము సదా సహజంగా లభిస్తుంది. లౌకిక తండ్రి అధికారము పిల్లలకు సహజంగా ప్రాప్తిస్తుంది కదా! కావున మీరు కూడా ఆధికారులే. మీరు అధికారులుగా ఉన్న కారణంగా సహజయోగులు. కష్టపడవలసిన అవసరం లేదు. తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడూ కష్టమనిపించదు. వీరు అనంతమైన తండ్రి, అలాగే అవినాశి తండ్రి కావున మీరు సదా సహజయోగీ ఆత్మలు. భక్తి అనగా శ్రమ, జ్ఞానమనగా సహజంగా ఫలము యొక్క ప్రాప్తి. ఎంతగా సంబంధము మరియు స్నేహముతో స్మృతి చేస్తారో అంత సహజంగా అనుభవమవుతుంది. సదా 'నేను సహజయోగిని' అన్న వరదానాన్ని గుర్తుంచుకోండి. కావున ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి స్వతహాగా తయారవుతుంది. అచ్ఛా.